ముస్లింవర్గంలో ఆచరణలో ఉన్న మూడుసార్ల తలాఖ్, నిఖాహలాలా, బహుభార్యత్వం వంటి ఆచారాలపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపి, నిర్ణయం తీసుకొనేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అంశంపై మార్చి 30న నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ డీవీ చంద్రచూడ్ ఉన్నారు. ఈ అంశాలు ముఖ్యమైనవనీ, హడావిడిగా నిర్ణయించేవి కావని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్రం సమర్పించిన న్యాయపరమైన ప్రశ్నాంశాల్ని ప్రస్తావిస్తూ.. అవన్నీ రాజ్యాంగపరమైనవనీ, విస్తృత ధర్మాసనం విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఓ మహిళా న్యాయవాది ప్రఖ్యాత షాబానో కేసును ప్రస్తావించగా.. ప్రతికేసులో రెండు కోణాలు ఎప్పుడూ ఉంటాయనీ, తాము చట్టపరంగానే వెళ్తామని స్పష్టంచేసింది. కేసు ముఖ్యమైనదనందున శని, ఆదివారాల్లో సైతం పరిశీలించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఆ అంశాలు ప్రాథమిక హక్కు కిందకు వస్తాయా..: న్యాయ నిర్ణయం జరిపేందుకు వివిధ అంశాలతో కూడిన జాబితాను కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ముస్లిముల్లో ఆచరణలో ఉన్న మూడుసార్ల తలాఖ్, నిఖాహలాలా, బహుభార్యత్వం వంటి అంశాలు మతస్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కు కిందకు వస్తాయా వంటి ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. స్త్రీపురుష సమానత్వం, లౌకికవాదం, అంతర్జాతీయ ఒడంబడికల నేపథ్యంలో ముస్లిముల్లో విస్తృతంగా ఆచరణలో ఉన్న ఈ తరహా సంప్రదాయాల్ని సర్వోన్నత న్యాయస్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకించడం భారత రాజ్యాంగ చరిత్రలో ఇదే తొలిసారి. కేంద్రం సమర్పించిన నాలుగు ప్రశ్నల్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుందని న్యాయస్థానం పేర్కొంది.
(ఈనాడు సౌజన్యంతో)