కేంద్ర బృందాలు… ప్రత్యేక పోలీస్ ఆపరేషన్ , ఉగ్ర సానుభూతిపరులు.. వీసా గడువు ముగిసిన వారిపై దృష్టి
ఉగ్ర ముఠాల కార్యకలాపాలు… సానుభూతిపరుల కార్యాచరణ… అనుమానాస్పద వ్యక్తుల సంచారాలపై కేంద్ర నిఘా సంస్థ అధికారులు హైదరాబాద్‌లో కొన్నిరోజుల నుంచి జల్లెడ పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. నియంత్రణరేఖ (ఎల్వోసీ) వద్ద ఉగ్రవాద శిబిరాలపై సైన్యం మెరుపుదాడుల (సర్జికల్ స్ట్రైక్స్) అనంతరం నగరంలోనూ అనూహ్యంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవచ్చనే అనుమానంతో వారు హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలిసింది. ప్రత్యేక విభాగం(ఎస్బీ) పోలీసులతో కలిసి విదేశీయులు ముఖ్యంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వస్తున్న వారి వివరాలను సేకరించడంతో పాటు వారి వీసా గడువులను పరిశీలిస్తున్నట్టు సమాచారం. గత ఆగస్టులో పోలీసులకు దొరికిన పాక్ ఉగ్రవాది నజీర్ కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించి రహస్యంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా హైదరాబాద్‌లో దర్జాగా జీవిస్తున్న పాక్ ఉగ్రవాది నజీర్ ఉదంతం నుంచి లెక్కాపత్రాలను కేంద్ర నిఘా బృందాలు పరిశీలిస్తున్నాయి. హైదరాబాద్‌కు రాకపోకలు కొనసాగిస్తున్న వారితోపాటు దీర్ఘకాలికంగా ఉంటున్న పాకిస్థాన్ పౌరుల వివరాలను ప్రత్యేక విభాగం పోలీసులతో రికార్డులు తీయించగా… 256 మంది ఉన్నట్లు గుర్తించారు. వారిలో 11 మంది పాస్‌పోర్టు గడువు తీరినా ఇంకా కొన్నినెలల పాటు హైదరాబాద్‌లో ఉంటామంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి పొందారు. 8 మంది మాత్రం వీసా గడువు పూర్తైనా… వారుంటున్న చిరునామాల్లో లేరు. ఎనిమిది మందిలో ఎవరికీ నేరచరిత లేకపోయినా… ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వారి చిరునామాలను గుర్తించి దిల్లీలో రాయబార కార్యాలయానికి పంపనున్నామని ప్రత్యేక విభాగం అధికారి ఒకరు వివరించారు. ఇక హైదరాబాద్ నుంచి పాస్‌పోర్టులు పొందిన బంగ్లాదేశ్ వాసుల వివరాలను సేకరిస్తున్నారు. పాతబస్తీలో నాలుగు పోలీస్ ఠాణాల పరిధుల్లో పదుల సంఖ్యలో పాస్‌పోర్టు దరఖాస్తులను తూతూమంత్రంగా విచారించి పంపించారని గుర్తించారు. వీటి ద్వారా ఎంత మంది పాస్‌పోర్టులు పొందారు? ఇందులో బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్థులు ఎంతమంది ఉన్నారు? గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారెంతమంది? అన్న అంశాలపై రహస్యంగా వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది.
ఉగ్ర కార్యకలాపాలు… సభ్యుల ఆనవాళ్లు…
హైదరాబాద్ కేంద్రంగా డజను ఉగ్రవాద సంస్థలు పాతికేళ్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని నిఘావర్గాలు, సిట్ ఆధారాలు సేకరించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో ఇండియన్ ముజాహిదీన్, లష్కరే తోయిబా, హుజి, ఐ.ఎస్(ఇస్లామిక్ స్టేట్) ఉన్నాయి. ఇవన్నీ వేటికవే భిన్నపంథాలో హైదరాబాద్‌లో రహస్యంగా సానుభూతిపరులతో మాట్లాడుతున్నాయి. హుజి(హర్కతుల్ జిహాదీ అల్ ఇస్లామీ) కీలక నేతలు పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా రూ.లక్షల్లో నిధులను సానుభూతి పరులకు, నిద్రాణ దళాలకు పంపిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. మత ఛాందసవాదాన్ని పెంపొందించి జీహాద్(పవిత్ర యుద్ధం)వైపు ఆకర్షితులయ్యేలా నిద్రాణ దళాల సభ్యులను ఉపయోగించుకుంటున్నారని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దీంతోపాటు ఆధునిక సాంకేతిక సమాచారాన్ని వినియోగించుకునేందుకు ఐటీ(సమాచార సాంకేతిక పరిజ్ఞానం) విభాగాన్ని పాకిస్థాన్, బంగ్లాదేశ్, దుబాయ్, ఇంగ్లండ్‌లో ఏర్పాటు చేసినట్టు పోలీసులకు కొంత సమాచారం లభించింది. పాతబస్తీలో రెండేళ్ల క్రితం ఉబేద్-ఉర్-రహిమాన్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి హుజి సానుభూతి పరుడిగా గుర్తించి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు ఐటీ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బెంగళూరు, హైదరాబాద్‌లలో ప్రజా ప్రతినిధులను చంపేందుకు హుజి ఏర్పాటు చేసిన ఉగ్రవాదులకు హైదరాబాద్‌లో తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. విదేశాల్లో ఇంగ్లండ్, దుబాయ్ భారత్‌లో దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబయి నగరాల నుంచి ఐటీ విభాగం నిత్యం కార్యక్రమాలను రూపొందించి వాటిని అమలు చేసే బాధ్యత స్థానిక సభ్యులు, సానుభూతి పరులకు అప్పగించింది. మెరుపుదాడుల నేపథ్యంలో పాతబస్తీ, రాజేంద్రనగర్, పహాడీ షరీఫ్ ప్రాంతాల్లో ఉగ్రవాద సానుభూతిపరులు, బంగ్లా, మయన్మార్ దేశీయులపై కేంద్ర నిఘా బృందం అత్యంత రహస్యంగా వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసింది.
(ఈనాడు సౌజన్యంతో)