Home News సూర్యుడు ‘అస్తమించని’ గ్రామం!!

సూర్యుడు ‘అస్తమించని’ గ్రామం!!

0
SHARE

బంజేరుపల్లి.. తెలంగాణలో మెదక్‌ జిల్లా సిద్దిపేట మండలంలో ఒక చిన్న పల్లెటూరు. 120 ఇళ్ళు ఉంటాయి. నాలుగేళ్ల క్రితం కరెంటు కోతలతో గ్రామంలోని ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతూ ఉండేవారు. విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ ఊరి రూపమే మారిపోయింది. ఎందుకంటే  ఈ గ్రామంలో సూర్యుడు ఎప్పుడూ ‘అస్తమించడు’! పగలంతా వెలుతురు ఇచ్చి, రాత్రయ్యే సరికి సోలార్‌ విద్యుత్‌ రూపంలో పల్లెకు వెలుగునిస్తాడు. ఈ గ్రామంలో అన్ని ఇళ్ళు ఇప్పుడు పూర్తిగా సౌర విద్యుత్‌ ను ఉపయోగించుకుంటున్నాయి. ప్రతి ఇంటి పైకప్పు మీద సౌర ఫలకాలు కనిపిస్తాయి.

కరెంట్‌ కోతల నుంచి విముక్తి

గతంలో కరెంటు కోతలతో విసిగిపోయిన గ్రామస్థులకు ఇప్పుడు విద్యుత్‌ గురించి పెద్దగా టెన్షన్‌ లేదు. కరెంటు పోయిన మరుక్షణం సౌర విద్యుత్‌ అందివస్తోంది. ఇళ్లలోనే కాదు, 65 సోలార్‌ వీధి దీపాలు ప్రజల జీవితంలో వెలుగులు నింపుతున్నాయి. వానాకాలంలో పిడుగు ప్రమాదాల నుంచి సోలార్‌ యూనిట్లను కాపాడుకోవడానికి లైట్నింగ్‌ అరెస్టర్‌లను కూడా బిగించారు.

నాబార్డ్‌ తోడ్పాటు

జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్‌) చొరవతో బంజేరుపల్లిలో ప్రతి ఇంటిలోనూ సౌర విద్యుత్‌ వెలుగులు కనిపిస్తున్నాయి. విద్యుత్‌ పొదుపు చేసే విధానానికి బంజేరుపల్లి ప్రజల నుంచి పూర్తి సహకారం లభించింది. సంపూర్ణ సోలార్‌ గ్రామంగా రూపొందించడానికి గ్రామసభలో తీర్మానం చేసి, ఉత్సాహంగా ముందుకు వచ్చారు. గ్రామంలోని 120 ఇళ్ల మీద సౌర ఫలకాలు వెలిశాయి. నాబార్డు, స్థానిక ఏపీజీవీ బ్యాంక్‌ ఇచ్చిన రుణాలతో పనులు జరిగాయి. ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ 4 లైట్లు, 4 ఫ్యాన్లు, టీవీ, ఫ్రిజ్‌ (500 వాట్స్‌) సోలార్‌ విద్యుత్‌తోనే పనిచేస్తున్నాయి.

ఒక్కో ఇంటికి సోలార్‌ ప్యానెళ్లు, బ్యాటరీలు, వైరింగ్‌ ఏర్పాటు చేయడానికి 85 వేల రూపాయలు ఖర్చయింది.ప్రతి ఇంటి నుంచి డిపాజిట్‌గా రూ.8 వేలు వసూలు చేశారు. మొత్తం వ్యయంలో 40 శాతాన్ని నాబార్డు సబ్సిడీగా అందించింది.

‘బిల్లులు తగ్గాయి’

సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థను అమర్చుకున్న తర్వాత తమ జీవనం మరింత మెరుగైందని, బిల్లుల మోత తగ్గిందని బంజేరుపల్లి వాసులు అంటున్నారు. గతంలో తాము నెలకు రూ.500 విద్యుత్‌ బిల్లు కట్టేవాళ్లమని, సౌర విద్యుత్‌ రాకతో నెలకు రూ.150 మాత్రమే బిల్లు కడుతున్నామని సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

అయితే ఏవైనా సాంకేతికపరమైన ఇబ్బందులు వస్తే రిపేర్‌ చేసేవారు లేరని, దీనివల్ల కొన్ని ఇళ్ళలో సోలార్‌ విద్యుత్‌ను ఉపయోగించలేకపోతున్నామని అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.

(లోకహితం సౌజన్యం తో)