సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలంలో నిర్మించే మసీదుకు బా బర్ పేరు పెట్టబోవడం లేదని, అది బాబ్రీ మసీదు కాబోదని మసీదు నిర్మాణం కోసం ఉత్తర్ ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేసిన ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ స్పష్టం చేసింది. అయోధ్యలో నిర్మించనున్న మసీదు నిర్మాణం మక్కా లోని కాబా మాదిరిగా ఉండనుందని అధికారికంగా వెల్లడించింది. దీనికి ఏ రాజు లేదా చక్రవర్తి పేరు కూడా పెట్టడం లేదని, దీనిని ధన్నిపూర్ మసీదు అని పిలవాలని తన వ్యక్తిగత అభిప్రాయమని ఫౌండేషన్ ప్రతినిధి హుస్సేన్ అన్నారు.
కొత్త మసీద్ గతంలో వివాదాస్పద నిర్మాణానికి సమానమైన పరిమాణంలో ఉంటుందని, సుమారు 15 వేల చదరపు అడుగుల కొలత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ మసీదు ఆకారం ఇతర మసీదుల ఆకృతికి పూర్తిగా భిన్నంగా ఉండవచ్చని, ఇది మక్కాలోని కాబా షరీఫ్ లాగా చదరపు ఆకారంలో ఉండవచ్చని, అయితే గోపురాలు లేదా మినార్లు ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. మసీదు నిర్మిస్తున్న శిల్పికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
కరొనా వైరస్ వల్ల మసీదు నిర్మాణం కొంత ఆలస్యం జరిగిందని ఇటీవల సున్నీ వక్ఫ్ బోర్డు తెలిపింది. మసీదు నిర్మాణానికి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర ప్రముఖ ముస్లిం సంస్థలు ఆర్థికంగా లేదా ఇతరత్రా సహాయాన్ని అందిస్తాయనే నమ్మకం తనకు లేదని సున్నీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జాఫర్ ఫరూకి అన్నారు.
రామజన్మభూమి కేసులో తీర్పు సందర్భంగా అయిదు ఎకరాల భూమిలో ప్రత్యామ్నాయ స్థలం లో అయోధ్యలో ఒక మసీదు నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అయోధ్య లోని ధన్నిపూర్ గ్రామంలో ఐదు ఎకరాల స్థలాన్ని మసీదు నిర్మించడానికి కేటాయించింది.
Source : OPINDIA