- ఇంటికి నిప్పు దంపతుల మృతి..
- పోలింగ్ బూత్‌ల వద్ద పేలుళ్లు
నేడు పశ్చిమ్‌బంగలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే నాలుగు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ పోలీసులను ఆదేశించింది.
నార్త్ 24 పరగణాస్, బుర్ద్వాన్, కూచ్‌బెహర్, సౌత్ 24 పరగణాస్ జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నార్త్ 24 పరగణాస్ జిల్లాలో భాజపా, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. బాగ్డాలోని ఓ పోలింగ్ కేంద్రంలోకి కొంతమంది వ్యక్తులు బలవంతంగా ప్రవేశించి బాలెట్ పత్రాలపై స్టాంపులు వేయడానికి ప్రయత్నించారు. అక్కడ జరిగిన దాడిలో పులువురు గాయపడ్డారు. జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బాంబు పేలడంతో 20 మంది గాయపడ్డారు.
సౌత్ 24 పరగణాస్ జిల్లాలో.. సీపీఎం మద్దతుదారుల ఇల్లు గత రాత్రి తగలబెట్టారని, ఆ ఇంట్లోని భార్య, భర్త చనిపోయారని సీపీఎం పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. జిల్లాలోని భాన్‌గర్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు మీడియా వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశారు. పోలెర్‌హట్ ప్రాంతంలో కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
కూచ్ బెహర్ జిల్లాలోని శుట్కబరి ప్రాంతంలో తక్కువ తీవ్రత గల బాంబు పేలింది. ఈ ఘటనలో ఓ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త సహా 20 మంది గాయపడ్డారు. తృణమూల్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి మధ్య ఘర్షణ కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ పేలుడులో ఓ మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దిన్‌హటా అనే ప్రాంతంలో ఓ పోలింగ్ బూత్ వద్ద రెండు వర్గాలకు చెందిన వారు తీవ్రంగా ఘర్షణ పడ్డారు.
బుర్ద్వాన్ జిల్లాలోనూ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లను భయపెడుతున్నారని, పలు చోట్ల పోలింగ్ బూత్‌లపైకి బాంబులు విసురుతున్నారని సీపీఎం, భాజపా ఫిర్యాదు చేశాయి. తృణమూల్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
(ఈనాడు సౌజన్యం తో)