Home Rashtriya Swayamsevak Sangh విద్యావికాసం.. జాతి ప్రకాశం

విద్యావికాసం.. జాతి ప్రకాశం

0
SHARE

జనవరి 29న సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

సరస్వతీ శిశు మందిరాలు పేరుకు తగ్గట్టే చదువుల తల్లి కొలువైన నిలయాలు. ఇక్కడ బోధన కేవలం విద్యకు మాత్రమే పరిమితం కాదు. విద్యార్థినీ విద్యార్థుల సంపూర్ణ వికాసానికి నిచ్చెన అది. వివేకం, సంస్కారం నేర్పే ప్రణాళిక, చిన్నారుల మానసిక పరివర్తనకు ఈ మందిరాలు ఆధారం. సకల కళలు, సంస్కృతులు, సంప్రదాయాల మేళవింపుల సమ్మేళనం. ఒక విద్యార్థికి విజ్ఞానంతో పాటు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని రంగరించి ఇమిడ్చే కేంద్రం. ఇది సరస్వతీ విద్యా పీఠం విశిష్టత. ఈ పీఠం అనుబంధ పాఠశాలల్లో సాగించే బోధన విలువలు, శిక్షణ, జాతీయ భావనల సమాహారంగా ఉంటుంది. ఉత్తమ వ్యక్తిత్వాన్ని, పరిపూర్ణ సంస్కారాన్ని ఆలవరించే విద్యా విధానం అమలవుతోంది. ఈ క్రమంలో పురాణేతిహాసాలు, భగవద్గీత, రామాయణం వంటి ఆధ్యాత్మిక ధార్మిక గ్రంథాల సారాంశాన్ని, దేశభక్తియుత  వీరగాథలను శిశు మందిర్  విద్యార్థులకు బోధిస్తారు. ఇతర పాఠశాలల్లో అందుబాటులో లేని చారిత్రక అంశాలను, నీతి గాథలను ‘సదాచారం’ లో భాగంగా చిన్నారుల  మస్తిష్కాలకు చేరేలా బోధిస్తారు. ఇందుకోసం ‘సదాచారం’ అనే ప్రత్యేక సబ్జెక్టు రూపొందించారు. పదో తరగతి వరకు ఈ పాఠ్యాంశం తప్పనిసరిగా బోధిస్తారు. ఏ బడి లోనైనా ప్రభుత్వ నిబంధనల మేరకు సబ్జెక్టులు ఉంటాయి. కానీ శిశుమందిర్ లో ఏడు సబ్జెక్టులు ఉంటాయి ఈ ఏడో సబ్జెక్టే ‘సదాచారం’.  ఇక్కడ ఉపాధ్యాయులను పలకరించే సంస్కారం నుంచి ప్రత్యేక సంప్రదాయాలు అలవాటు చేస్తారు. ఇతర పాఠశాలల్లో గురువులను సార్, మేడమ్, టీచర్ ఇలా పిలవడం పరిపాటి. కానీ శిశుమందిర్ లో ఆచార్యజీ, మాతాజీ అని పిలవడం సాంప్రదాయం. దీనివల్ల విద్యార్థినీ విద్యార్థులలో పసితనం నుంచి ఉపాధ్యాయులు అంటే ప్రత్యేక గౌరవం  సంస్కార భావన అలవడుతుంది. నిరాడంబరత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం వంటి లక్షణాలను అలవరచుకునేలా ఇక్కడి పద్ధతులు ఉంటాయి. విజ్ఞాన మేళా, ఖేల్ ఖూద్,  సంస్కృతీబోధ, పరియోజన, వేదగణిత శిక్షణ, సంస్కృతీ కార్యశాలలు నిర్వహించి విజేతలకు బహుమతుల  అందజేస్తారు.  దీనివల్ల విద్యార్థినీ విద్యార్థులలో పోటీతత్వం, నైపుణ్య సాధన, అందరితో కలిసి ఉండటం వంటి లక్షణాలు అలవడతాయి. దీనినే సకారాత్మక బోధనగా పరిగణిస్తారు. అందువల్లే భవిష్యత్తులో ఏ స్థాయిలో, ఏ సంస్థలో పనిచేస్తున్నా పూర్వ శిశుమందిర్ విద్యార్థులు జాతి ఐక్యత, జాగృతిలో చక్కటి పాత్ర పోషిస్తుంటారు. సరస్వతి విద్యా పీఠం ఇప్పుడు మహావృక్షంగా విస్తరించింది. 1967, జూన్ 17న  ప్రస్తుత నిర్మల్ జిల్లా కేంద్రంలో బ్రహ్మపురి రథాల గుడిలో తొలి సరస్వతి శిశుమందిర్ పాఠశాలకు బీజం పడింది. ఆ మరుసటి ఏడాది అదిలాబాదులో రెండో సరస్వతి శిశు మందిర్ ఏర్పడింది. అలా పెరుగుతూ వచ్చిన శిశుమందిర్ లను ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చేందుకు 1973 శ్రీరామనవమి నాడు శ్రీ సరస్వతీ విద్యా పీఠం ఆవిర్భవించింది. ఇప్పుడు వేలాది శిశుమందిర్ లలో లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. మరెంతో మంది ఉన్నత పదవులు అలంకరించారు. శిశుమందిర్ లో బోధించే ఉపాధ్యాయ వర్గానికి ఏటా శిక్షణ తరగతులు, నైపుణ్య మేళాలు నిర్వహించడం ప్రత్యేకత. ఆచార్యులు, మాతాజీలు అందరూ ఏటా తప్పనిసరిగా 40 రోజుల ప్రశిక్షణా వర్గలో పాల్గొనాల్సి ఉంటుంది. శిశుమందిర్ లో కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు మాధ్యమంలోనే విద్యాబోధన సాగేది. కానీ సామాజిక పరిణామాల నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. మాతృభాషలోనే కాదు, ఆంగ్లంలోనూ మన సంస్కృతి సాంప్రదాయాలు, విలువలను విద్యార్థులకు బోధించి వారిని దేశభక్తి గల పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం సాగుతోంది. హైదరాబాద్ బండ్లగూడజాగీర్ లోని శారదాధామంలో ఈనెల 29న, ఆదివారం సరస్వతి శిశుమందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నారు.

-సప్తగిరి,  9885086126

ఆంధ్రప్రభ సౌజన్యంతో …..