సేవా భారతి-తెలంగాణ ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్ లో రెండు రోజుల సేవా సంగమం ఏర్పాటు చేసింది. దీని ప్రారంభోత్సవ కార్యక్రమంలో(14.9.2019) ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్యాంకుమార్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
శ్రీ శ్యామ్ కుమార్ ఉపన్యాసం –
సంఘం ప్రారంభమైన నాటి నుంచే సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నది. అయితే సేవా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం…సంఘం ఆధ్వర్యంలో మాత్రం ఓ సేవా విభాగం ఏర్పాటైంది మాత్రం 1990లోనే. ఆ తర్వాత కాలంలో ఈ విభాగమే సేవా భారతిగా రూపాంతరం చెందింది.
జాతి పునర్నిర్మాణంలో సేవ అనేది కూడా ఒక భాగమే! సమాజ సంఘటన కార్యంలో భాగంగా సేవా ద్వారా సమాజంలోకి వెళ్లాలి. దుఃఖితులు, పీడితులు, అణగారిన వర్గాల వారికోసం మనం పనిచేయాలి. సమాజం మనకు ఎన్నో ఇస్తుంది. ప్రతిగా అదే సమాజానికి మనం ఏమి ఇస్తున్నాం? ఏమి చేస్తున్నాం? మనం చేపట్టే సేవా కార్యక్రమాల ద్వారా కొంతలో కొంతైనా సమాజానికి తిరిగి ఇవ్వాలి. ఈ దిశగా సమాజంలో ప్రేరణ నింపేలా సంఘ స్వయం సేవకులు కృషి చేస్తున్నారు. సమాజంలో దుఃఖితులకు సేవ చేయడమే కాకుండా, వారిని తిరిగి సమాజ నిర్మాణ కార్యంలో భాగస్వామ్యులను సైతం చేయాలి.
మన సమాజంలో దివ్యాంగులు ఉన్నారు. అలాగే మానసిక వైకల్యం కలిగిన వికలాంగులు, మూగ, బధిర, అలాగే చలన సంబంధమయిన లోపం కలవారు అనేక మంది ఉన్నారు. మనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. మరి వాళ్ల సంగతి ఏమిటి? వారిలో ఆత్మన్యూనతా భావం లేకుండా చేయాలి. వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా కృషి చేయాలి. వారు తమ అంగవైకల్యాలను జయించి జీవితంలో ముందుకు సాగేలా చేయాలి.
దేశ పునర్నిర్మాణంలో ఇవన్నీ కూడా భాగమే! మన దేశంలో నేటికి కొన్ని కోట్ల మంది రెండు పూటల సరైన తిండి లేనివారు ఉన్నారు. అలాగే దుస్తులు లేని వారు, కనీస మౌలిక సౌకర్యాలు, సదుపాయలు లేకుండా జీవనం సాగించేవారు ఉన్నారు. వారి వద్దకు మనం వెళ్లాలి. వారి కష్టాలను దూరం చేసేందుకు సేవా కార్యక్రమాలు ప్రారంభించాలి.
కేవలం మనుషులు ఒక్కరే ఈ సమాజానికి సేవ చేస్తున్నారని చాలా మంది భావిస్తారు. కానీ ఈ ప్రకృతి కూడా మానవ మనుగడకు తనదైన సేవలను అందిస్తోంది. వృక్షాలకు తెలిసింది పరోపకారమే! జంతువులు, పశుపక్ష్యాదులు సైతం ఉపకారమే చేస్తున్నాయి. అయితే మనుష్యులమైన మనం మన తోటివారి కోసం ఏం చేస్తున్నాం? ఇలా అందరు తమను తాము ప్రశ్నించుకోవాలి.
వేద వేదాంగాలను అష్టాదశ పురాణాలను ఉపనిషత్తులను రచించిన వ్యాస మహర్షిని ఒకరు ఇలా అడిగారు-` మహర్షీ మీరు రచించిన గ్రంథ సారాన్ని ఒక శ్లోకంలో మాకు వివరించండి’ అని. దానికి వేదవ్యాసులవారు సమాధానంగా ఒక శ్లోకం చెప్పారు. యదుక్తం గ్రంథ కోటిభిః అంటే…నాచే చెప్పబడిన గ్రంథ సారాన్ని శ్లోకార్థేన ప్రవక్ష్యామి అంటే శ్లోకంలో అర్ధ పాదంలో చెపుతాను అన్నారు.
ఆ అర్ధ పాదం…పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం అని. పరులకు ఉపకారం చేస్తే పుణ్యం, పరులను పీడిస్తే, బాధ పెడితే పాపము. పరుల కోసం జీవించాలి. వారికి అవసరమైన సాయం చేయాలి. ఇదే ఉన్నతమైన సేవ!
సంఘం, స్వయం సేవకులు తమదైన సేవా కార్యక్రమాలతో…సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సమాజంలోని కొంతమంది ప్రతిష్ఠిత వ్యక్తులు సైతం తమకు తోచిన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే ఎన్నో స్వచ్చంధ సంస్థలు సైతం సంఘంతో సంబంధం లేకుండా సేవా కార్యంలో నిమగ్నమయ్యాయి. వీరిని కూడా మనం కలుపుకుని పోవాలి. ఆశ్రితులకు అభయం ఇవ్వాలి. మీ వెనుక ఇంత పెద్ద సమాజం అండగా ఉందనే నమ్మకం కలిగించాలి.
సమాజం అంతా ఒక్కటే అనే భావనను పెంపొందించాలి. ఎక్కువ తక్కువ లేదు. మనం అందరం ఒకే సమాజం అనే భావనతో మన సేవా కార్యక్రమాలు సాగాలి. అంతేకాదు ప్రతిఫలాపేక్ష లేకుండా సేవా చేయాలి. ప్రతిఫలం ఆశించేది సేవనే కాదు!
కన్నతల్లి పిల్లలకు సేవ చేస్తుంది. వారి మలమూత్రాదులను ఎత్తిపోస్తుంది. ఎప్పటికప్పుడు వారి అవసరాలను గుర్తిస్తుంది. వారిని అన్నివిధాల సంరక్షిస్తుంది. తాను పస్తులు ఉండి కూడా తన బిడ్డల కడుపును నింపుతుంది. తాను చేసే ఈ సేవకు ఏ తల్లి ప్రచారం కోరుకోదు! టీవీలో, పత్రికలో పేరు రావాలని చూడదు!
ఓ తల్లి నిస్వార్థ భావనతో ఎలాగైతే సేవ చేస్తుందో…, అలాగే మనం సేవ చేయాలి! సేవాభారతి లక్ష్యం కూడా ఇదే!
సంఘ ప్రార్థనలో పరమ వైభవ స్థితిని కోరుకుంటాం! మన భారతదేశం పరమవైభవ స్థితికి ఎదగాలని ప్రార్థన చేస్తాం.
సంఘం అందించిన మహోన్నత తత్వవేత్త పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ ఈ పరమవైభవ స్థితి గురించి ఎంతో ఉన్నతంగా వివరించారు. మన సమాజంలోని చిట్టచివరి వ్యక్తి సైతం సుఖంగా ఉండేలా చూడాలి. దీని కోసం మిగతా సమాజం ఆలోచించేలా తగిన విధంగా సేవా కార్యక్రమాల రూపకల్పన చేయాలి.
నేను మాత్రమే సేవ చేస్తూ ఉంటాను..అని కాకుండా …సేవను పొందేవారు సైతం సేవ చేసేవారిగా మార్చాలి. వారిలోనూ అందుకు తగిన ప్రేరణను నింపాలి.
లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హయంలో జరిగిన ఒక సంఘటన చెబుతాను. వారు తమ ఉపన్యాసాల్లో పరిశుభ్రత గురించి ప్రస్తావించేవారు. ఒక రోజు వారు ఒక గ్రామానికి వెళ్లారు. అక్కడ చెత్తచెదారం చూసి తన వెంట వచ్చిన కార్యకర్తలతో కలిసి సేవా కార్యం నిర్వహించారు. చెత్తచెదారాన్ని తొలగించారు. రోడ్లను ఊడ్చారు. గ్రామాన్ని పరిశుభ్రంగా మలిచారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత అదే గ్రామం మీదుగా జేపీ వెళ్లడం జరిగింది. మళ్లీ ఎప్పటిలాగే అక్కడ చెత్తచెదారం పేరుకుపోయింది. జేపీ ఇదేమిటని ప్రశ్నించేలోపునే గ్రామస్థులే ఆయన్ను నిలదీశారు. ఇంతకాలం ఎక్కడికి వెళ్లారు. మీరు మరుసటి రోజు మళ్లీ వచ్చి మా గ్రామాన్ని శుభ్రం చేస్తారని…, రోడ్లు ఊడ్చుతారని భావించాం. మీరు ఇలా చేసారేంటని అడిగారు.
ఇక్కడ మనం గమనించాల్సింది. సేవను పొందడమే కాదు, సేవను పొందినవారిని కూడా ఆ సేవా కార్యంలో నిమగ్నం చేయడం, వారిని కూడా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం కూడా అంతే ముఖ్యం!
1990లో చిన్న సంస్థగా ప్రారంభమైన సేవా భారతి ద్వారా నేడు దేశంలో ఒక లక్ష 30 వేల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో స్వయంసేవకుల ద్వారా నడిచే ఇతర స్వచ్ఛంద సంస్థలను కలపలేదు.
సంఘ శాఖ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శాఖలు నడిచే గ్రామాలు, బస్తీల్లో అవసరమైన సేవా కార్యక్రమాలను స్వయంసేవకులే చేపడుతున్నారు. పాఠశాల, మందిరం నిర్మాణం, అక్షరాస్యత, వైద్య సౌకర్యం, ఇలా ఉపక్రమ కార్యక్రమాలు సాగుతున్నాయి.
అంతేకాదు సాంఘిక దురాచారాలను రూపుమాపటం, సమాజంలోని అన్ని వర్గాల మధ్య సామరస్యం సాధించేలా చూడటం కూడా సేవా కార్యక్రమంలో భాగమే..! ఇలా సంఘం ద్వారా అనేక ఆవాసకేంద్రాలు నడుస్తున్నాయి. తల్లిదండ్రులు లేని అనాధలైన చిన్నారులను చేరదీసి వారికి ఆవాసం ఏర్పాటు చేయడమే కాదు. వారికి విద్య బుద్దులు చెప్పించడం, ఉత్తమ సంస్కారాలను అందించడం, నేను కూడా సమాజంలో భాగమే…, నేను సైతం ఈ సమాజం కోసం పనిచేస్తానని వారికి తగిన ప్రేరణను ఇవ్వడం జరుగుతోంది.
తెలంగాణలో 15 ఆవాస కేంద్రాలు నడుస్తున్నాయి. ఇంకా వైద్య సేవా కార్యక్రమాలు, ఉచితంగా మందులు, వైద్య సేవలు, మొబైల్ మెడికల్ వ్యాన్ సేవలు, 25 గ్రామాలకు ఒక మెడికల్ వ్యాన్ వంటి కార్యక్రమాలు సేవా భారతి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.
అంతే కాదు నెల్లూరులోని జై భారత్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సైతం సేవా భారతి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇందులో అతిచౌకగా కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే గాంధీ ఆసుపత్రిలో రోగులకు తగిన సహాయం అందించేలా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఫ్లోర్ లో ఈ హెల్ఫ్ డెస్కులు ఉన్నాయి. అలాగే ఆసుపత్రిలో రోగుల వెంట వచ్చేవారి రోగి బంధువులు (అటెండెంట్) ఆవాసం కోసం శివానంద ఆశ్రమం వారితో కలిసి ఓ భవనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కేవలం 10 రూపాయలతో వారికి చాప, దిండు, ఉదయం అల్పహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సౌకర్యం కల్పిస్తున్నారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో 8,9,10వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రికి సంబంధించిన ప్రయోగాలు చేసే సౌకర్యాలను కల్పిస్తున్నారు. వీరికోసం ఒక సంచార ప్రయోగశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక లెక్చరర్ ఉంటారు. ఆయన విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తారు.
ఇంకా భారత్ వికాస్ పరిషత్ కూడా సంఘ ప్రేరణతోనే ఏర్పాటైన సంస్థ! ఈ సంస్థ కూడా కాళ్లు లేని వికలాంగులకు కృత్రిమ కాళ్ళను అందిస్తోంది. వారికి ఉచితంగా భోజనం పెడుతోంది. ఈ కేంద్రానికి కుంటుతూ వచ్చినవారు తిరిగి నడుస్తూ తమ ఇంటికి వెళ్తారు. అటు రోగుల కోసం అతి తక్కువ ధరకే మందులు అందించేలా కూడా సేవా భారతి ఎన్నో జనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేసింది.
జాతి పునర్నిర్మాణంలో సేవా కార్యక్రమాలను సేవా భారతి చేపట్టింది. అంతేకాదు సమాజంలోని మిగిలిన ఎన్జీవో సంఘాలను సైతం ఇందులో భాగస్వామిని చేస్తోంది సేవా భారతి.
అటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సైతం సహాయక కార్యక్రమాల్లో స్వయం సేవకులు ఎల్లప్పుడు ముందు నిలుస్తున్నారు. సేవా భారతి ద్వారా ఎంతోమందికి సాయం అందిస్తున్నారు. 1977లో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు అందరికంటే ముందు చేరుకున్నది మన స్వయం సేవకులే! దివిసీమ శవాల దిబ్బగా మారిపోయింది. ఆ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు స్వయం సేవకులు. అలాగే అంటువ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా బాధిత కుటుంబాలకు పునరావసం కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మంది స్వయం సేవకులు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేను కూడా ఆ రోజుల్లో 40 రోజుల పాటు అక్కడే ఉండి పనిచేశాను.
గుజరాత్ భూకంపం వచ్చిన సందర్భంలో భుజ్ ప్రాంతం మృత్యుదిబ్బగా మారింది. ఎక్కడ చూసిన శిధిల భవనాలే! ఆ సమయంలో స్వయం సేవకుల ఇళ్లు సైతం కూలిపోయాయి. వాళ్లు బాధపడుతూ కూర్చోలేదు. సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. భుజ్ నగర కార్యవాహ ఇద్దరు కూతుళ్లు శిధిలాలకింద పడి మరణించారు. తన కుటుంబంలో దుఃఖం అలముకున్నా వెంటనే ఆయన తెరుకున్నారు. స్వయంసేవలకును సమయాత్తం చేసి సహాయ కార్యక్రమాలను చేపట్టారు. అందరితోపాటు శిధిలాలను తొలగించిన తర్వాతే ఆయన తన ఇద్దరు కుమార్తెలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఇలా ఎన్నో కార్యక్రమాలు సేవా భారతి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ సేవా కార్యక్రమంలో మనతోపాటు మిగిలిన అందరిని కూడా తప్పక భాగస్వాములను చేయాలి. అప్పుడే పరమవైభవ స్థితి లక్ష్యం నెరవేరుతుంది.