Home News ఉన్నవ ల‌క్ష్మీనారాయ‌ణ‌… స‌మాజ జీవితాన్ని ఆనంద‌మ‌యం చేయ‌డానికి కృషి చేసిన సంఘ సంస్క‌ర్త‌

ఉన్నవ ల‌క్ష్మీనారాయ‌ణ‌… స‌మాజ జీవితాన్ని ఆనంద‌మ‌యం చేయ‌డానికి కృషి చేసిన సంఘ సంస్క‌ర్త‌

0
SHARE

డిసెంబ‌ర్ 4 – ఉన్నవ ల‌క్ష్మీనారాయ‌ణ గారి జ‌యంతి..

పుట్టుకని-మరణాన్ని విశ్లేషించి, మానవ అంతిమ గమ్యాన్ని శోధించిన, వేద-వాగ్మయం ఆవిర్భవించిన దేశం మనది. బట్ట కట్టడం, క్రమబద్ధమైన జీవన విలువలను ప్రారంభించి, పాటిస్తున్న మొట్ట మొదటి దేశం మనది. అతి పురాతన, సుదీర్ఘ నాగరికత కలిగి, కాలానుగుణంగా చేరిన అనేక సామాజిక లోటుపాటులను, వివక్షలను, కాలబాహ్యమైన సంస్కృతి, సంప్రదాయ, ఆచార, వ్యవహారాలను, మనం తయారు చేసుకున్న మను, పరాశర, యాజ్ఞవల్క స్మృతుల ద్వారా మానవ సంఘ జీవితాన్ని ఆనందమయం చేసే మార్పులు చేసుకుంటూ వచ్చాము. ఈ క్రమంలోనే నేటి అవసరాలకి అనుగుణమైన భారత రాజ్యాంగమనే, అంబేడ్కర్ స్మృతిని భారత ప్రజలమైన మనం, మనకి ఇచ్చుకుని, నవ-సమాజాన్ని, సమ-సమాజాన్ని తీర్చి దిద్దుకుంటున్నాము.

ఈ క్రమంలో, అన్ని కాలాలలో, ఎంతో మంది సామాజిక సంస్కర్తలు, సమాజ జీవితాన్ని ఆనందమం చేయడానికి నిరంతరంగా తమవంతు ప్రయత్నం చేశారు. అటువంటి విశేష ప్రయత్నం చేసిన ఒక శ్రేష్ఠమైన వ్యక్తి అయిన శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారి గురించి తెలుసుకుందాము.

శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారు, డిసెంబర్ 4, 1877న శేషమ్మ, శ్రీరాములు దంపతులకు గుంటూరు జిల్లా అప్పటి సత్తెనపల్లి తాలూకా వేములూరుపాడు గ్రామంలో జన్మించారు. వారి ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. 1892లో (15 సం.) లక్ష్మీబాయితో వివాహం అయ్యింది. 1897లో గుంటూరులో Matriculation పూర్తి చేశారు. 1906లో రాజమండ్రిలో ఉపాధ్యాయునిగా శిక్షణ పొందారు. 1908లో ర్యాలీ కంపెనీలో ఉద్యోగిగా చేరారు. 1916లో డబ్లిన్‌ విశ్వవిద్యాలయంలో బారిష్టర్ చదివారు. అక్కడ ఐరిష్ హోమ్ రూల్ జాతీయ నాయకుడైన ‘డీవాలేరా’తో ఏర్పడిన పరిచయం వారిని ప్రభావితం చేసింది. స్వదేశానికి వచ్చి 1917లో మద్రాస్ హై కోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టారు.

శ్రీ కందుకూరి వీరేశలింగంగారు, బ్రహ్మ సమాజం చేపట్టిన సామాజిక సంస్కరణలు ఉన్నవ గారిని విశేషంగా ప్రభావితం చేశాయి. వారిలో నిద్రాణమై ఉన్న జాతీయ వాదాన్ని తట్టి లేపాయి. అదే సమయంలో, గాంధీగారు, స్వాతంత్ర్య సాధన కోసం సమాజానికి పిలుపునిచ్చారు. శ్రీ లక్ష్మీనారాయణ, అన్నింటినీ తృణ ప్రాయంగా వదిలేసి, సహాయ నిరాకరణ ఉద్యమాలలో పాల్గొన్నారు. నిరాకరణ ఉద్యమం ఫిబ్రవరి 1927న ముగిసిన తరువాత, 1923లో కాంగ్రెస్ స్వరాజ్య పార్టీలో చేరారు. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు ఇద్దరిలో ఒకరిగా ఎన్నికయ్యారు.

కాంగ్రెస్ వాది అయినప్పటికీ, మత ప్రాతిపదికపై జరుగుతున్న ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్మొహమాటంగా విమర్శించారు ఉన్నవ. స్వాతంత్రోద్యమంలో భాగంగా పల్నాడులో అటవీ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన పుల్లరి సత్యాగ్రహం (1921), ఉప్పు సత్యాగ్రహం (1931), క్విట్ ఇండియా ఉద్యమం (1942)లో పాల్గొని అనేక సార్లు కారాగార శిక్ష అనుభవించారు. ఆయనతో పాటు వారి సతీమణి శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయిగారు కూడా అనేక ప్రజాహిత, స్వాతంత్ర్య ఉద్యమాలలో విశేష సేవలు అందించారు. భర్తతో పాటు అనేక సార్లు కారాగార శిక్ష కూడా అనుభవించారు. శ్రీలక్ష్మీనారాయణ, నడిపిన “గుంటూరు పత్రిక” సామాజిక సంస్కరణా ఉద్యమాలకు ప్రేరణా కేంద్రంగా నిలిచింది.

ఒకవైపు బ్రిటీషు పాలనలో అత్యంత హీనమైన జీవనం సాగిస్తున్న భారతీయ జనత, మరొక వైపు తప్పుదారి పట్టి, లేదా కాలబాహ్యమైన వర్ణ వ్యవస్థతో, స్వార్థం కారణంగా ఛాంధసంగా మారిపోయిన సంప్రదాయాలతో సాటి మనిషిని అస్పృశ్యునిగా మార్చిన కట్టుబాట్లు, స్త్రీలను అబలగా మార్చిన సిద్ధాంతాలు.. ఈ రెండూ భారతదేశంలో వెంటనే నాశనం కావాలని తలచారు శ్రీ లక్ష్మీనారాయణ. అనుకున్నదే తడవుగా వీటిపై సమర శంఖం పూరించారు.

సమాజంలో, రుగ్మత ముందు గుర్తించబడుతుంది. తరువాత మాట్లాడ బడుతుంది. తరువాత రచయితకి అది కథా వస్తువుగా మారుతుంది. ఆ విధంగా, శ్రీ లక్ష్మీనారాయణ స్వాతంత్ర్య సాధనలో భాగంగా, రాయవెల్లూరు కారాగార శిక్ష అనుభవిస్తున్న సమయంలో, ఆయనలోని కవి, సమాజంలోని వివక్షని ఎండగడతూ 1922లో ఆయన చేత “మాలపల్లి” అనే (762) పుటల సుదీర్ఘ నవల వ్రాయించింది. ఈ నవలకి పీఠిక వ్రాసిన దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు- “ఈ నవల ఆంధ్ర సాహిత్య హృదయ వైశాల్యాన్ని దర్శింపజేస్తుందని, తెలుగు నాట విశేష మార్పుకి కారణమైన ఉత్తమ కావ్యమని, తెలుగు దేశము, తెలుగు హృదయము, తెలుగు సంకల్పాన్ని మాలపల్లి నవలకి అనిర్వచనీయమైన ప్రతిభని సమకూర్చాయి” అని ప్రశంసించారు. ఈ నవల నాటి రాజకీయ వాతావరణాన్ని, గాంధీగారి ఆశయాల్ని, తెలుగువారి జీవన విధానాన్ని, సాంఘిక దురాచారాలని, జాతీయ సత్యాగ్రహ ఉద్యమాలని, మార్పుకి అడ్డుపడుతున్న కుల, వర్గ, వర్ణ వ్యవస్థలని, కులం కారణంగా ఆధ్వాన్నంగా మారిన దళితుల సామాజిక, ఆర్థిక అసమానతలని విస్తృతంగా పరిశీలించింది. సామజిక, ఆర్థిక అసమానతలపై బలమైన విమర్శ చేస్తూనే, దళితుల అభ్యున్నతి దిశగా వారు ఆలయ ప్రవేశం, సహపంక్తి భోజనాలు వంటి అనేక కార్యకలాపాలకు పురి కొలిపారు.

వాస్తవానికి “మాలపల్లి” నవలని 1922లో (45సం.వయస్సులో) సామాజిక మార్పుదిశగా వ్రాసినప్పటికీ, శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారు, సామాజిక మార్పు యొక్క ఆచరణ ఆయన 25సం. వయస్సులోనే ప్రారంభించి ఉన్నారు. 1900వ సం.లో గుంటూరులో “Young Men Literary” అసోసియేషన్ ‌ని స్థాపించిన ఉన్నవ, మాలపల్లి నవల వ్రాయడానికి 20సంవత్సరాల ముందే తన సామాజిక వర్గం నుండి ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ, వాటిని లెక్కచేయకుండా ఆయన 1902వ సం.లో, వీరేశలింగం పంతులు గారి అధ్యక్షతన తొలి వితంతు వివాహం జరిపించారు. గుంటూరులో 32 వితంతు వివాహాలు జరిపి “గుంటూరు వీరేశలింగం’గా పేరుపొందారు. 1906లో వీరేశలింగంగారు స్థాపించిన వితంతు శరణాలయాన్ని, 1912లో పూనాలోని కార్వే మహిళా విద్యాలయాన్ని సందర్శించారు. 1913లో జొన్నవిత్తుల గురునాథంగారితో కలసి విశాలాంధ్ర పటం తయారుచేశారు. కార్వే మహాశయుని స్ఫూర్తితో 1922వ సం.లో “శారదా నికేతన్” స్థాపించి, బాలికలకు విద్యావకాశాలు కల్పించారు. విద్యతో పాటుగా వృత్తి విద్యలలో శిక్షణ అవకాశాలు కూడా కల్పించారు. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది స్త్రీలు విద్యావంతులై, జాతీయోద్యమంలో పాల్గొన్నారు. అనాథలైన, సామాజిక వెలివేత బారినపడ్డ పిల్లల ఇంటికి వెళ్ళి వారితో కలిసి భోజనం చేసి వారిని సమ-సమాజంలోకి తీసుకువచ్చి, వారి శరణాలయంలో ఆశ్రయం కల్పించారు. ఈ క్రమంలో ఆ దంపతులను తోటి కులస్థులు వెలి వేసినప్పటికీ, వారు ఏమాత్రం వెనుకంజ వేయలేదు.

పై సంఘటనలన్నీ, ఉన్నవ లక్ష్మీనారాయణగారి సామాజిక సంస్కరణ, దళితోద్దరణ అనేది 1917 నాటి బోల్షెవిక్ విప్లవం చేత ప్రభావితమై, చేసిన చర్యగా అభివర్ణించే వాదనని సత్యం కాదని నిరూపిస్తాయి. మరొక ప్రముఖమైన విషయం ఏమిటంటే- “అచల యోగం” అనే కుండలినీ విద్యని సాధన చేసిన శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారి తండ్రిగారైన శ్రీరాములు గారికి, కులతత్వం అంటే ఎంత మాత్రం విశ్వాసం ఉండేది కాదు. ఈ రకంగా కులరహిత సమాజ కాంక్ష, దళిత జనోద్ధరణ అనేది శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారికి పుట్టుకతో వచ్చిందని నిష్కర్షగా చెప్పవచ్చు. సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతీ పౌరుడు, అందునా ఒక రచయిత, ప్రపంచ వ్యాప్తంగా జరిగే అన్ని సంఘటనలను నిశితంగా పరికిస్తాడు. వాటి నుండి స్వదేశానికి, సమాజానికి కావలసినది క్రమం తప్పకుండా తీసుకుంటాడు. ఇది శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారికి కూడా వర్తిస్తుంది.

శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారి “మాలపల్లి” నవలని సంపూర్ణంగా పరికించినప్పుడు, ఆయన తన పాత్రలతో…. “మొక్కాబోతే గుళ్లే లేవు, యెక్కాబోతే బళ్ళే రావు- కుడవ పూట కూళ్ళే లేవురా ఓ జ్ఞానా సంగా జదువనైనా బళ్లే లేవురా”… పనివారందరు యేకమైతిరా ప్రపంచమే మీది, ఐకమత్యమే అన్ని పనులకు ఆధారము సుండి.. అని అనిపించిన వ్యాఖ్యలు, దిగుమతి చేసుకున్న భావజాలం కాక, స్థానికంగా అప్పటికే సమాజం కోసం పోరాడిన ఎందరో సామాజిక సంస్కర్తల ఆలోచనా ధోరణినే ప్రస్ఫుటించిందనవచ్చు. పైగా అప్పటికే తల్లాప్రగడ సూర్యనారాయణ గారు “హేలావతి” (1913), వేంకటపార్వతీశ్వర కవుల “మాతృ మందిరం” (1919) వంటి నవలలు దళిత సమస్యలని స్పృశించాయి.

శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారు జైలు నుండి విడుదలైన తరువాత, బెల్లంకొండ రాఘవరావుగారు “మాలపల్లి” నవలని రెండు భాగాలుగా 1922లో ప్రచురించారు. ఈ రాజకీయ నవల ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని, వ్యతిరేకిస్తోందని బ్రిటిష్ ప్రభుత్వ అభియోగం మోపి, 1923 ఏప్రిల్ 5వ తేదీన నవలని నిషేధించింది. మద్రాసు శాసనమండలిలో 1926లో కాళేశ్వరరావు తదితరులు నిషేధంపై చర్చించాక, నవలలోని కొన్ని భాగాలు తొలిగించిన పిదప “మాలపల్లి” నవలకి 1928 మార్చి, 30వ తేదీన ప్రచురణ అనుమతి లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు ఈ నవలని ఇంటర్ పాఠ్య గ్రంధంగా ఎంపిక చేశారు. 1936 మార్చి, 7న మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం “మాలపల్లి” నవలపై రెండవసారి నిషేధం విధించి, పాఠ్య గ్రంధంగా తొలగించింది. 1937లో రాజగోపాలాచారి ఆధ్వర్యంలో మద్రాసులోని కాంగ్రెసు ప్రభుత్వం “మాలపల్లి” నవలపై నిషేధాన్ని రద్దు చేసింది. రెండు సార్లు బ్రిటిష్ ప్రభుత్వ నిషేధాన్ని ఎదుర్కొన్న ఈ నవలకు ప్రజల్లో విశేష ఆదరణ లభించింది. స్వాతంత్ర్యానంతరం శ్రీ మరుపూరి కోదండరామి రెడ్డిచే క్లుప్తీకరించబడిన ఈ తెలుగు నవల (416 పేజీలు) 1976లో కేంద్ర సాహిత్య అకాడమి ద్వారా ప్రచురింపబడింది. క్లుప్తీకరించబడిన ఈ నవలకు బెజవాడ గోపాలరెడ్డి ముందు మాట వ్రాశారు. ‘సహవాసి’చే తెలుగులో మరింతగా కుదించబడిన ఈ నవల సంక్షిప్త ప్రతి (68 పేజీల)ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. డా. వాడపల్లి వి.బి. రామారావుచే ఆంగ్లంలోకి అనువదించబడిన ఈ నవలను (403 పేజీలు) 2007లో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది.

మాలపల్లిలో ప్రముఖంగా కనిపించే పాత్రలు మాలదాసరి కులస్థుడు, సాత్వికుడు, సాంప్రదాయ పరాయణుడు, గాంధేయవాది అయిన రామదాసు. అతడి పెద్ద కొడుకు వెంకట రెడ్డి, చిన్నకొడుకు సంగదాసు. వీరి కుటుంబము, చుట్టూ అల్లుకుని వాళ్ళ జీవితాలను ప్రభావితం చేస్తున్న సామాజిక అంశాలే దీనిలోని కథావస్తువు. ఈ కుటుంబం అంతా సంస్కరణ కోసం పాటుపడే తత్వం ఉన్నవాళ్ళు. 800 ఎకరాలున్న మోతుబరి రైతు అయిన చౌదరయ్య ఆయన కొడుకులైన రామానాయుడు, వెంకటయ్యనాయుడు నవలలో సామాజిక, ఆర్థిక ఆధిపత్యం కలిగిన మరికొన్ని ముఖ్య పాత్రలు. సంగదాసు ఈ చౌదరయ్యదగ్గరే పాలేరుగా పనిచేస్తుంటాడు. యజమాని కొడుకు రామానాయుడు, సంగదాసు ఆశయాలు కలుస్తాయి. ఇద్దరు స్నేహితులు అవుతారు. ఒక సందర్భంలో భూస్వామి సంగదాసు తలపై పనిముట్టుతో గట్టిగా మోదడం వలన అతడు మరణిస్తాడు. భూస్వామి పోలీసులకి లంచం ఇచ్చి తప్పించుకుంటాడు. ఈ పరిస్థితి రామానాయుడుని పేద రైతులు, దళితులకు మరింత దగ్గరగా చేస్తుంది.

అంటరానితనాన్ని నశింపజేసి, నిమ్న జాతుల అభివృద్దికి తోడ్పడడానికి అహ్మదాబాదు‌లో 1921లో కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఈ విషయ సారాన్ని మాలపల్లి నవలలో అగ్రవర్ణ భూస్వామి రామానాయుడి పాత్ర ద్వారా చెప్పించారు. వెంకట రెడ్డి పాత్ర ఒక రకంగా భాగ్యరెడ్డి వర్మ (1888 – 1939), (హైద్రాబాదులో 1906లో జగన్ మిత్రమండలిని స్థాపించి దళితోద్దరణకి అడుగులు వేసిన తల్లిదండ్రులు జూలియా రంగమాంబ, మాదిరి వెంకయ్య అతనికి పెట్టిన పేరు భాగయ్య. కుల గురువు భాగ్యరెడ్డీ అని పిలవటంతో అదే అతని పేరు అయింది. 1913లో ఆర్యసమాజం ఇచ్చిన బిరుదు ‘వర్మ’) ఛాయని సంతరించుకుని ఉంటుంది. మాల కులస్తుడైన సంగదాసు పాత్ర, వర్ణవ్యవస్థపై ప్రశ్నలు సంధించేవానిగా, హేతుబద్ధంగా ఆలోచించేవానిగా, హిందూ తాత్విక పరిధికి లోబడి దళిత జన అభ్యుదయ సాధన చేస్తున్న వ్యక్తిగా పాఠకుల ముందుకి వస్తాయి.

పైగా, సంగదాసుతో చర్చించిన విషయాలు విన్న తరువాత కొన్ని అభిప్రాయాలు మారాయని వెంకటరెడ్డిచేత చెప్పించడం ద్వారా రచయిత, సంగదాసు తత్వాన్ని పై చేయిగా చేశారు. దళిత జనాభ్యుదయం గురించిన సంగదాసు దృక్పథం హిందూ ధర్మ తాత్విక పరిధికి లోబడినది కాగా, వెంకటరెడ్డి దృక్పథం దానిని ధిక్కరించటం నుండి రూపొందినట్లు రచన సాగుతుంది. 1913 నుండే బుద్ధ జయంతులు జరుపుతూ హిందూ వర్ణవ్యవస్థ పైన, వర్ణాశ్రమ వృత్తి-విభజన పట్ల, ధర్మాలపట్ల హేతు బద్ధ ప్రశ్నలతో విమర్శనాత్మక వైఖరిని అభివృద్ధి చేసుకొంటూ వస్తున్న భాగ్యరెడ్డివర్మ స్వభావాన్ని వెంకటరెడ్డి పాత్ర వ్యక్తిత్వంలో భాగం చేశారు లక్ష్మీనారాయణగారు. అయితే లక్ష్మీనారాయణగారి దళిత జనాభ్యుదయ దృక్పథానికి ప్రాతినిధ్యం వహించే పాత్ర సంగదాసే కానీ వెంకటరెడ్డి మాత్రం కాదు. అందువల్లనే సంగదాసు చర్చించిన విషయాలు విన్న తరువాత ‘కొన్ని అభిప్రాయములు మారినవి’ అని అనిపించి సంగదాసుది పైచేయిగా చేశారు రచయిత.

1917 నాటి సదస్సులో 18 తీర్మానాలు ఆమోదించబడ్డాయి. నవలలో సంగదాసు 14 తీర్మానాల చిత్తుప్రతులను సభలో సమర్పించినట్లు కల్పన చేయబడింది. దళితులు నీచమైన పేర్లని వదిలి, గౌరవ ప్రదమైన పేర్లు పెట్టుకోవాలి. ప్రభుత్వ నిధులతో నిర్మించబడిన విద్యాలయాలు, దేవాలయాలు, బావులు, చెరువులు, సత్రాలను నిమ్నజాతులు కూడా వినియోగించుకునే అధికారం ఉండాలి. ఆది ఆంధ్రుల పిల్లలకు ఉచిత విద్యను అందించే ప్రత్యేక పాఠశాలలను, వసతిగృహాలు ఏర్పడాలి. బంజరు భూములు వారికి ఇవ్వాలి అనేది ఆనాటి మరొక తీర్మానం. అడవులలో వ్యవసాయానికి పనికి వచ్చే భూములను దరఖాస్తు పెట్టుకొన్న పంచములకు ఇయ్యాలనీ, ప్రముఖంగా అలా ఇచ్చేటప్పుడు పంచమ క్రైస్తవులకు అవి పోకుండా హిందూ పంచముల సంఖ్యను బట్టి వారికి రావలసిన భూములు వారికే ఇప్పించవలసిందనీ, ఇల్లుకట్టుకొనటానికి స్థలం కేటాయింపు, ద్రవ్యసహాయం ఇవ్వాలని. ఇలాంటి వాస్తవ సంఘటనలను నవలలో భాగం చేయడం ముదావహం.

శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారు కేవలం రచనాకారుడుగానే కాక, ఆచరణ పూర్వకంగా దళిత జనోధ్ధరణ, సామాజిక సమరసత కోసం తన సంపూర్ణ జీవితాన్ని వెచ్చించి, 25.09.1958లో తుది శ్వాస విడిచారు.

Courtesy: VSK Andhra

This article was first posted in 2021