‘‘సైన్యంతో పోరాడటం మీ వల్ల కాదు, కశ్మీరుకు స్వాతంత్ర్యం ఎన్నటికీ రాదు’’ అని కశ్మీరు యువతకు భారత సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్ గట్టిగా చెప్పారు. కొందరు కశ్మీరు యువత తుపాకులను పట్టుకుంటున్న నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరిక సందేశాన్ని పంపించారు.
ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కశ్మీరుకు స్వాతంత్ర్యం సాధ్యం కాదని కశ్మీరీ యువతకు చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. అనవసరంగా ఎవరి వెంటో పడి వెళ్ళవద్దని హితవు పలికారు. ‘‘మీరు తుపాకులు ఎందుకు పట్టుకుంటున్నారు? స్వాతంత్ర్యం కావాలనేవారితోనూ, దేశాన్ని విభజించాలనుకునేవారితోనూ మేం నిరంతరం పోరాడతాం. స్వాతంత్ర్యం ఎన్నటికీ రాదు, అసలు ఎన్నటికీ అది సాధ్యం కాదు’’ అని వివరించారు. తప్పుదోవపడుతున్న యువత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సైన్యం కార్యకలాపాల్లో ఉగ్రవాదులు మరణిస్తూ ఉండటం, మళ్ళీ ఉగ్రవాద సంస్థలు కొత్తగా ఉగ్రవాదులను నియమించుకోవడం వంటివి కొనసాగుతూనే ఉంటాయన్నారు. అయితే ఇదంతా నిష్ఫలమని స్పష్టం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ‘‘మీరు ఏమీ సాధించలేరు. మీరు సైన్యంతో పోరాడలేరు’’ అని చెప్పాలనుకుంటున్నట్లు వివరించారు.
(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)