రాష్ట్రం పేరు జమ్మూ కశ్మీర్. అక్కడ జమ్మూ, కశ్మీర్‌లే కాదు, ఇంకో భాగం కూడా ఉంది. అదే లడాఖ్. నిజానికి వైశాల్యం పరంగా లడాఖ్ ఆ రాష్ట్రంలోని అతి పెద్ద భాగం. మూడింట రెండు వంతుల భూభాగం ఉన్నా, అక్కడ జనాభా మాత్రం చాలా తక్కువ. రాష్ట్ర జనాభాలో మూడు శాతానికి మించదు. మొత్తం జనాభా 2.79 లక్షలు మాత్రమే. అలాంటి లడాఖ్ ఒక విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. అదే ‘లవ్ జిహాద్’
లడాఖ్‌లో రెండు జిల్లాలున్నాయి. ఒకటి కార్గిల్, ఇంకొకటి లేహ్. కార్గిల్‌లో షియా ముస్లింలు ఉంటారు. వీరంతా పదహారో శతాబ్దంలో మీర్ షంషుద్దీన్ ఇరాకీ అనే మత ప్రచారకుడి వల్ల ఇస్లాంను స్వీకరించారు. పదుమ్, ద్రాస్‌లలో మాత్రం కొంత మంది సున్నీలు ఉంటారు. లేహ్, జన్‌స్కార్ లోయలో బౌద్ధులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడా కొద్దిమంది సున్నీలు, షియాలు, నూర్ బక్షీ ముస్లింలు ఉంటారు. సున్నీలు ప్రధానంగా కశ్మీరీ మూలానికి చెందినవారు. నిజానికి శతాబ్దాల పాటు ముస్లింలు, లడాఖీలు సామరస్యపూరితంగా జీవించారు. లడాఖ్ పై 1681లో టిబెటన్లు, మంగోలియన్లు దాడి చేసినప్పుడు మొగల్ సేనాని నవాబ్ ఫిదాయ్‌ఖాన్ బౌద్ధ రాజుకు బాసటగా నిలిచారు. ఇందుకు కతజ్ఞతగా రాజు ముస్లింలకు తన రాజప్రాసాదం దిగువనే మసీదు నిర్మించి ఇచ్చాడు. ఈ నాటికీ లేహ్ నగరంలో అదే అతిపెద్ద మసీదు. కశ్మరీ ముస్లింలు వ్యాపారులుగా, పత్ర లేఖకులుగా లడాఖ్‌లో పనిచేసేవారు. లడాఖీ బౌద్ధ పాలకుడు జామ్యాంగ్ నమ్ గ్యాల్ (1555-1610) ఖాప్లూ ప్రాంతానికి చెందిన ఎగ్బో షేర్ ఘాజీ కుమార్తె గ్యాల్ ఖాతున్‌ను వివాహం చేసుకున్నారు. బౌద్ధులు జంతుహింస చేయరు కాబట్టి లడాఖ్‌లో మాంసాన్ని అమ్మేవారంతా ముస్లింలే. లడాఖ్‌లో సుప్రసిద్ధ లోసర్ పండుగ సమయంలో బౌద్ధ రాజు లేహ్‌లో ఊరేగింపుగా వెళ్లేవాడు. ఆ సమయంలో ఆయన సున్నీ మసీదులో ప్రవేశించి, ఇమామ్ ఆశీర్వాదాన్ని తీసుకునేవారు. అదేవిధంగా మరో లడాఖ్ రాజు నిమానమ్ గ్యాల్ జీజీ ఖాతున్ అనే ముస్లిం మహిళను వివాహం చేసుకున్నాడు. ఇంకొక రాజు థుండుప్ నమ్ గ్యాల్ కూడా ముస్లిం మహిళను వివాహం చేసుకున్నాడు. కానీ వారెవరు ముస్లిం మహిళలను మతం మార్చలేదు. రాజు బౌద్ధుడిగా, రాణి ముస్లింగా స్వేచ్ఛగా తమ తమ మత విశ్వాసాలను పాటించే వారు. దీని వల్ల ఏ రోజూ ఎలాంటి సమస్యా రాలేదు. ఇరు వర్గాల మధ్య స్నేహపూరిత సంబంధాలే ఉండేవి.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బౌద్ధ మహిళలను ముస్లింలు లేవదీసుకుపోవడం, వారిని మతం మార్చడం బౌద్ధులను కలవర పెడుతోంది. గత నాలుగు దశాబ్దాల్లో 97 గురు మహిళలు ఇలా లవ్ జిహాద్‌కు గురయ్యారు. ఇందులో 2003 నుంచి 45 మంది మతమార్పిడికి గురయ్యారు. చూసేందుకు ఇది చాలా తక్కువ సంఖ్య అని అనిపించవచ్చు. లడాఖ్ జనాభా చాలా తక్కువ. ఇందులో ఈ మతమార్పిడులు చాలా ఎక్కువగానే భావించాలి. అందుకే బౌద్ధులు ఆందోళన బాట పడుతున్నారు. లడాఖ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ 1989 నుంచి 1992 వరకూ ముస్లింలను బహిష్కరించారు. పలు సార్లు ఘర్షణలు కూడా జరిగాయి. ఇటీవలి కాలంలోనూ ఈ లవ్ జిహాద్ సంఘటనలు జరిగాయి. దీనితో లడాఖ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. ఈ ఆందోళన నేపథ్యంలోనే లడాఖ్ స్వయంశాసిత కౌన్సిల్ ఏర్పాటైంది. ప్రస్తుతం లడాఖ్‌లో బౌద్ధుల సంఖ్య 51 శాతం, ముస్లింల సంఖ్య 49 శాతం ఉంది. అందుకే ఒక్కరిని మతం మార్చినా ఇంత ఆందోళన పెల్లుబుకుతోంది.
ఇదే కాక లడాఖ్‌లో కశ్మీరీల ఆధిపత్య ధోరణి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. అనేక సంవత్సరాలుగా తమను కశ్మీర్ లోయ పాలననుంచి వేరు చేసి, లడాఖ్‌ను ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించ మని బౌద్ధులుకోరుతున్నారు. ఇప్పటికే లడాఖ్‌లో బౌద్ధులు మైనారిటీలు. ఎందుకంటే కార్గిల్ జిల్లాలో జనాభా పెరుగుదలకి, లేహ్‌లోని బౌద్ధ జనాభా పెరుగుదలకు చాలా తేడా ఉంది. మామూలుగానే లడాఖ్‌లో ఉన్న మొత్తం ఎమ్మెల్యే సీట్లు నాలుగు. ఈ నాలుగింటిలో నియోజకవర్గాల ఏర్పాటు ఎలా జరిగిందంటే బౌద్ధులు నాలుగింట ఒక సీట్ మాత్రమే గెలిచే పరిస్థితి ఉంది. అంటే బౌద్ధుల గొంతు వినిపించే అవకాశం అసెంబ్లీలో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లవ్ జిహాద్ కొనసాగితే పరిస్థితులు మరింత దిగజారుతాయి. అందుకే బౌద్ధులు భయాందోళనలతో బతుకుతున్నారు.
ఇంతే కాక మత మార్పిడులు జరుగుతున్న తీరు కూడా బౌద్ధులకు ఆందోళన కలిగిస్తోంది. ఉదాహరణకు 2016లో కార్గిల్‌లోని ద్రాస్‌కు చెందిన మూర్తజా ఆగా సాల్డన్ అనే ఒక బౌద్ధ మహిళను మతం మార్చి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు షిఫాగా మార్చివేశాడు. ఇది 2015లో జరిగింది. వారి వివాహం బెంగుళూరులో 2016లో జరిగింది. జమ్మూ కశ్మీర్ మహిళా కమీషన్, హైకోర్టు వంటి అన్ని చట్టపరమైన సంస్థలను ఉపయోగించుకుని మూర్తజా షిఫాను తల్లిదండ్రులు కలవడానికి కూడా వీలు లేకుండా చేశాడు. ఇంత పెద్ద వ్యవస్థలను ఉపయోగించడంలో చాలా సంస్థలు, ప్రభావం ఉన్న వ్యక్తులు అతనికి సహకరించారు. ఇవన్నీ చూస్తే మత మార్పిడి ఒక పకడ్బందీ పథకంలో భాగంగా జరుగు తోందన్నది సుస్పష్టమౌతుంది. చాలా సందర్భాల్లో తమను తాము బౌద్ధులుగా పరిచయం చేసుకుని, స్నేహం చేసి, తరువాత మోసపూరితంగా మతం మార్చారు. తాము ఇష్టప్రకారమే మతం మారామని వారి చేత బలవంతంగా అఫిడవిట్లు దాఖలు చేయిస్తున్నారు. ఈ విషయాలు వెలుగులోకి వచ్చే సరికే పుణ్యకాలం గడిచిపోతోంది. అందుకే లడాఖ్ లోని బౌద్ధులలో తీవ్ర అలజడి నెలకొంది.
– సూర్యపుత్ర
(జాగృతి సౌజన్యం తో)