Home News తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

0
SHARE
  • ఇది చరిత్రాత్మకం: ప్రభుత్వం
  •   ఏకాభిప్రాయానికి భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ పిలుపు
  •   కాంగ్రెస్‌ మద్దతిచ్చినా బిల్లును తప్పుపట్టిన ఖుర్షీద్‌
  •   ఇలాంటి చట్టం చేసే అధికారం పార్లమెంటుకు లేదు: ఒవైసీ

ఈ బిల్లు ఏ మతానికీ విరుద్ధం కాదు. మహిళలకు న్యాయం జరగాలనేదే మా ఉద్దేశం. ఇది రాజకీయాలకు, మతానికి సంబంధించిన అంశం కాదు. మానవత్వంతో ముడిపడింది. ముస్లింలకు అనుకూలంగా బిల్లును తేవడమే నేరమైతే ఆ నేరాన్ని పదిసార్లు చేస్తాం

– న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

ముస్లిం సమాజంలో అనేక ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ముమ్మారు తలాక్‌ పద్ధతిపై లోక్‌సభ చరిత్రాత్మక నిర్ణయం తీసుకొంది. దీనిని నేరంగా పరిగణించే బిల్లును ప్రవేశపెట్టడం, మూజువాణి ఓటుతో దానిని ఆమోదించడం… అంతా గురువారం కొన్ని గంటల్లో పూర్తయిపోయింది. ముమ్మారు తలాక్‌ పద్ధతి చట్టవ్యతిరేకమనీ, దీనిపై ఆరు నెలల్లోగా ప్రభుత్వం చట్టాన్ని చేయాలనీ ఆదేశిస్తూ ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బిల్లు రూపొందిన విషయం తెలిసిందే. పార్టీల మధ్య భిన్నమైన అభిప్రాయాలున్న ఈ అంశంపై ఇక రాజ్యసభ ఆమోద ముద్ర వేయడమే తరువాయి. దానికి తగ్గ ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. లోక్‌సభలో బిల్లుకు మద్దతునిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ… రాజ్యసభలోనూ అదేవిధంగా చేస్తే… అక్కడ సంఖ్యాపరంగా బలం తక్కువగా ఉన్న అధికార పార్టీ గట్టెక్కినట్లే.

వీగిపోయిన విపక్ష సవరణలు: ఒకేసారి ముమ్మారు తలాక్‌ చెప్పి విడాకులిచ్చే పద్ధతిని నేరంగా పరిగణించే బిల్లుకు లోక్‌సభ గురువారం రాత్రి మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చానంతరం విపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. బిల్లు ఇప్పుడు రాజ్యసభకు వెళ్తుంది. ఏ రూపంలోనైనా తలాక్‌ చెప్పే భర్తలకు మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించడానికి అవకాశం కల్పించే బిల్లుపై లోక్‌సభ విపక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా అధికార పక్షం మాత్రం ఇది చరిత్రాత్మక రోజుగా నిలిచిపోతుందని పేర్కొంది. బిల్లును రాజ్యసభలో ఏకాభిప్రాయంతో ఆమోదిద్దామని ప్రధాని నరేంద్రమోదీ భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పిలుపునిచ్చారు. బిల్లును న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రవేశపెడుతూ తాము చరిత్ర సృష్టిస్తున్నామన్నారు. పాకిస్థాన్‌ సహా అనేక ఇస్లాం దేశాలు ఈ చట్టాన్ని మార్చాయని గుర్తు చేశారు. ఏ రూపంలోనైనా మూడుసార్లూ వెంట వెంటనే తలాక్‌ చెబితే ప్రతిపాదిత చట్టం కింద నేరమే అవుతుంది. ఇలాంటివారికి మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. జమ్ముకశ్మీర్‌కు మినహా యావద్దేశానికీ వర్తిస్తుంది.

మద్దతిస్తాం గానీ… కాంగ్రెస్‌:  తలాక్‌ బిల్లుకు తాము మద్దతునిస్తామనీ, అయితే- విడాకులు పొందే ముస్లిం మహిళల ప్రయోజనాలను పరిరక్షించడానికి మరిన్ని చర్యలు అవసరమనీ కాంగ్రెస్‌ పేర్కొంది. బిల్లుపై వెంటనే ఓటింగ్‌ చేపట్టేబదులు స్థాయీ సంఘానికి నివేదించాలని సూచించింది. కాంగ్రెస్‌కే చెందిన సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ మాత్రం ఈ చట్టాన్ని తప్పుపట్టారు. ఇది వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడడమే అవుతుందని అన్నారు. ఆర్జేడీ, ఏఐఎంఐఎం, బీజేడీ, ఏఐఏడీఎంకే, ఆలిండియా ముస్లింలీగ్‌ పార్టీల సభ్యులు మాత్రం బిల్లును వ్యతిరేకించారు. తృణమూల్‌ మౌనం దాల్చింది. ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందనీ, ఇలాంటి చట్టాన్ని చేసే అధికారం పార్లమెంటుకు లేదనీ అసదుద్దీన్‌ ఒవైసీ (ఏఐఎంఐఎం) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చట్టం వెనుక దురుద్దేశాలున్నాయన్నారు. ‘గుజరాత్‌లోని మన బాబీ (వదిన) సహా’ వివిధ మతాలకు చెందిన 20 లక్షల మంది తమ భర్తల నుంచి దూరంగా ఉంటున్నారనీ, వారి గురించీ ప్రభుత్వం పట్టించుకోవాలనీ ఆయన మోదీని ఉద్దేశించి అన్నారు. పార్లమెంటు బయట విలేకరులతో ఆయన మాట్లాడుతూ- సివిల్‌ వ్యవహారమైన వివాహంపై క్రిమినల్‌ కేసులు పెట్టాలనడం తగదన్నారు. తలాక్‌ను ముస్లిం దేశాలూ వ్యతిరేకిస్తున్నాయి కదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ… ఆ దేశాల్లోని అన్ని చట్టాలనూ భారతదేశంలో అమలు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు.

పార్లమెంటరీ పార్టీలో చర్చ: తలాక్‌ బిల్లుపై గురువారం భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించినట్లు ఈ సమావేశానంతరం మంత్రి అనంత్‌కుమార్‌ విలేకరులకు తెలిపారు. వివిధ అంశాలను మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వివరించారని చెప్పారు. ఏకాభిప్రాయంతో బిల్లుకు రాజ్యసభలో ఆమోదం పొందడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పారు. తలాక్‌ చట్టానికి మద్దతు ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పినందువల్ల బిల్లుకు ఎగువసభలోనూ ఆమోదముద్ర పడే అవకాశాలున్నాయి.

ముస్లిం మహిళలకు గౌరవం పెరుగుతుంది

‘ఒకేసారి ముమ్మారు తలాక్‌ చెప్పే పద్ధతి చెల్లదని చట్టం చేయడం ద్వారా ముస్లిం మహిళల్లో కొత్త ఆశలు కలగడమే కాకుండా వారికి గౌరవం పెరుగుతుంది. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీని, ఎన్డీఏ సర్కారును అభినందిస్తున్నా. ఇదో చరిత్రాత్మక అడుగు.’

– అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు.

సవరణలకు ప్రయత్నిస్తాం

‘ఈ బిల్లు రద్దుకు, లేదా సవరణలకు ప్రజాస్వామ్య విధానాల్లో ప్రయత్నం చేస్తాం. తలాక్‌ చట్టం విషయంలో బోర్డునూ పరిగణనలో తీసుకుని ఉండాల్సింది. బిల్లునుహడావుడిగా తీసుకువచ్చారు. అయితే దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనేదీ ప్రస్తుతానికి లేదు.’

– మౌలానా ఖలీల్‌ ఉర్‌ రెహ్మాన్‌ సజ్జద్‌ నొమానీ, అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ)

తలాక్‌ బిల్లుపై ఎవరేమన్నారంటే…

పదేళ్ల శిక్ష విధించాలి

‘ముమ్మార్‌ తలాక్‌ చెప్పేవారికి విధించే శిక్షను పదేళ్లకు పెంచడంతో పాటు క్రిమినల్‌ కేసు నమోదు చేసేలా చూడాలని ప్రధానికి లేఖ రాశాను.’

– షియా వక్ఫ్‌బోర్డ్‌ అధ్యక్షుడు వాసిమ్‌ రిజ్వి.

మహిళా సంఘాలతో చర్చించనే లేదు

‘ఈ బిల్లుపై ముస్లిం మహిళలతో గానీ, మహిళా సంఘాలతో గానీ ప్రభుత్వం చర్చించలేదు.’

-బృందా కారాట్‌, సీపీఎం.

సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది

‘ఈ బిల్లుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా చట్టాలను పార్లమెంటు చేస్తే దానిని సవాల్‌ చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.’

– ఏఐఎంపీఎల్‌బీ సభ్యుడు జఫర్యాబ్‌ జిలానీ.

ఆహ్వానించదగ్గ పరిణామం

‘మహిళలను వెంటాడుతున్న దుష్టశక్తిలాంటిదే ముమ్మారు తలాక్‌. ఈ బిల్లు ఆహ్వానించదగ్గది. నూతన చట్టం ఖురాన్‌ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి.’

-అఖిల భారత ముస్లిం మహిళల పర్సనల్‌ లా బోర్డు అధ్యక్షురాలు షైష్టా అంబర్‌.

(ఈనాడు సౌజన్యం తో)