భారత్‌తో సామరస్య సంబంధాలు నెలకొల్పుకోవడానికి పాకిస్థాన్ సైన్యం ప్రయత్నిస్తోందన్న మాట దౌత్య వర్గాలలోను, మీడియాలోను విన్పిస్తోంది. మరి జనరల్ బజ్వా 2016 నవంబర్‌లో పాక్ సైనిక దళాల ప్రధానాధికారిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ఇరు దేశాల సరిహద్దుల్లోను, నియంత్రణ రేఖ వద్ద హింసాత్మక ఘర్షణలు నిరంతరమూ ఎందుకు పెచ్చరిల్లిపోతున్నాయి?
భారత్‌తో సుస్థిర స్నేహ సంబంధాలను పాకిస్థాన్ సైన్యం ప్రగాఢంగా ఆకాంక్షిస్తోందట! ఇటీవల బ్రిటిష్ దినపత్రిక ఒకదానిలో వెలువడిన ఒక వ్యాసం సారాంశమది. ఆ వ్యాసాన్ని మన దేశంలోని వివిధ దినపత్రికలు పునఃప్రచురించాయి. ఇదొక ఆకస్మిక పరిణామం. భారతీయ విశ్లేషకులు ఆ వ్యాస ప్రతిపాదనలను విశ్వసించకపోతే వారిని క్షమించవచ్చు సుమా! బ్రిటన్‌లోని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ లో విజిటింగ్ ఫెలోగా ఉన్న పాకిస్థానీ విశ్లేషకుడు కమాల్ అలం రాసిన వ్యాసమది. సరే, భారత్–పాకిస్థాన్ సంబంధాలలో ఇంతవరకు చోటుచేసుకున్న సంఘటనల స్వభావానికి, తీరుతెన్నులకు పాక్ సైన్యం ఆకాంక్ష విరుద్ధంగా లేదూ?
పాకిస్థాన్‌తో ఆత్మీయ అనుబంధాలను పటిష్ఠం చేసుకోవడానికి ప్రయత్నించని భారత ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారా? మరీ ముఖ్యంగా పాక్‌తో శాంతి సామరస్యాలకు అటల్ బిహారీ వాజపేయి చేసిన ప్రత్యేక కృషి ఏ విధంగా పర్యవసించిందో మరి చెప్పాలా? శాంతి స్థాపన ప్రయత్నాలను ప్రతిసారీ భగ్నం చేసింది పాకిస్థాన్ సైన్యమే కాదూ? పాకిస్థాన్ విధాన నిర్ణయాలను పాక్ సైన్యం ఏ విధంగా నియంత్రిస్తుందీ విఖ్యాత పాకిస్థానీ విశ్లేషకుడు, మాజీ దౌత్యవేత్త హుస్సాయిన్ హక్కాని తన రెండు పుస్తకాలలో – ‘పాకిస్థాన్: బిట్వీన్ మసీద్ అండ్ మిలిటరీ’, ‘రీ ఇమేజినింగ్ పాకిస్థాన్’– సవివరంగా రాశారు. 2005లో వెలువడిన మొదటి పుస్తకమూ, ఇటీవలే విడుదలైన రెండో పుస్తకమూ భారత ఉపఖండ వ్యవహారాల పరిశీలకుల, అధ్యయన వేత్తల ప్రశంసలు పొందాయి.
ఒక కఠోర సత్యమేమిటంటే పాక్ రాజకీయాలలో ఆ దేశ సైనిక దళాల ఆధిపత్యానికి, భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నిరంతరమూ కొనసాగుతూ ఉండడమనేది తప్పనిసరి. అమెరికా రచయిత క్రిస్టినె ఫెయిర్ సమగ్ర, లోతైన పరిశోధనతో రాసిన ‘ఫైటింగ్ టు ది ఎన్డ్: ది పాకిస్థాన్ ఆర్మీస్ వే ఆఫ్ వార్’ అనే పుస్తకం ఆ సత్యాన్ని ధ్రువీకరించింది. అంతర్జాతీయంగా పేరు పొందిన మరెందరో ఉపఖండ వ్యవహారాల అధ్యయనవేత్తలు కూడా తమ తమ రచనలలో అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
1998లో వాజపేయి, ఇప్పుడు నరేంద్ర మోదీ పాక్‌తో సామరస్య సాధనకు పలువిధాల ప్రయత్నించారు. చాలా ఉదారంగా, విశాల హృదయంతో వ్యవహరించారు. అయితే జరిగినదేమిటి? శాంతి స్థాపనకు భారత ప్రధానమంత్రులు పూనుకున్న ప్రతిసారీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ధం లాంటి స్థితిని సృష్టించడం ద్వారా పాక్ సైన్యం ఆ శాంతి ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కల్గించింది. భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధానికి దిగిన ప్రతిసారీ పాకిస్థాన్ అవమానకరమైన రీతిలో పరాజయాల పాలయింది.
1947 నుంచి ఇదే పరిస్థితి పునరావృతమవుతూనే ఉన్నది. కాకపోతే భిన్న సందర్భాలలో భిన్న నాయకులు, భిన్న పార్టీలు అధికారంలో ఉన్నారు. వాజపేయి 1998లో లాహోర్‌కు చరిత్రాత్మక బస్ యాత్ర చేశారు. ఆ వెన్వెంటన్ కార్గిల్ యుద్ధం ప్రజ్వరిల్లింది. పాక్ సైన్యం పరాజయం పాలయింది. ఈ ఓటమిలో తన బాధ్యతను కప్పిపుచ్చుకోవడానికిగాను జనరల్ పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలో పాక్ సైన్యం తమ పౌర ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. అనేక సంవత్సరాల పాటు సైనిక పాలన కొనసాగింది 2016లో ప్రధాని మోదీ శాంతి చర్చలను పునః ప్రారంభించడానికి రెండు సార్లు చొరవ చూపారు. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి చేయడం ద్వారా పాక్ సైన్యం ఆ చర్చల విషయంలో తన అభీష్టమేమిటో వెల్లడించింది.
గత ఏడు దశాబ్దాలుగా పాకిస్థాన్ సైన్యం ఇదే విధంగా వ్యవహరిస్తూ వచ్చింది కదా. మరి ఇప్పుడు పాక్ సైన్యం మరోసారి చేస్తున్న శాంతి చర్చల ప్రతిపాదనను భారత్‌లో వివేకవంతుడైన ఏ వ్యక్తి అయినా ఎలా ఆహ్వానించగలుగుతాడు? ‘భారత్‌కు పాక్ సైన్యం స్నేహ హస్తం చాచడం ఇదే మొదటిసారి’ అని, ‘ఈ చరిత్రాత్మక ప్రథమ ప్రయత్నానికి న్యూఢిల్లీ సానుకూలంగా ప్రతిస్పందించాలని’ పాకిస్థానీ విశ్లేషకుడు కమాల్ అలం కోరారు. పాక్ సైన్యం చిత్తశుద్ధితో శాంతి చర్చల ప్రతిపాదన చేసిందని పేర్కొంటూ అందుకు కొన్ని నిదర్శనాలను ఆ విశ్లేషకుడు చూపారు. దుర్బలమైన ఆ నిదర్శనాలను, దశాబ్దాలుగా చేదు అనుభవాలను చవి చూస్తున్న భారతీయులు ఎలా అంగీకరించగలుగుతారు? అయినా అలం ప్రస్తావించిన నిదర్శనాలను నిశితంగా పరిశీలిద్దాం.
ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో సైనిక ప్రతినిధి సంజయ్ విశ్వాస్‌రావు , ఆయన బృందాన్ని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ జావేద్ బజ్వా పాకిస్థానీ మిలిటరీ పెరేడ్‌కు ఆహ్వానించారు. ఇది పాక్ సైన్యం చిత్తశుద్ధికి మొదటి నిదర్శనం. ఇది జరిగిన పక్షం రోజులలోనే భారత్‌తో శాంతిని నెలకొల్పుకోవాలని పాక్ సైన్యం కోరుకొంటుందని, ఇందుకు న్యూ ఢిల్లీతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని జనరల్ బజ్వా ప్రకటించడం రెండో నిదర్శనమని కమాల్ అలం పేర్కొన్నారు. ఇక మూడో నిదర్శనం– రష్యా తన భూభాగంలో నిర్వహించనున్న సంయుక్త సైనిక విన్యాసాలలో భారత్, పాకిస్థాన్‌లు రెండూ పాల్గొననున్నాయి. ఈ విన్యాసాలలో చైనా కూడా పాల్గొననుండడం గమనార్హం.
2016 నవంబర్‌లో జనరల్ బజ్వా పాక్ సైనిక దళాల ప్రధానాధికారి అయిన దరిమిలా భారత్ పట్ల పాక్ సైన్యం విధానంలో ఉద్దేశపూర్వక మార్పులలో భాగంగానే ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయని కమాల్ అలం వ్యాఖ్యానించారు. దీన్ని విశ్వసించేందుకు మరిన్ని నిదర్శనాలు ఎంతైనా అవసరం. ఎందుకని? జనరల్ బజ్వా ఆర్మీ చీఫ్ అయిన దరిమిలా అంటే గత 18 నెలల్లో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోను, కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వద్ద ఇరు దేశాల సైన్యాల మధ్య నిరంతరమూ హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లిపోతూనే ఉన్నాయి మరి. ఈ ఘర్షణలకు కారణమేమిటి?
భారత్ పట్ల పాక్ సైనిక దళాల వైఖరిలో మార్పు వచ్చిందనే విష యాన్ని నొక్కి చెప్పడానికి రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్‌లో జనరల్ బజ్వా ప్రసంగ భాగాలను కూడా కమాల్ అలం ఉటంకించారు. పాకిస్థాన్ సైన్యం భారత్ సైన్యం మూలంగా అభద్రతా భావానికి లోనవుతుందనే అభిప్రాయాన్ని పాక్ వ్యవహారాల పరిశీలకులు పలువురు పదే పదే వ్యక్తం చేస్తుండేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే కాబోలు జనరల్ బజ్వా ఇటీవల రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్‌లో వెలువరించిన ఒక ప్రసంగంలో ఇలా వ్యాఖ్యానించారు: ‘పాకిస్థాన్ సైన్యం ఇంకెంత మాత్రం అభ్రదతా భావానికి లోనుకావడం లేదు. తన భవిష్యత్తు పట్ల నిండు విశ్వాసంతో ఉన్నది’. అయితే ఈ వ్యాఖ్యల సూచితార్థాన్ని మినహాయింపులు లేకుండా అంగీకరించడానికి వీలులేదు. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు క్సి జిన్‌పింగ్‌ల మధ్య ఇటీవల చర్చలు జరిగిన విషయం విదితమే. ఆ చర్చల స్ఫూర్తితో చైనా తన ఆధిపత్య ధోరణిని అదుపు చేసుకొని, భారత్ పట్ల అనుసరిస్తున్న వైఖరిన మార్చుకునేలా తన మిత్ర దేశమైన పాకిస్థాన్‌కు నచ్చచెప్పగలిగితే దక్షిణాసియాలో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఎంతైనా ఉన్నది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం జరిగితే అది పాక్ ప్రజలకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ వాణిజ్యం ఇరు దేశాల సరిహద్దుల్లో సుస్థిర శాంతి నెలకొనడానికి దారి తీయగలదు. అంతేగాక పాక్ పౌర సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న ఉగ్రవాద, మతఛాందస సంస్థలను ఇస్లామాబాద్ పాలకులు అదుపుచేయడానికి దోహదం చేయగలదు.
పాకిస్థాన్‌లో మతఛాందసవాదులు భిన్న మతశాఖల మసీదులపై ప్రార్థనల సమయంలో తరచూ బాంబుదాడులు చేయడం ద్వారా పౌర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. ఇస్లాం గౌరవాన్ని కాపాడే మిషతో విధాన నిర్ణయాల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ఒక వైపు సర్వశక్తిమంతమైన సైనిక దళాల నుంచి, మరో వైపు ముల్లాల నుంచి వస్తోన్న ఒత్తిళ్ళ మూలంగా పౌర ప్రభుత్వం సతమతమైపోతోంది. భారత్‌తో సుస్థిర శాంతిని పాక్ సైన్యం కోరుకొంటోందని కమాల్ అలం చేసిన వాదనలు అటు పాక్, ఇటు భారత్ ప్రభుత్వాల నిత్యానుభవాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ పాక్ సైనికదళాల శాంతిచర్చల ప్రతిపాదన ఆహ్వానించదగినదే. దానికి భారత్ సానుకూలంగా ప్రతిస్పందించాలంటే ఇస్లామాబాద్ పాలకులు తమ చిత్తశుద్ధిని మరింతగా నిరూపించుకోవాల్సిన అవసరమున్నది. పాకిస్థాన్ సైన్యమే అటువంటి మార్పుకు చొరవ తీసుకోవాలి. ఇది జరగనంతవరకు శాంతిస్థాపనే కాదు శాంతి చర్చలు సైతం ఒక పగటికలగానే మిగిలిపోతాయి.
-బల్బీర్ పుంజ్
(వ్యాసకర్త సీనియర్ బీజేపీ నాయకుడు)
(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)