దేశంలో మూడో వేవ్ కరోనా పరిస్థితులు ఏర్పడితే ఎదుర్కోవడానికి సంసిద్ధం చేయడం కోసం దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది కార్యకర్తలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శిక్షణ సమకూర్చిన్నట్లు అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. కర్ణాటకలోని ధార్వాడ్ లో ఈ నెల 28 నుండి మూడు రోజులపాటు జరుగనున్న కార్యకారిణి సమావేశాల సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా ప్రదేశాలలో శిక్షణ జరిగిన్నట్లు చెప్పారు. జూలై నెలలో ప్రాంత ప్రచారకుల సమావేశంలో కార్యకర్తలకు ఈ విషయమై ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించినట్లు ఆయన గుర్తు చేశారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులతో పాటు బాంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలు, భారత స్వాతంత్య్ర అమృతోత్సవ కార్యక్రమాల గురించి ప్రస్తుత సమావేశాలలో చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. కొంతకాలంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై నిరంతరం దాడులు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలను ప్రపంచవ్యాప్తంగా ఖండించారని పేర్కొంటూ ఈ సమావేశంలో హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై చర్చించి, సభ్యుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని తీర్మానాన్ని కూడా ఆమోదించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశం “అమృత మహోత్సవ్”ను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దేశంలో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. దేశం “స్వా” మేల్కొలుపు గురించి కూడా చర్చ జరుగుతోంది. సమాజంలో అంతగా ప్రాచుర్యం లేని ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధుల గురించి సమాచారాన్ని కూడా ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలిపారు.
ఆర్.ఎస్.ఎస్ ఏడాదికి రెండుసార్లు ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తుందని చెబుతూ అఖిల భారతీయ ప్రతినిధి సభ మార్చిలో నిర్వహించగా, కార్యకారి మండల సమావేశం దసరా- దీపావళి మధ్య జరుగుతుందని అంబేకర్ చెప్పారు. ఈ సమావేశంలో దాదాపు 350 మంది సభ్యులు పాల్గొంటారు. ప్రాంత, క్షేత్ర సంఘచాలక్‌లు, ప్రచారక్‌లు, కార్యవాహులు, అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు, కొన్ని సంస్థల ఆర్గనైజింగ్ కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం నుండి జూలై వరకు, అన్ని సమావేశాలు ఆన్‌లైన్ ద్వారా లేదా తక్కువ సంఖ్యలో భౌతిక హాజరుతో నిర్వహించారు. ఇప్పుడు తొలిసారిగా కార్యకరిణి మండలి సమావేశం పూర్తి స్థాయిలో జరుగుతుంది. ప్రతినిధి సభ సమావేశంలో పనుల విస్తరణకు సంబంధించి ప్రణాళికను సవివరంగా చర్చించడంతో పాటు, ఈ అక్టోబర్ సమావేశంలో పనులపై సమీక్ష కూడా జరుగుతుంది. సమావేశంలో సమీక్షలతో పాటు కార్య విస్తరణపై చర్చ, కార్యకర్తల అభివృద్ధిపై సమాలోచనలు కూడా జరుపుతారు.
ఆర్.ఎస్.ఎస్ ను 1925లో స్థాపించగా, 2025లో సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి కానుంది. దీని దృష్ట్యా 3 సంవత్సరాల పని విస్తరణ వివరణాత్మక ప్రణాళిక చేయడం జరిగింది. ఇది 2024 నాటికి పూర్తి అవుతుంది. ఈ ప్రణాళికను కూడా ఈ సమావేశంలో వివరంగా చర్చించడం జరుగుతుంది. శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 400వ జయంతి సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చ జరుగుతుంది.