‘That these Bactrian kings we Hindus, is now universally admitted. Thus according to Dabistan, India enjoyed splendid civilisation 6000 BC (i.e) mearly 8000 years before the victorian age. భాక్ట్రియాను పరిపాలించిన రాజులు హిందువులన్న విషయం అందరికీ తెలిసిందే. దబిస్తాన్ పట్టికను చూస్తే భారతదేశం 6000 బి.సి నాటికే గొప్ప సంస్కృతిని కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. అంటే విక్టోరియా పాలనకు పూర్వం 8000 సం.ల నాడు అన్నమాట!’ అంటూ భారతదేశంలో హిందువుల ప్రాచీన వైభవ స్థితిని గురించి ‘హరవిలాసశారద’ అనే చరిత్రకారుడు”The Hindu Superiority” అన్న గ్రంథంలో చెప్పుకొన్న ఆణిముత్యాలు ఇవి. కానీ ఆ వైభవం క్రీ.శ 712లో మహమ్మద్ బిన్ కాశిం సింధు రాజ్యాన్ని కబళించడంతో మంటగలవడం మొదలైంది. విగ్రహారాధకులను విధ్వంసం చేయాలన్న ఘోరీ, గజనీ, బాబర్ నుండి రజాకార్ కాశిం రజ్వీ వరకు ఈ దండయాత్ర అలాగే సాగింది. ఇక కర్జన్‌వైలీ నుండి లార్డ్ మౌంట్‌బాటన్ వరకు ఇక్కడి మెజారిటీ ప్రజలపై యుద్ధం బాగానే చేసారు. లక్షలాదిమంది అమరులై ఈ దేశానికి స్వాతంత్య్రం సాధించుకొన్నాం. ఖాయిది ఆజం మహ్మదాలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతంతో ఈ దేశం రెండు ముక్కలైంది. ఇక్కడి హిందువులను బలిపీఠం ఎక్కించి పాకిస్తాన్‌ను ఏర్పాటు చేసినా అదొక రాచపుండులా వేధిస్తూనే వుంది. పోనీ స్వాతంత్య్రం వచ్చాక హిందూ సమాజం తమ చరిత్రను, సంస్కృతిని అధికారాన్ని ఎంతమాత్రం కాపాడుకొన్నది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న?
సర్ జాన్ వుడ్రాఫ్ ఇండియా నాగరిక దేశమా? (Is India Civilized?) అనే పుస్తకంలో మన దేశానికి ఆంగ్లేయులు స్వార్ధంతో ఉద్దేశపూర్వకంగా ద్రోహం చేస్తున్నారని, ఇది అన్యాయం, పాపం అని నెత్తీనోరు మొత్తుకున్నాడు. కానీ స్వాతంత్య్రం వచ్చాక మన బానిసత్వానికి కారణమైన అనేక విషయాలను చర్చించి పకడ్బందీగా వ్యవస్థ నిర్మించాల్సిందిపోయి అనేక లోపాలను కొత్తగా కొనితెచ్చుకొన్నాం.
197 దేశాలున్న భూఖండంపై హిందువు హిందువుగా జీవించాలంటే ఒక్క భరత ఖండంపైనే అవకాశం వుంది. నిన్నమొన్నటి వరకు హిందూ దేశంగా వున్న నేపాల్, చైనా కమ్యూనిస్టుల కారణంగా విధ్వంసంవైపు పయనిస్తోంది. ఇవాళ సౌదీ అరేబియాలో రాముని చిత్రాన్ని జేబులో పెట్టుకోవడం కూడా సాధ్యం కాదు. సత్యనారాయణ వ్రతం నిర్వహించుకోవడం అక్కడ సాధ్యం కాదు. మరి రేపు భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తే హిందువులకు దిక్కెవరు?
జమ్మూకశ్మీర్‌లో లక్షలాదిమంది హిందూ పండిట్లు నిరాశ్రయులయ్యారు. వారు ఈ రోజుకూ తమ స్వస్థలాలకు వెళ్లే పరిస్థితి లేదు. వారి గురించి మాట్లాడిన నాధుడు లేడు. ఉన్న ఊరిని విడిచి, కన్నవాళ్లను వెంటబెట్టుకుని ఉత్తర భారతం మొత్తం వారు ప్రవాస జీవితం ఎందుకు గడుపుతున్నారు? ప్రాచీనమైన చరిత్ర కాదుకదా ఆధునిక భారతంలో పండిట్ల వలసను ఆపలేని దుస్థితికి కారణం ఎవరు? ఇంకా విచిత్రం ఏమిటంటే ‘‘భారతదేశం ఆక్రమణల్లో అందెవేసిన చేయి’’ అని జమ్మూకశ్మీర్‌ను, ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకొన్నదని స్వయం ప్రకటిత మేధావి అరుంధతీరాయ్ నిర్భీతిగా ఈ దేశంలో అనగలదు!? హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వ సంస్థల అధీనంలో కొన్ని, కబ్జాకోరుల కబంధ హస్తాల్లో మరికొన్ని వున్నాయి. దేవాలయాలు ప్రతి రాష్ట్రంలో ఎంతో ఆదాయాన్ని సమకూర్చుతున్నా వాటిని హిందూ సమాజ ఐక్యతకు వినియోగించే వ్యవస్థ లేదు. దేవాలయాల భూములు పేదలకు పంచాలి అని నినదించే కామ్రేడ్ నారాయణ వక్ఫ్, ఆస్తులో, చర్చి ఆస్తులో అలా పంచమని ఎందుకు చెప్పరు?
వేల యేళ్ల నాగరికత వున్న మన సంప్రదాయాలను తులనాడుతూ సినిమా తీస్తారు, పుస్తకాలు రాస్తారు, చిత్రాలు గీస్తారు. ఎంఎఫ్ హుస్సేన్ సరస్వతీదేవి నగ్న చిత్రాన్ని గీసి కళాఖండం అంటే మనం నోరు తెరిచి చూడడం తప్ప ఇంకేం చేయలేకపోయాం. రామసేతువుపై నాస్తిక కరుణానిధి కుట్రపూరితంగా మాట్లాడితే, డా. సుబ్రహ్మణ్య స్వామిలాంటివాళ్లు తప్ప బలంగా ఎవరూ ఖండించలేకపోయారు. దేశంలో దేవాలయాల వివాదాలు అలా ఉండగానే రామసేతువు అబద్ధం అన్నా ఎవరూ నోరు మెదపరు. ‘నాసా’ వాళ్లు పరిశోధన చేసి అక్కడ రామసేతువు ఉంది అన్నాక అందరి నోళ్లు మూతబడ్డాయి.
ఈ దేశంలోని మెజార్టీ ప్రజలకు మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామ జన్మభూమి వందల ఏళ్లుగా వివాదంలో వుంది. దేశంలోని ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం నిర్మించడానికి దాని పరిష్కారం కొనుగొనేవారిని సూడో సెక్యులర్ శక్తులు నిలువరిస్తున్నాయి. కంబోడియా, థాయ్‌లాండ్ తమ సరిహద్దుల్లో వున్న ఒక దేవాలయ సముదాయంపై శతాబ్దాల నుంచి వున్న వివాదానికి పరిష్కారం కొనుగొన్నాయి. అంతేకాకుండా ఆ స్థలానికి ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రత్యేక గుర్తింపు ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రతాప్‌ఘర్‌లోని మొగల్ సేనాని అఫ్జల్‌ఖాన్ సమాధి మెల్లమెల్లగా విస్తరించి, అనేక మార్పులు చెందిన 23 అద్భుతమైన గదులతో కొత్త అందాలను సంతరించుకున్నది. న్యాయస్థానం అక్కడి అక్రమ కట్టడాలను కూల్చాలని ఆదేశించినా ఓటు బ్యాంక్ రాజకీయాలవల్ల అది సాధ్యం కాలేదు. మరి రామజన్మభూమిలో రామలల్లాపై ఓ కొత్త గది నిర్మించగలరా? మొన్న దీపావళికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య పర్యటన సందర్భంగా సరయూ నది పరిసర ప్రాంతంలో విద్యుద్దీపాలు వెలిగిస్తేనే అనేక విమర్శలు చేసిన సూడో సెక్యులర్ గ్యాంగ్ రేపు ఎన్‌డిఏ ఆధ్వర్యంలో పార్లమెంటు ద్వారా చట్టం చేసి రామమందిరం నిర్మిస్తే ఊరుకుంటారా?
హిందూ మతం అంటేనే ఒంటి కాలిపై లేచే నాస్తిక సంఘాలు, జన విజ్ఞాన సంఘాలు ఈ దేశ మూల సంస్కృతిని ఎందుకు విధ్వంసం చేయాలను కొంటున్నాయి. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉపగ్రహాలను పంపే క్రమంలో హసన్‌లో వున్న ఆ సంస్థ ప్రధాన నియంత్రణ విభాగానికి చెందిన శాస్తవ్రేత్తలు ఉపగ్రహ నమూనాను ధర్మస్థలలోని మంజునాథ స్వామి ముందు ఎందుకు పెడతారో గమనించారా? అలాగే శ్రీహరికోట సమీపంలో అంకాలమ్మ దేవాలయంలో డైరెక్టర్ దంపతులు పూజ చేసి మరీ ఈ ప్రయోగానికి ఉద్యుక్తులవుతారన్న ఈ విదేశీ మానసపుత్రులు ఎందుకు విస్మరిస్తారు.
సరస్వతిని నాలుకపై, లక్ష్మీదేవిని వక్షస్థలంపై, శరీరంలో సగభాగం ఇచ్చి స్ర్తిమూర్తులను త్రిమూర్తులు నిలుపుకొన్నారని పురాణాలు ప్రతీకగా చెప్పాయి. కానీ హిందూ ధర్మంలో స్ర్తి పురుష సమానత్వం లేదు అని వాదించేవారు ఇతర మతాల్లో స్ర్తి పురుష సమానత్వం గురించి ఎందుకు మాట్లాడరు. కనీసం త్రిపుల్ తలాక్ చట్టంపై పార్లమెంటులో చర్చ జరుగుతుంటే తెలుగు మాధ్యమాలు కనీసం చిన్నపాటి చర్చనైనా జరపడానికి ఎందుకు సాహసించరు?
రాజకీయంగా ‘హిందూ’ అని చెప్పడం సిగ్గుగా భయపడేవాళ్లు ఇతర మతాల కార్యక్రమాలను ఆనందంగా తలపైకి ఎత్తుకుంటారు. హిందువుల గురించి మాట్లాడడం మతతత్వంగా ముద్ర వేసేవాళ్లు ఏమతం గురించి అయినా ఎందుకు మాట్లాడాలి? ఇదేం సెక్యులరిజం? మరోవైపు మతమార్పిడి ముఠాలు సేవ పేరుతో ప్రవేశించి మతం మార్పిడి ఉధృతంగా చేస్తున్నాయి. క్రీ.శ. 1498 వాస్కోడిగామా నుంచి ఈరోజు వరకూ వేలకోట్లు భారతదేశంలో గుమ్మరించినా అధికారికంగా క్రైస్తవుల జనాభా పది శాతం లోపే. వెయ్యేళ్ల పరాయిపాలనలో కూడా హిందూ జనాభా 85% మించి వుండడం హిందూ సాంస్కృతిక నిష్ఠకు తార్కాణం కాదా?
కులాల కుంపట్లను రంగులతో అలంకరించి మండిస్తున్న వ్యక్తులు హిందూమతాన్ని కులాల సముదాయం అని నినదిస్తున్నారు. ఇటీవల గతితార్కిక తర్కవాదులు ‘హిందుత్వాన్ని కేవలం బ్రాహ్మణత్వం’ అంటూ నినదిస్తున్నారు. మరి వ్యాసుడు, వాల్మీకి, విదురుడు, రాముడు, కృష్ణుడు, వివేకానందుడు, నారాయణగురు, మాదిగ కక్కయ్య, వీరబ్రహ్మేంద్రస్వామి, మలయాళస్వామి వంటి మహనీయులను హిందూ మతం నుండి విడదీయగలుగుతారా? వీళ్లంతా పుట్టుకతో బ్రాహ్మణులు కారే! వేరే సూక్తాలను సృష్టించిన శూద్రులను, మంత్రద్రష్టలైన స్ర్తిలను హిందుత్వ నుండి వేరుచేసి చూడగలమా!
ఎంతో ప్రాచీనమైన గ్రంథాలు, శిల్పం, వాస్తు, ఖగోళం వంటి విద్యలకు నెలవైన హిందుత్వం ఈ భూగోళం నుంచి తుడిచి వేయాలనుకోవడం సాధ్యమా? తమిళనాడులోని చిదంబరం క్షేత్రాన్ని ప్రపంచ భూ అయస్కాంత కేంద్ర స్థానంగా చెప్తారు. పంచభూతాత్మకమైన ఆలయాల్లోని చిదంబరం (ఆకాశలింగం), శ్రీకాళహస్తి (వాయులింగం), కాంచీపురం (పృథ్వీలింగం) ఈ మూడూ ఒకే రేఖాంశంపై నిర్మించడం హిందూ శిల్పుల ప్రజ్ఞకాదా?
హిందుత్వను ధ్వంసం చేస్తామని అంటున్నవాళ్లు ఒక ఆర్యభట్టను, భాస్కరాచార్యుణ్ణి, కపిలుణ్ణి, కణాదుణ్ణి, పతంజలిని, కాళిదాసును ఎలా నశింపచేస్తారు? ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు బట్టకట్టనినాడే యవ్వనంలో వున్న హిందూ సంస్కృతిని ధ్వంసం చేయడం సాధ్యమా?
ఆత్మరక్షణకో, దుర్మార్గాన్ని నిర్మూలించడానికో తప్ప మన దేశం ఎప్పుడూ దురాక్రమణ చేయలేదు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ సగర్వంగా ప్రకటించింది. అలాంటి ప్రాచీన వారసత్వానికి వారసులైన, శాంతి కాముకులైన హిందూ జీవన విధానం ప్రపంచానికే దిక్సూచి అవడం అతిశయోక్తికాదు. హిందుత్వం సత్యం. సత్యాన్ని ఎవరూ నిర్మూలించలేరు. హిందుత్వం ఎప్పుడూ తనలోని లోపాలను గుర్తిస్తూ ముందుకు సాగడంవల్లనే ప్రాచీన ప్రపంచ మతంగా సజీవంగా ఉండగలుగుతుందనేది నిజం.
-డా. పి భాస్కరయోగి [email protected]
(ఆంధ్రభూమి సౌజన్యం తో)