Home Hyderabad Mukti Sangram ఆత్మాభిమానాన్ని నిరూపించుకున్న భైరవునిపల్లి ప్రజలు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-13)

ఆత్మాభిమానాన్ని నిరూపించుకున్న భైరవునిపల్లి ప్రజలు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-13)

0
SHARE

ఆ రోజుల్లో భైరవుని పల్లె (భైరవునిపల్లి)నల్గొండ జిల్లాలో ఉండేది. ఈనాడు ఇది వరంగల్ జిల్లాలో అంతర్భాగం. ఈ గ్రామం చెరియాలకు సుమారు 12 మైళ్ళు దూరంలో ఉంది. వరంగల్, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాలు కలిసే సరిహద్దుల మధ్య ఈ గ్రామం ఉంది. ఈ గ్రామంలో వెళ్ళడానికి ఈనాటికీ పక్కా రోడ్డు లేదు. ఈ భైరవునిపల్లి ప్రజలు ఆనాడు రజాకార్లను ప్రతిఘటించి తమ ఆత్మాభిమానాన్ని నిరూపించుకున్నారు. నాడు నాయకత్వం వహించిన ఈ గ్రామ నివాసి శ్రీ ఇమ్మడి రాజిరెడ్డి నేటికీ సజీవులుగా ఉన్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే “రజాకార్లు మజాకర్లుగా తయారై యథేచ్ఛగా గ్రామాలను దోచుకునేవాళ్ళు. తగులబెట్టేవాళ్ళు చందాల పేరుతో డబ్బులు వసూలుచేసేవారు.

ఇవ్వని గ్రామాలపై దాడిచేసి, దోచి తగులపెట్టి కసి తీర్చుకునేవాళ్ళు. భైరవునిపల్లి పశ్చిమంగా ఉన్న లింగాపూర్ గ్రామానికి ఒకరోజు పగటిపూటనే రజాకార్లు నిప్పంటించారు. ఈ వార్తవిని భైరవునిపల్లి వాస్తవ్యులు శ్రీయుతులు ఇమ్మడి రాజిరెడ్డి, వంగాల అనంతరామిరెడ్డి, మగుటం రామయ్య తదితరులు పదిమంది కుండలు, వగైరాలు తీసుకొని లింగాపూర్ బయలుదేరారు. ధూళిమిట్ట నివాసి శ్రీ దుబ్బుల రామచంద్రారెడ్డిని కూడా సహాయం రమ్మని కబురు పంపారు. వీళ్ళందరూ వెళ్ళేసరికి రజాకార్లు గ్రామంలోని దోపిడీ సాగిస్తున్నారు. ధూళిమిట్టనుండి ముఫ్పుమైంది కర్రలు, గొడ్డళ్ళు తీసుకొని వచ్చేశారు.

గ్రామంలో ఎదురు పోరాటం మంచిది కాదని అక్కడే పొలిమేరలో ఆగిపోయారు. రజాకార్లు దోపిడీ సామాగ్రిని బళ్ళలో వేసుకొని నినాదాలు చేసుకుంటూ వచ్చారు. వెంటనే రాజిరెడ్డి బృందం కేకలు వేసుకుంటూ వెంటాడుతున్న గ్రామస్తులను చూసి రజాకార్లు బెదిరిపోయి పారిపోవడం మొదలుపెట్టారు. కొందరు రజాకార్ల పైజమాలు భయంతో తడిసిపోయాయి. దోచుకున్న సామాను నాలుగుబళ్ళతో సహా గ్రామస్తుల చేజిక్కింది. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత మద్దూరుకు చెందిన రజాకార్లు ఆ నాలుగుబళ్ళను తిరిగి ఇమ్మని కబురు చేశారు.  భైరవునిపల్లి ప్రజలు తిరస్కరించారు. అప్పుడు రజాకార్లు ఆ ప్రాంతం పోలీసు అమీన్‌కు ఫిర్యాదు చేశారు. అమీన్ ఇమ్మడి రాజీరెడ్డిని పిలిపించారు. రాజిరెడ్డి ఆ గ్రామం పోలీసు పటేల్ కూడా కావడంతో వెళ్ళక తప్పలేదు. వెళ్ళి పరిస్థితినంతా చెప్పాడు.

తానే స్వయంగా విచారించగలమని అమీన్ హామీ ఇచ్చి పంపాడు. ఆ తర్వాత ఇమ్మడి రాజిరెడ్డి, ఆయన మిత్రులు తమ గ్రామాన్ని చుట్టుప్రక్కల ఇతర గ్రామాలను సంరక్షించుకునే ప్రయత్నాలు సాగించారు. భైరవునిపల్లి గ్రామానికి 12 వందల రూపాయలు చందా ఇమ్మని తాఖీదు పంపారు రజాకార్లు. భైరవునిపల్లి గ్రామం చుట్టూ కోటగోడ ఉండేది. ఈ గోడకి పెద్ద ఎత్తయిన బురుజుండేది. సురక్షితంగా ఎత్తుగా ఉన్న ఈ బురుజు భైరవునిపల్లి గ్రామానికి ఎంతో మేలు చేసింది. ఇదే బురుజుపైన మందుగుండు సామాగ్రి వగైరా సేకరించి ఇరువది నాలుగు గంటలపాటు గ్రామస్తులలో ఇద్దరు తుపాకులు చేతబూని కాపలా కాస్తుండేవాళ్ళు.

రజాకార్లు కనపడితే బురుజుపైనున్న నగారా మ్రోగించే వాళ్ళు. గ్రామస్థులు పనులు వదలి గ్రామరక్షణకు సిద్ధమయ్యేవారు. ఈ ఏర్పాట్లతో భైరవునిపల్లి గ్రామం దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. చుట్టుప్రక్కల ఉన్న ఆరేడు గ్రామాలను కూడా ఇలాగే తయారుచేసి రక్షణ దళాలను ఏర్పరిచారు. యాభైమంది కర్రలతో, గొడ్డళ్ళతో సహా అన్ని గ్రామాల్లో తిరిగి ధైర్యం చెబుతుండే వారు. ఈ గ్రామాలలో వైర్‌లెస్ వార్తాహరుడిగా శ్రీ విశ్వనాథ భట్ జోషి సైకిలుపై తిరుగుతూ తనవంతు కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. గ్రామాల పరిస్థితిని రైతులకు సమాచారంగా అందచేసేవాడు. ఈ పరిస్థితుల్లో మద్దూరు రజాకార్లు తాము కోల్పోయిన బళ్ళు సంపాదించుకోలేక పోయారు.

రేవర్తి రజాకార్లు

కొంతకాలం గడిచిన తర్వాత జనగామ రోడ్డుపై రేవర్తి గ్రామం నుండి రజాకార్లు బయలుదేరుతున్నారు. తుపాకులతో అన్నీ సిద్ధం చేసుకొని ఈ రజాకార్లు భైరవునిపల్లిపై దాడిచేయ యత్నించారు. వీళ్ళను చూడగానే నగారా మ్రోగించారు. బురుజుపైనుండి కాల్పులు ప్రారంభమైనాయి. రజాకార్లు తట్టుకోలేకపోయారు. పిక్కబలం చూపెట్టుతుండగా గ్రామస్థులు వెంటబడి తరిమారు. దండాల కృష్ణయ్య అనే వ్యక్తి గాయపడి కూడా రజాకార్ల నుండి తుపాకీ లాక్కోగలిగాడు. ఈ తర్వాత రజాకార్లు మళ్ళీ పోలీసు అమీన్‌తో ఫిర్యాదు చేశారు. ఈ సారి అమీన్ స్వయంగా వచ్చి భైరవునిపల్లి తనిఖీ చేశాడు. బురుజుపై ఉన్న మందుగుండు సామాగ్రి వగైరా చూసి వారితో ఇలా అన్నాడు “మేముండగా మీకెందుకు ఈ ఏర్పాట్ల ఫికర్, కమ్యూనిష్టులను మేము ఎదుర్కొంటున్నాం. మిమ్మల్ని రజాకార్లతో దోస్తీ చేయిస్తాం” అని చెప్పి గ్రామంలో తుపాకులను స్వాధీనం చేసుకున్నాడు. రాజిరెడ్డికి రేవర్తిలోని రజాకార్లకు రాజీ కుదిర్చాడు.

(విజయక్రాంతి సౌజన్యం తో)