26 నవంబర్ 2008వ సంవత్సరం.. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతం. ముంబైలోని తాజ్ హోటల్ రెండో అంతస్తులో ఒక వీడ్కోలు కార్యక్రమం జరుగుతోంది. ఆ హాలు మేనేజర్ మల్లిక. ఆమె వయసు 24 మాత్రమే. అప్పుడే బయట కాల్పులు వినిపించాయి. ఆమె గొప్ప సమయస్ఫూర్తితో వెంటనే హాలులో ఉన్న విద్యుత్ దీపాలన్నీ ఆర్పేసి, అతిథులందరినీ కుర్చీలు, టేబుళ్ల కింద నక్కి ఉండవలసిందని చెప్పింది. ఇంకొకమాట కూడా చెప్పింది. భార్య, భర్త ఒకేచోట ఉండవద్దు. అలా చేస్తే నష్టాన్ని కొంచెం తగ్గించుకోవచ్చునని చెప్పింది. ఉదయానికి అక్కడి వరకు పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఒక కిటికీ నుంచి నిచ్చెన వేయించి మొత్తం అందరినీ ఆమె కిందకి దింపించింది. చివరిగా తాను దిగింది.
అదే హోటల్లో మరొక దుర్ఘటన.. ఆరో అంతస్తులో తాజ్ జనరల్ మేనేజర్ కరమ్‌వీర్ సింగ్ కుటుంబంతో (భార్య, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు) ఉంటున్నాడు. ఏదో పని మీద బయటకు వెళ్లిన ఆయనకు అప్పుడే కాల్పుల సంగతి తెలిసింది. వెంటనే వచ్చి పరిరక్షణ చర్యల బాధ్యత స్వీకరించారాయన. కానీ అర్థరాత్రికి తెలిసింది, తాను ఆరో అంతస్తుకు వెళ్లడం సాధ్యం కాదని! ఎందుకంటే ఆ అంతస్తు మొత్తం దగ్ధమైంది. అయినా ఆయన లోపల ఉన్న హోటల్ అతిధులను రక్షించే బాధ్యతలోనే కొనసాగాడు. మరునాడు భార్య, పిల్లలు చనిపోయిన సంగతిని ఇంటికి సమాచారం పంపారాయన.
ముంబై నగరం మీద ముష్కరులు దాడి చేసినప్పుడు (26/11) జరిగిన రెండు ఘటనలు చాలామంది దృష్టికి రాలేదు. ఇవి తాజ్ హోటల్‌లో జరిగాయి. ఆ సమయంలో అక్కడ ఉండిపోయిన భారతీయ, అంతర్జాతీయ అతిథులను రక్షించడానికి జరిగిన ప్రయత్నం అద్భుతమైనది.
ఈ ఘటనలు హార్వార్డ్ బిజినెస్ స్కూల్‌కి చెందిన బృందం అక్కడకు వచ్చి ఇంటర్వ్యూలు చేసినప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఆ అధ్యయనాన్ని ప్రచురించిన హార్వర్డ్ బృందం తమ శీర్షికకు ‘అతిథిదేవో భవ’ అని పేరు పెట్టారు. ఇది పూర్తిగా భారతీయమైన విలువ.