‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..’ ప్రసిద్ధమైన గేయ రచయితగా తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాకవి శంకరంబాడి సుందరాచారి. తేటతెనుగు నుడికార విలసితమైన తేటగీతుల్లో సుందర రామాయణం, ‘సుందర భాగవతం’ గొప్పగా రచించారు. రవీంద్రుని ‘గీతాంజలి’ అనువాదం, ‘బుద్ధగీత’ రచనతో ప్రముఖ పండితుల, మాన్యుల మన్ననలు అందుకున్న ప్రతిభావంతమైన కవి. సినీ రచయితగా నాలుగైదు సినిమాలకే పాటలు రాసినా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. దుర్భర దారిద్య్రం వెంటాడినా, చెక్కు చెదరని, మొక్కవోని అపరిమిత మైన ఆత్మ విశ్వాసంతో, సడలని పట్టుదలతో జీవనయానాన్ని సాగించిన ఆయన అప్పటి రాష్ట్రపతి, ప్రధాన మంత్రులు రాజేందప్రసాద్, జవహర్‌లాల్ నెహ్రూల ప్రశంసలు, సత్కారాలందుకున్నారు.
జీవిత విశేషాలు
శంకరంబాడి సుందరాచారి ఆగస్ట్ 10వ తేదీన 1914లో తిరుచానూరులో తమిళ పేద వైష్ణవ కుటుంబంలో జన్మించారు. సనాతన ఛాందస బ్రాహ్మణ సంప్రదాయాలు, మూఢాచారాల పట్ల ఆయన విముఖుడు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం తిరుమల తిరుపతి దేవస్థానం వారి పాఠ••శాలలో సాగింది. అక్కడే తెలుగు, సంస్కృత భాషల పట్ల అభిరుచిని పెంపొందించుకున్నారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఉత్తీర్ణుడైన తర్వాత మదనపల్లి బి.టి.కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు.
సంధ్యావందనం వంటి బ్రాహ్మణోచిత కార్యాలు తిరస్కరించడంతో తండ్రి కోపానికి గురై జంధ్యాన్ని తెంచివేసి ఇంటినుండి బయటకు వెళ్లారు. భుక్తికోసం హోటల్ సర్వర్‌గా, రైల్వేస్టేషన్‌లో కూలీగా చేశారు. ఉద్యోగాన్వేషణలో భాగంగా మద్రాసు వెళ్లాడు. అక్కడ ‘ఆంధ్రపత్రిక’ సంపాదకులు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారిని కలిశారు. ‘నీకు తెలుగువచ్చా’ అన్న పంతులు గారి ప్రశ్నకు సమాధానంగా ‘మీకు తెలుగు రాదా?’ అని అడిగారట. ఆశ్చర్యపోయిన పంతులు గారితో ‘నేనిప్పటివరకు తెలుగులోనే కదా మాట్లాడాను! అందుకే మీ ప్రశ్నకు ఎలా సమాధానం ఇవ్వాలో తెలియలేదు’ అని అన్నారట. వెంటనే పంతులు గారు తమ పత్రికలో అచ్చు దోషాలు దిద్దే (ప్రూఫ్‌రీడర్) ఉద్యోగిగా నియమించారు.
సుందరాచారి కవితా ప్రతిభను గుర్తించిన నాగేశ్వరరావు గారు ఒక ప్రముఖునిపై పద్యాలు రాయమని అడిగితే, ‘నేను వ్యక్తులపై పద్యాలు రాయను’ అని భీష్మించుకొని ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఆ తర్వాత బి.ఏ. పట్టభద్రులై చిత్తూరులో స్కూల్స్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగంలో చేరి నిబద్ధత గల ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నారు. నందనూర్‌లో స్కూల్స్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సమయంలో పర్యవేక్షణకు వచ్చిన సంచాలకులు ఆయన నిరాడంబర వేషాన్ని చూసి బంట్రోతుగా భావించారట. అదే సమయంలో ఆడంబర వేష ధారణతో ఉన్న బంట్రోతును చూసి సుందరాచారిగా పొరపాటు పడ్డారట. ఆహార్యానికి విలువనిచ్చే తీరుకు కోపగించిన సుందరాచారి ఆత్మాభిమానంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు.
మా తెలుగు తల్లికి మల్లె పూదండ నేపథ్యం
శంకరంబాడి సుందరాచారికి పద్య కవిత్వం అంటే ప్రీతిపాత్రం. ప్రత్యేకించి అచ్చ తెనుగు ఛందస్సు తేటగీతి అంటే ఎంతో ఇష్టం. ‘నా పేరు కూడా (శంకరంబాడి సుందరాచారిని గద) తేటగీతిలో ఇమిడింది. అందుకే నాకది బాగా ఇష్టం’ అనేవారు.
సుందరాచారి సినీ రంగానికి వెళ్లి దీనబంధు, బిల్హణీయం వంటి సినిమాలకు మంచి పాటలు రాశారు. ‘దీనబంధు’ (1942) సినిమా కోసం ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ యుగళగీతంగా రాయగా, అది నిర్మాతకు నచ్చకపోవడంతో ఆ సినిమాలో పెట్టలేదు. దానికి సుందరాచారి ఎంతో బాధపడ్డాడు. హెచ్‌ఎంవీ గ్రామ్‌ఫోన్ రికార్డు కోసం టంగుటూరి సూర్యకుమారి సురభి బాల సరస్వతి సంగీత సహకారంతో ఈ గీతాన్ని గానం చేశారు. హెచ్‌ఎంవీ కంపెనీ ఈ గీతానికి పారితోషికంగా 116 రూపాయలు అందచేసింది. సూర్యకుమారి గానంతో ఆ పాట బాగా ప్రసిద్ధమై ఆయనకు ఎనలేని పేరు, రికార్డుల అమ్మకం ద్వారా ఆ సంస్థకు మంచి లాభాలు వచ్చాయి.
ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా, మండలి వెంకట కృష్ణారావు విద్యా సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా తొలి ప్రపంచ తెలుగు మహాసభలను(1975 ఏప్రిల్) ఘనంగా నిర్వహించారు. దేశ విదేశాల నుండి లక్షలాది మంది తెలుగు భాషాభిమానులు ఆ వేడుకలకు ప్రతినిధు లుగా పాల్గొన్నారు. టంగుటూరి సూర్యకుమారిని లండన్ నుంచి ఆహ్వానించి ప్రారంభసభలో ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ను ప్రార్థన గీతంగా పాడించారు. గీత రచయిత శంకరంబాడికి ఆహ్వానం లేదు. అయినా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా సభలకు వచ్చారు. లోపలికి వెళ్లడానికి ప్రవేశ ద్వారం అనుమతి లభించలేదు. ‘మా తెలుగు తల్లికి’ గీత రచయితను తానేనని ఆవేదనతో మొరపెట్టుకున్న విషయం మండలి వేంకట కృష్ణారావు దృష్టికి వెళ్లింది. ఆయన వెంటనే ప్రవేశద్వారం దగ్గరకు వచ్చి సుందరాచారిని సాదరంగా వేదికపైకి తీసుకెళ్లి పరిచయం చేశారు. పొరపాటుకు మన్నింపు కోరుతూ, ఆయనను ఘనంగా సత్కరించడానికి సభలకు ప్రతినిధిగా హాజరైన ఈ వ్యాస రచయిత ప్రత్యక్ష సాక్షి.
‘మా తెలుగు తల్లి’ విశిష్టత
తెలుగు భాషా సంస్కృతుల ఘనతను వినుతిస్తూ శ్రీశ్రీ ‘తెలుగు తల్లి’ గీతం రాశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘తెలుగు తల్లికి మంగళం’ గీతంలో తెలుగు తల్లి సాంస్కృతిక వైభవాన్ని గొప్పగా కీర్తించారు. అయితే అది సంస్కృత సమాస భూయిష్టంగా ఉన్నందున జన సామాన్యానికి చేరలేక పోయింది. దాశరథి ‘తెలుగు పతాకం’ గేయంలో తెలుగు సంస్కృతీ విశిష్టతను శ్లాఘించారు. వేములపల్లి శ్రీకృష్ణ ‘జై కొట్టు తెలుగోడా’! తెలుగు జాతికి ‘వైతాళిక గీతం’గా ప్రచారం పొందింది. మడిపడగ బలరామాచార్యులు ‘తెలుగు తల్లి గీతం’ తెలుగు కవుల సాహితీ వైభవాన్ని మాత్రమే కీర్తించింది. అందులో తెలుగు సంస్కృతి ప్రస్తావనే లేదు.
ఆధునిక వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీ కాంతరావు ‘రావమ్మా! మా తెనుగు తల్లీ’! గీతంలో తెలుగు తల్లిని సౌభాగ్యవతిగా వర్ణిస్తూ తెలుగు ప్రజలను చల్లగా పాలించటానికి రమ్మని ఆహ్వానించారు. కందుకూరి రామభద్రరావు తెలుగు దేశాన్ని పూలతోటగా భావించి కవిత్వీకరించాడు. నాగభైరవ కోటేశ్వరరావు ‘ఇదే ఆంధ్రదేశం’ సుదీర్ఘ గీతంలో ఆంధ్రదేశ చారిత్రక వైభవాన్ని, సంస్కృతీ వికాసాన్ని గొప్పగా వర్ణించారు. డాక్టర్ సి. నారాయణ రెడ్డి ‘తెలుగువాడు’ గేయంలో తెలుగువాడి ఘనతను, విశిష్టతను కవిత్వీకరించారు.
శంకరంబాడి ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతంలో తెలుగు తల్లికి సుందరంగా, సాంస్కృతిక ప్రీతితో మల్లె ‘పూదండ’ సమర్పించి మంగళారతు లిచ్చారు. తెలుగుతల్లి కడుపులో బంగారు నిధులున్నాయని, ఆమె కనుచూపులో కరుణాదయా దృక్కులున్నాయని ఆమె ఔన్నత్యాన్ని వర్ణించారు.
తెలుగు దేశంలో సస్యశ్యామలమైన గోదావరి గలగలా ప్రవహించడం, కృష్ణమ్మ బిరబిరా పరుగు లెత్తడం వల్ల బంగారు పంటలు పండుతున్నాయని, సంపదకు సంకేతాలైన మురిపాల ముత్యాలు దొర్లుతున్నాయని వర్ణించడం సహజ సుందరంగా ఉంది. అమరావతీ నగర అపురూప శిల్ప సంపదను అభివర్ణించారు. వాగ్గేయకారుడైన త్యాగయ్య గొంతులో తారాడు నాదాల మాధుర్యాన్ని, తిక్కన్న కలం నుండి జాలువారిన తేట తెనుగు తియ్యదనాన్ని వర్ణిస్తూ, అవి నిఖిలమై, నిత్యమై నిలిచి ఉండాలని కాంక్షించారు.
‘అమరావతీ గుహల అపురూప శిల్పాలు’ అనే వర్ణనలో అమరావతిలో గుహలు లేవు. కవి పొరపాటు పడ్డారు. అమరావతి బౌద్ధ స్థూపంపై అద్భుతమైన శిల్పకళా సంపద ఉంది. అమరావతీ గుహల బదులు ‘అమరావతీ నగర’ అని మార్చి గానం చేశారు.
కాకతీయ రాణీ రుద్రమ్మ తిరుగులేని భుజశక్తిని, బొబ్బిలి రాణీ మల్లమ్మ సాటిలేని ‘పతిభక్తినీ, మంత్రి తిమ్మరుసు మహోన్నత ధీయుక్తినీ, సాహితీ సమరాంగణ సార్వభౌముడు కృష్ణరాయల కీర్తినీ..గత చారిత్రక సాంస్కృతిక వైభవానికి సాక్ష్యాలుగా సముచితంగా కీర్తించారు. అవి మా చెవులు రింగుమని మారు మ్రోగేదాక! (సృష్టి ఉన్నంత వరకు) తెలుగు ఆటలే ఆడుతాం.. తెలుగు పాటలే పాడుతామంటూ తెలుగు సంస్కృతీ వైభవాన్ని, చారిత్రక దీప్తిని సుందరంగా గానయోగ్యంగా రూపొందించిన మహాకవి సుందరాచారి. అందుకే ఈ గీతం రాష్ట్ర చారిత్రక సాంస్కృతిక గీతంగా, ప్రార్థనా గీతంగా శ్రోతల మన్ననలు పొందింది.
సుందరాచారి ఇతర రచనలు
సరళ సుందరమైన శైలిలో తెనుగు నుడికారపు సొగసులతో తేటగీతంలో ‘సంక్షిప్త సుందర రామాయణం’, ‘సుందర భాగవతం’ రచించి పండితుల మెప్పు పొందారు. రవీంద్రుని ‘గీతాంజలి’ అనువాదం, బుద్ధగీత కూడా తేటగీతుల్లో రాశారు. ‘బుద్ధగీత’లోని ఒక పద్యాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఢిల్లీలో నాటి రాష్ట్రపతి, ప్రధాన మంత్రులు రాజేందప్రసాద్, జవహర్‌లాల్ నెహ్రూకు వినిపించారు. దానికి ముగ్ధులైన రాష్ట్రపతి రూ.116 చెక్కుతో, ప్రధానమంత్రి రూ.500తో ఆత్మీయంగా సత్కరించారు. ఇవన్నీ సుందరాచారి జీవితంలో మరుపురాని మధుర సంఘటనలు.
మహాత్మాగాంధీ మరణించిన సందర్భంగా 1948లో ‘బలిదానం’ పేరిట కరుణ రసాత్మకమైన స్మృతి కావ్యాన్ని రాశారు. ఇవికాక ‘ఏకలవ్యుడు’ ఖండకావ్యం, పేద కవి, జపమాల, నా స్వామి, కర్వేటి నగర నీరాజనం వంటి రచనలతో పాఠకుల మెప్పు పొందాడు. ప్రత్యేకించి సుందర రామాయణం రాసే సందర్భంలో రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ ‘అయ్యా! సుందరాచారీ! తాటకి భయంకర స్వరూపిణి గదా! నీ తేటగీతుల్లో ఇముడుతుందా?’ అని ప్రశ్నించారట. ఆయన దాన్ని ఒక సవాలుగా తీసుకొని- ‘నల్ల కొండలను నుగ్గుగా నలగగొట్టి / చిమ్మ చీకటిలో గల చేవకుండి / కాల సర్పాల విసమెల్ల గలిపినూరి / కాచిపోసిన రూపుగా కానుపించె’/
‘కాలభైరవియై వల్ల కాటికెల్ల /…. మెడను వ్రేలాడు త్రాచులు పడగలెత్తి / భూషణంబులయ మేనబుస కొట్టి ఘెషలిడును’ అంటూ భయంకరమైన తాటకి రూపాన్ని తేటగీతుల్లో తేటతెనుగులో అనితర సాధ్యంగా వర్ణించారు. వల్లకాటికి తానే కాపరిగా కపాల మాలలతో బుసకొట్టే త్రాచులు భూషణాలుగా భయంకరంగా ఉందన్నాడు. ఆ వర్ణన చూసి రాళ్లపల్లి వారు సుందరాచారిని గొప్పగా ప్రశంసించారు. రాయప్రోలు సుబ్బారావు, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, గడియారం శేషశాస్త్రి వంటి వారు ఆయన కవితా శైలినీ అమితంగా ప్రశసించారు.
కాంచీపురంలో ఆయన ప్రేమించి పెళ్లి చేసుకొన్న వేదమ్మాళ్ మనోవ్యాధి గ్రస్థురాలై మరణించిందన్న ఆవేదనతో జీవిత చరమాంకాన్ని నిర్లిప్తంగా గడిపారు. మద్యపానానికి అలవాటుపడి 1977 ఏప్రిల్ 8వ తేదీన తిరుపతిలో మరణిం చారు.
శంకరంబాడిని శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం ‘ప్రసన్నకవి’గా గౌరవించి సత్కరిచింది. డా।।వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు (2004) ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుపతిలోని తిరుచానూరు రోడ్డులో అన్నపూర్ణేశ్వరి సర్కిల్‌లో సుందరాచారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన పట్ల అభిమాన పూర్వకంగా ఆ విగ్రహం దగ్గర నిరంతరం ‘మా తెలుగు తల్లికి’ పాట ధ్వనించే విధంగా ధ్వని వర్ధకం ఏర్పాటు చేసింది. సుందరాచారి రచనలు ప్రస్తుతం పాఠకులకు అందుబాటులో లేవు. ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని వాటిని పునర్ముద్రిస్తే తెలుగు సాహిత్యాభిమానులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. తెలుగు భాషా సాహిత్యాలున్నంత వరకు చిరస్మరణీయుడు శంకరంబాడి.
– డా।। పి.వి.సుబ్బారావు, రిటైర్డ్ ప్రొఫెసర్ & తెలుగు శాఖాధిపతి, సి.ఆర్. కళాశాల, గుంటూరు.
-జాగృతి సౌజన్యంతో…