దక్షిణ కశ్మీర్‌లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాది మహమ్మద్ తౌఫిఖ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువకుడిగా కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి.
సోమవారం తెల్లవారుజామున అనంత్‌నాగ్ జిల్లా హకూరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా ఐసా ఫజిలి, సయ్యద్ షఫీలను గుర్తించారు. మూడో వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తుండగా అల్‌ఖైదాతో సంబంధమున్న ఏజీయూహెచ్ దళం సభ్యులు మహ్మద్ తౌఫిక్ అని ప్రకటించారు.
కశ్మీర్‌లో అల్‌ఖైదా విభాగం నాయకుడు జకీర్ ముసా బృందంలో తౌఫిఖ్ ఉన్నాడని తెలిపాయి. తౌఫిక్ తొలుత హైదరాబాదీగా నిఘా వర్గాలు భావించాయి.
నగర పోలీసులు తమకు సమాచారం లేదనడంతో మరిన్ని వివరాలు సేకరించారు. ఇతను ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
(ఈనాడు సౌజన్యం తో)