Home News ప్రజల మధ్య సమరసత సాధించడానికి తెలంగాణలో జరుగుతున్న ప్రయత్నాలు

ప్రజల మధ్య సమరసత సాధించడానికి తెలంగాణలో జరుగుతున్న ప్రయత్నాలు

0
SHARE

సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ప్రజలమధ్య సమరసత సాధించడానికి తెలంగాణలో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. వాటి వివరాలు సంక్షిప్తంగా…

మిడిదొడ్డి గ్రామంలో (సిద్దిపేట జిల్లా):

దేవీ నవరాత్రుల్లో అన్ని వర్గాల ప్రజలతో పూజలు:

మిడిదొడ్డి గ్రామంలో ముదిరాజు కులానికి చెందినవారు ‘పెద్దమ్మగుడి’ని నిర్మించుకుని గత సంవత్సరం నుండి పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలో దేవీనవరాత్రుల పూజలను నిర్వహించిన అర్చకులు శ్రీ కె. అజయ్‌శర్మ కుల పెద్దలముందు ఒక ప్రతిపాదన పెడ్తూ అన్ని కులాలవారికి ఇంటికి వెళ్ళి, సాదరంగా ఆహ్వానించి పూజలు జరపాలని” సూచించారు. ముదిరాజు సంఘ అధ్యక్షులు శ్రీ నర్సింలు వెంటనే అంగీకరించి, బాజా భజంత్రీలతో ఎస్‌.సి. సామాజిక వర్గాలకుచెందిన కుటుంబాలతోసహా అందరి గృహాలను సంపర్కంచేసి కుటుంబ సమేతంగా పూజలకు ఆహ్వానించారు. అంతేగాకుండా 6కి.మీ. దూరంలో ఉన్న సంచార జాతులు ఉన్న ముత్యంపేట నుండి కొన్నికుటుంబాలు పూజలో పాల్గొని, అమ్మవారిని దర్శనం చేసికొని సామరస్యతను చాటిచెప్పారు.

కుల అసమానతలు, అంటరానితనం నిర్మూలనవల్లనే సమాజ అభివృద్ధి: శ్రీ సత్తయ్య, జాయింట్‌ కలెక్టర్‌, కామారెడ్డి

జులై 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో సామాజిక సమరసత సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీ సత్తయ్య పాల్గొని ప్రసంగించారు. సాంఘిక దురాచారాలు, అంటరాని తనంవంటి వాటి వల్లనే నిమ్నవర్గాలు హిందూమతానికి దూరం అవుతున్నారు. డా|| బి.ఆర్‌. అంబేడ్కర్‌ అందువల్లనే బౌద్ధాన్ని స్వీకరించాడని, కాకపోతే హిందూధర్మంలో భాగమైన బౌద్ధాన్ని స్వీకరించాడేతప్ప క్రైస్తవ, ఇస్లాంలను స్వీకరించకపోవటం గమనించాలని, హిందువులు పరస్పరం కులాల కతీతంగా మాట్లాడుకుంటూ కలిసి, మెలిసి జీవించినప్పుడే సమాజం అభివృద్ధిని సాధిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమ నిర్వహణలో జిల్లా కన్వీనర్‌ శ్రీ నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీ కిష్టయ్య, అధ్యక్షులు డా||.మల్లికార్జున్‌ పాల్గొన్నారు. అఖిల భారత కన్వీనర్‌ శ్రీ కె. శ్యామ్‌ప్రసాద్‌ దేశంలో సమరసతా పనులద్వారా ప్రజలమధ్య సామరస్యం నెలకొన్న సంఘటనలను వివరించి చెప్పారు. సుమారు 150మంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

సామాజిక సమరసతావేదిక ప్రయత్నంలో సంచార జాతులకు డబుల్‌బెడ్‌రూమ్‌ గృహాలు:

సిద్ధిపేటజిల్లా ముత్యంపేట గ్రామంలో 45కి పైగా సంచార జాతుల కుటుంబాలు నివసిస్తున్నాయి. మిగతా గ్రామాలు, నగరాలకు భిన్నంగా దూరంగా దురాచారాలు, మద్యపాన వ్యసనాలు, ఆర్థిక దుబారాలు, అపరిశుభ్రతల మధ్య జీవిస్తున్న ఆ కుటుంబాల గురించి, ఆర్థిక, సామాజిక పరిస్థితుల గురించి, సమరసతా కార్యకర్తలు అధ్యయనం చేశారు. నిత్యావసర వస్తువుల కిట్‌, బాలబాలికలకు సైకిళ్ళు, వినాయక చవితి, సామూహిక సత్యనారాయణవ్రత ఉత్సవాలు జరిపి, స్వచ్ఛతపై జాగృతి కార్యక్రమాలు నిర్వహించారు. వారి ఆర్థిక వెనుకబాటుతనం గురించి పత్రికల్లో కథనాలు వ్రాశారు. ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు అందజేశారు. ఫలితంగా 22 కుటుంబాలకు ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహాలను మంజూరుచేసి నిర్మించింది.

సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో తెలంగాణా ప్రాంతంలో 12జిల్లా కేంద్రాల్లో సమరసతా కార్యకర్తల శిక్షణా తరగతులు జరిగాయి. జులై 16 నుండి అక్టోబర్‌ 8 వరకు జరిగిన ఈ వర్గల్లో 23 జిల్లాల నుండి 133 స్థలాలనుండి 551 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

సామాజిక సమరసతా వేదిక అఖిల భారత కన్వీనర్‌ శ్రీ కె. శ్యాంప్రసాద్‌జీ తెలంగాణాలో 15 జిల్లాల్లో పర్యటన చేశారు. జులై, ఆగస్టు మాసాల్లో జహీరాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ఆదిలాబాద్‌, ఇందూరు, కామారెడ్డి, జగిత్యాల, కరినగర్‌, గూడూరు, జనగామ, భువనగిరి మొదలైన ప్రాంతాల్లో పర్యటించి సమరసతా వేదికద్వారా దేశంలో జరుగుతున్న కార్యక్రమాలు – పనులు వివరించారు.

మెదక్‌లో వాల్మీకిజయంతి కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షులు రవి, ప్రధాన కార్యదర్శి మత్స్యేంద్రనాధ్‌ పాల్గొని వాల్మీకి గురించి తెలియచేసి సమరసత ఆవశ్యకతను తెలిపారు.

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ గ్రామంలో కులవృత్తులవారికి మరియు ఆదిలాబాద్‌ నగరంలో ‘అనాథ శవాల దహన సంస్కారం చేయటం ద్వారా సేవా కార్యక్రమాలు చేసే 23మంది ‘మానవ సేవ’ సంస్థ సభ్యులకు సన్మానం సమరసతా వేదిక ఆధ్వర్యంలో జరిగింది. సమరసతా వేదిక జిల్లా కన్వీనర్‌ రాజేశ్వర్‌, రమేశ్‌ రెడ్డి పాల్గొన్నారు.

మెట్టచిట్టాపూర్‌లో (జగిత్యాల జిల్లా) సమరసత:

జగిత్యాలజిల్లా మెట్ల చిట్టాపూర్‌ గ్రామం సమరసతకు మారు పేరుగా నిలుస్తుంది. సామాజిక సమరసతా వేదిక జిల్లా ఉపాధ్యక్షులు, గ్రామ సర్పంచ్‌ శ్రీ రాజేందర్‌రెడ్డి గత 4,5 సంవత్సరాలుగా అంబేడ్కర్‌ జయంతి, దేవాలయ ఉత్సవాలలో, అన్నదానాల్లో అన్ని వర్గాలను ముఖ్యంగా ఎస్‌.సి., సామాజిక వర్గానికి చెందిన ప్రజలను అందరితో సమానంగా ఆదరించి భాగస్వాములను చేస్తున్నారు. ఇటీవల కార్తీక పూజల సందర్భంగా స్థానిక రామాలయంలో ఎస్‌.సి. సామాజిక వర్గానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున అన్ని కులాలతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని సమరసత చాటిచెప్పారు.

భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా సమరసతా సమావేశం:

అక్టోబర్‌ 10న ములుగులో జరిగింది. ఉపాధ్యాయులు, ప్రతిష్ఠిత వ్యక్తులు కుల పెద్దలు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో సమరసతా, సామరస్య నిర్మాణానికి కృషిచేయాలని సంకల్పించారు. జిల్లా కన్వీనర్‌ శ్రీ బండారు రఘు, జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీ సమ్మయ్య ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించారు.

* సూర్యాపేటలో ‘నవ దివాకరుడు డా|| అంబేడ్కర్‌’ పుస్తక ఆవిష్కరణ స్థానిక ప్రభాకర్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది. వేదిక జిల్లా అధ్యక్షుడు తళ్ళమళ్ళ హసేన్‌ (న్యాయవాది) అధ్యక్షతన జరిగిన ఈ సభలో అఖిల భారత కన్వీనర్‌ శ్రీ కె. శ్యాంప్రసాద్‌జీ పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి జయరాములు (ఉపాధ్యాయులు) తదితర ఉపాధ్యాయులు, విద్యావంతులు పాల్గొన్నారు.

సెప్టెంబర్‌ 23న సూర్యాపేటలో కులవృత్తుల, పెద్దలకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌.సి. జాతీయ కమీషన్‌ సభ్యులు శ్రీ కె. రాములుకు సత్కారం చేశారు. జిల్లా కలెక్టర్‌ సురేంద్ర మోహన్‌, ఎస్‌.పి. ప్రకాశ్‌ జాదవ్‌ పాల్గొన్నారు.

సమరసత ఉన్న గ్రామం గూడూరు:

గూడూరు (మానుకోట జిల్లా)లో కులవృత్తుల వారికి సన్మానం:

మానుకోట జిల్లా గూడూరులో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో కులసంఘాల పెద్దలతో సమావేశం జరిగింది. సుమారు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరవింద స్కూల్‌ కరస్పాండెంట్‌ పింగళి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామ సర్పంచ్‌, ఎమ్‌.పి.టి.సి పాల్గొన్నారు. తరువాత 28 కులవృత్తులవారిని సన్మానించారు. దసరా కార్యక్రమంలో 10 గ్రామాలనుండి 10వేలమంది అన్ని వర్గాలవారు పాల్గొన్నారు. బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా సమరసతా వేదిక ప్రాంత కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌ మాట్లాడుతూ సామరస్యత వల్లనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, అన్ని వర్గాలు కలిసి మెలిసి జీవించడానికే పండుగలను మనకు అందించారని తెలిపారు.

(సమరసత సందేశ్ సౌజన్యం తో)