Home News బడిని బతికించుకుంటున్నారు, మూతపడిన సర్కారు పాఠశాలలకు పూర్వవైభవం

బడిని బతికించుకుంటున్నారు, మూతపడిన సర్కారు పాఠశాలలకు పూర్వవైభవం

0
SHARE

గ్రామస్థుల చొరవ, దాతల చేయూతతోనే దశ మారుతున్న సర్కారు బడులు

     రంగురంగుల ప్రచారపత్రాలు, బహుళ అంతస్థుల భవనాలు, టై, బెల్టూ కట్టుకుని బస్సుల్లో బిలబిలమని వచ్చే విద్యార్థులు.. ఇదంతా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల సందడి. మరోవైపు ఈసురోమంటూ సర్కారు బడులు. బడి ఉంటే ఉపాధ్యాయులుండరు. ఉపాధ్యాయులున్న చోట భవనం సరిగా ఉండదు. రెండూ ఉంటే నమ్మి పిల్లలను చేర్పించే తల్లిదండ్రులుండరు. ఎవరైనా ముందుకొచ్చి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపినా వారికి చదువెలా అబ్బుతుందోనన్న సంశయమే. ఆంగ్ల మాధ్యమం చదువుల్లో తమ పిల్లలు వెనకబడిపోతారేమోనన్న ఆందోళనే. వెరసి ఉన్నవారూ, లేనివారూ అనే తేడా లేకుండా అందరిదీ ప్రైవేటు బాటే. ఈ పరిస్థితి సర్కారు బడి పాలిట మరణశాసనమవుతోంది. ఇంత నిర్వేదంలోనూ కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల సహకారం, గ్రామస్థుల భాగస్వామ్యమే ఆలంబనగా పూర్వవైభవం దిశగా వడివడిగా అడుగులేస్తున్నాయి. మూతపడిన బడులు తెరుచుకుంటున్నాయి. కాస్తంత చేయూతనివ్వాలే గానీ ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల పోటీని తట్టుకొని సర్కారు బడి జైత్రయాత్ర సాగించగలదని రుజువు చేస్తున్నాయి. ‘ఈనాడు’ ప్రతినిధి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ వాతావరణం కనిపించింది.

 

ప్రైవేట్‌ బడుల్లోనే చదువొస్తుంది. అక్కడైతే ఆంగ్ల మాధ్యమం ఉంటుంది..అనే ఆలోచనతో రాష్ట్రంలో అధిక శాతం మంది తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు పాఠశాలలకే పంపుతున్నారు. ఆర్థిక స్థోమత లేనివారు అప్పు చేసి మరీ వాటికి ఫీజులు కడుతున్నారు. దీంతో విద్యార్థుల్లేక సర్కారు బడులు మూతపడుతున్నాయి. మరోవైపు ప్రైవేట్‌ పాఠశాలల్లో రుసుములు, రవాణా ఛార్జీలు, పుస్తకాల ఖర్చు తడిసి మోపెడవుతోంది. సంపాదనంతా ప్రైవేటు బడులకే ధారపోయడం కంటే సర్కారు బడినే తలో చేయీ వేసి మెరుగ్గా తీర్చిదిద్దుకుందామనే స్పృహ గ్రామీణుల్లో పెరుగుతోంది. పట్టణాలకు, మండల కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల్లో ఈ చైతన్యం వెల్లివిరుస్తోంది. కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లో ‘ఈనాడు’ ప్రతినిధి పర్యటించినప్పుడు సర్కారు బడిని కాపాడుకునేందుకు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న కృషి కనిపించింది. వరంగల్‌, ఖమ్మం, రంగారెడ్డి తదితర జిల్లాల్లోనూ ఇలాంటి చైతన్యం కనిపిస్తోంది.

ఏం చేస్తున్నారంటే..

* కొన్నేళ్లుగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలలను తెరిపించుకుంటున్నారు. పిల్లలను ప్రైవేట్‌ విద్యాసంస్థలకు పంపించే తల్లిదండ్రులతో సమావేశమై నచ్చచెబుతున్నారు.

* ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించారు.

* పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించుకున్నారు. దాంతో మూడేళ్లు నిండగానే పిల్లలకు ఎల్‌కేజీలో ప్రవేశం కల్పిస్తున్నారు.

* పొరుగు గ్రామాలకు ఆటోలు, చిన్న వ్యాన్లు ఏర్పాటు చేస్తూ పిల్లలను రప్పిస్తున్నారు.

* సాయంత్రం 4గంటలకే బడి పూర్తయినా మరో గంట చదువుతోపాటు ఆటపాటలు నేర్పుతున్నారు. దానివల్ల తల్లిదండ్రులు పొలాల నుంచి వచ్చిన తర్వాతే పిల్లలు ఇంటికి చేరుకుంటారన్నది ఆలోచన.

* దాతలను, గ్రామ పెద్దలను, ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో స్థిరపడిన ఆ వూరివారిని సంప్రదించి కుర్చీలు, బల్లలు, డిజిటల్‌ తరగతుల బోధనకు ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు, ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాలు, ఆట వస్తువులు అందజేస్తున్నారు. మంచినీటి సరఫరాకు, ట్యాంకుల నిర్మాణానికి, కుళాయిల ఏర్పాటుకు దాతల సహకారం తీసుకుంటున్నారు.

* ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను నియమిస్తుండగా విరాళాలు వేసుకొని విద్యా వాలంటీర్లను, ఆయాలను నియమించుకుంటున్నారు.

* ప్రైవేట్‌ బడులకు పిల్లలను పంపం.. సర్కారు బడికే పంపిస్తామని తీర్మానాలు చేస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులు కూడా నాణ్యమైన విద్య అందించేందుకు పాటుపడుతున్నారు.

కళకళలాడుతున్న పాఠశాలలు

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాల ప్రాథమిక పాఠశాల 28 మందితో మూతపడే పరిస్థితి. సర్పంచి ఎడమ ఇందిరా నరసింహరెడ్డి, ఉపాధ్యాయులు కలిసి ఇంటింటికీ తిరిగి ఇతర గ్రామాల్లో పిల్లలను చదివిస్తున్నవారికి నచ్చజెప్పి ఆంగ్ల మాధ్యమం ప్రారంభించారు. ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులకు తోడుగా నెలకు రూ.3,500 వేతనంతో మరో ఇద్దరు విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. ఆయాలను నియమించుకున్నారు. 18 మంది పిల్లలతో ఉన్న సింగరాజుపల్లి ప్రాథమిక పాఠశాలదీ ఇదే పరిస్థితి. సర్పంచి యాదగిరి తదితరులు కొంతమంది తల్లిదండ్రులతో కలిసివెళ్లి అప్పటికే ఆదర్శంగా నిలుస్తున్న ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి పాఠశాలను సందర్శించారు. వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు పాఠశాలకు పంపించే బదులు ప్రభుత్వ పాఠశాలలకు పంపించవచ్చన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో గ్రామంలోని 45 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోని ఆంగ్లమాధ్యమంలో చేరారు. విద్యార్థుల తల్లిదండ్రులు విరాళం వేసుకుని ఇద్దరు విద్యా వలంటీర్లను నియమించుకొని వేతనాలు చెల్లిస్తున్నారు.

ఏకరూప దుస్తులు, టై, బెల్టు ధరించిన విద్యార్థులతో కళకళలాడుతున్న ఈ పాఠశాల.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలోని సర్కారు బడి. విద్యార్థులు లేక ఆరేళ్ల క్రితం మూతపడింది. అన్నాహజారే స్వగ్రామం రాలేగావ్‌సిద్ధి స్ఫూర్తితో ఒంటిమామిడిపల్లి గ్రామస్థులు.. ఇంటికింత అని విరాళాలు పోగేసి పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టారు. విద్యా వలంటీర్లను నియమించి వారికి తామే వేతనాలిస్తున్నారు. ఫలితంగా.. ఆ బడి ప్రస్తుతం 370 మంది విద్యార్థులతో కళకళలాడుతోంది.

సకల సౌకర్యాలతో చదువు

మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లి ఉన్నత పాఠశాలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దారు. డాక్టర్‌ కల్వకూరి చంద్రశేఖర్‌ నీటి శుద్ధి యంత్రాన్ని అందజేశారు. పూర్వ విద్యార్థి డాక్టర్‌ వెంకట్రాములు రెండేళ్ల క్రితమే అధునిక ప్రొజెక్టరు అందజేశారు. పూర్వవిద్యార్థి, దివంగత సినీ సంగీత దర్శకుడు చక్రి నాలుగేళ్ల క్రితమే మైక్రో ప్రొజెక్టర్‌ బహూకరించారు. ప్రైవేట్‌ బడులకు మాదిరిగా విద్యార్థులు టై, బెల్టులు ధరించి బడికి వస్తారు. వాటిని దాతలే అందజేస్తున్నారు. అన్ని గదుల్లో ఫ్యాన్లు, బల్లలు సమకూర్చారు.

ఖమ్మం జిల్లా బోనకల్లు ప్రాథమిక పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థులున్నారు. ఇక్కడ కంప్యూటర్‌ శిక్షణ ఇస్తున్నారు. ఈ ఏడాది ఎల్‌కేజీ నుంచి అంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించారు. సర్పంచి చావా వెంకటేశ్వరరావు ఒక విద్యా వాలంటీర్‌కు ఆరు నెలల జీతం ఇస్తున్నారు. గ్రామస్థులు నెలకు రూ.3 వేలు చొప్పున చెల్లిస్తూ మరో ఇద్దరిని ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ గోంగూర వెంకటేశ్వర్లు, మరికొందరు కలిసి రూ.2 లక్షలు వెచ్చించి కళావేదిక నిర్మించారు. మూడేళ్లుగా పాఠశాల వార్షికోత్సవం కోసం గ్రామస్థులు రూ.లక్షకు పైగా విరాళం అందజేస్తున్నారు.

బడిని తెరిపించి…ఆటోలు పెట్టి

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాల 2011లో మూతపడింది. మాజీ సర్పంచి మల్లారెడ్డి ప్రేరణతో ఎంపీటీసీ సభ్యుడు బావు మల్లేశం గ్రామస్థులకు నచ్చజెప్పారు. రూ.40 వేలు ఖర్చు చేసి గదులను, ఆవరణను బాగు చేసుకున్నారు. గతేడాది బడి మళ్లీ తెరుచుకుంది. పూర్వ ప్రాథమికం నుంచి 5వ తరగతి వరకు ప్రారంభించగా 90 మంది విద్యార్థులున్నారు. చుట్టుపక్కల వూళ్లకు ఆటోలు పంపిస్తూ పిల్లలను బడికి రప్పిస్తున్నారు. ఆటో బాడుగ మాత్రం తల్లిదండ్రులే భరిస్తున్నారు.

డిజిటల్‌ బోధన

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్లలో రెండేళ్ల క్రితమే డిజిటల్‌ తరగతులను ప్రారంభించారు. పూర్వ విద్యార్థులు ప్రొజెక్టర్‌ను విరాళంగా ఇచ్చారు. దాంతో పిల్లలకు పాఠాలతోపాటు కథలు, ఆటలను తెరపై చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆ వూరికి సమీపంలోని ఢీకొండ, రాములపల్లిలో బడులు మూసివేయగా అక్కడి పిల్లలను తమ బడికి పంపించాలని నచ్చజెప్పి ఆటోలు ఏర్పాటు చేశారు. గతేడాది 92 మంది ఉంటే ఈసారి 275 మందికి చేరారు. అన్ని తరగతులూ ఆంగ్ల మాధ్యమమే. ప్రవాస భారతీయుడు సిద్ధింకి తిరుపతి.. విద్యార్థులకు బేబీ కుర్చీలు సమకూర్చారు.

40 నుంచి 200 మందికి..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని చెర్లపటేల్‌గూడ ప్రాథమిక పాఠశాలలో 2016లో 40 మంది మంది విద్యార్థులే ఉన్నారు. సర్పంచి గణేష్‌, గ్రామస్థులు కలిసి పిల్లలను వూరి బడిలోనే చదివించాలని తీర్మానించారు. ఫలితంగా విద్యార్థు´ల సంఖ్య 205కు చేరింది. నలుగురు ఉపాధ్యాయులే ఉండడంతో ఆరుగురు విద్యా వాలంటీర్లను నియమించుకున్నారు. వీరికి సర్పంచి గణేష్‌, సహకార సంఘ ఛైర్మన్‌ హన్మంత్‌రెడ్డి, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు సొంత డబ్బుతో వేతనాలు ఇస్తున్నారు. పాఠశాలలో గ్రంథాలయం, తాగునీరు, బల్లలను సొంతంగా సమకూర్చుకున్నారు.

(ఈనాడు సౌజన్యం తో )