బాలగంగాధర్ తిలక్
తిలకు ఘనమగు తన కలను జనులలోన
రగుల గొల్పి తాను రణము సల్పి
జైలు గోడలందు జయగీతి లిఖించె
వినుర భారతీయ వీర చరిత
ఉత్సవములు జరుపుచుత్తేజపరచుచు
జనుల సేకరణను జరిపి తాను
సమరమెంతొ తిలకు సలిపె తీవ్రముగను
వినుర భారతీయ వీర చరిత
భావము
భారతదేశం త్వరలో స్వతంత్ర సాధించి తీరుతుందని లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కలగన్నారు. తాను కన్న కలను నిజం చేసుకోవడానికి ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించారు. సామూహిక ఉత్సవాల నిర్వహణతో వారిలో ఉత్తేజాన్ని కలిగించారు. స్వాతంత్ర ఉద్యమాన్ని కొనసాగించారు. ఆంగ్లేయులు మండలే జైలులో నిర్బంధించినప్పుడు జైలు గోడల మీద గీతా రహస్యాన్ని బాలగంగాధర్ తిలక్ లిఖించారు. ఎందరెందరో విప్లవ వీరులకు మార్గదర్శిగా నిలిచిన బాలగంగాధర్ తిలక్ వీర చరిత్రను వినుము ఓ భారతీయుడా!
-రాంనరేష్