Home Telugu Articles ఉగ్రమూకల పని పట్టాల్సిందే! అమరనాథ్‌ ఘటన నేర్పుతున్న పాఠం

ఉగ్రమూకల పని పట్టాల్సిందే! అమరనాథ్‌ ఘటన నేర్పుతున్న పాఠం

0
SHARE

-కులదీప్ నయ్యర్

అమర్‌నాథ్‌ యాత్రికులపై జమ్ముకశ్మీర్‌లో జరిగిన అమానుష దాడి ఉగ్రవాదుల తెంపరితనానికే అద్దం పడుతోంది. అమరనాథేశ్వరుడిని దర్శించుకుని వస్తున్న యాత్రికుల బస్సుపై విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందిన ఘటనకు ఇప్పటివరకూ బాధ్యులమని ఏ ముష్కర సంస్థా ప్రకటించుకోకపోయినా- అనుమానాలన్నీ లష్కరే తొయిబా చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. ఈ అమానుష దాడికి ఒకవేళ లష్కరే బాధ్యత ప్రకటించుకున్నప్పటికీ- దీనివెనక హిజ్బుల్‌ ముజాహిదీన్‌ వంటి ఇతర ఉగ్ర సంస్థల మద్దతు కచ్చితంగా ఉండి ఉండవచ్చునని నిఘా సంస్థలు భావిస్తున్నాయి. పశ్చిమాసియా దేశాలను లక్ష్యంగా చేసుకుని లష్కరే తొయిబా ఇప్పటికే అనేక దాడులు నిర్వహించింది. జమ్ముకశ్మీర్‌లో తాజా దాడి ద్వారా తన అస్తిత్వాన్ని బలంగా చాటుకోవాలన్నది లష్కరే సంకల్పంలా కనిపిస్తోంది. ఒకసారంటూ భారత్‌ను గట్టిగా భయపెడితే ఇక పశ్చిమాసియా దేశాలు సులభంగా గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చన్నది లష్కరే ముష్కరుల వ్యూహం కావచ్చు. దేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతిలో ముంచెత్తిన ఈ ఘటనపట్ల వివిధ పార్టీలు రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేస్తుండటమే బాధాకరం.

అమర్‌నాథ్‌ యాత్రికులపై ముష్కర మూకలు దాడి జరపడం ఇదే తొలిసారి కాదు. 2000 ఆగస్టులో యాత్రకు బయలుదేరిన 95మందిపై ఉగ్రమూకలు విచక్షణరహితంగా కాల్పులు జరపగా 89మంది మరణించారు. పదిహేడు సంవత్సరాల క్రితం ఆగస్టు ఒకటో తేదీ రాత్రి అమాయక ప్రజలపై వరస వెంబడి చోటచేసుకున్న దాడులన్నీ పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగాయి. ఆ తరవాతి ఏడాది స్థానిక హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సంస్థ యాత్రికులపై కాల్పులు జరపరాదని నిశ్చయించింది. కానీ, ఇతర ఉగ్రవాద సంస్థలన్నీ హిజ్బుల్‌ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. పహాల్‌గామ్‌లోని యాత్రికుల విడిది కేంద్రంపై దాడికి తెగబడ్డాయి. ఆ దాడిలో 21మంది అమర్‌నాథ్‌ యాత్రికులతోపాటు మొత్తం 32మంది అసువులు బాశారు. ఆ తరవాత 2001 జులై 20న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో యాత్రికులపై ముష్కర మూకలు రెండు గ్రెనేడ్‌ దాడులతో విరుచుకుపడ్డాయి. ముగ్గురు మహిళలు, ఇరువురు పోలీసు అధికారులతోపాటు ఆ దాడుల్లో మొత్తం 13మంది మృత్యువాతపడ్డారు. ఈ దాడుల నేపథ్యంలో ప్రభుత్వం 2002లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. అమర్‌నాథ్‌ యాత్రికులకు రక్షణగా మొత్తం 15 వేల దళాలను మోహరించింది. అంత పకడ్బందీ భద్రత ఏర్పాట్ల మధ్య కూడా ఉగ్రమూకలు దాడికి తెగబడి ఎనిమిది మంది యాత్రికులను హతమార్చి, 30మందిని గాయపరచడం అత్యంత ఆందోళన కలిగించిన సంఘటన. జమ్ముకశ్మీర్‌లో తాజా అమానుష దాడి ఉగ్రవాదుల రూపంలో పొంచి ఉన్న ముప్పును మరోసారి బయటపెట్టింది. తాజా పరిమాణాల నేపథ్యంలో కశ్మీర్‌ లోయలో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం సైనిక బలగాలను ఆదేశించింది. అయితే భద్రతా వైఫల్యం వల్లే ఆ దాడి జరిగిందని, అందుకు ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యత వహించాలనీ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ధ్రువీకరణలేకుండా, రహదారి భద్రతా బృందాన్ని ఉపసంహరించాక ఆ బస్సును రోడ్డుపైకి ఎలా అనుమతించారన్న ప్రశ్నకు జవాబులు అన్వేషించాల్సి ఉంది.

ఈ దుశ్చర్యలో పాకిస్థాన్‌ హస్తంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన లోతుపాతులు అర్థమైతేగాని ఈ విషయంలో స్పష్టత రాదు. గడచిన కొన్ని నెలలుగా జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. లష్కరే వంటి ఉగ్రవాద సంస్థలకు అండదండలు అందించేందుకు అక్కడ ఎన్నో దేశీయ విషనాగులు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి దాడులవల్ల మతాలు, వర్గాలకు అతీతంగా కశ్మీరీల సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తూ సూఫీలు ప్రతిపాదించిన ‘కశ్మీరియత్‌’ భావనకు తూట్లు పడతాయి. మహారాజా హరిసింగ్‌ నుంచి కశ్మీరీల నాయకుడు షేక్‌ అబ్దుల్లా చేతికి ప్రభుత్వ పగ్గాలు వెళ్ళిన సందర్భంగా గతంలో ఎక్కడా, ఎలాంటి సంఘర్షణలూ జరగలేదు. మతపరమైన విభేదాలేవీ పొడచూపలేదు! సర్వత్రా కశ్మీరియత్‌ భావన వెల్లివిరిసింది. కాలక్రమేణా పాక్‌ ప్రారంభించిన విషప్రచారం కారణంగా, ఛాందస మూకల మౌఢ్యంవల్ల కశ్మీర్‌లో పరిస్థితులు అదుపుతప్పాయి. ఏడు దశాబ్దాలుగా లౌకిక, ప్రజాస్వామ్య భారతీయ విలువల పునాదులమీదే కశ్మీర్‌ ప్రస్థానం కొనసాగుతోంది. కొంతకాలంగా అక్కడ ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఇటీవల శ్రీనగర్‌ను సందర్శించినప్పుడు అక్కడి యువత కశ్మీర్‌ను సర్వసత్తాక ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చాలన్న ఆకాంక్షలు వ్యక్తం చేయడాన్ని నేను స్వయంగా గమనించాను. యాసిన్‌ మాలిక్‌, షబ్బీర్‌ షా వంటి నాయకులకు కశ్మీర్లో ఇప్పుడు ఎలాంటి గౌరవమూ దక్కడం లేదు. పాకిస్థాన్‌ అనుకూల వాదనలతోపాటు ఇస్లామిక్‌ సిద్ధాంతాలను బలంగా ప్రవచించే సయ్యద్‌ షా గిలానీ, మిర్వాయిజ్‌ వంటివారికి మాత్రం కశ్మీరీ యువత బ్రహ్మరథం పడుతోంది. గిలానీ, మిర్వాయిజ్‌ వంటివాళ్లు భద్రతా దళాల మీద రాళ్లు విసరుతున్న వారినీ అడ్డంగా సమర్థిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌ భూభాగంనుంచి ఈ మౌఢ్యాన్ని తొలగించాల్సిందే! అయితే అందుకోసం ఇతర రాజకీయ పక్షాల సలహాలు, సూచనలూ స్వీకరించి జాగ్రత్తగా విధాన రచన చేయాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా అమర్‌నాథ్‌ యాత్రికుల భద్రతకు తక్షణం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. ఉగ్రవాద శక్తులకు గట్టి గుణపాఠం నేర్పేందుకు భద్రత దళాలను సర్వసన్నద్ధం చేయాలి.

కులదీప్ నయ్యర్, రచయిత, బ్రిటన్ లో భారత మాజీ హైకమిషనర్

ఈనాడు సౌజన్యం తో

For regular updates download Samachara Bharati app

http://www.swalp.in/SBApp