Home News వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి విశిష్టత

వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి విశిష్టత

0
SHARE

డిసెంబర్‌ 29 వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి సందర్భంగా

తిథులన్నింటిలోను ఏకాదశి తిథికి ఒక విశిష్టత ఉంది. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. పదకొండు విషయాలకు సంబంధించిన విశేషాలను తనలో దాచుకుంది కనుక ఇది ఏకాదశి అయింది. కర్మేంద్రియాలు అయిదు. వాక్కు, చేతులు, కాళ్ళు, మూత్రద్వారం, మలద్వారం. జ్ఞానేంద్రియాలు కూడా అయిదు. అవి కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, చర్మం వీటిలో ఏ ఒక్కటి లోపించినా బతుకు అస్తవ్యస్తం అవుతుంది. ఈ పది ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకొని నడిపించేదే మనసు. అందుకే మనసును ఎల్లపుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసు ప్రశాంతగా, నిర్మలంగా ఉండాలంటే ఏకాదశి రోజు ఉపవాసాలు చేయడం, పూజలు చేయడం అలవాటు చేసుకోవాలి.

ఉపవాసం అంటే ఏమిటి ?

‘ఉపసమీపేయోవాసః ఉపవాస ఇతి కథ్యతే’

ఇతర ఆలోచనలు, వ్యాపకాలు లేకుండా కేవలం భగవంతుని సన్నిధిలో రోజంతా గడపడమే ఉపవాసం.

ఉపవాసం ఎందుకు ?

భారతీయ సంస్కృతిలోను, ధార్మిక విధి విధానంలోను ఉపవాసానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. జీర్ణకోశంలో నాడీ సముదాయాలుంటాయి. మనం పీల్చుకొనే శ్వాస 72 వేల వాయు నాళికల ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. అతి సూక్ష్మమైన వాయువు మాత్రమే ప్రవహించే ధూమవర్ణపు నాళికలవి. ఈ నాడీ సముదాయాన్ని ఉపత్సికలు అంటారు. అవి ఇంధక, దీపిక, భోచిక, చంద్రిక, కపిల, అసిత, అమాయ, ధూసార్వి, ఊష్మ, పూప, ఉద్గీత, ఆప్యాయిని, యుక్తహస్ర. ఈ ఉపత్సికలలో ఉష్ణ ప్రభావాన్ని తగ్గించడం లేదా అసమానం చేయడమే ఉపవాసం అంతరార్థం. ఏకాదశి తిథి నాడు మధ్యాహ్నం ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ స్మరణతో జాగరణ చేసిన వారికి ఏకాదశి వ్రత ఫలం దక్కుతుందని శాస్త్రం. ఏకాదశి తిథికి ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఈ తిథి శ్రీ మహా విష్ణువుకు, శంకరుడికి ప్రీతిపాత్రం. ఈ రోజు భక్తి శ్రద్ధలతో శివకేశవులలో ఎవరిని ఆరాధించినా అఖండ పుణ్యఫలంతో పాటు దేవతానుగ్రహం తప్పక లభిస్తుంది. ఇటువంటి మహా పుణ్యప్రదమైన ఏకాదశి తిథులు సంవత్సరంలో 12I12=24 వస్తాయి. ఏదైనా ఒక సంవత్సరంలో అధిక మాసం వస్తే 26 ఏకాదశి తిథులు రావొచ్చు.

మాసం పేరు                  శుక్ల పక్షం                       కృష్ణ పక్షం

1. చైత్రమాసం                 కామద                           పాపవిమోచన

2. వైశాఖమాసం             మోహిని                         వరూధిని

3. జ్యేష్ట మాసం               నిర్జల                             అపద

4. ఆషాఢం                      శయనైకాదశి                 యోగిని

5. శ్రావణ మాసం             పుత్ర ఏకాదశి                 కామద

6. భాద్రపద మాసం          పరివర్తన                       ఇందిర

7. ఆశ్వయుజ మాసం      పాశంకుశైకాదశి             వాల్మీకి

8. కార్తీకమాసం               ఉత్థానైకాదశి                  ప్రబోధినైకాదశి

9. మార్గశిరమాసం           వైకుంఠ ఏకాదశి             మోక్షదా నైకాదశి

10. పుష్యమాసం             షేష పుత్రాడ                   ఏకాదశి సఫల

11. మాఘమాసం            భీష్మ ఏకాదశి                   విజయ

12. ఫాల్గుణ మాసం          ఉత్పన్న ఏకాదశి             అమలవి

అధికమాసం                    పరమ ఏకాదశి               పద్మిని ఏకాదశి

1. ప్రతి సంవత్సరం ఆషాడ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి, శయనైకాదశి, ప్రథమ ఏకాదశి, ప్రబోధ నైకాదశిగా పిలుస్తారు. ఈ రోజు శ్రీ మహాశిష్ణువు క్షీరసాగరంలో శేష శయ్యపై యోగ నిద్రలోకి జారుకుంటాడని, తిరిగి కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడని ప్రతీతి. ఈ 4 నెలల పుణ్య కాలాన్ని చాతుర్మాస్యం అంటారు.

2. ఆషాఢ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు.

3. శ్రావణ శుక్ల ఏకాదశిని పుత్ర ఏకాదశి అంటారు. సంతానం లేని వాళ్ళ ఈ ఏకాదశి రోజు వ్రతాన్ని చేస్తే సంతానం లుగుతుందని పురాణ వాక్యం.

4. శ్రావణ బహుళ ఏకాదశిని కామద ఏకాదశి అంటారు.

5. భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అంటారు. శ్రీమన్నారాయణుడు శేష శయనం మీద పక్కకు ఒరుగుతాడు. కనుక దీనిని పరివర్తిని ఏకాదశి అంటారు.

6. భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిర ఏకాదశి అంటారు.

7. ఆశ్వయుజ శుక్ల ఏకాదశిని పాశాంకు శైకాదశి అంటారు. పాశం అంటే యమపాశం. ఈ రోజు ఉపవాసం చేస్తే ఆ వ్రత ఫలం అంకుశంలా యమపాశాన్ని అడ్డు కుంటుందట. యముడు ఏకాదశి వ్రతం చేసిన వారి పట్ల కరుణ చూపు తాడని పురాణ కావ్యం.

8. ఆశ్వయుజ బహుళ ఏకాదశిని వాల్మీకి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని వాల్మీకి జయంతిగా కూడా జరుపుకుంటారు. రత్నాకరుడు అనే కిరాతకుడు ఆదికవిగా అవతరించిన ఘట్టం మనిషిలో అంతర్లీనంగా ఉన్న మహాశక్తికి సంకేతం. కృషి ఉంటే మనుషులు ఋషులవు తారు అన్న మహత్తర సందేశాన్ని ఇది తెలుపుతుంది.

9. కార్తీక శుక్ల ఏకాదశిని ఉత్థాన ఏకాదశి (ప్రబోధనే కాదశి) అంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి మేల్కొంటాడని అందుకే దీనిని ఉత్థాన ఏకాదశి అంటారని సాంప్రదాయ కథనం. ఇది దేవతలు మేల్కొనే రోజు అయినందున ఉపవాసకులకు అత్యంత ముఖ్యమైనది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పునర్జన్మ ఉండదని శాస్త్రవచనం.

10. కార్తీక బహుళ ఏకాదశిని రమ ఏకాదశి అంటారు. ఆ రోజు యధావిధిగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపిండితో చేసిన లడ్లు, బెల్లం దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.

11. మార్గశిర మాస బహుళ పక్ష ఏకాదశిని మోక్షదా లేక ఉత్పత్తి ఏకాదశి అంటారు. ఈ రోజు వైవాహిక ఆలోచనలను దూరంగా పెట్టి హరినామామృతాన్ని ఆహారంగా భావించి ఆధ్యాత్మిక సాధనకు తొలి అడుగువేస్తే మంచి ఫలితముంటుంది.

12. మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిగా ప్రసిద్ది చెందింది. దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి నాడు సర్పాలంకారాలతో, శ్రీదేవి, భూదేవితో కలసి గరుడ వాహనంలో వైకుంఠానికి వచ్చేటప్పుడు వైకుంఠం ఉత్తర ద్వారం వద్ద సకల దేవతలు శ్రీ మహావిష్ణువును సేవించినందున దీనిని వైకుంఠ ఏకాదశి అంటారు.

– వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు ఆలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ రోజు తెల్లవారు జామున ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని చెప్తారు. అందుకే ఈ ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారంగా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు 33 కోట్ల దేవతలు భూమికి దిగి వస్తారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేసి రాత్రికి జాగరణ ఉండి మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుమూర్తికి పూజ చేసి, నైవేద్యం సమర్పించి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తే మంచిది. ఈ ఏకాదశి వ్రత మహిమను శివుడు పార్వతికి స్వయంగా చెప్పాడని పద్మపురాణం వివరిస్తుంది. ఈ సంవత్సరం డిసెంబర్‌ 29న ముక్కోటి ఏకాదశి వస్తుంది.

13. అధిక మాస శుక్ల ఏకాదశిని పద్మిని ఏకాదశి అంటారు.

14. అధిక మాస కృష్ణ పక్ష ఏకాదశిని పరమా ఏకాదశి అంటారు. పరమా అంటే చాలా గొప్పది.

15. పుష్య శుక్ల ఏకాదశిని పుత్ర ఏకాదశి అంటారు.

16. పుష్య బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు.

17. మాఘ శుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. మాఘ మాసంలో వచ్చే 2 ఏకాదశులు ముఖ్యమైనవే. మాఘ శుద్ధ సప్తమి మొదలుకొని ఏకాదశి వరకు భీష్ముడు ఒక్కొక్కరోజు ఒక్కొక్క ప్రాణాన్ని విడిచి పెట్టాడట. ఈ 5 రోజులను భీష్మ పంచకాలంటారు. భీష్ముడు శ్రీ కృష్ణ పరమాత్మలో ఐక్యమైంది మాఘ శుద్ధ అష్టమి నాడైనా శ్రీహరి ఆయన గొప్పదనాన్ని లోకానికి తెలియజేయడం కోసం తనని దివి నుండి భువికి దింపిన భక్తునిగా గౌరవిస్తూ తనకు ప్రీతిపాత్ర మైన ఏకాదశి తిథిని అతనికి ఏర్పాటు చేస్తూ భీష్మ ఏకాదశిని పర్వదినంగా ప్రకటించాడు. ఈ ఏకాదశి రోజు మాఘ స్నానంచేసి ఉపవాసం ఉంటే 24 ఏకాదశుల ఫలితం వస్తుందని పురాణ వచనం.

18. మాఘ మాస కృష్ణ పక్ష ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఆనాడే రామసేతువు నిర్మాణం పూర్తి అయిందని పురాణ వాక్యం.

19. ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. విష్ణువును శేషపుష్పాలతో పూజిస్తారు. పూర్వం మేధావి అనే మహర్షి రోజూ ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలేవాడు. మంజుఘోష అనే అప్సర అతనికి తపోభంగం కలిగించింది. కోపానికి గురైన ఆ మహర్షి అప్సరసను శపించాడు. విష్ణుమూర్తి కటాక్షంతో ఆ దేవకన్య ఫాల్గుణ ఏకాదశి నాడే శాప విముక్తురాలైంది.

20. ఫాల్గుణ బహుళ ఏకాదశిని అమలిక ఏకాదశి అంటారు.

21. చైత్రమాస శుక్ల ఏకాదశిని కామద ఏకాదశి అంటారు.

22. చైత్రమాస కృష్ణ పక్ష ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటారు.

23. వైశాఖ శుక్ల ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు.

24. వైశాఖ బహుళ ఏకాదశిని వరూధిని ఏకాదశి అంటారు.

25. జ్యేష్ట శుక్ల ఏకాదశిని నిర్మల ఏకాదశి అంటారు.

26. జ్యేష్ట మాస బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అంటారు.

ఏకాదశి వ్రతాలను మించిన వ్రతం లేదని, ఏకాదశి ఉపవాసం అన్నిటి కంటే శ్రేష్ఠమైందని శ్రీ కృష్ణ భగవానుడు ధర్మరాజుకు వినిపించాడు.

– ఎస్‌.వి.ఎస్‌. భగవానులు, విశ్రాంత డివిజనల్‌ ఇంజనీరు, ఎ.పి.ట్రాన్స్‌కో, ఒంగోలు

(జాగృతి సౌజన్యం తో)