Home News శ్రీనగర్: 31 సంవత్సరాల‌ తర్వాత తిరిగి తెరుచుకున్న శీతల్ నాథ్‌ ఆలయం

శ్రీనగర్: 31 సంవత్సరాల‌ తర్వాత తిరిగి తెరుచుకున్న శీతల్ నాథ్‌ ఆలయం

0
SHARE

ఉగ్రవాదం, హిందువుల వలసల కారణంగా 31 సంవత్సరాల క్రితం తలుపులు మూసివేసిన శ్రీనగర్ లోని హబ్బా కదల్ ప్రాంతంలో ఉన్న శీతల్ నాథ్‌ ఆలయం వ‌సంత‌ పంచమి సందర్భంగా భక్తుల కోసం తిరిగి తెరుచుకుంది. ఫరూక్ అబ్దుల్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదం బెదిరింపుల వ‌ల్ల ఈ ఆలయం బలవంతంగా మూసివేయబడింది. ఆ స‌మ‌యంలో ముఫ్తీ మహ్మద్ సయ్యద్ కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు.

సుదీర్ఘ కాలం త‌ర్వాత తెరుచుకున్న ఆల‌యంలో భ‌క్తులు వ‌సంత పంచ‌మి సంద‌ర్భంగా పూజ‌లు నిర్వ‌హించారు. శ్రీనగర్ మేయర్ జునైద్ మట్టు కూడా ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సంతోష్ రజాదాన్ అనే ఒక భ‌క్తుడు మాట్లాడుతూ, 30 ఏండ్ల క్రితం మూసివేయ‌బ‌డిన ఆల‌యాన్నితిరిగి తెర‌వ‌డానికి స్థానికుల నుండి, ముఖ్యంగా ముస్లిం ప్ర‌జ‌ల నుంచి మద్దతు లభించింద‌ని చెప్పాడు. ఉగ్రవాదం కారణంగా  ఆలయం సమీపంలో నివసించే హిందువులు కూడా వ‌ల‌స వెళ్లారు, ముస్లింలే ఈ ప్రాంతంలో ఎక్కువ‌గా ఉన్నార‌ని తెలిపారు.

శీతల్ నాథ్‌ ఆలయంలోని ఒక  పూజారి రవీందర్ రాజ్‌దాన్ మాట్లాడుతూ  ఆల‌యాన్ని తిరిగి తెర‌వ‌డానికి త‌మ‌కు ముస్లిం ప్రజలు సహాయాన్ని అందించార‌ని, ఆలయాన్ని శుభ్రం చేయడానికి కూడా వారు ముందుకు వచ్చార‌ని చెప్పారు. దశాబ్దాలుగా ఉగ్రవాదం, అనేక రాజకీయ కారణాల వల్ల కాశ్మిర్ లో  దేవాలయాలు మూతబడట‌మో, లేదా శిధిలం కావటంలో జరిగింద‌ని, అక్కడి హిందువులు ఇప్పుడిప్పడే దేవాలయాలు తిరిగి తెరవటానికి ముందుకు వస్తున్నార‌ని తెలిపారు.

ఆలయం తిరిగి తెరవడం వ‌ల్ల అక్క‌డి ప్ర‌జ‌ల్లో విశ్వాసాన్నిపెంపొందించేలా ఉంద‌ని, కాశ్మీర్ ప్రాంతం ఇప్పుడు సుర‌క్షిత‌మైనద‌న్న సందేశాన్ని ఇస్తోంద‌ని అక్క‌డి ప్ర‌జ‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. హిందువులు లోయకు తిరిగి వచ్చేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని దేవాల‌యానికి చెందిన ఆశ్రమ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఆల‌యం తెరుచుకున్న సంద‌ర్భంగా కాశ్మీరీ హిందువులు మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టికల్ 370, 35ఏ లను రద్దు చేయడం వల్ల ఇదంతా జరిగిందని వారు సంతోషం వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉంటే మ‌రో వైపు రాష్ట్రంలో 500 రోజుల విరామం తర్వాత కాశ్మీర్‌లో 4 జి ఇంటర్నెట్  సేవ‌లు పున‌రుద్ద‌రిచ‌డంలో ఆల‌స్యం జ‌రిగింద‌ని వామపక్ష వాదులు గ‌గ్గోలు పెడుతున్నారు. కానీ అదే ప్రాంతంలో ఉగ్రవాదుల వ‌ల్ల 30 ఏండ్లుగా మూసివేయబడిన అనేక దేవాలయాల గురించి కానీ, అక్క‌డి హిందూ ప్ర‌జ‌లు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కానీ కూహాన లౌకిక వాదులు, వామ ప‌క్ష వాదులు ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Source : ORGANISER