Home News ‘ది సటానిక్ వెర్సెస్’ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్‌లో దాడి

‘ది సటానిక్ వెర్సెస్’ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్‌లో దాడి

0
SHARE

ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై శుక్రవారం న్యూయార్క్‌లో దాడి జరిగింది. ‘ది సటానిక్ వెర్సెస్’ నవలతో ప్రసిద్ధి చెందిన సల్మాన్ రష్దీపై ఒక ఆగంతుకుడు దాడి చేశాడు. ఆయనపై పిడిగుద్దులు కురిపించాడు. కత్తితో అనేకసార్లు పొడిచాడు. విశ్వసనీయ వర్గాల ప్రకారం న్యూయార్క్‌లోని షిటాక్వాలో షిటాక్వా ఇనిస్టిట్యూషన్‌లో ప్రసంగించడానికి రష్దీ వచ్చారు. ఆయన ప్రసంగించడానికి ముందుకు కార్యక్రమ నిర్వాహకులు సభికులకు రష్దీని పరిచయం చేస్తుండగా హఠాత్తుగా ఆగంతుకుడు వేదికపైకి దూసుకువచ్చాడు. రష్దీపైకి విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో రష్దీ కిందపడిపోయారు. అక్కడ ఉన్నవారు ఆగంతుకుని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని హదీ మాతర్ గా గుర్తించారు.

దాడికి గురైన రష్దీని చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. రష్దీ మెడపైన కత్తి పోట్లు దిగినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్‌పైన ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. సల్మాన్ రష్దీపై జరిగిన దాడి గురించి తాము దర్యాప్తు చేపట్టినట్టు న్యూయార్క్ స్టేట్ పోలీస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. “రష్దీ మెడపైన కత్తిపోటు దిగింది. ఆయన్ను హెలికాప్టర్ ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించాము. ఆయన తలకు కూడా చిన్న గాయమైంది” అని సదరు ప్రకటన పేర్కొంది.

‘ది సటానిక్ వెర్సెస్’ పుస్తక రచయితగా సల్మాన్ రష్దీ పేరు ప్రపంచమంతటా మారుమోగిపోయింది. పుస్తకంలోని అంశాలు ‘మతవిద్వేషం’ తో కూడుకుని ఉన్నాయని ముస్లిములు ఆరోపించారు. దాంతో 1988లో భారత్ సహా అనేక దేశాలు ఆ పుస్తకాన్ని నిషేధించాయి. అప్పట్లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఒక సంవత్సరం తర్వాత ఇరాన్‌కు చెందిన అయతొల్లా ఖొమైనీ రష్దీని హతమార్చాలని పిలుపునిస్తూ ఒక ఫత్వా జారీ చేశారు.

ప్రపంచంలోని ఇస్లామిస్టులందరూ రష్దీ రాసిన ‘ది సటానిక్ వెర్సెస్’ పుస్తకం ఇస్లామ్‌కు వ్యతిరేకంగా ఉందని ఆరోపిస్తూ ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడంతో రష్దీని హతమార్చినవారికి 3 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామనే మాట వినిపించింది. అప్పట్నుంచి కూడా ఖుమైనీ జారీ చేసిన ఫత్వాకు ఇరాన్ దేశం దూరంగా ఉన్నది.

అయితే ఇస్లామ్ వ్యతిరేకంగా రాస్తున్నారనే ఆరోపణలతో అనేక మంది రచయితలు, జర్నలిస్టులపై ఇస్లామిస్టుల హత్యాయత్నాలు దశాబ్దాల కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. జర్నలిస్టు చార్లీ హెబ్డో నుంచి ఫ్రెంచ్ స్కూల్ టీచర్ శామ్యూల్ ప్యాటీ దాకా, హిందూ సమాజ్ నేత కమలేష్ తివారీ నుంచి ఇటీవల కన్హయా లాల్, ఉమేష్ కొల్హే వరకు ఇలా అనేక మంది బాదితులైనారు.

రష్దీ సైతం ఇస్లామిస్టు బెదిరింపుదారుల జాబితాలో ఉన్నారు. అయితే తనను చంపితే బహుమతి ఇస్తామని ప్రకటించినంత మాత్రాన ప్రజలు ఆ పనిచేయడానికి ఆసక్తి చూపుతారనడానికి ‘ఎలాంటి ఆధారం’ లేదంటూ తనకు వచ్చిన బెదిరింపులను రష్దీ అప్పట్లో తోసిపుచ్చారు.

Source : OPINDIA