Home News హైదరాబాద్‌లో ‘టిప్పు నిజస్వరూపం’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్‌లో ‘టిప్పు నిజస్వరూపం’ పుస్తకావిష్కరణ

0
SHARE

‘టిప్పు నిజస్వరూపం’ పుస్తకావిష్కరణ సభ సంవిత్ ప్రకాశన్ – సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ (దక్షిణాపథ స్టడీస్) సంయుక్త ఆధ్వర్యంలో భాగ్యనగరంలో జరిగింది. సికింద్రాబాద్‌ సిక్కు విలేజ్ లోని దాదావాడి జైన్ టెంపుల్ హాల్‌ లో జరిగిన ఈ కార్యక్రమానికి రచయితలతో పాటు పుస్తక ప్రియులు, సాహితీ అభిమానులు, చారిత్రక పరిశోధకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శ్రీ గజానన్ భాస్కర్ మహందలే ఆంగ్లంలో రచించిన ‘Tippu as He Really Was’ పుస్తకాన్ని శ్రీమతి గూడా హేమలత ‘టిప్పు నిజస్వరూపం’ పేరిట తెలుగులోకి అనువదించారు. సంవిత్ ప్రకాశన్ సంస్థ దీన్ని ప్రచురించింది. పుస్తకావిష్కరణ సభలో సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపాల్ రెడ్డి ప్రసంగిస్తూ దక్షిణాపథ చేపట్టిన అధ్యయనాలను సభకు పరిచయం చేశారు. చరిత్ర మరచిన ఘట్టాలను, వాస్తవాలను, దేశానికి సేవ చేసిన అనేకమంది గొప్ప వ్యక్తుల సమాచారాన్ని అధ్యయనం ద్వారా వెలికితీసే పనిని CSIS  దక్షిణాపథ సంస్థ చేపట్టినట్టు తెలిపారు. ఈక్రమంలో కంటెంట్ తయారీపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ ఈ దిశగా ప్రయత్నిస్తూ  కంటెంట్ ప్రచురణలో సహాయం చేస్తోందని తెలియజేశారు. సంవిత్ ప్రకాశన్ వారి పుస్తకాలు సోర్స్ మెటీరియల్ ఇస్తున్నాయని, ఆధారాలు, వాస్తవాలతో పరిశోధించబడ్డాయని ఈ సందర్భంగా  ప్రశంసించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ-శ్రేష్ఠ సంస్థ అధ్యక్షులు, భూగర్భ జలాల నిపుణులు  డాక్టర్ నర్రా భూపతి రెడ్డి ప్రసంగిస్తూ,  దురదృష్టవశాత్తు మన సమాజానికి దాని అద్భుతమైన గతం గురించి, శత్రువుల గురించి తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంపై దాడి చేసి ఆక్రమించిన ఎడారి మతాలు సమాజాన్ని నాశనం చేశాయని, యుద్ధనీతి అనేది ఏమాత్రం లేకుండా ఇక్కడి స్త్రీలపై అత్యాచారాలు చేసి చిన్న పిల్లలు చంపారని వివరించారు. ఇక్కడి సాంస్కృతిక కళలు, శాస్త్రాలు నాశనం చేయబడి, దేవాలయాలు కూల్చివేతకు గురై అపవిత్రం అయ్యాయన్నారు. ఈక్రమంలోనే `కులతత్వం’ వంటి సామాజిక దురాచారాలు సృష్టించబడ్డాయని తెలిపారు.

పుస్తక అనువాదకురాలు శ్రీమతి గూడా హేమలత తన ప్రసంగంలో, రచయిత శ్రీ గజానన్ మహందలే తన లోతైన పరిశోధన ద్వారా వాస్తవాలను పుస్తకరూపంలోకి ఎలా తీసుకొచ్చారో వివరించారు. అమాయక హిందువులపై నిరంకుశుడు టిప్పు సుల్తాన్ చేసిన అకృత్యాలు, వారిని దోచుకుని, వ్యవసాయ వాణిజ్యాలను నాశనం చేయడం గురించి పుస్తకం వివరిస్తుందన్నారు. రాజాధికారంతో టిప్పు సుల్తాన్ హిందూ స్త్రీలు, పిల్లలపై వర్ణించలేని దారుణాలకు పాల్పడ్డాడని, అనేక దేవాలయాలను ధ్వంసం చేశాడని తెలిపారు. అంతేకాకుండా, విదేశీ ఆక్రమణదారులకు భారతదేశంపై దాడికి ఆహ్వానిస్తూ టిప్పు సుల్తాన్ రాసిన లేఖలను కూడా పుస్తకంలో ప్రస్తావించారు.

నకిలీ-సెక్యులర్ రచయితలు, చరిత్రకారులు అతని భయంకరమైన నేరాలను ఏమాత్రం కనీసం ప్రస్తావించకుండా అతడినొక స్వాతంత్ర్య సమరయోధుడిగా మనకు చూపిస్తారని, రాజకీయ కారణాలతో కొన్ని దేవాలయాలకు విరాళాలు సంగతిని అదేపనిగా కీర్తిస్తూ, వందల సంఖ్యలో దేవాలయాలను ధ్వంసం చేయడం, లక్షలాది మందిని బలవంతంగా మతం మార్చడం, ఒప్పుకోకపోతే చంపడం వంటి వాస్తవాలను కప్పుపుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో హిందువులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ మన చరిత్రలను మనం తెలుసుకొని దాన్ని మన తర్వాతి తరాలకు అందించకపోతే ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలిచిన గొప్ప పూర్వీకులను మనం అగౌరవపరచినట్టేనని అన్నారు. టిప్పు సుల్తాన్ దీపావళి పండుగకు ఒకరోజు ముందు సామూహికంగా హతమార్చిన మాండ్య జిల్లాలోని మెల్‌కోట్‌కు చెందిన శ్రీవైష్ణవ  అయ్యంగార్‌ల గురించి సీనియర్ న్యాయవాది శ్రీ పరవస్తు కృష్ణ మాట్లాడారు. ఆ భయంకరమైన రోజు జ్ఞాపకార్థం, మేల్కోట్ వాసులు ఈ తేదీ వరకు దీపావళిని జరుపుకోరని గుర్తుచేశారు. టిప్పు సుల్తాన్ మాత్రమే కాదు, అతని తండ్రి హైదర్ అలీ కూడా పెద్ద నిరంకుశుడని,  హిందూ దేవాలయాలను ధ్వంసం చేసేవాడు అని సీనియర్ పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని తిమ్మప్ప దేవాలయంతో పాటు తిరుపతి సమీపంలోని మరికొన్ని ఆలయాలను కూడా హైదర్ అలీ ధ్వంసం చేసిన విషయాలను ఉదాహరణగా చెప్పారు.

సంవిత్ ప్రకాశన్‌ సంస్థ డైరెక్టర్ పి.శైలజ మాట్లాడుతూ, తక్కువ సమయంలో ప్రచురణ సంస్థ చాలా ప్రాముఖ్యత, విలువ కలిగిన సుమారు 30 శీర్షికలను ప్రచురించిందని అన్నారు.  ప్రస్తుత పుస్తక రచయిత శ్రీ మహందలే గతంలో రాసిన ‘ఛత్రపతి శివాజీ సేవియర్ ఆఫ్ హిందూ ఇండియా’ అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి ప్రచురించామన్నారు.  సంవిత్ ప్రకాశన్ వారు  చరిత్ర మరచిన, వక్రీకరణకు గురైన, విస్మరించబడిన ముఖ్యమైన అధ్యాయాలను క్రమపద్ధతిలో వెలికితీస్తోందని, విలువైన కంటెంట్‌తో కూడిన ప్రచురణల పరంపరతో ముందుకు వచ్చిందని అన్నారు. ‘ఆఖరు ప్రవక్త అతని మతం’, ‘ఖిలాఫత్’, ‘బెంగాల్ బ్లీడింగ్’, ‘గోవా ఇంక్విజిషన్’, ‘మతం పేరుతో అక్రమాలు – న్యాయ పోరాటానికి మార్గాలు’ ఇంకా అనేక పుస్తకాలతో పాటు  హైదరాబాద్‌లో నిజాంల పాలనపై మూడు శీర్షికలు సంవిత్ ప్రకాశన్ ద్వారా ప్రచురించబడ్డాయని అన్నారు.  `శివస్య కులం’, `శివ భారతం’ `చార్వాకం’ వంటి అత్యంత ముఖ్యమైన పరిశోధనాత్మక పుస్తకాలను కూడా సంవిత్ ప్రకాశన్ ప్రచురించిందన్నారు. వీటితో పాటు కొన్ని ముఖ్యమైన అనువాద రచనలు `గంగలో విషనాగులు’, ‘ఇస్లాం అంతరంగం’ మొదలైనవి కూడా ఉన్నాయన్నారు. మరింత సమాచారం కోసం https://samvitprakashan.com/ మరియు https://dakshinapatha.com/ వెబ్‌సైట్‌లను సందర్శించాల్సిందిగా సూచించారు.