సంఘటిత సమరస సమాజ నిర్మాణమే శ్రేష్టభారత్‌కు ఆధారం – డా. మోహన్ భాగవత్ దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్ చేపడుతున్న దేశభక్తితో కూడిన సేవా కార్యక్రమాలకు ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తోందని, ఈ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ అన్నారు. ఆదివారం కేశవమెమోరియల్ కాలేజి మైదానంలో జరిగిన ఉద్యోగి స్వయంసేవకుల సాంఘిక్‌లో ఆయన ప్రసంగించారు. వ్యక్తి నిర్మాణంతోపాటు సమాజ పరివర్తన కార్యంలో స్వయంసేవకులు మరింత చురుకుగా పనిచేయాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు.
సమాజంలో ఈనాడు కనిపిస్తున్న హెచ్చుతగ్గులు, వివక్షలను రూపుమాపి సామరస్యంతో కూడిన సమాజాన్ని నిర్మించవలసిన బాధ్యత మనపైన ఉందని, సమరస సమాజ నిర్మాణం ద్వారానే మనం ఆశిస్తున్న శ్రేష్ట భారత నిర్మాణం జరుగుతుందని శ్రీ మోహన్‌భాగవత్ అన్నారు. దేశనిర్మాణ కార్యంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని, ఆ విధంగా అందరూ ముందుకు వచ్చేట్లు సంఘ స్వయంసేవకులు ప్రేరేపించాలని అన్నారు. మనం ఉంటున్న బస్తీ, గ్రామంలో మార్పు తీసుకురావడమే మన ప్రధమ కర్తవ్యమని ఆయన ఉద్బోధించారు.
రాగల 15,20 ఏళ్ళలో సంఘం కోరుకుంటున్న సర్వోన్నత సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని, అటువంటి సమాజాన్ని చూసే అదృష్టం మనకు కలుగుతుందని ఆయన అన్నారు.
కార్యక్రమంలో భాగ్యనగర్, సికింద్రాబాద్‌లకు చెందిన 3217మంది గణవేషధారీ స్వయంసేవకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో క్షేత్ర సంఘచాలకులు శ్రీ నాగరాజు, తెలంగాణా ప్రాంత సంఘచాలకులు శ్రీ ప్యాటా వెంకటేశ్వరరావుగారు కూడా పాల్గొన్నారు.