Home News శివప్రసాద్‌ గారి జీవనం ప్రతి స్వయంసేవక్ కు ప్రేరణ

శివప్రసాద్‌ గారి జీవనం ప్రతి స్వయంసేవక్ కు ప్రేరణ

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ఆంధ్రప్రదేశ్‌ పూర్వ ప్రాంత సంఘచాలక్‌ స్వర్గీయ ప్రొ|| డి.శివప్రసాద్‌ సంస్మరణ సభ విశాఖపట్నంలో జరిగింది. ఈ సభలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ సర్‌ కార్యవాహ వి.భాగయ్య పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

భాగయ్య ప్రసంగం

శివప్రసాద్‌ గారు చనిపోయిన రోజు నేను భువనేశ్వర్‌లో ఉన్నాను. ఆ వార్త విని ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. తట్టుకోలేకపోయాను. నా తల్లి, తండ్రి, గురువు గారు పోయినంతగా బాధపడ్డాను. ఈ శరీరం అశాశ్వతమైనదని మనం చాలాసార్లు చెబుతుంటాం. అయినప్పటికీ ఒక్కసారిగా శివప్రసాద్‌ గారు లేరనే వార్త నన్ను కదిలించింది. వారు స్వయం కృషితో పైకి వచ్చారు. వారు వారి సహోద్యోగులకు ధనసాయం కూడా చేసేవారు. ఒక స్వయంసేవక్‌ ఎలా జీవించాలన్నది ఆయన ఆచరించి చూపారు.

ఈ పదం వాడకూడదు. అయినా సరే నేను 48 ఏళ్ళ నుండి వారిని చూస్తున్నాను. వారు ఒక గృహస్తు. అయినా రాక్షసుడిలా పనిచేసారు. నిరంతరం రైళ్ళలో ప్రయాణిస్తూ వారంలో 6 రోజులు పర్యటనలో ఉండేవారు. క్షణం క్షణం ఆహుతి చేశారు. వయస్సు పెరుగుతున్నప్పుడు అందరినీ కలవటం కష్టం అవుతుంది. అయినప్పటికీ వారు విద్యార్థులతో కలసిపోయేవారు. యువకులను సాన పట్టడంలో ఆయనకు ఆయనే సాటి. కుమ్మరి కుండలను సాన పట్టి నునుపు చేసినట్లుగా వ్యక్తులను సానపట్టి మంచి కార్యకర్తలుగా తీర్చిదిద్దారు.

సంఘ విషయం చెప్పడంలో ఏ విధమైన సంకోచం వారికి ఉండేది కాదు. విశాఖలో ప్రభాత్‌ శాఖలు ఎక్కువ, సాయం శాఖలు తక్కువ. బుధవారం జరుగుతున్న వర్గను ఆదివారానికి మార్చారు. వర్గలో స్వయంగా పాల్గొనేవారు. ‘ధోతీ’ తోనే వర్గ తీసుకొనేవారు. దానితో విశాఖ శాఖ దశ, దిశ మారిపోయింది. జిల్లా అంతా భయకరంగా తిరిగేవారు. అప్పుడు విజయనగరం, విశాఖపట్నం కలిసి ఒకే జిల్లాగా ఉండేది. శాఖలు పెరగాలని నిరంతరం ప్రయత్నిస్తూండేవారు.

అత్యయిక పరిస్థితి ముగిసిన తరువాత వారు గ్రామీణ రైతుల ఇండ్లకు జి.ఎస్‌.రాజు గారితోపాటు వెళ్ళి వాళ్ళను సంఘానికి పరిచయం చేశారు. గ్రామాలలో సంఘ విస్తరణకు వారి నిరంతర పర్యటన, ప్రేమే కారణం.

విశాఖ బివికె కాలేజి స్థాపనలో పూజనీయ సోమయ్యగారితో కలిసి పరిశ్రమించి సాధించారు. గుడిలోవ పాఠశాల స్థలం కోసం వారు వయసు మీరిన అమ్మాయికి పెళ్ళి కొడుకు కోసం ఎలా తిరుగుతారో అలా తిరిగి ఆ కార్యాన్ని సాధించారు. వెయ్యి రూపాయలు వడ్డీలేని అప్పు చేసి గుడిలోవ స్థలాన్ని కొన్నారు. దాని కొరకు వారు కాలికి బలపం కట్టుకు తిరిగారు. పిళ్ళావారు, శాస్త్రిగారు, శివప్రసాద్‌ గారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా పనిచేశారు.

నూతక్కి స్కూల్‌, వివేకానంద హాస్పిటల్‌లను వ్యవస్థితం చేశారు. ఏ సమస్య వచ్చినా వ్యవస్థీకృతం చేసేవారు. చాలా మందిని సెటిల్‌ చేయడంలో సిద్ధహస్తులు.

శివప్రసాద్‌ గారు మొదటినుండి ఆఖరి రోజు వరకు ఒకే ధ్యేయనిష్ఠతో పనిచేశారు. పెద్దలపట్ల వారికి ఉన్న శ్రద్ధ అనన్య సామన్యం. శాస్త్రిగారు, శివప్రసాద్‌గారు కూడ యువకులను ముందుకు తేవాలని తపన చెందేవారు.

మోహన్‌జీ బాధ్యత తీసుకున్నప్పుడు చాలా సంతోషించారు. వారు ఎప్పుడూ ఎవ్వరితో అనవసర మాటలు మాట్లాడలేదు. భక్తితో సంఘ పని చేశారు. సంఘ వ్యవస్థను అంగీకరించటం, ఆచరించటం చాలా కష్టతరమైన పని. రామయ్యగారు, సోమయ్యగారు, శాస్త్రిగారు వారికి గురువులు. బి.టి. కాలేజీలో కలసి భోజనం చేసేవాళ్ళం. విశాఖపట్నం రావటం వలన వీరి సాంగత్య భాగ్యం నాకు లభించింది. ప్రతి విషయం వివరంగా చర్చించుకొనే వారం.

సంఘ బాధ్యతల నుండి తప్పుకున్న తరువాత వారి జీవనం ఎలా సాగిందో మనం గమనించాలి. వయసు మీద పడుతున్నప్పటికీ వారు స్వయంసేవకులను కలవటానికి ఒకసారి 5 అంతస్తుల భవన మెట్లు ఎక్కి వెళ్ళి కలిశారు.

ప్రతి ఒక్క స్వయంసేవక్‌ జీవితంతో వారు పంచుకొన్న ఆప్యాయత, అభిమానం అనిర్వచనీయమైనది. ఈ విధంగా వారి నుండి ప్రతి స్వయంసేవక్‌ ప్రేరణ పొందవచ్చు. తన పిల్లలు కూడా స్వయంసేవకులైతే బాగుండనుకొనేవారు. ఆర్యగారు, విజయ రామరాజు గార్లను వారు తయారు చేశారు. ప్రేమతో, పురుషార్థంతో పని చేశారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. వారిచ్చిన ప్రేరణతో, భక్తి, శ్రద్ధలతో వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను.

ఈ కార్యక్రమంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఆంధ్రప్రదేశ్‌ ప్రాంత సంఘచాలక్‌ భూపతిరాజు శ్రీనివాసరాజు, దక్షిణ మధ్య క్షేత్ర కార్యవాహ దూసి రామకృష్ణ, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు, తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

(జాగృతి సౌజన్యం తో )