Home News రామమందిరం నిర్మాణ దిశగా అడుగులు

రామమందిరం నిర్మాణ దిశగా అడుగులు

0
SHARE

‘‘దేవాలయంలో జ్యోతిర్లింగ ప్రతిష్ఠ చేసే సమయం ఆసన్నమైంది. నేను రాష్టప్రతి డా రాజేంద్రప్రసాద్‌గారిని కలిసి ఆ కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించాను. అప్పుడే నేను ఒక మాట స్పష్టంగా చెప్పాను. మాకు ఆశాభంగం కల్గించకుండా, తప్పకుండా వచ్చేటట్లయితేనే మా ఆహ్వానాన్ని అంగీకరించాలని కోరాను. ప్రధానమంత్రి వైఖరి ఎలా ఉన్నప్పటికీ తాను వచ్చి తప్పక మూర్తి ప్రతిష్ఠ చేస్తానని డా.రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు. ఆయన మరో మాట కూడా అన్నారు. ‘ఒక మసీదు లేదా చర్చి నుండి ఆహ్వానం వచ్చినా నేను స్వీకరిస్తాను’! ఆయన దృష్టిలో భారతదేశపు లౌకిక దృక్పథానికి అర్థమిదే! మన దేశపు ప్రభుత్వం మతంతో ముడిపెట్టుకొన్నది కాదు- అలాగే మతానికి వ్యతిరేకమైనదీ కాదు. నేను అనుమానపడినట్లే సోమనాథ్ మందిర దేవాలయ ప్రారంభోత్సవానికి డా.రాజేంద్రప్రసాద్ హాజరవుతున్నట్లు తెలిసి జవహర్‌లాల్ నెహ్రూ గట్టిగా వ్యతిరేకించారు. అయినా రాష్టప్రతి వాగ్దానం నిలుపుకొన్నారు’’.

క్రీ.శ.1025లో మహమ్మద్ గజనీ ధ్వంసం చేసిన సోమనాథ్ దేవాలయం పునర్నిర్మాణం అయ్యాక అక్కడ జరిగిన విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానించిన ఘట్టాన్ని ‘పిల్గ్రిమేజ్ టు ఫ్రీడం’ అన్న పుస్తకంలో కె.ఎం.మున్షీ వివరించిన ఘట్టం ఇది! వెయ్యేళ్ల బానిసత్వంలో హిందువులు ఎన్నో దేవాలయాలు కోల్పోయారు. వాటిలో కాశీ, అయోధ్య, మధుర చాలా ముఖ్యమైనవి. దురదృష్టవశాత్తు ఈ దేశంలో సెక్యులరిజం మనుసుగులో అన్ని ఆలయాలు వివాదాస్పదమై ఓటు బ్యాంక్‌గా మారిపోయాయి. స్వాతంత్య్రం వచ్చాక 1947 నవంబర్ 9న సర్దార్ పటేల్ సౌరాష్ట్ర పర్యటనకు వెళ్లి, అక్కడి బహిరంగ సభలో ‘అతి ప్రాచీనకాలంనుండి సోమనాథ్ మందిరం ఎక్కడుందో అక్కడే పునర్నిర్మాణం జరిగి తీరుతుంది’ అని ప్రకటించారు.. అప్పుడు ఏ సమస్యా రాలేదు. మందిర నిర్మాణం జరిగి దానిపై ఉన్న వివాదాస్పద గత చరిత్రకు తెరపడింది. ఆనాడే బానిసత్వానికి ప్రతీకలైన మిగతా వివాదాస్పద అంశాలను పరిష్కారం చేసి ఉంటే మన దేశ అభివృద్ధి గతిలో గొప్ప మార్పు ఉండేది.

అలాగే మిగతా దేవాలయాల విషయంలో ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోవడానికి సెక్యులర్ పాలకులు పన్నిన పన్నాగాలు దేశాన్ని ఈ రోజున రెండుగా చీల్చేశాయి. ఇప్పుడు కూడా సెక్యులర్ ముసుగుతో ఉన్న మతతత్వవాదులు అయోధ్య అంశాన్ని తేల్చనివ్వడంలేదు. ఈ నెల 16వ తేదీన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అయోధ్య సమస్య పరిష్కారానికి సయోధ్య దిశగా అడుగులు వేయిద్దామని ప్రయత్నం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని, ఇంకొందరు ముస్లిం నాయకులను కలుసుకొన్నారు. మాధ్యమాల్లో కన్పించినంత పెద్ద ఫలితాలు ఏమీ లేకున్నా ఈ దిశగా ఉదారవాద ముస్లిం వర్గాలు అడుగులేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్‌బోర్డు తమకు లక్నోలో మసీదు నిర్మించుకోవడానికి స్థలం ఇచ్చినట్లయితే తాము స్వచ్ఛందంగా రామజన్మభూమి కేసు నుండి వైదొలుగుతామని ప్రకటించింది. అంతేగాకుండా లక్నోలోని హుస్సైనాబాద్ ప్రాంతంలో మసీద్-ఎ-అమన్ (శాంతి మసీదు) నిర్మించి ఇవ్వాలని ఈ నెల 18న సుప్రీంకోర్టుకు నివేదించామని బోర్డు చైర్మన్ వాసీంరిజ్వీ వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారంలో ఇదో పురోగతి! కానీ మతతత్వవాదులకు నిలయమైన ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఇక యథావిధిగా ఆజంఖాన్, అసదొద్దీన్ ఒవైసీ అసలు రవిశంకర్ గురూజీ చర్చలు జరుపుతున్నారనగానే వ్యతిరేకించారు. మరోవైపు దీనికి అనుబంధంగానే ఈ నెల 24న ఉడిపి పీఠాధిపతి శ్రీ విశే్వశ్వర తీర్థస్వామివారి ఆధ్వర్యంలో హిందూ సంఘాలు సమావేశం కానున్నాయి. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తున్న డా సుబ్రహ్మణ్య స్వామి వచ్చే సంవత్సరం మందిర నిర్మాణ పనులు జరుగుతాయంటూ చాలా కాలంగా చెప్తూ అంశాన్ని సజీవంగా ఉంచుతున్నారు. 2017 డిసెంబర్ 5వ తేదీ నుండి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ‘మేం అధికారంలోకి వస్తే రామ మందిరం నిర్మిస్తాం’ అంటూ మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ తప్పించుకోవడం సాధ్యంకాదు!

రామభక్తుడు, పేరులో రామనామం ఉన్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, సభ్యుల ఆనుపానులన్నీ తెలిసిన ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు, రామమందిర ఉద్యమంలో ప్రత్యక్ష సంబంధం ఉన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ – ఈ ముగ్గురినీ వ్యూహాత్మకంగానే గద్దెపైకి మోదీ, అమిత్ షాలు ఎక్కించారని అభిజ్ఞ వర్గాల నుండి అప్పట్లో తెలిసిన సమాచారం. రాజ్యాంగం క్షుణ్ణంగా తెలిసిన రామనాథ్ కోవింద్ దళిత వర్గం నుండి వచ్చినందున ఆయన తీసుకొనే ఏ నిర్ణయమైనా ఈ దేశంలోని దళిత వర్గాల ఆమోదం లభించవచ్చనేది వ్యూహం కావచ్చు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే రాజ్యసభలో భాజపా బలం పెరగడం, వెంకయ్యనాయుడు లాంటి సమర్థ నేత ఆ సభకు చైర్మన్‌గా ఉండడం ఈ అంశం మొదలుపెడితే కలిసొచ్చే అంశాల్లో ఒకటి. జాతీయవాద భావాలు పుష్టిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉండడం రేపు రాజ్యాంగబద్ధంగా రామమందిర నిర్మాణం జరిగే క్రమంలో అనుకూల అంశాలు.

కానీ విషాదం ఏమిటంటే సెక్యులర్ రాజకీయ పార్టీలు, సంస్థలు, మతతత్వ శక్తులు ఈ అంశాన్ని ఎంత మేరకు ముందుకు కదలనిస్తాయో చూడాలి. ఎందుకంటే గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు కంచి పరమాచార్య శ్రీ జయేంద్ర సరస్వతి చేసిన ప్రయత్నాలను ఈ శక్తులే నీరుగార్చాయి. అంతకు ముందు చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నపుడు ఆయన హృదయపూర్వకంగానే ఈ అంశాన్ని పరిష్కరించాలని కోరుకొన్నారు. ముస్లిం వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తుందనుకొన్న సమయంలో ఈ అంశాన్ని ఇలాగే అపరిష్కృతంగా ఉంచాలనుకొన్న 50 మంది జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ వామపక్ష ఆచార్యులు కొత్త వివాదం రాజేశారు. ‘సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్’ సమావేశం నుండి రామశరణ్ మధ్యలో బైకాట్ చేసి వెళ్లిపోయారు. అయోధ్య వివాదం తెగకుండా ఉండాలని కోరుతూ వారు 8 పుటల పుస్తికను విడుదల చేశారు. ఇపుడు ఈ అంశం ఇంకే మలుపు తిరుగుతుందో చూడాలి. ఈ సందర్భంలో ప్రముఖ ముస్లిం ఆలోచనాపరుడు, పరిశోధకుడు తారేఖ్ ఫతే వ్యాఖ్యలు గమనించదగినవిగా ఉన్నాయి. ఆయన ఓ టెలివిజన్ చానల్‌లో మాట్లాడుతూ ‘బాబర్‌కు ఈ దేశ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు. అతను ఆఫ్ఘాన్‌లో పుట్టాడు. కాబూల్‌లో మరణించాడు. మేం అతని నుండి పొందాల్సిన ఎలాంటి వారసత్వం లేదు’ అన్నాడు. అలాగే 12 అక్టోబర్ 2010న టైమ్స్ ఆఫ్ ఇండియాలో మహమ్మద్ హష్మి మియాన్ అనే ముస్లిం పరిశోధకుడు ఓ వ్యాసం రాస్తూ ‘‘మనం బాబర్ వారసులం కాదు. జహీర్ -ఉద్-దీన్ బాబర్ భారతీయ ముస్లింల ప్రతినిధి కాదు, ఖ్వాజా, గరీబ్ నవాజ్ జీవితం, వారి ఆధ్యాత్మిక సందేశం మనకు శిరోధార్యం కావాలి’ అన్నాడు. డా.సుబ్రహ్మణ్యస్వామి అయితే ఎన్నోసార్లు ‘సౌదీలో రాజుగారి సౌకర్యం కోసం ప్రవక్తగారు నమాజ్ చదివిన బిలాల్ మసీదునే కూల్చి బంగ్లాలు కట్టారు. వెయ్యేళ్లు సర్వస్వం కోల్పోయిన ఇక్కడి హిందువుల కోసం వివాదాస్పద బాబ్రీ స్థలం వదలిపెడితే తప్పేం లేదు’ అన్నారు.

నిజానికి క్రీ.శ.1526లో బాబర్ భారతదేశంపై దండెత్తి వచ్చి 1528లో అయోధ్య చేరుకొన్నాడు. బాబర్ ఆదేశంతో ఆయన సేనాని మీర్‌బాకి అక్కడి రామమందిరం ధ్వంసం చేశాడు. ఈ దుర్ఘటన గురించి బ్రిటీషు చరిత్రకారుడు కన్నింగ్ హోమ్ రాతల ప్రకారం ‘మీర్‌బాకీ ఫిరంగులతో జన్మభూమిలోని మందిరాన్ని పేల్చివేయడానికి విఫలయత్నం చేశాడు. 15 రోజులు హిందువులు తీవ్ర ప్రతిఘటన చేయగా, 1,74,000 మంది హిందువులు బలిదానమయ్యారు. చివరకు ఆ మందిరంపైనే మసీదు నిర్మాణం జరిగింది. అది కూడా దార్వేష్ మూసా అసీఖాన్ సలహా మేరకు ఈ పని సాధ్యమైంది’’ అన్నారు. ఈ అయోధ్య మందిరం కోసం క్రీ.శ.1525 సంవత్సరం నుండి 1949వ సంవత్సరం వరకు 76 యుద్ధాలు జరిగాయి. 1934 నాటి సంఘటనలో గుమ్మటాలకు భారీ నష్టం జరుపగా 6 డిసెంబర్ 1992నాడు జరిగిన అంతిమ పరిణామంతో అక్కడున్న మూడు గుమ్మటాలు నేలమట్టం అయ్యాయి. బహుశా! ఈ రామజన్మభూమి ఆందోళన ద్వారా వచ్చిన హిందూ ఐకమత్యం చరిత్రలో మరెప్పుడూ రాలేదనే చెప్పాలి. విచిత్రం ఏమిటంటే ఈ ఉద్యమాన్ని భాజపాకన్నా ముందే కాంగ్రెస్ పరోక్షంగా చేసింది. 1983లో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన హిందూ సమ్మేళనానికి రెండుసార్లు ప్రధానిగా వ్యవహరించిన శ్రీ గుల్జారీలాల్ నందా, శ్రీ దావు దయాళ్‌ఖన్నా ప్రముఖంగా పాల్గొన్నారు. మంత్రిగా, ఐదుసార్లు శాసనసభ్యునిగా పనిచేసిన దావు దయాళ్ ఖన్నా అయోధ్య రామజన్మభూమి, మధుర కృష్ణ జన్మస్థానం, కాశీ విశ్వనాథ మందిరాల విముక్తి కోసం అదే సమ్మేళనంలో పిలుపునిచ్చారు. 1986 ఫిబ్రవరి 1న ఫైజాబాద్ జిల్లా న్యాయమూర్తి కె.యం.పాండే తాళాలు తెరవడానికి ఆదేశిస్తే నాడు యూపి సిఎంగా వీరబహదూర్ సింగ్ ఉన్నాడు. 1989 నవంబర్ 9న అన్ని అడ్డంకులను అధిగమించి బిహార్ నివాసి కామేశ్వర్ చౌపాల్ శంకుస్థాపన చేశాడు. షాహబానో కేసులో ఏకపక్షంగా వ్యవహరించిన స్వర్గీయ రాజీవ్‌గాంధీ మందిరం తాళాలు తెరిపించడంతో హిందువులను సంతృప్తిపరచాలనుకొన్నాడు. 1990 తర్వాత దేశమంతా తిరిగిన ‘రామజ్యోతి’ దేశంలోని హిందువులను ఏకం చేసింది. 1990 అక్టోబర్ 30న గుమ్మటాలపైకి ఎక్కి భగవధ్వజాన్ని ఎగురేసిన కలకత్తా కొఠారి సోదరులను నాటి ములాయం ప్రభుత్వం కాల్చి చంపింది. ఆ తర్వాత దేశమంతా రామమయం అయ్యింది. రామజన్మభూమి ఉద్యమం తీవ్రరూపం దాల్చి స్వర్గీయ పి.వి ప్రధానిగా ఉన్నపుడే వివాదాస్పద కట్టడాలు కూల్చివేయబడ్డాయి. 1993 జనవరి 1న హైకోర్టు న్యాయమూర్తి శ్రీ హరినాథ్ తిలహరి రామలల్లా దర్శనం, పూజకు అనుమతి ఇచ్చాడు. ఆ తర్వాత అనేక వివాదాలు తలెత్తాయి. దేశంలో సుహృద్భావ వాతావరణం నెలకొల్పడానికి ఈ దేశ మెజారిటీ ప్రజల మనోభావాలు గౌరవించడం కోసం ఈ రోజు షియా వక్ఫ్ బోర్డు ముందడుగు వేస్తుంటే అడ్డుకోవాలనుకొంటున్న మతతత్వ, సెక్యులర్ శక్తులకు చెంపపెట్టుగా ఈ దేశ హిందూ ముస్లింలు సమస్యను పరిష్కరించుకోవాలి. అప్పుడు నిజమైన లౌకికవాదం పరిఢవిల్లి ప్రపంచానికి ఈ దేశం ఓ సందేశం ఇచ్చినట్లవుతుంది. లేదంటే ఓట్ల వేటకు ఈ అంశం వెయ్యేళ్లయినా ఓ సాధనంగానే మిగిలిపోతుంది. వర్తమానంలో నడుస్తున్న మనం ఈ సమస్యను పరిష్కరిస్తే చరిత్రలో మనం భాగస్వాములమవుతాం.

-డా. పి భాస్కరయోగి [email protected]

(ఆంధ్రభూమి సౌజన్యం తో)