Home News హిందూ ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం ఎందుకు ?

హిందూ ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం ఎందుకు ?

0
SHARE

హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉండే భారతదేశంలో హిందువులకు చెందిన దేవాలయాల నిర్వహణలో హిందువులకు ప్రాధాన్యం ఉండటం లేదు. వాటిపై ప్రభుత్వ పెత్తనం సాగుతోంది. కానీ మైనారిటీ మతసంస్థల ప్రార్థనా స్థలాల నిర్వహణలో మైనారిటీలకు పూర్తి అధికారాలున్నాయి. ప్రభుత్వం వేలు కూడా పెట్టలేదు. అత్యంత దయనీయమైన విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాల నుండి వచ్చిన ధనాన్ని ఇస్లామిక్‌ మదర్సాలకు, క్రైస్తవ చర్చిలకు, హజ్‌ యాత్రికుల ప్రయాణ ఖర్చులకు కేటాయిస్తున్న విషయమే బాధ కలిగిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తోన్న ఈ వివక్షకు అంతం లేదా?

ఏ దేశంలోనైనా అధిక సంఖ్యాకులుగా ఉన్న మతస్తులకు, వారి మత సంస్థలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. సహజంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రతి మతానికి, పురుషులు, స్త్రీలు, కులం, మతం అనే బేధం లేకుండా అందరికీ సమాన హక్కులుంటాయి. దురదృష్టవశాత్తు భారతదేశంలో హిందువులు అధిక సంఖ్యాకులైనా, ప్రభుత్వం దృష్టిలో వారు రెండవ తరగతి పౌరులుగానే జీవించాల్సి వస్తోంది.

మనదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలోని దేవాలయాలను తమ ఆధీనంలోకి తీసుకుని నిర్వహిస్తున్నాయి.

హిందూ దేవాలయాలకు వచ్చిన విరాళాలపై ప్రభుత్వానికి ఆదాయ పన్ను కట్టవలసి ఉంది. దేవాలయ ఆర్థిక వనరులపై ప్రభుత్వ పెత్తనం ఉంటుంది. కానీ మైనారిటీ మతసంస్థలు ఎలాంటి పన్నులు చెల్లించనవసరం లేదు. హిందూసంస్థలు నిర్వహిస్తున్న విద్యాసంస్థల పైన, ధనవనరుల పైన ప్రభుత్వానికి పెత్తనం ఉంటున్నది. మైనారిటీ సంస్థలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, ఇతర సంస్థలపైన ప్రభుత్వ పెత్తనం అత్యంత పరిమితంగా ఉంటున్నది. హిందూ దేవాలయాల నిర్వహణలో చట్ట ప్రకారం దేవాలయ నిర్వాహకులకు అధికారం ఉండదు. కానీ మైనారిటీ మతసంస్థల నిర్వహణలో ఆయా మత సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉంది.

అత్యంత దయనీయమైన విషయం ఏమిటంటే, హిందూ ఆలయాల నుంచి వచ్చిన నిధులను ఇతర మత సంస్థల నిర్వహణ కోసం ఖర్చుపెడుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని దేవాలయాల నుంచి వచ్చే నిధులను మహమ్మదీయ మదర్సాల నిర్వహణకు, క్రైస్తవ చర్చిల నిర్వహణకు, హజ్‌యాత్రికుల ప్రయాణ సబ్సిడీలకు ఖర్చుపెడ్తున్నారు. ఇదేగాక 1997లో కర్ణాటక ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం హిందూ దేవాలయ అధికారులు, అర్చకులు, దేవాలయంలో పనిచేసే చిరు ఉద్యోగులను ప్రభుత్వమే నియమిస్తుంది. వారికి ఇచ్చే జీతభత్యములను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ విధంగా కర్ణాటక ప్రాంతంలో 4,00,000 దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం చెలాయించగా, తెలుగు ప్రాంతంలో 2,50,000 దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం చేస్తున్నది.

మరోపక్క ప్రభుత్వ విధానాల వల్ల వేలకొలది దేవాలయాలు మూతపడే స్థాయికి చేరుకున్నాయి. బ్రిటీష్‌ కాలం నుండి తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ అధికార దుర్వినియోగం వల్ల అనేక దేవాలయాలు మూతపడ్డాయి. హిందూ సాంప్రదా యంలో నడుస్తున్న రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌ వంటి సంస్థలు మైనారిటీ సంస్థల నిర్వహణ కింద కొనసాగుతూ, ప్రభుత్వ జోక్యానికి దూరంగా ఉంటున్నాయి. ఇది కాస్త సంతోషకరం.

కేరళ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ 1980లో ఒక ప్రభుత్వ ఉత్తరువు జారీచేస్తూ కేరళ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నందున గురువాయూర్‌ దేవాలయానికి చెందిన పదికోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు తరలించమని ఆదేశించారు. ఈ ధనాన్ని తిరిగి గురువాయూరు దేవాలయానికి చెల్లించారనే దాఖలా ఎక్కడా కనబడలేదు. ఇదేగాక ఈ దేవాలయానికి 13 వేల ఎకరాల భూమి ఉండగా దీనిని ‘ల్యాండ్‌ రిఫార్మ్‌ యాక్ట్‌’ తో 230 ఎకరాలకు తగ్గించింది. హిందూయేతర సంస్థలకు ఈ చట్టాన్ని వర్తింపచేయలేదు. దీనినిబట్టి కేరళలో ‘భూ’ స్వాహాలు కమ్యూనిస్టుల ప్రభుత్వ కాలంలో బాగా జరిగాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.

బొంబాయిలో శ్రీ సిద్ధి వినాయక దేవాలయ అభివృద్ధికి 2004లో లక్షా తొంభై వేల అమెరికా డాలర్లు కానుకగా వచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయి హైకోర్టుకు వివరిస్తూ ఆ ధనాన్ని ఆనాటి వెల్‌ఫేర్‌, రీహ్యాబిలిటేషన్‌ టెక్స్‌టైల్‌ మంత్రి అయిన విలాసరావు పాటిల్‌ ఉండలేకర్‌కు చెందిన చారిటబుల్‌ ట్రస్ట్‌కు తరలించామని చెప్పింది. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం పూరీ జగన్నాథ స్వామి దేవాలయానికి చెందిన 500 ఎకరాల భూమిని 2010లో ‘వేదాంత రిసోర్స్‌ మైనింగ్‌ కంగ్లామరెట్‌’ సంస్థకు ఎకరాభూమిని ఒక లక్ష రూపాయల చొప్పున అమ్మేసింది. దీనిని ఆనాడు సుప్రీంకోర్టు తన తీర్పుతో నిలిపివేసింది.

ఇది ఇలా ఉండగా, కర్ణాటకలోని కాంగ్రెసు ప్రభుత్వం మైనారిటీల మెప్పు పొందడానికి మరో ఘనకార్యం చేసింది. అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టి- కర్నాటక రాష్ట్రంలోని దేవాలయాలు, దేవాలయ ట్రస్టీలు ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం కొంత పన్ను చెల్లించాలని, ఆ విధంగా పన్నులు చెల్లించకపోతే ఆ ట్రస్టీలను కఠినంగా శిక్షిస్తామని తెలియచేసింది. ఈ విధంగా వచ్చిన ధనాన్ని, ఇతర మతాల అభివృద్ధికి వినియోగిస్తోంది.

హిందూ ధర్మం – సాంప్రదాయం

కర్ణాటక ప్రభుత్వం ఆనాడు మదర్సాల అభివృద్ధికి హజ్‌ యాత్రికులకు ప్రాధాన్యమిచ్చింది. కానీ కర్ణాటకలోని తమ అధీనంలో ఉన్న రెండున్నర లక్షల హిందూ దేవాలయాల భవితవ్యం గురించి ఆలోచించలేదు. ఇదేవిధంగా కొన్ని సంవత్సరాల పాటు హిందూ దేవాలయాల నిర్వాహణను గురించి పట్టించుకోకపోవటం వలన ఇక్కడ ఉన్న యాభై వేల హిందూ దేవాలయాలు వచ్చే ఐదు సంవత్సరాలలోనే మూతపడటానికి సిద్ధంగా ఉన్నాయి. దేవాలయాలు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రం కర్ణాటక. (దేశంలోనే ఎక్కువ దేవాలయాలు గల 4వ రాష్ట్రము). అందువల్ల ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొనవలసి ఉంది.

తమిళనాడు రాష్ట్రం విషయానికి వస్తే సుప్రీంకోర్టు 2013 సంవత్సరం జనవరి 6వ తేదీ చిరస్థాయిగా నిలిచిపోయే ఒక తీర్పును ఇచ్చింది. దీని ప్రకారం తమిళనాడు ప్రభుత్వం తెచ్చిన 2006 జి.ఓ. ప్రకారం శ్రీ సాభానాయగర్‌ దేవాలయాన్ని (ప్రస్తుతం ఉన్న నటరాజ దేవాలయం) తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసికొనకూడదని స్పష్టంగా చెప్పింది. దేవాలయ నిర్వాహణలో ప్రభుత్వ జోక్యం ఉండ కూడదనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. తమిళనాడు దేవాలయాల నిర్వహణలో తమిళనాడు అధికారులు, ఎం.ఎల్‌.ఎ.లు, మంత్రులు దేవాలయ ధనాన్ని, భూములను దుర్వినియోగం చేస్తున్నారని, భక్తులు సమర్పించగా దేవాలయానికి వచ్చిన నిధులను ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఈ తీర్పు నిజంగా చారిత్రాత్మక మైనది. దేవాలయాల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం కూడదని స్పష్టంగా తెలియజేసిన తీర్పు ఇది.

మరో విషయం ఏమిటంటే – తమిళనాడులో హిందూ రిలేజియన్‌ అండ్‌ ఛారిటబుల్‌ ఎండోమెంట్‌ శాఖ అధీనంలో 407 లక్షల వ్యవసాయ భూమి, 2.6 కోట్ల చదరపు అడుగుల భవన సముదాయం, 2.9 కోట్ల చదరపు అడుగుల అర్బన్‌ ఖాళీస్థలాలు, దేవాలయాలు ఉన్నాయి. వీటివల్ల వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది. కానీ ప్రభుత్వం 36 కోట్ల ధనాన్ని మాత్రం ఇస్తున్నది. నిజంగా దేవాలయాలకు రావలసిన ఆదాయం 304 కోట్ల రూపాయలు. అంటే రావలసిన ధనంలో దేవాలయా లకు 12 శాతం మాత్రమే వస్తున్నది. అంటే దేవాలయ నిధులకు ప్రభుత్వం గండి కొడుతోంది.

తమిళనాడులోని శ్రీరంగనాథ దేవాలయం ప్రభుత్వానికి సంవత్సరానికి (2010-11) 18.56 కోట్ల రూపాయలను దేవాలయ నిర్వాహణ, కార్యాలయ సిబ్బంది జీతాల కోసం చెల్లిస్తోంది. ఇక మతపరమైన సేవలను అందించేవారికి అనగా వేదపారాయణం చేసేవారికి, దేవుని ఉత్సవాల సమయంలో పాలు పంచుకునేవారికి ఎటువంటి జీతభత్యాలు ఉండవు. శ్రీరంగం దేవాలయంలో ఇలాంటి పూజారులు 36 మంది ఉన్నారు. వీరు నిత్య పూజలలో పాల్గొంటున్నారు. వీరికి నెలజీతాలు ఉండవు. వీరికి భక్తులు సమర్పించిన కానుకలు, అర్చన టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయాలలో భాగం మాత్రం ఇస్తారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం నియమించిన ఉద్యోగులకు నెలకు ఎనిమిది వేల నుంచి 20,000 రూపాయలు నెల జీతంగా చెల్లిస్తారు. అంటే దేవాలయ కాపలాదారు, కారుడ్రైవర్‌, ఇతర ఉద్యోగు లకు ప్రభుత్వమే జీతాలను చెల్లిస్తున్నది.

తిరునల్వేలిలో ఉన్న నెల్లియప్ప దేవాలయం విషయానికి వస్తే శ్రీరంగ దేవాలయం కంటే ఉద్యోగుల స్థితి మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ఈ దేవాలయంలో అర్చకులకు నెలకు 55 రూపాయల నుంచి 72 రూపాయలు జీతం మాత్రమే ఇస్తున్నారు (2010-11). ఇప్పటి కాలంలో పూట భోజనం ఐదు రూపాయలకు వస్తుందా? ఆలోచించండి.

దేవాలయ నిర్వహణ అధికారులు విలాస వంతమైన టయోటా కారులు, ఇన్నోవా బండ్లు వాడుతున్నారు. దేవాలయ కమీషనర్‌, అసిస్టెంట్‌ కమీషనర్‌ కూడా విలాసవంతమైన కారులు ఉపయోగిస్తున్నారు. దేవాలయ నిర్వహణ కోసం 89 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. వారి జీతభత్యాలకు 49 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. దైవపూజలకు ఇంత ధనాన్ని ఖర్చుపెట్టడం సబబేనా? దేవాలయానికి వచ్చే భక్తులు ఈ విషయాలను గమనిస్తున్నారు. దేవుళ్ళు, దేవతలు కూడా ఈ అపర భక్తిని చూస్తున్నారు.

భారతదేశంలోని దేవాలయాలు బాగుపడాలంటే వాటిని మతసంస్థలకు, సాంస్కృతిక సంస్థలకు అప్పగించవలసి ఉంది. దేవాలయాల ప్రతిష్టను, ముఖ్యంగా దేవాలయాల ఆస్తులను కాపాడటానికి భక్తులు ముందుకు రావాలి. అందుకు హిందువు లంతా ఏకం కావాలి. హిందూ ఆలయాలను, హిందూ ధర్మాన్ని కాపాడాలి. భక్తి భావాలను పెంపొందించాలి. దేవాలయాలకు పూర్వవైభవాన్ని తీసుకురావాలి.

– డా|| జి.వెంకటేశ్వరరావు చరిత్ర పరిశోధకులు, ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ వ్యవస్థాపక సభ్యులు

(జాగృతి సౌజన్యం తో)