Home News సంకల్ప బలమే నిలబెట్టింది…

సంకల్ప బలమే నిలబెట్టింది…

0
SHARE

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు.. ఇది కేవలం సినిమా పాట మాత్రమే కాదు. ఇదే జీవిత సత్యం. కష్టపడితే సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. ఇందుకు ఉదాహరణ సన్మతి జీవితమే. సమాజం మొత్తం తనను చిన్నచూపు చూసినా సంకల్ప బలంతో తన అంగవైకల్యాన్ని అధిగమించి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్ది అందరికీ ఆదర్శప్రాయురాలైంది.

సన్మతి వెన్నెముక సరియైన స్థితిలో లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. అయినా ఆమె కుంగిపోలేదు. ధైర్యంగా తన అంగవైకల్యాన్ని అధిగమించి అలా బాధపడుతున్న వారికి సహాయంగా నిలిచింది. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎందరి జీవితాలనో తీర్చిదిద్దింది. దివ్యాంగులతో ఎలా మసలుకోవాలో ప్రజలకు తెలియజేసింది.

‘నాకు నేను అన్ని విధాల సమర్థురాలినే. కాని ఈ సమాజం నన్ను అసమర్థురాలివని, స్వతంత్రంగా జీవించలేవని నిందించేది’ అంటూ బాధ పడింది 29 సంవత్సరాల సన్మతి. ఆమెది కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లా బోరగావ్‌ గ్రామం.

సన్మతి బాల్యంలో ఆరోగ్యంగానే ఉండేది. యవ్వనంలోకి అడుగు పెట్టే సమయానికి ఆమె వెన్నెముకలో మార్పు, వంపు ప్రారంభమైంది. ఫలితంగా ఒక భుజం అసమానంగా పెరిగిపోయింది. ఇక అప్పటి నుండి ఆమె పోరాటం ప్రారంభమైంది.

శరీరంలో మార్పులు, వెన్నెముకలో వంపు.. అయినా సన్మతి ఏమాత్రం బాధపడలేదు. కాని ఆమె తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు తన వైపు జాలిగా చూడటాన్ని మాత్రం తట్టుకోలేకపోయింది.

ఒకరోజు సన్మతికి తన క్లాస్‌టీచర్‌ ప్రభుత్వ ఆసుపత్రి నుండి వికలాంగుల సర్టిఫికెట్‌ తెచ్చుకొమ్మని చెప్పింది. ఆమెకు అది అర్థం కాలేదు. విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. వారు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయురాలితో మాట్లాడారు. అప్పుడు అర్థమైంది తనకు ఏదో అంగవైకల్యం ఉందని.

తరగతి గదిలో కొందరు సన్మతిని ఆదరంగా చూస్తూ అవసరమైన సహాయం చేస్తుంటే కొందరు మాత్రం ఆమెను హేళన చేసేవారు. ‘నువ్వు ఏ పనీ చేయలేవు.. నీకు శక్తి లేదు’ అని ఏడిపించేవారు. ఇలా ఏళ్ళతరబడి కొనసాగింది. ఈ పరిస్థితులే ఆమెలో పట్టుదలను పెంచాయి.

‘నా చుట్టూ ఉన్నవారు నన్ను అసమర్థురాలిగా భావిస్తున్నారు. అంగవైకల్యంతో ఉన్న నేను ఏదీ సాధించలేననుకుంటున్నారు. అది తప్పు అని నిరూపి స్తాను. నా కాళ్ళ మీద నేను నిలబడటమే కాకుండా నాలాంటి వారికి సహాయంగా నిలుస్తాను’ అని అప్పుడే సన్మతి నిశ్చయించుకుంది. ప్రారంభంలో ఇబ్బందులు ఎదురైనా ముందడుగు వేసింది.

2009లో టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు పూర్తి చేసి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించింది. కర్ణాటకలో బోరగావ్‌లోని పాఠశాలలోనే పని ప్రారంభించింది. శరీరం సహకరించకున్నా పట్టుదలతో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎదిగింది. ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఆ తర్వాత కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి సామాజిక శాస్త్రంలో ఎం.ఏ. పట్టా పొందింది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది.

ప్రస్తుతం సన్మతి ప్రతిరోజు 300 మంది విద్యార్థులకు బోధిస్తోంది. భారతీయ విద్యా విధానం అంగవైకల్యం గురించి అవగాహన కల్పించాలని ఆమె భావిస్తోంది. సమాజం దివ్యాంగులను చిన్నచూపు చూడొద్దని, వారిని అసమర్థులుగా భావించరాదని చెబుతుంది. ప్రస్తుతం బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఈ ప్రయాణంలో సన్మతికి తన తల్లిదండ్రులు ఎంతగానో సహకరిస్తున్నారు. ‘సన్మతి స్వతంత్రంగా జీవించడమే మాకు కావాలి. ఆమె ఆశయం నెరవేరడానికి మా శాయశక్తులా కృషిచేస్తాం’ అంటారు వారు.

సంకల్ప బలం ముందు ఏదీ నిలువలేదు. సమాజం చిన్నచూపు చూసినా సంకల్పబలంతో అంగవైకల్యాన్ని అధిగమించి అందరికీ ఆదర్శంగా నిలిచి తాను అనుకున్నది సాధించిన సన్మతిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి.

(జాగృతి సౌజన్యం తో)