Home Hyderabad Mukti Sangram ముఖ్యమైన రక్షణ సామగ్రి ధ్వంసం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-16)

ముఖ్యమైన రక్షణ సామగ్రి ధ్వంసం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-16)

0
SHARE

అప్పటికి బాగా వెలుగు వచ్చేసింది. బురుజుపైన ఇద్దరు యువకులు లేచి నిలబడి చూస్తుండగానే గుండు వచ్చి తగిలింది. మగుటం రామయ్య, భూమయ్య అనే ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడే కూలిపోయారు. అక్కడి గది వగైరా అంతా కూలి ముఖ్యమైన రక్షణ సామాగ్రి ధ్వంసమైపోయింది. గ్రామస్థులు ఇది రజాకార్ల దాడి కాదనే విషయాన్ని గ్రహించారు.

ప్రతిఘటించి ప్రయోజనం లేదని బురుజు పైనుండి తెల్లజెండా చూపారు. అయినా నిజాం సైన్యం ఫిరంగి కాల్పులు జరుపుతూనే వచ్చింది. గ్రామంలో చొచ్చుకొని వస్తున్న సైనికులు అడవి జంతువులలాగా ప్రవర్తించారు. కనబడిన ప్రతి అమాయకుణ్ణి షూట్ చేశారు. ఒకమూల నిలబడి సైనికులు పదిమంది యువకులపైకి చేతిబాంబులువేసి చంపివేశారు. అందులో విశ్వనాథ్ భట్ జోషి తదితరులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది నిరపరాధులైన గ్రామస్థులు హత్య చేయబడ్డారు. అందులో అప్పుడే ప్రసవించిన తల్లి కూడా ఉంది. తర్వాత శవాలను గుర్తిస్తున్నపుడు సజీవంగా ఉన్న శిశువు లభించింది. గ్రామంలో ప్రతిఘటనా శక్తి సర్వస్వం నాశనమై పోయింది.

నిజాం ప్రభుత్వ అధికారులు, సైనికులు విజయోన్మాదంతో పాశవిక చర్యలకు దిగారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఏదో పెద్ద తిరుగుబాటును అణచివేశామనే గర్వంతో విర్రవీగుతూ భైరవునిపల్లి నేలమట్టం చేశారు. ప్రతి ఇంట్లోకి వెళ్ళి యువకులను ఏరి పశువుల్లా బంధించి తీసుకువచ్చారు. స్త్రీలను బలాత్కరించారు. ఇళ్ళను దోచుకున్నారు. గడ్డివాములను తగులబెట్టారు. మత పిచ్చి ఎక్కి దుష్కృత్యాలు జరిపిన గూండాలకు ఈ నిజాం ప్రభుత్వం అధికారులకు మధ్య తేడాలేదు అనిపించింది.

ఊరు అవతలికి 92 మంది యువకులను పట్టి తెచ్చి నిలబెట్టారు. వాళ్ళలో ఇద్దరు ముసలివాళ్ళు కూడా ఉన్నారు. అధికారులు తమ షూటింగ్ నైపుణ్యాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమై నిల్చున్నారు. త్రీనాట్ త్రీ రైఫిల్‌తో వరుసగా ఒకేసారి ఒకే గుండుతో ఎంతమందిని చంపవచ్చునో అంచనా వేసుకున్నారు. నాలుగు వరుసలలో ఒకరి వెనుక ఒకరిని నిలబెట్టారు. కట్టివేయబడిన యువకులు బలిపశువుల్లా నిలుచున్నారు. మొదట ఒక సైనికాధికారి కాల్పులు జరిపాడు.

ఒకేగుండు వరుసగా నలుగురి శరీరాల గుండా దూసుకుపోయి మరోవైపు వెళ్ళింది. ఫలితంగా ఆ నలుగురు యువకులు నేలకూలిపోయారు. రెండోసారి ఒక పోలీసు అధికారి ఫైరింగ్ చేయగా ముగ్గురు చనిపోయారు. ఇక సివిల్ అధికారులు తమ బలాన్ని ప్రదర్శించుకోవడానికి ముందుకు వచ్చారు. భువనగిరి డిప్యూటి కలెక్టర్ హాషిం కసితో ఎనిమిదిమందిని కాల్చి చంపాడు. ఇద్దరు ముసలివాళ్ళను వదలి దాదాపు అందరినీ స్టెన్‌గన్‌తో కాల్చి హత్య చేశారు.  ఈ దారుణ హత్యాకాండలో రజాకార్ల సర్వసైన్యాధికారియైన ఖాసిం రజ్వీ ముఖ్య అనుచరుడైన మొహజ్జిం హుస్సేన్ (నల్గొండ) అత్యధికమైన భాగాన్ని పంచుకున్నాడు.

తర్వాత గ్రామంలో హరిజనులను పిలిచి 90 మంది శవాలను నిరుపయోగంగా ఉన్న ఒక బావిలో పడవేయించి సామూహిక సమాధి చేశారు. గ్రామంలో చచ్చిన జనం ఈ లెక్కలోకి రాలేదు. 11 గంటల ప్రాంతంలో ఈ సైన్యం కుటిగల్ గ్రామం గుండా తిరుగు ప్రయాణం సాగించింది. ఆ గ్రామంలో పట్వారీ నరసింహారావుతో సహా 25 మందిని హత్య చేశారు.

(విజయక్రాంతి సౌజన్యం తో )