Home News “ది కేరళ స్టోరీ” : క్రూరమైన లవ్ జిహాద్ వాస్తవికతను తెలిపే చిత్రం

“ది కేరళ స్టోరీ” : క్రూరమైన లవ్ జిహాద్ వాస్తవికతను తెలిపే చిత్రం

0
SHARE

– రతన్ శార్దా

ల‌వ్ జీహాద్ ఆధారంగా రూపొందించిన “ది కేరళ స్టోరీ” అనే చిత్రానికి సంబంధించిన టీజర్ కొన్ని నెలల క్రితం విడుదలైనప్పుడు, బహిరంగ, రహస్య ఇస్లామిస్ట్ గ్రూపుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా సినిమా నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా, దర్శకుడు సుదీప్తో సేన్‌పై కేసులు నమోదయ్యాయి. లవ్ జిహాద్, బాధిత బాలబాలికలను అబ్బాయిలను మధ్యప్రాచ్యంలో జిహాదీ యుద్దభూమికి రవాణా చేయడం గురించి చదివిన నాకు ఈ కథ తెలియనిది కాదు. నేను ఒక సంవత్సరం క్రితం కేరళలోని వివిధ వర్గాలకు చెందిన ఇద్దరు క్రైస్తవ మత గురువులను ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూలో, వారు తమ పరిశోధనలు, లవ్ జిహాద్ బాధిత కుటుంబాలతో సమావేశాల గురించి చర్చించారు. అమ్మాయిలను వలలో వేసుకోవడానికి జిహాదీలు ఉపయోగించే పద్ధతులను వివరించారు. రెండు సంవత్సరాల క్రితం, కేరళ క్రైస్తవులలోని ఒక వర్గం నుండి సుమారు 3,000 మంది క్రైస్తవ బాలికలు అదృశ్యమయ్యారు.

సినిమా భారీ పర్వతాల బ్యాక్‌గ్రౌండ్‌లో, మంచుతో కప్పబడిన శిఖరాలతో కూడిన కొన్ని అద్భుతమైన విజువల్స్‌తో ప్రారంభమవుతుంది. సునిధి చౌహాన్ పాట – ‘నా జమీన్ మిలీ నా ఫలక్ మిలా….’ థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా మన చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. క్రూరమైన, జుగుప్సాకరమైన పరిసరాలను ఘనంగా సంగ్రహించగలిగినందుకు, చక్కటి సినిమాటోగ్రఫీకి కెమెరామెన్‌కి అభినందనలు తెలియజేయకుండా ఉండలేం. దర్శకుడు సుదీప్తో సేన్ ఆఫ్ఘనిస్తాన్ , సిరియాలను తెరపై చూపడానికి లడఖ్‌లోని ఎన్నో రహస్య ప్రాంతాలను ఎంచుకున్నాడు.

కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ కేరళ స్టోరీని ‘మన కేరళ కథ కాదు’ అని ఎందుకంటున్నారు:

క్రూరమైన వర్తమానం, మంత్రముగ్ధులను చేసే గతం మధ్య కథ ముందుకూ వెనుకకు నడుస్తూ ఉంటుంది. వామపక్ష చిత్రనిర్మాతలు చేసే విధంగా వాస్తవాలను మరుగుపరిచి, మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నమేమీ జరగలేదు. డైలాగ్స్ సాధార‌ణంగా ఉన్న చాలా ప్ర‌భావం చూపుతాయి. సాక్ష్యాలపై ఆధారపడిన కథ కాబట్టి వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. పద్ధతి కాదు కాబట్టి, నేను సినిమా కథాంశాన్ని ఇక్కడ పంచుకోవడం లేదు. జిహాదీ-నియంత్రిత ఇస్లామిక్ సమాజాలలో తీవ్రవాదుల ఉచ్చులో చిక్కుకున్న మహిళల దుస్థితి మిమ్మల్ని ఎంతగానో కదిలిస్తుందని మాత్రమే నేను చెప్పగలను. అది చూసిన తర్వాత మీ కోపాన్ని అణచుకోవటం కష్టతరమవుతుంది.

హిందీ చిత్రసీమలో పెద్దగా పేరు లేని నటీనటుల అద్భుత నటన, అదా శర్మ నేతృత్వం సినిమాని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాయి. మలయాళీ-యాసను, ఆఫ్ఘన్ స్వరాలను యువ కళాకారులు చక్కగా పలికించారు. గత తొమ్మిదేళ్లుగా భారత్‌లో హిందుత్వ పాలన సాగుతున్నప్పటికీ, పేరు మోసిన నటీనటులెవరూ సినిమా చేయటానికి ముందుకు రాలేదంటే, కేరళ, ముంబైలలో సినిమా మాఫియా ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, దర్శకుడు మాత్రం తారాగణం నుండి అద్భుతమైన నటనను రాబట్టుకోగలిగాడు. తెలియని ముఖాలు సినిమాను మరింత వాస్తవికంగా మలిచాయి.

విభిన్న రకాల సంగీతాన్ని చాలా ప్రభావవంతంగా ప్రయోగించిన సంగీత దర్శకులు వీరేష్ శ్రీవల్స , బిషాక్ జ్యోతిలకు ప్రత్యేక అభినందనలు. నేపథ్య సంగీతం కథనాన్ని మరింతగా పెంచింది. పాటలు కత్తిరించి అతికించినట్లు కాకుండా సన్నివేశాలకనుగుణంగా ఉన్నాయి.

దర్శకుడు సుదీప్తో సేన్ ఫెస్టివల్ సర్క్యూట్‌లో అవార్డు విన్నింగ్ చిత్రాలకు,షార్ట్ ఫిలింలకు పెట్టింది పేరు.ఈ చిత్రంతో, అతను ఫెస్టివల్ సర్క్యూట్ నుండి బయటికి వచ్చాడు.బాక్సాఫీస్ కలెక్షన్ల ద్వారా మాత్రమే విజయాన్ని కొలిచే వాణిజ్య సినిమాల్లోకి దూకాడు. కేరళ కథ సంవత్సరాల పరిశోధనా ఫలితం. నిర్మాతలు తాము కల్పిత కథలను సృష్టించలేదని నిరూపించుకోవడానికి సెన్సార్ బోర్డ్‌కు ఎన్నో వ్రాతపూర్వక, వీడియో ఆధారాలను అందించారు.

విజయవంతమైన వాణిజ్య బాలీవుడ్ సినిమాలను నిర్మించడంలో సంవత్సరాలుగా పేరుగాంచిన విపుల్ అమృత్‌లాల్ షా ఈ చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను మరింతగా చూరగొన్నారు. తొలిసారి స్క్రీన్‌ప్లే చదివిన తర్వాత ఇదంతా నిజంగా జరిగిందేనా అని తాను దర్శకుడు సుదీప్తోసేన్‌ని అడిగానని విపుల్ నాతో అన్నారు. నిజమైనదేనంటూ పక్కా సమాధానం రావడంతో, అతను దానిని పూర్తిగా స్వీకరించాడు. మన సమాజంలోని కఠోరమైన వాస్తవాలను తెలుసుకున్నందువల్ల స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కోసం తానే స్వయంగా కష్టపడ్డాడు. సినిమా నాణ్యత కోసం ఖర్చుకు ఏమాత్రం వెనకాడ లేదు. ఒక్క ఫోన్ కాల్ తో అందుబాటులోకి వచ్చే పరిశ్రమలోని చాలామంది అగ్ర తారలు ఇప్పుడు అతనికి దూరం కావడం మాత్రం ఖాయమనుకుంటున్నాను. సత్యం కోసం నిలబడినందుకు, దశాబ్దాలుగా పనిచేసిన స్నేహితులను కోల్పోవడం బాధాకరమే. సంవత్సరాల పరిశోధనను, మనల్ని కలవరపరిచే, కదిలించే కఠోరవాస్తవాలను చిత్రంగా మలచినందుకు ఆయన సదా అభినందనీయుడు.

‘ది కేరళ స్టోరీ‘ ఆర్‌ఎస్‌ఎస్ వ్యూహాత్మకంగా చేస్తున్నప్రచారమని, ఇందులో అంతర్లీన ఎజెండా ఉందని రాష్ట్ర ప్రస్తుత మార్క్సిస్ట్ ముఖ్యమంత్రి చెప్పడం చాలా వింతగా ఉంది. పిఎఫ్‌ఐ వంటి సంస్థలు కేరళను మరో 20 ఏళ్లలో ముస్లిం మెజారిటీగా మార్చాలని చూస్తున్నాయని తన సొంత పార్టీ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ 2010లోనే చెప్పారని ఆయన మర్చిపోయారు. సినిమాలో అతని ప్రకటన యొక్క వీడియో క్లిప్‌ కూడా ఉంది.

మీరు సినిమా నుండి బయటకు వస్తున్నప్పుడు, ముస్లింలపై ద్వేషంతో బయటకు రారు. హిందూ ధర్మం యొక్క మౌలికమైన విషయాలను కూడా తమ పిల్లలకు నేర్పించని హిందూ సమాజం, హిందూ కుటుంబాల బలహీనతను నిందిస్తూ బయటకు వస్తారు. ఏది ఏమైనా కాఫిర్లను మతమార్పిడి చేసి అల్లా పాలనను తీసుకురావడమే ఏకైక ఎజెండాగా ఉన్న వ్యక్తులున్న సమాజంలో మనం మన వాళ్లను దుర్భలుగా వదిలేస్తున్నాం. ఈ చిత్రంలో మతమార్పిడిని ఎదిరించి పోరాడే ఏకైక అమ్మాయి క్రైస్తవ అమ్మాయి అనేది రచయిత ఊహకు అందడం లేదు. ఇది యాదృచ్ఛికం కాదు. ఆమె తన విశ్వాసాన్ని, తనను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల విశ్వాసాలను కూడా అర్థం చేసుకున్నది. ఆమె భారీ మూల్యం చెల్లిస్తుంది.

నాగరికతల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న ఈ కాలంలో విశ్వసమ్మతమైన, మానవతా విలువలతో కూడిన మన ధర్మం గురించి మన పిల్లలకు నేర్పించకపోతే మాత్రం దాని పర్యవసానాలను మనమే అనుభవించాల్సి వస్తుంది. “ధర్మో రక్షతి రక్షితః” – ధర్మాన్ని రక్షించేవారిని ధర్మం రక్షిస్తుంది అని మన పెద్దలు చెప్పారు. ‘అన్ని మతాలు ఒక్కటే’ అనే మనల్ని చూసి సినిమాపై నిరసనలు తెలిపే వారు నవ్వుకుంటున్నారు. ‘ఉదారవాదం’, ‘సహనం’ మాత్రమే వారి కర్తవ్యం అంటూ అమాయక హిందువులకు తీపి విషాన్ని తినిపించారు. మన ధర్మం గురించి మనకు తెలియకపోవటం ప్రమాదకరమని హిందువులకు అనిపించడం లేదు. సినిమాని ప్రతిఘటించే వ్యక్తులు, పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయనే విషయం మనకు తెలియకూడదనుకుంటున్నారు.

వ్యాసకర్త:  రచయిత, కాలమిస్ట్, టీవీ ప్యానలిస్ట్.

అనువాదం- బీరం వేంకటేశ్వర రెడ్డి