రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
శ్రీ విజయదశమి(18అక్టోబర్,2018) సందర్భంగా
పరమపూజ్య సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ ఉపన్యాసం
ప్రస్తావన:
ఈ సంవత్సరపు పవిత్ర విజయదశమి జరుపుకునేందుకు మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. ఇది శ్రీ గురునానక్ దేవ్ జీ 550వ ప్రకాశ పర్వ్ జరిగే సంవత్సరం. ప్రాచీన సంప్రదాయం నుండి వారసత్వంగా అందుకున్న సత్యాన్ని, భారతీయ సహజ తత్వాన్ని మరచిపోయి అసత్యం, స్వార్ధం, మోసంలో మునిగిపోయినప్పుడు మన సమాజం బలహీనపడింది. ఓటమిపాలయ్యింది. ముక్కలయ్యింది. సరిహద్దు అవతల నుంచి వచ్చిపడిన క్రూర, అసహనపరులైన, విదేశీ దురాక్రమణదారుల చేతిలో అమానుషమైన మారణకాండకు, అత్యాచారాలకు గురైంది. అలాంటి సమయంలో శ్రీ గురునానక్ దేవ్ జీ తన జీవితం ద్వారా నూతన ఆధ్యాత్మిక మార్గాన్ని చూపారు. మరచిపోయిన సంప్రదాయాన్ని గుర్తుచేసి తద్వారా ఏకాత్మ భావనను సమాజంలో తిరిగి పాదుకొల్పారు. ఆయన ప్రారంభించిన సంప్రదాయమే ఆ తరువాత దేశాన్ని కష్టాల నుంచి, ఆత్మవిశ్వాసరాహిత్యం నుంచి బయటపడేసిన 10 మంది గురువుల పరంపరను అందించింది.
ఈ దేశపు స్వాతంత్రోద్యమానికి అహింస, సత్యం అనే రాజకీయ పునాదిని అందించిన మహాత్మా గాంధీ 150 జయంతి ఉత్సవాలు కూడా జరిగాయి. ఈ దేశంలో అనేకమంది మహానుభావులు వివిధ కాలాల్లో ప్రేమ, సత్యం ఆధారంగా ప్రవచించిన విలువల ద్వారా ఏర్పడిన సంస్కృతి ఈ అపురూపమైన స్వాతంత్ర్య పోరాటానికి మూలం. ఆ బృహత్ ప్రయత్నాలవల్లనే సామాన్య ప్రజానీకం కూడా తమ ఇల్లూవాకిళ్ళు వదిలి బయటకు వచ్చి బ్రిటిష్ అణచివేతకు వ్యతిరేకంగా నైతిక పోరాటం చేశారు. వంద ఏళ్ల క్రితం అమృత్ సర్ లోని జలియన్ వాలాబాగ్ లో అన్యాయపురితమైన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమావేశమైన ప్రజలను చుట్టుముట్టి విచక్షణారహితంగా జనరల్ డయ్యర్ బలగాలు జరిపినప్పుడు అనేకమంది అమరులయ్యారు. వారిని తలుచుకున్నప్పుడు కూడా మనలో అదే నైతిక శక్తి జాగృతమవుతుంది.
గత 71 ఏళ్ల స్వతంత్ర భారతంలో మనం అనేక రంగాల్లో చెప్పుకోదగిన అభివృద్ధిని సాధించాం. అయినా మన జాతీయ జీవనానికి సంబంధించిన మిగిలిన అనేక పార్శ్వాలలో కూడా మనం ముందుకు వెళ్లవలసి ఉంది. దానికోసం ఇలాంటి ముఖ్యమైన ఘట్టాలను గుర్తుచేసుకోవడం అవసరం. సువ్యవస్థితమైన, సంపన్న, పటిష్టవంతమైన దేశంగా మనం సాధించిన ఈ ప్రగతి వల్ల అనేక స్వార్ధపర శక్తుల కుట్రలు విఫలమయ్యాయి. అయినా దేశ ప్రగతిని అడ్డుకునేందుకు ఈ శక్తులు తమ ప్రయత్నాలను విరమించలేదు. మనం ఇంకా చాలా అవరోధాలను అధిగమించాల్సిఉంది. అందుకు మనం సత్యం, పవిత్రత, తపస్సు, ప్రేమ, త్యాగం అనే సద్గుణాల ఆధారంగా జీవనాన్ని సాగించి, సమాజానికి ఆదర్శంగా నిలచిన మహాపురుషుల బాటలో పయనించాలి. జాతీయ పరిస్థితులను చూసినప్పుడు మనకు ఆశ, నిరాశల సమ్మిళిత చిత్రం కనిపిస్తుంది. ఇలాంటి స్థితిలో ఆ మహాపురుషుల సందేశం మనకు ఎంతో ఉపయోగపడుతుంది.
దేశ భద్రత :
ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, సుసంపన్నం కావాలంటే అందుకు తగిన అవకాశం, పరిస్థితులు ఉండాలి. అవి ఏర్పడటానికి సరిహద్దు భద్రత, అంతర్గత భద్రత అత్యవసరం. రక్షణ పరమైన మన సమస్యలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యల పరిష్కారంలో ఆ దేశాల సహాయసహకారాలు పొందే విధంగా అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నంలో మనం చాలావరకు ఫలితాన్ని సాధించగలిగాం. ఒకపక్క పొరుగు దేశాలతో స్నేహపూర్వక, శాంతియుత సంబంధాలు కొనసాగించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తూనే, దేశ భద్రత కోసం అవసరమైనప్పుడు శక్తిసామర్ధ్యాలను ప్రదర్శించడంలో, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో సైన్యం, ప్రభుత్వం, అధికార యంత్రాంగం వెనుకాడలేదు. సైనిక బలగాల మనోధైర్యాన్ని మరింత పెంచేందుకు వారికి అవసరమైన ఆయుధాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందించారు. ప్రపంచంలో కూడా భారత్ ప్రతిష్ట బాగా పెరగడానికి గల అనేక కారణాలలో ఇది కూడా ఒకటి.
సైనికులకు ఆయుధాలు అందించడంతోపాటు వారి కుటుంబాలకు కనీస సదుపాయాలు కల్పించడం కూడా చాలా అవసరం. ఈ విషయంలో కూడా ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంది. వాటిని మరింత వేగవంతంగా ఎలా అమలుచేయవచ్చన్న విషయమై ఆలోచించాలి. ఈ పధకాల రూపకల్పన, అమలు సైనిక అధికారులు, పౌర పరిపాలనా యంత్రాంగం ద్వారా జరగాలి. ఇందులో హోమ్, రక్షణ, ఆర్ధిక మంత్రిత్వ శాఖలు పాలుపంచుకోవాలి. అప్పుడే సైనిక బలగాలు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతాయి. సైనికులు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి దేశాన్ని రక్షించగలుగుతారు. ఈ విషయమై ఈ మంత్రిత్వ శాఖలు, అధికార యంత్రాంగంలోని ప్రతిఒక్కరి మనస్సులో సంవేదన, శ్రద్ధా ఉండాలి. ప్రభుత్వం, అధికారులకు ఈ విషయంలో ఎంత బాధ్యత ఉంటుందో సమాజానికి, అందులోని ప్రతి వ్యక్తికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. సైనికులు తమ కుటుంబాల గురించి ఎలాంటి ఆందోళన లేకుండా సరిహద్దుల్లో తమ బాధ్యతలను నెరవేర్చగలగాలి. మన పశ్చిమ సరిహద్దు అవతల ఉన్న దేశంలో ఇటీవల ప్రభుత్వం మారినా, మన రాష్ట్రాలైన జమ్ము కాశ్మీర్, పంజాబ్ లలో ఆ దేశం పాల్పడుతున్న ప్రత్యక్ష, పరోక్ష దుందుడుకు కార్యకలాపాలు తగ్గ లేదు. అలా తగ్గుతాయని మనం ఆశించడానికి కూడా అవకాశం లేదు.
వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా మన సముద్ర సరిహద్దులను పరిరక్షించుకోవడం కూడా చాలా ముఖ్యం. భారత్ చుట్టుపక్కల వందలాది దీవులు ఉన్నాయి. అండమాన్ నికోబార్ తో సహా ఈ దీవులన్నీ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవి. మన భద్రత దృష్ట్యా ఇక్కడ స్థావరాలను మరింత బలోపేతం చేయడం అత్యవసరం. ఈ దీవులు, సముద్ర సరిహద్దులను కాపలా కాసే నౌకా దళానికి, ఇతర దళాలకు అవసరమైన వనరులను అందించడంతోపాటు వాటి మధ్య సమన్వయం, సహకారం సాధించడంపై వెంటనే దృష్టి పెట్టాలి. సరిహద్దుల్లో నివసించే సోదర ప్రజానీకం అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ అక్కడ నుండి వచ్చేయకుండా దృఢంగా నిలబడ్డారు. వీరి సంక్షేమాన్ని పట్టించుకుంటే ఈ స్థానికులే చొరబాట్లు, అక్రమ వ్యాపారం మొదలైన సమస్యలను ఎదుర్కోవడంలో ఎంతో సహాయం అందజేయగలుగుతారు. కనుక విద్య, వైద్యం ఇతర సదుపాయాలు అందే విధంగా ప్రభుత్వం, సమాజం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ స్థానికుల్లో దేశభక్తిని, పోరాటపటిమను నింపాలి.
అవసరమైనప్పుడు ఆయుధాలను దిగుమతి చేసుకున్నప్పటికీ, రక్షణ సామగ్రి ఉత్పత్తి విషయంలో స్వావలంబన సాధించడం చాలా అవసరం.
అంతర్గత భద్రత:
సరిహద్దు భద్రతతోపాటు దేశంలో అంతర్గత భద్రత కూడా చాలా ముఖ్యం. దేశం లోపల, వెలుపల నుంచి సహాయం పొందుతూ దేశపు రాజ్యాంగం, సార్వభౌమత్వం, చట్టాలను సవాలు చేసే, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడే శక్తుల పట్ల కేంద్రం, అలాగే రాష్ట్రప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పారామిలటరీ బలగాలు ఈ విషయంలో చురుకుగానే వ్యవహరిస్తున్నాయి. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఇలాగే ఈ చర్యలను చేపడుతూ ఉండాలి. అయితే ఇలాంటి హింసాత్మక, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనేవారు మన సమాజంలో ఉన్నవారే. వీరు ఇలాంటి పనులకు పాల్పడటానికి కారణం కనీస సదుపాయాల లేమి, నిరుద్యోగం, శోషణ, వివక్ష మొదలైనవి. సమాజం తమను నిర్లక్ష్యం చేస్తోందనే భావం కూడా వారిని ఇలాంటి కార్యకలాపాలకు ప్రేరేపిస్తుంది. కనుక ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం వారిలోని ఈ భావాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. అయితే ఇందులో సమాజానిదే ఎక్కువ బాధ్యత. అంతరాలను తొలగించి ప్రేమాభిమానాలను పంచగలగాలి. ఎవరికి వారు ఇందుకు ప్రయత్నించినప్పుడే అది సామాజిక స్థాయిలో కనిపిస్తుంది. సమాజంలోని అన్ని వర్గాల సాదకబాధకాల్లో పాలుపంచుకుంటూ వారితో సన్నిహిత సంబంధాలను కలిగిఉండాలి.
షెడ్యూల్ జాతులు, తెగలకు సంబంధించిన వివిధ ప్రణాళికల అమలులో మరింత పారదర్శకత, వేగాన్ని తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. అంతర్గత భద్రతను కాపాడటంలో పోలీసు దళాల పాత్ర చాలా ముఖ్యం. పోలీసు వ్యవస్థలో తీసుకురావలసిన సంస్కరణ గురించి జాతీయ పోలీస్ కమిషన్ కొన్ని సిఫార్సులు చేసింది కూడా. చాలా సంవత్సరాలుగా పట్టించుకొని ఈ సంస్కరణలను వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆందోళన కలిగించే ధోరణులు :
బలహీన వర్గాల ఉద్దరణకై సహానుభూతితో కూడిన స్పందన, పారదర్శకత, గౌరవం వంటివి చూపడంలో ప్రభుత్వాలు, మొత్తం సమాజం శ్రద్ద వహించాలి. ఇవి లేకపోతే అన్యాయానికి, నిర్లక్ష్యానికి గురైన ఈ వర్గాలలో సమాజం పట్ల తిరుగుబాటు ధోరణి, ద్వేషం, తాము సమాజంలో భాగం కాదనే భావం తలెత్తుతాయి. దీనిని ఆసరాగా చేసుకునే స్వార్ధ ప్రయోజనాలకోసం పనిచేసేవారు దేశ వ్యతిరేక, నేర కార్యకలాపాలకు వారిని వాడుకుంటారు. గత 4 ఏళ్లుగా వివిధ అంశాల పేరు చెప్పి సాగుతున్న ఆందోళనలు చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. ఈ ఆందోళన వెనుక స్వార్ధ అధికార రాజకీయాలు ఉన్నాయి. రాజ్యాంగం, సామాజిక సమరసత, చట్టం పట్ల ఏమాత్రం గౌరవం లేనివారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆడుతున్న రాజకీయాలు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి ఈ వేర్పాటువాదం, హింస, విద్వేషం ఎంతవరకు వెళ్ళాయంటే దేశ వ్యతిరేక భావాలను రెచ్చగొట్టి తమ పబ్బంగడుపుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. `భారత్ తేరే టూక్దే హోంగే’ అంటూ నినాదాలు చేసిన బృందంలోని వారే కొన్ని ప్రదేశాల్లో రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తూ ఆందోళనల్లో ముందున్నారు. అడవులు, మారుమూల ప్రాంతాల్లో హింసాత్మక కార్యకలాపాలను ప్రభుత్వం కఠినంగా అణచి వేయడంతో వాటికి పాల్పడినవారే నగర నక్సల్స్ అవతారమెత్తారు. విద్యార్ధి హాస్టళ్లను ఆధారం చేసుకునే సైద్ధాంతిక సమూహాలను తయారుచేస్తున్నారు. వారి ద్వారా చిన్న, పెద్ద హింసాత్మక ఆందోళనలు చేయించి ప్రభుత్వం, చట్టం పట్ల గౌరవం లేని అరాచక ధోరణిని వ్యాప్తిచేస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం, నాయకత్వం పట్ల సమాజంలో కూడా ద్వేషం, కోపాన్ని నింపుతున్నారు. హింసాత్మక ఆందోళనల ద్వారా సమాజంలో ఉన్న పౌర కట్టుబాటు, క్రమశిక్షణను నాశనం చేస్తున్నారు. అలాగే సమాజంలోని వివిధ స్థాయిల్లో ఉన్న నాయకత్వాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్థానంలో నూతన వామపక్ష వాదాన్ని గుడ్డిగా అనుసరించే అనుచరగణాన్ని, ఎలాంటి కట్టుబాటు లేని నక్సల్ నాయకత్వాన్ని ఏర్పాటు చేయడమే ఈ నగర నక్సల్స్ లక్ష్యంగా కనిపిస్తోంది. వీరి ప్రతినిధులు ఇప్పటికే సామాజిక, ఇతర మాధ్యమాల్లో, మేధో బృందాల్లో, ఇతర సంస్థల్లో తిష్ట వేసుకున్నారు. వీరంతా తమతమ పదవులు, పీఠాలను కాపాడుకుంటూనే వివిధ ప్రజా ఉద్యమాలు, ఆందోళనల ద్వారా సైద్ధాంతిక మద్దతునిస్తుంటారు. వీళ్ళకి మోసకారి పద్దుతులన్నీ తెలుస్తాయి. రెచ్చగొట్టే భాషను ఉపయోగించి జనం మనస్సులను ఎలా కలుషితం చేయాలో, విషపూరిత ప్రచారాన్ని ఎలా వ్యాప్తి చేయాలో బాగా తెలుసు. ఈ దేశానికి శత్రువులైన విదేశీ శక్తుల సహాయాన్ని పొందడం వీరి అదనపు నైపుణ్యం. వారి సామాజిక మాధ్యమ ఉద్యమాలలో కనిపించే విషయాలు, వాదనల మూలాన్ని పరిశీలిస్తే ఈ విదేశీ సంబంధం స్పష్టమవుతుంది. హింసాత్మక సంఘటనలు, ఆందోళనల్లో జిహాది, తీవ్రవాద శక్తుల పాత్ర తప్పకుండా కనిపిస్తుంది. దీనినిబట్టి ఈ బృహత్ కుట్ర వెనుక దేశంలోపల, బయటి శక్తులు ఉన్నాయని తేలుతుంది. ఇది కేవలం విపక్షాల అధికార రాజకీయాలకే పరిమితం కాలేదు. ఇందులో రాజకీయ ప్రాబల్యం పెంచుకోవాలనుకున్న సమూహాలు, తెలిసో, తెలియకో బలహీన వర్గాలు పావులుగా మారుతున్నారు. విద్వేషపూరిత, అరాచక పరిస్థితుల వల్ల అంతర్గత భద్రతకు మూలమైన సామాజిక ఐక్యత దెబ్బతింటుంది. అంతేకాదు మేధోపరమైన ఘర్షణకు దారితీస్తుంది. దీనినే ప్రాచీన రాజనీతి శాస్త్రాల్లో `మంత్రయుద్ధం’ అన్నారు.
ఇలాంటి ధోరణులను తొలగించేందుకు ప్రభుత్వం, పాలనాయంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఇలాంటి సంఘటన ద్వారా ప్రయోజనం పొందాలనుకునేవారి ఉద్దేశ్యం నెరవేరదు. అలాగే ఇలాంటి వేర్పాటువాద, విఘటన శక్తులపై నిరంతర నిఘా ఉంచాలి. సమాజం నుంచి ఎలాంటి మద్దతు లభించకపోతే ఈ శక్తులు క్రమంగా కనుమరుగవుతాయి. పాలనాయంత్రాంగం సమాచార సేకరణ వ్యవస్థను, గూఢచారి వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసుకోవాలి. ప్రజల కోసం ప్రవేశపెట్టిన పధకాలు అన్నీ చిట్టచివరి వ్యక్తికి కూడా అందే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. శాంతిభద్రతలను కాపాడటంలో నైపుణ్యాన్ని, నిష్టను చూపాలి.
అయితే ఇలాంటి వేర్పాటువాద ధోరణులను పూర్తిగా నియంత్రించాలంటే సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన వారు ఒకే మనస్సుతో, ఆలోచనతో వ్యవహరించగలగాలి. మతం, కులం, ఉపకులం, భాష, ప్రాంతాలు మొదలైన వాటిలో కనిపించే భిన్నత్వం నిజానికి ఏకత్వానికి ప్రకటీకరణ అని గ్రహించాలి. ఏ వర్గానికి చెందిన సమస్యనైనా తనదిగా పరిగణించి మొత్తం సమాజం సంయమనపూర్వక మార్గంలో దానికి తగిన పరిష్కారం అన్వేషించాలి. నిరంతర, స్నేహపూర్వక సంవాదం కొనసాగుతూ ఉండాలి. ఈ సందర్భంలో 25 నవంబర్, 1949 నాటి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉపన్యాసాన్ని గుర్తుచేసుకోవాలి. సమాజంలో సౌభ్రాతృత్వ భావన లేకపోతే దేశం న్యాయం, స్వేచ్చా, సమానాత్వాలతోపాటు సామాజిక, రాజకీయ, ఆర్ధిక ప్రజస్వామ్యం సాధించడం సాధ్యంకాదని ఆయన తన ఉపన్యాసంలో అన్నారు. ఈ ప్రజాస్వామ్య విలువలు లేకపోతే మన స్వాతంత్ర్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. కనుక రాజ్యాంగ పద్దతులను మాత్రమే అనుసరించాలి. దైనందిన జీవనంలో పౌర స్పృహని కలిగిఉండడమే దేశభక్తి అని సోదరి నివేదిత బోధించేవారు.
కుటుంబంలో సంస్కారాల అవసరం:
న్యాయవ్యవస్థ, పాలనా యంత్రాంగం, సంస్థలు మొదలైనవాటి గురించి ఏకాభిప్రాయం, సమాజంలో ఏకత్వభావం ఉన్నప్పుడే స్థిరత్వం, అభివృద్ధి, భద్రత సాధ్యపడతాయి. ఈ గుణాలను చిన్నప్పటి నుంచి ఇంట్లో, పాఠశాలలో, వివిధ సామాజిక కార్యక్రమాల ద్వారా కలిగించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఇలాంటి ప్రయత్నం చాలా అవసరం. ఎందుకంటే మన విద్యా ప్రణాళికలో, చుట్టూ ఉన్న వాతావరణంలో ఇలాంటి విలువలు కనిపించడం లేదు. నూతన విద్యా విధానాన్ని సాధ్యమైనంత త్వరగా అమలుచేసుకోవాలి. వివిధ సంస్థలు, ప్రభుత్వాలు ఈ పని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మన ఇళ్ళల్లో ఈ ప్రయత్నం జరగడం ముఖ్యం. స్వీయ నియంత్రణ, సానుభూతి, అభిమానం, కుటుంబ, సామాజిక బాధ్యత మొదలైన గుణాలను నవతరంలో కలిగించే ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నామన్నది చూసుకోవాలి. మారుతున్న కాలంలో మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచమంతటా భావిస్తున్నారు. మీడియా ప్రభావం రోజురోజుకీ పెరుగుతుండడం, అనేక కొత్త సాధనాలు అందుబాటులోకి రావడంవల్ల వ్యక్తులలో గిరిగీసుకుని తమ వరకు మాత్రమే పరిమితమయ్యే ధోరణి పెరిగింది. అన్నివైపుల నుంచి వచ్చిపడుతున్న విపరీతమైన సమాచారం వారిలో విచక్షణా శక్తిని మొద్దుబారుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో కుటుంబ విలువలు, సంప్రదాయాలు చాలా అవసరం.
కుటుంబాలు విడిపోవడం, అనైతిక వ్యవహారశైలి, అత్యాచారాలు, ఆత్మహత్యలు, కుల ఘర్షణలు, వివక్ష మొదలైన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఈ సమస్యలన్నిటికి పరిష్కారం ప్రేమ, అభిమానం నిండిన కుటుంబ వాతావరణం, సామాజిక సమరసతలోనే ఉంది. కాబట్టి సమాజం మొత్తం ఈ విలువలను పెంపొందించే దిశగా కృషి చేయాలి.
సమీకృత ఆలోచనాధోరణి:
సమాజంలోని వివిధ రంగాల్లో పనిచేసేవారంతా తమ కార్యకలాపాలు, వ్యవహారశైలి వ్యక్తి, కుటుంబం, సమాజం, మానవాళి, పర్యావరణం మొదలైనవాటిని పరిపుష్టం చేసేవిధంగా ఉండాలని గుర్తించాలి. ఏ సమాజంలోను కేవలం చట్టాలు, శిక్షల భయం వల్ల శాంతియుతమైన, సుఖవంతమైన జీవన పరిస్థితులు ఏర్పడలేదు, ఏర్పడవు. సమాజంలో కట్టుబాటు ఉన్నదంటే అది కేవలం చట్టాల వల్ల రాదు. తరతరాలుగా వచ్చే సంప్రదాయ సామాజిక విలువలు, నైతిక ప్రమాణాల వల్ల సాధ్యపడుతుంది. మారుతున్న కాలానికి తగినట్లుగా ఆచారాలు, పద్దతులు మార్చుకోవచ్చును కానీ విలువలను మరచిపోకూడదు. సమాజంలో నిజమైన, సరైన న్యాయం చేకూరాలంటే నాలుగు అంశాలు ఉండాలి. అవి – సమాజంలో కార్యకలాపాలకు మూలమైన సహజమైన కోరికలు, సంపద; ఆ సహజమైన కోరికలను నియంత్రించే నైతిక విలువలు; ఈ నైతిక విలువలను కుటుంబాలలో, సమాజంలో ఆచరించేవిధంగా చూసే న్యాయవ్యవస్థ; ఈ విలువల వెనుక ఉన్న ధార్మిక అంశం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా చేపట్టే ఏ కార్యకలాపమైనా మారుతున్న కాలానికి, పరిస్థితులకు తగిన నూతన సామాజిక వ్యవస్థను సృష్టించలేదు. ఇటీవల శబరిమల దేవాలయం విషయంలో వచ్చిన తీర్పు ఇలాంటి సందిగ్ధాన్నే కలిగించింది. చాలా ఏళ్లుగా అక్కడ అనుసరిస్తున్న సంప్రదాయాన్ని, సమాజం ఆమోదించిన పద్దతిని పరిగణలోకి తీసుకోలేదు. అలాగే మత పెద్దల అభిప్రాయాన్ని, కోట్లాదిమంది భక్తుల మనోభావాలను పట్టించుకోలేదు. ఈ సంప్రదాయాన్ని నిష్టగా అనుసరిస్తున్న మహిళా వర్గపు వాదనను వినిపించుకోలేదు. దీనితో శాంతి, స్థిరత్వం, సమానత్వాన్ని సాధించాల్సిన కోర్ట్ తీర్పు అసహనానికి, ఆందోళనకు, చీలికలకు దారితీసింది. తమ విశ్వాసాలపైనే పదేపదే ఇలాంటి దాడులు ఎందుకుజరుగుతున్నాయనే సందేహాలు హిందువులలో అసహనానికి కారణమవుతున్నాయి. ఇలాంటి ఆందోళన, అసహనం సమాజపు శాంతికి, స్థిరత్వానికి దోహాదం చేయవు.
స్వతంత్ర జాతికి `స్వ’ఆధారిత వ్యవస్థలు :
శాశ్వత భారతీయ విలువలపై ఆధారపడిన జాతీయ జీవన రంగాలన్నింటిని పునరుజ్జీవితం చేసినప్పుడే అసలైన అభివృద్ది సాధ్యపడుతుంది. దేశంలో అప్పటికి ఉన్న వ్యవస్థలో కాలానుగుణంగా మార్పులు చేసుకోవాలి. కొన్నింటిని మార్చుకోవాలి, కొన్నిటిని తీసివేయాలి, చుట్టూ ప్రపంచంలో మనకు ఉపయోగపడే, సరిపోయే విషయాలను గ్రహించాలి. ఇలా ఏది తీసుకోవాలి, ఏది వదిలిపెట్టాలన్నది ఆ శాశ్వతమైన విలువల ఆధారంగానే నిర్ధారించుకోవాలి. ఆ విలువలే మన దేశపు ప్రత్యేకత. వాటినే మనం `హిందూత్వం’ అంటున్నాం. ఏ దేశమైన స్వీయ స్వభావానికి అనుగుణంగా వ్యవహరించినప్పుడే, దానికి కట్టుబడిఉన్నప్పుడే ప్రగతి సాదించగలుగుతుంది. అంతేకానీ అనుకరణ వల్ల కాదు.
ప్రభుత్వపు మంచి పధకాలను అమలుచేయడంలో పాలనాయంత్రాంగంలో కనిపించాల్సిన త్వరితంగా స్పందించే గుణం, పారదర్శకత, సహానుభూతి వంటివి ఇంకా ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. దీనివల్ల ఆ పధకాల వల్ల సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి ప్రయోజనం చేకూరడంలేదు. విదేశీ బ్రిటిష్ పాలకులు, పాలనయంత్రాంగం ఈ దేశాన్ని కేవలం తమ ఆధీనంలోని ఒక రాజ్యంగానే చూశారు. కానీ స్వతంత్ర భారతంలో పాలకులు అలా ఉండకూడదు. ప్రజా కేంద్రీత పాలన అందిస్తారని, అందించాలని ఆశిస్తారు.
రాజకీయ స్వాతంత్ర్యమే అన్నీకాదు. జాతీయ జీవనంలోని అన్ని పార్శ్వాల్లో `స్వ’, స్వాబిమాన భావన కనిపించాలి. ఆ `మేము, ఈ దేశ ప్రజానీకం’ అనే భావనే స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపింది. స్వంతంత్ర భారత ప్రజానీకపు ఆశలు, ఆకాంక్షలను రాజ్యాంగపు నాలుగు భాగాల్లో పేర్కొన్నారు. అవి ప్రవేశిక (ప్రియాంబుల్), ప్రాధమిక హక్కులు (ఫండమెంటల్ రైట్స్), ఆదేశిక సూత్రాలు (డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్), ప్రాధమిక బాధ్యతలు (ఫండమెంటల్ డ్యూటీస్). వీటిని బట్టి మనం మన అభివృద్ధి నమూనాను ఎంచుకోవాలి. వాటికి తగినట్లుగానే ఆర్ధిక కార్యకలాపాలతోపాటు జాతీయ జీవనానికి సంబంధించిన అన్ని లక్ష్యాలు నిర్ధారించుకోవాలి. అప్పుడే మన కృషి ఫలిస్తుంది. ఆశించిన ఫలితాలను అందిస్తుంది.
ప్రపంచంలో ఉన్న ఉన్నతమైన భావాలు, ఆలోచనలను స్వీకరించినా, వాటిని మనకు అనుగుణమైన రీతిలో మలచుకోవడం, అందుకు తగిన అభివృద్ధి నమూనాను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఆ నమూనాను మన తాత్విక భూమిక ఆధారంగానే ఏర్పరచుకోవాలి.
శ్రీ రామజన్మభూమి:
ఈ జాతి `స్వ’త్వాన్ని గుర్తిస్తూ, కోట్లాది ప్రజానీకాపు మనోభావాలను గౌరవిస్తూ సంఘం శ్రీ రాముని జన్మస్థలంలో భవ్యమైన రామమందిర నిర్మాణానికి మద్దతు తెలిపింది. శ్రీ రాముడు ఈ జాతికి జీవశక్తి. ధర్మానికి ప్రతీక. ఒకప్పుడు అక్కడ దేవాలయం ఉందని చెప్పడానికి అన్ని రకాల సాక్ష్యాధారాలు ఉన్నప్పటికి ఆ భూమిని మందిర నిర్మాణానికై అప్పగించలేదు. న్యాయప్రక్రియలో వివిధ రకాలైన అడ్డంకులను సృష్టించడం ద్వారా ఈ అప్పగింత ప్రక్రియను ఆలస్యం చేయాలన్నది కొన్ని శక్తుల ప్రణాళిక. ఎలాంటి అవసరం, కారణం లేకుండా ఇలా సమాజపు సహనాన్ని పరీక్షించడం మంచిది కాదు. రామమందిర నిర్మాణం స్వాభిమానానికి సంబంధించిన విషయమేకాక, దీనివల్ల దేశంలో సద్భావన, ఐకమత్య భావన ఏర్పడతాయి. స్వార్ధ ప్రయోజనాలు ఆశించి మతరాజకీయాలకు పాల్పడే కొందరు పిడివాదులు జాతీయ ప్రాధాన్యత కలిగిన ఈ విషయం కొలిక్కి రాకుండా అడ్డుపడుతున్నారు. ఇలాంటి అవరోధాలు ఎన్ని ఎదురైనా భూమిపై యాజమాన్య హక్కులను త్వరితంగా నిర్ణయించడానికి, భవ్యమైన మందిర నిర్మాణానికై మార్గాన్ని సుగమం చేయడానికి ప్రభుత్వం అవసరమైన చట్టం చేయాలి.
ఎన్నికలు:
ఈ దేశాన్ని ఎవరు నడిపిస్తారు? ప్రస్తుతపు విధానాలు సరిగా ఉన్నాయా? లేదా? మొదలైన విషయాలు అయిదేళ్ళకి ఒకసారి వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వేయడం ప్రజల పవిత్రమైన బాధ్యత. ఏలాంటి ఎన్నికలు రాబోతున్నాయి. ఓటు హక్కు ద్వారా, భారత ప్రజానీకం జాతీయ స్థితిగతులు ఎలా ఉండాలో నిర్ణయిస్తారు. అయితే ఓటింగ్ రోజున మనం తీసుకునే నిర్ణయపు ప్రభావం, ఫలితం, అది మంచైనా, చెడైనా, చాలా సంవత్సరాలు, కొన్నిసార్లు జీవితాంతం అనుభవించాల్సివస్తుంది. ఆ రోజున తప్పితే మరెప్పుడు మనం దేశం గురించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. తీసుకున్న నిర్ణయం వల్ల విచారించవలసిన పరిస్థితి రాకూడదంటే వోటర్లు సంకుచితమైన కుల, భాషా, ప్రాంత భావాలకు అతీతంగా దేశ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని వోటు వేయాలి. అభ్యర్ధులు, పార్టీల విధానాలు, దేశ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి, దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడటంలో సామర్ధ్యం, గత చరిత్ర మొదలైనవి దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి.
ప్రజాస్వామ్య రాజకీయాల ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఎవరూ పూర్తిగా సరైనవారు, పూర్తిగా అయోగ్యులని తేల్చి చెప్పలేము. అలాంటి పరిస్థితిలో అసలు ఓటు వేయకపోవడం లేదా ఎవరూ నచ్చలేదని చెప్పడం (NOTA) వల్ల లాభం అయోగ్యుడికే కలుగుతుంది. కనుక ప్రచార హోరులో కొట్టుకుపోకుండా తప్పనిసరిగా ఓటు వేయడం దేశ ప్రయోజనాల దృష్ట్యా అత్యవసరం. 100 శాతం ఓటింగ్ జరగాలి. భారత ఎన్నికల సంఘం కూడా ఇదే అభ్యర్ధన చేస్తోంది. 100 శాతం ఓటింగ్ సాదించే దిశగా ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవకులు పౌరులుగా తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి కూడా చేస్తారు.
ప్రారంభం నుండి ఆర్ ఎస్ ఎస్ పార్టీ రాజకీయాలకు, కుల రాజకీయాలకు దూరంగానే ఉంది. ఇకముందు కూడా అలాగే ఉంటుంది. అయితే దేశ పౌరులుగా స్వయంసేవకులు తమ బాధ్యతను నిర్వర్తిస్తూ దేశ హితానికై తమ శక్తియుక్తులను వెచ్చించాలి. ఇది జాతి ప్రయోజనాల దృష్ట్యా చాలా అత్యవసరం.
విజ్ఞప్తి :
ఒక దేశం బాగుండాలంటే శక్తివంతమైన, వ్య్వస్థీకృతమైన, `స్వ’త్వాన్ని కలిగిన సమాజం ఉండాలి. ఆ స్వత్వమే హిందూత్వం. హిందూత్వం అంటే ఆందరిని గౌరవించి, అంగీకరించి, ఆదరించేది. అందుకనే శక్తిశాలి, అజేయ, సంఘటిత హిందూ సమాజాన్ని ఏర్పరచడానికే సంఘం పనిచేస్తోంది. ఆ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటుంది. మతం, సంప్రదాయం, జీవన విధానం ఆధారంగానో, `హిందూ’అనే పదం పట్ల సందేహాలు ఉండడం వల్లనో తాము ఈ సమాజంలో భాగం కాదని, తాము ప్రత్యేకమని అనుకునే కొన్ని వర్గాల వారు హిందూత్వం ఈ దేశపు చిరంతన, శాశ్వత గుర్తింపు అని గుర్తుపెట్టుకోవాలి. మూల, శాశ్వత విలువలను మార్చుకోకుండా కాలానుగుణంగా అవసరాలను బట్టి వ్యవహారంలో అనేక మార్పులు చేసుకుంటుంది ఈ సమాజం. హిమాలయాల నుండి సముద్రాల వరకు ఉన్న ఈ భారత భూభాగానికి, హిందూత్వానికి విడదీయలేని సంబంధం, గుర్తింపు ఉన్నాయి. భారతీయులంతా ఈ సాంస్కృతిక జీవన స్రవంతిలో భాగం కావాలని సంఘ్ కోరుకుంటోంది. వివిధ పంథాలు, సంప్రదాయాలు ఆ సాంస్కృతిక ధార నుండే పుట్టాయి. ఈ సమాజాన్ని రక్షించడానికి అపూర్వమైన త్యాగాలు చేసిన ఎందరో మహానుభావులు, మహాపురుషులు మన పూర్వజులు. వారి వారసులం కావడం మనకు గర్వకారణం. అనేక ప్రత్యేకతలు, భిన్నత్వం ఉన్న ప్రపంచాన్ని భారతదేశం కుటుంబంగా అంగీకరించడానికి, ఆ భిన్నత్వాన్ని ఆమోదించడానికి కారణం ఈ హిందుత్వమే. అందుకనే భారత్ హిందూ దేశం. దేశ సమైక్యత, సమగ్రత, అభివృద్ధికి సుసంఘటిత హిందూ సమాజమే పునాది. పిడివాదం, స్వార్ధం, మితిమీరిన భౌతికవాదం నుండి పుట్టుకువచ్చిన వినియోగవాదం మొదలైన అవలక్షణాలకు శాశ్వత హిందూ విలువలే ఔషధం. కనుక హిందువులను సంఘటితం చేయడమంటే ప్రపంచానికి మేలు చేయడమే. అందులోనే భారత సంక్షేమం, మానవాళి కళ్యాణం ఇమిడి ఉన్నాయి.
భారతమాతను విశ్వగురు పీఠంపై ప్రతిష్టించేందుకు, భారత ప్రగతి రధాన్ని ముందుకు తీసుకుపోయెందుకు సంఘ స్వయంసేవకులకు సహాయసహకారాలు అందించి, ఈ పవిత్ర కార్యంలో భాగస్వాములు కావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
నహీహై అబ్ సమయ్ కోయీ, గహన్ నిద్రా మే సోనేకా ,
సమయ్ హై ఏక్ హోనేకా, న మత్ భేదొంమే ఖోనే కా
బఢే బల్ రాష్ట్ర కా జిస్ సే , వో కర్ నా మేల్ హై అప్ నా
స్వయం అబ్ జాగ్ కర్ హమ్ కో, జగానా దేశ్ హై అప్ నా
భారత్ మాతాకీ జయ్
(ఆర్ఎస్ఎస్ సౌజన్యం తో )