Home News పాకిస్తాన్ పైశాచికం

పాకిస్తాన్ పైశాచికం

0
SHARE

కులభూషణ్ జాధవ్ భార్య మెడలోని మంగళసూత్రాలను తొలగించారు, గాజులను బొట్టును కూడ!! కుల్‌భూషణ్ జాధవ్‌తో ఆయన తల్లి ఆయన భార్య జరిపిన సమావేశం సందర్భంగా జరిగిన ఈ ఘటనాక్రమం పాకిస్తాన్ ప్రభుత్వ జిహాదీ బీభత్స స్వభావాన్ని మరోసారి వికృతంగా ఆవిష్కరించింది. మనదేశపు నౌకాదళంలో పనిచేసిన తరువాత వ్యాపారం నిమిత్తం ఇరాన్‌కు వెళ్లిన జాధవ్‌ను పాకిస్తాన్ సైన్యం ఆపహరించుకొనిపోవడం చరిత్ర.. జాధవ్ తమ దేశంలోని బలూచిస్థాన్‌లోకి చొరబడి ఉగ్రకలాపాలు నిర్వహించాడన్నది పాకిస్తాన్ ప్రభుత్వం ఆ తరువాత జరిపిన అసత్య ప్రచారం. ఇరాన్ నుంచి జాధవ్‌ను అపహరించిన పాకిస్తాన్ సైన్యం ఆయనను బలూచిస్థాన్‌లో నిర్బంధించినట్టు ప్రచారం చేసింది! ఈ అపహరణ జరిగిన తరువాత పదహైదు నెలలలోగా, జాధవ్‌ను పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం రహస్యంగా విచారించి, ఆయనను ఉగ్రవాదిగా నిర్ధారించి మరణశిక్షను విధించింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ‘మరణదండన’ను అమలు చేయరాదని ఆదేశించడంతో జాధవ్ పాకిస్తాన్ నిర్బంధంలో కొనసాగుతున్నాడు! ఇరవై రెండు నెలల కథ ఇది, జాధవ్ జీవన వ్యథ ఇది. జాధవ్ మాతృమూర్తి అవన్తి, ఆయన భార్య చేతన్‌కుల్ సోమవారం ఇస్లామాబాద్‌లో ఆయనను కలుసుకున్న సందర్భంగా వారిని తీవ్రమైన ఘోరమైన అవమానాలకు గురిచేయడం పాకిస్తాన్ ప్రభుత్వ జిహాదీ బీభత్సకాండలో భాగం! జాధవ్ ఉదంతం సాకుగా ఇస్లామేతర మతస్థులను అవమానించడానికి అమానవీయ చర్యలకు గురిచేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం యత్నించింది! జాధవ్‌ను ‘టెర్రరిస్టు’గా, మన దేశపు గూఢచారిగా చిత్రీకరించ డం ద్వారా అంతర్జాతీయ సమాజంలో మన దేశానికి అపకీర్తిని అంటగట్టడానికి గత ఇరవై రెండు నెలలుగా పాకిస్తాన్ ప్రభుత్వం యత్నిస్తోంది! మనదేశంలోని పాకిస్తాన్ ప్రభుత్వం 1947 నుంచీ ఉగ్రవాదులను, జిహాదీ హంతకులను ఉసిగొల్పుతూనే ఉంది! ఇటీవలి కాలంలో అమెరికా వంటి ప్రముఖ దేశాలు పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స రాజ్యాంగ స్వభావాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాయి. ‘ఐక్యరాజ్య సమితి’ కూడ పాకిస్తాన్ ప్రభుత్వం కొనసాగిస్తున్న భారత వ్యతిరేక బీభత్సకాండను గుర్తించింది! ‘లష్కర్ ఏ తయ్యబా’ ‘జమాత్ ఉద్ దావా’ ముఠాలను నడుపుతున్న హఫీజ్ సరుూద్‌ను ఐక్యరాజ్య సమితి 2008లోనే ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా గుర్తించింది. మరో కరడుగట్టిన జిహాదీ హంతకుడు అఝార్ మసూద్‌ను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ప్రకటించకుండా చైనా ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో అడ్డుతగులుతోంది! అయినప్పటికీ అఝార్ మసూద్ అసలు స్వభావం గురించి అంతర్జాతీయ సమాజం గుర్తించింది. ఈ పరిణామక్రమం ఇలా కొనసాగినట్టయితే ఎప్పుడో అప్పుడు ‘ఐక్యరాజ్య సమితి’ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ‘బీభత్స రాజ్యాంగ వ్యవస్థ’ – టెర్రరిస్ట్ రిజీమ్ – గా ప్రకటించడం ఖాయం! దీన్ని నివారించడానికై పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారంలో భాగం జాధవ్ వ్యవహారం.

మనదేశం కూడ తమ దేశంలో బీభత్స చర్యలను జరుపుతోందని అబద్ధాలను ప్రచారం చేయడం పాకిస్తాన్ ప్రభుత్వ దీర్ఘకాల వ్యూహం.. గతంలో సర్వజిత్‌సింగ్ అన్న భారతీయుడిని పంజాబ్‌లోకి చొరబడిన పాకిస్తానీ సైనికులు, ప్రచ్ఛన్న బీభత్సకారులు అపహరించారు! సర్వజిత్‌సింగ్ తమ దేశంలో పేలుళ్లు జరిపించాడని, ఇతర ఉగ్రవాద కలాపాలను నిర్వహించాడని పాకిస్తాన్ ప్రభుత్వం అసత్యపు ఆరోపణలు చేసింది. సర్వజిత్‌ను ఇరవై ఏళ్లకు పైగా నిర్బంధించి ఉంచింది! సర్వజిత్‌సింగ్ కుటుంబ సభ్యులు, ఆయనను కలుసుకొనడానికి ‘‘అవకాశం కల్పించింది’’! ఇలా అవకాశం కల్పించడం మానవీయ దృష్టితో కాదు. సర్వజిత్ సింగ్ ‘‘బీభత్సకారుడన్న’’ ప్రచారం చేయడానికి మాత్రమే!! ఇదే వ్యూహాన్ని పాకిస్తాన్ ఇప్పుడు పునరావృత్తం చేసింది! ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యాలయంలో జరిగిన ‘‘సమావేశం’’లో జాధవ్ కూర్చిండిన గదికీ, ఆయన భార్య తల్లి కూర్చున్న గదికీ మధ్య గాజు తెరను ఏర్పాటు చేయడం ఈ వ్యూహంలో భాగం.. ఈ ‘గాజు’ తెరను ఏర్పాటు చేయడం గురించి ప్రచారం అవుతుంది కనుక తమ వ్యూహం విజయవంతం అవుతుందన్నది పాకిస్తాన్ ప్రభుత్వ నిర్వాహకుల ‘‘విశ్వాసం..’’ ‘‘్భద్రతా నియమాలలో భాగంగా’’ కుల్‌భూషణ్ భార్య మెడలోని మంగళసూత్రాన్ని చేతులకున్న గాజులను తొలగించడమేకాక, బొట్టుకూడ చెఱిపివేశారు! ఇది పైశాచిక జిహాదీ చర్య.. ఇందులో న్యాయం లేదు, తర్కం లేదు! ఇస్లామేతర మహిళలను అవమానించడం ‘జిహాదీ’లకు శతాబ్దులుగా స్వభావం! ఈ స్వభావ భూమికపై పాకిస్తాన్ ‘విషవృక్షం’ వెళ్లూని ఉంది!

కుల్‌భూషణ్‌కు ఆయన కుటుంబ సభ్యులకు మధ్య ఈ గాజుతెర మధ్య జరిగిన సంభాషణ ధ్వనియంత్రాల ద్వారా మాత్రమే వారికి వినబడింది. ఈ సంభాషణను వినడానికి పాకిస్తాన్‌లోని భారత్ సహాయ రాయబారి – డిప్యూటీ హైకమిషనర్-కి అవకాశం కల్పించలేదు! ‘‘గాజుతెర’’కు అటూఇటూ కూర్చున్న జాధవ్ కుటుంబ సమావేశం మొదలైన తరువాత పదిహేను నిమిషాల వరకూ ‘సమావేశ ప్రాంతం’లోకి మన సహాయ రాయబారి జెపిసింగ్‌ను అనుమతించకపోవడం దౌత్య నియమాలను ఉల్లంఘించడంలో పాకిస్తాన్ ప్రభుత్వ ప్రచ్ఛన్న బీభత్సకారుల తెంపరితనానికి మరో సాదృశ్యం. ఆ తరువాత ఆయనను సమావేశ స్థలంలోకి వెళ్లడానికి అనుమతించినప్పటికీ ఆయన చుట్టూ మరో ‘గాజు తెర’ ఏర్పాటు చేయడం పాకిస్తాన్ దౌత్య దౌర్జన్యానికి నిదర్శనం. ఈ గాజుగోడ కారణంగా జెపిసింగ్‌కు జాధవ్ కుటుంబ సభ్యులు ఏమి మాట్లాడుకున్నదీ వినబడలేదు. కానీ సంభాషణలను పాకిస్తాన్ అధికారులు ధ్వని ముద్రణ ద్వారా నమోదు చేసుకున్నారు! మరాఠీ – మాతృభాష -లో మాట్లాడడానికి జాధవ్ తల్లిని అనుమతించకపోవడం పాకిస్తాన్ అధికారులు ఒడిగట్టిన మరో బీభత్స కృత్యం.. జాధవ్ కుటుంబ సభ్యుల సమావేశం జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్ దళాలు జమ్మూకశ్మీర్‌లోని అధీన రేఖ – లైన్ ఆఫ్ కంట్రోల్ – ఎల్‌ఓసి – వద్ద మరోసారి కవ్వింపు కాల్పులకు పూనుకోవడం సమాంతర ప్రచ్ఛన్న పరిణామం. ఊహించని సమయంలో గోడ దూకడం తోడేలు స్వభావం! జాధవ్ కుటుంబ సభ్యుల సమావేశంపై దృష్టి మళ్లి ఉన్న సమయంలోనే ఇలా ‘రేఖ’ వద్ద పాకిస్తానీ తోడేళ్లు మళ్లీ దూకాయి.. మంగళవారం నాడు మన దళాల ‘రేఖ’ వద్ద పాకిస్తానీలను తిప్పికొట్టాయి…

ఇలా పాకిస్తానీ భౌతిక దురాక్రమణను – జిహాదీల ప్రత్యక్ష బీభత్సకాండను, సైనికుల ప్రచ్ఛన్న బీభత్సకాండను – ఎప్పటికప్పుడు తిప్పికొట్టగలుగుతున్న మన ప్రభుత్వం పాకిస్తానీ దౌత్య బీభత్సాన్ని మాత్రం నిరోధించలేకపోతోంది! ‘వెన్నంటి తరుమడం’ – హాట్ పర్సూట్ – ద్వారా పాకిస్తానీ ముష్కర మూకలను, ఉగ్రవాదులను అదుపుచేయగలుగుతున్నాయి. దౌత్యరంగంలో సైతం ఇలా ‘వెన్నంటి తరిమే’ విధానాన్ని మన ప్రభుత్వం ఇప్పుడైన మొదలుపెట్టాలి! వివిధ దేశాల ప్రభుత్వాలను ఒప్పించడం ద్వారా జాధవ్‌ను మన దేశానికి రప్పించడానికి యత్నించాలి! ఆయా ప్రభుత్వాల ద్వారా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచాలి! సర్వజిత్ సింగ్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం జైలులో హత్య చేయించింది. కులభూషణ్ కథ సర్వజిత్ వ్యథకు పునరావృత్తి కారాదు.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)