అడవిలో 14 సంవత్సరాలు అసౌకర్య, బాధాకరమైన జీవితాన్ని గడిపిన తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో జరుపుకునే సంతోషాల పండుగ దీపావళి. దీపావళి పండుగ అసలైన అర్థం అంధకారంపై వెలుగుల గెలుపు. ఇంకో విధంగా చెప్పాలంటే అజ్ఞానంపై జ్ఞానం గెలుపు. దీపావళి భావం “తమసోమా జ్యోతిర్గమయ” అంటే చీకటి నుండి వెలుతురు వైపు వెళ్లడం. ఉపనిషత్తుల నుండి తీసుకోబడింది.
హిందూ సంస్కృతిలో దీపావళి పండుగ శరత్ ఋతువులో ప్రతీ సంవత్సరం శోభాయమానంగా జరుపుకుంటారు. భారతదేశంలో వివిధ ఆటవిక క్షేత్రాలలో అనేక గిరిజన తెగలు కూడా ఆడంబరంగా ఈ పండుగలను జరుపుకునే సాంప్రదాయం ఉంది. కొన్ని సమాజ విచ్చిన్న శక్తులు వీరిని హిందువులుగా పరిగణించకుండా కుటిల పన్నాగాలు పన్నుతున్నారు.
మధ్యప్రదేశ్‌లోని గిరిజన తెగలలో దీపావళి పండగను జరుపుకునే పరంపర విధానం హిందూ సాంప్రదాయానికి అణుగుణంగానే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని విధానాలల్లో తేడాలు ఉండొచ్చు. అంతమాత్రన వారు హిందువులు కాకుండా పోతారా? పండుగలు జరుపుకునే తీరులో తేడా హిందూ మతంలోని ఆంతరిక ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుంది.
దీపావళి ఎప్పుడు ప్రారంభమైంది. ?
వనవాసం ముగించి ప్రభువు శ్రీరాముడు అయోధ్య తిరిగి వచ్చిన సంతోషంలో వారికి స్వాగతం పలుకుతూ అయోధ్య ప్రజలు నేతి దీపాలు వెలిగించారు. కార్తీక మాసపు ఘోర అంధకారపు అమావాస్య రాత్రి ఆ రోజు దీపాల వెలుగులో మెరిసిపోయింది. దాని తరువాతే భారతీయ సమాజం ప్రతీ సంవత్సరం ఈ వెలుగుల పండుగును హర్షోల్లాసాలతో జరుపుకుంటారు. ఆంగ్ల సంవత్సరాన్ని పరిగణలో తీసుకుంటే ఈ పండుగ ప్రతి సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. ప్రసంగ రీత్యా గిరిజన తెగల సమాజంలో దీపావళి జరుపుకునే సాంప్రదాయంపై కొన్ని తథ్యాలు ఇలా ఉన్నాయి.
భిల్లుల దీపావళి :
భిల్లు తెగలకు చెందిన వారు కార్తీక మాసపు కృష్ణ పక్ష త్రయోదశి నుండి దీపావళి పండుగను జరుపుకోవడం ప్రారంభిస్తారు. దీపావళికి కొన్ని రోజుల ముందు నుంచి తమ ఇంటిని మట్టి, పేడతో అలంకరించి రంగులద్దుతారు. భిల్లులు దీపావళిని రెండు సార్లు జరుపుకుంటారు. మొదటిది కార్తీక మాసపు ధన త్రయోదశి నుంచి అమావాస్య వరకు. రెండవది పఛ్‌లీ దీపావళి దీనిని కార్తీక మాసపు శుక్షపక్షంలో త్రయోదశి నుంచి పౌర్ణిమ వరకు.
భిల్లు కుటుంబాలు అమావాస్య రోజు ఉదయం లక్ష్మీదేవిని, కొత్తగా ఇంటికి చేరిన ధాన్యాన్ని పూజిస్తారు. దినమంతా టపాకాయలు కాలుస్తారు. సాయంత్రం దీపాలను వెలిగించి తులుపులు, ధాన్యపు గది, గోవుల పాక, వంటగది తో పాటు సార్వజనిక స్థానాలల్లో కూడా ఉంచుతారు.
భిల్లుల సమాజంలో చతుర్ధశి ని నల్లనిచతుర్ధశి అని అంటారు. ఒక వేళ చతుర్ధశతో కూడిన అమావాస్య రాత్రికి తాంత్రికులు, వారి శిష్యులు తాంత్రిక సిద్ధి కోసం పూజలు చేస్తారు. దీపావళి అమావాస్య రాత్రి మంత్రతంత్రాల జపం, ప్రయోగాల వల్ల ఎనలేని విజయం, సిద్ధి లభిస్తుందని భిల్లుల నమ్మకం చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఇలాంటి సాంప్రదాయమే దేశంలోని వివిధ క్షేత్రాలలో కూడా అగుపడుతుంది.
అమావాస్య అనగా దీపావళి రెండవ రోజు ( పాఢ్యమి) సూర్యోదయం కంటే ముందు ఇంటి ఆవరణలో అగ్నిని వెలిగిస్తారు. ఉత్తరప్రదేశ్, బీహార్ లోని గ్రామీణ, పట్టణ ప్రదేశాలలో దీనిని దరిద్రాన్ని పారదోలడం అంటారు. ఉత్తర ప్రదేశ్, బీహర్, ఝార్ఖండ్ ప్రాంతాలలో ఈ సాంప్రదాయం ఉండడం గమనార్హం.
అగ్నిని వెలిగించిన తర్వాత స్త్రీలు స్నానం చేసి జపతపాలు ముగించి ఆవుపేడతో గోవర్ధన గిరిని తయారు చేసి దానిని పూజిస్తారు. ఇంటిలోని పశువులను పూలమాలలతో అలంకరిస్తారు. వాటి కొమ్ములను జౌజుతో అలంకరిస్తారు. గోవర్ధన పూజ, పశువులను పూజించు సాంప్రదాయం ఉత్తరప్రదేశ్, బీహార్‌తో భారతదేశంలోని వేరు వేరు క్షేత్రాలలో కూడా ఉంది.
కోర్క గిరిజన తెగలో దీపావళి పండుగ :
కోర్క్ గిరిజన తెగలో కూడా కార్తీక మాసంలోని అమావాస్య నాడే దీపావళి జరుపుకుంటారు. “కోర్క్” ప్రజలు “దీవాదావీ” చేస్తారు. దీనిలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించి ఆవులకు హారతి ఇస్తారు.
పశువుల గిట్లకు వచ్చే వ్యాధి నుంచి వాటిని కాపాడడానికి “కోర్క్” ప్రజలు ఆవులను, ఎద్దులను పూజిస్తారు. గ్వాల్ దేవి ని కూడా పూజిస్తారు. పాఢ్యమి నాడు హనుమంతుని దర్శనం చేసుకుంటారు. రాత్రివేళ భుగ్డూ (పిల్లన గ్రోవి లాంటిది) వాయిస్తూ నాట్యం చేస్తారు. రెండో రోజు సూర్యోదయం కంటే ముందు పశువుల పై తమ చేతులతో రంగురంగుల ముద్రలు వేస్తారు. దీపావళి నాడు కోర్క్ ప్రజల ఇళ్లలో మాంసాహారం వండరు. తీయటి ఏక్వాన్నాలు తయారు చేస్తారు. ఆవులు, ఎడ్లు ఎంగిలి చేసిన కెచిడీని తినే సాంప్రదాయం ఇక్కడ ఉంది.
గోండు తెగ వారి దీపావళి :
గోండు గిరిజనులలో కొన్ని చోట్ల దీపావళి కార్తీక మాసపు అమావాస్య నాడు జరుపుకుంటారు. కొన్ని చోట్ల ఆశ్వయుజ మాసపు అమావాస్యకు ఆరంభమై కార్తీక పూర్ణిమతో (5రోజులు) ముగుస్తుంది. గోండులు అమావాస్యనాడు రాత్రి వారి గురువులను, ధాన్యపు రాశులను పూజిస్తారు. దాంతో పాటు మంత్రసిద్ధి, గురు మంత్రాలను స్వీకరిస్తారు. మూలికా ఔషధాలను పూజించి జాగృతం చేస్తారు. తరువాతి రోజు లక్ష్మీ పూజ లేదా గోవర్ధన పూజ నిర్వహిస్తారు.
గోండుల నమ్మకం ప్రకారం ఇదే రోజు ధాన్యము, లక్ష్మి, గోవు భూమిపై అవతరించాయి. వారి సాంప్రదాయం ప్రకారం దౌగున్ పూజ నుండే దీపావళి ఉద్భవించాయి. అందుకే దౌగున్ పూజ దీపావళి నాడు చేస్తారు. దీపావళి నాడు గోండుల నాయకుడు వారి ఇంట్లో పిండితో ముగ్గు వేస్తాడు. జౌజు పూయబడిన గంపలో బియ్యం, పువ్వులు ఉంచి నేతి దీపాలు వెలిగిస్తారు. ఇలాంటి పద్ధతి భారతదేశంలోని వివిధ సమాజాలలో ఉనికిలో ఉంది. కులదేవత, గురువు, పూర్వీకుల కోసం దీపాలు వెలిగిస్తారు. అంతే కాకుండా ఇంటి లోని వివిధ భాగాలలో దీపాలు వెలిగిస్తారు. పశువుల శరీరంపై జౌజుతో రంగు వేస్తారు.
భారియా తెగలో దీపావళీ :
భారియా తెగవారు కూడా కార్తీక అమావాస్య రాత్రి నాడు దీపావళి జరుపుకుంటారు. దీని సందర్భంగా మట్టి, పిండితో 5 దీపాలు వెలిగించి లక్ష్మి, ధనాన్ని పూజిస్తారు. భారియా ప్రజలు వారి సాంప్రదాయ దుస్తులు ధరించి ఇంటింటికి ఒక్కో దీపాన్ని దానం చేస్తారు. దానికి బదులుగా వారికి నేగా ఇవ్వబడుతుంది. తరువాతి రోజు ఉదయం అందరూ కిచిడీని, నువ్వులను సేవిస్తారు.
దీపావళి తరువాత మూడవరోజు ఇంటి వాకిట్లో గోవర్ధన పూజ నిర్వహిస్తారు. మహిళలు గోవర్ధన పూజకు సంబంధించిన పాటలు ఆలపిస్తారు. పశువులకు జౌజుతో అలకంరిస్తారు. పిల్లలు వారి సాంప్రదాయ దీపావళి పాటు (దోహరా గీత్) పాడుకుంటూ బంతిపువ్వులు లేదా కానుకలు అందిస్తారు.
కోల్ గిరిజన తెగ :
హిందువులు, ఇతర గిరిజనుల లాగే కోల్ గిరిజనులు కూడా దీపావళి జరుపుకుంటారు.
పైన పేర్కొన్న అన్నీ గిరిజన తెగలు దీపావళి పండుగను జరుపుకునే తీరు ఒకేలా ఉంది. గిరిజనుల దీపావళి పండుగలోను వారికి ప్రకృతి, జీవుల పట్ల ఉన్న అంతులేని శ్రద్ధను చూపిస్తుంది. ఇదే శ్రద్ధ మనకు గ్రామీణ, పట్టణ సమాజాలలో కూడా అగుడుపడుతుంది.
అనువాదం: ధీరజ్ కులకర్ణి