వినూత్న ఆలోచనా, సామాజిక బాధ్యత, ఎదుటివారికి సాయం చేయాలనే ఆలోచనే పేదలకు ఆసరాగా నిలుస్తుంది. ఆ విద్యార్థినులు గుప్పెడు బియ్యం పథకంతో అదే చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమానికి గుంటూరులోని ప్రభుత్వ మహిళ కళాశాల వేదికైంది. ఈ కార్యక్రమం ఇతర కళాశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎంతో మంది విద్యార్థినులు తాము సేకరించిన బియ్యాన్ని అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు పంచడం గమనార్హం.
గుంటూరులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అది. కొన్నాళ్లక్రితం ఆ కళాశాల ప్రిన్సిపల్ శశిబాల గుప్పెడు బియ్యం పథకం ప్రారంభించారు. విద్యార్థులు మారినా… ఆ పథకం మాత్రం ఇంకా కొనసాగడం విశేషం. కళాశాలలో ప్రస్తుతం రెండు వేల మంది విద్యార్థినులు ఉన్నారు. ప్రతి బుధవారం ఈ విద్యార్థినులు కళాశాలకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా గుప్పెడు బియ్యం తీసుకొస్తారు. కళాశాలలో ఈ బియ్యాన్ని సేకరించడం కోసం ఒక డబ్బాని ఉంచుతారు. ఈ డబ్బాను కళాశాల భవనంలోని ప్రతి బ్లాకులో పెడతారు. బుధవారం ఉదయం కళాశాలకు రాగానే విద్యార్థినులు ఇంటి నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని ఆ డబ్బాలో వేస్తారు. ఇలా ప్రతి వారం చేస్తారు. కేవలం ఆ బాలికలే కాకుండా అక్కడ పనిచేసే అధ్యాపకులూ, ఇతర ఉద్యోగులు అందరూ ఈ గుప్పెడు బియ్యం పథకంలో భాగస్వాములవుతున్నారు. ఇలా సేకరించిన బియ్యం ఎక్కువ మొత్తంలో అయ్యాక ప్రతి మూడు నెలలకొకసారి వాటిని అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు పంపిణీ చేస్తారు. ఇలా సంవత్సరానికి మూడు నాలుగు క్వింటాళ్ల బియ్యం ఆశ్రమాలకు వెళ్తుంది.
ఇప్పటి వరకు 10 అనాథ శరణాలయాలకు దాదాపు 16 క్వింటాళ్ల వరకు సాయం చేశారు. ఆ బియ్యం ఇవ్వడానికి కూడా కళాశాల అధ్యాపకులతోపాటూ కొంతమంది విద్యార్థినులూ వెళ్తారు. బియ్యం మాత్రమే ఇచ్చి వచ్చేయడంలోనే తమ పని అయిపోయిందని అనుకోరు. అక్కడన్నవారితో కాసేపు గడిపి మరీ వస్తారు. ఇలా చేయడం తమ బాధ్యత అంటారీ విద్యార్థినులు.
అధిక మొత్తంలో తీసుకోరు…
గుప్పెడు బియ్యం పథకంతో ఎంతో మంది స్ఫూర్తి పొంది ఎక్కువ మొత్తంలో బియ్యాన్ని ఇవ్వడానికి విద్యార్థినుల తల్లిదండ్రులూ, ఇతర వ్యక్తులు కళాశాలకు వచ్చేవారు. కానీ కళాశాల యాజమాన్యం దానికి అంగీకరించలేదు. విద్యార్థినుల్లో సామాజిక బాధ్యతను పెంచడానికే ఈ పథకం కొనసాగిస్తున్నామని పేర్కొంది. ఎక్కువ తక్కువ ఇచ్చామనే భావన వల్ల కళాశాలలో విద్యార్థినుల మధ్య పోటీతత్వం పెరిగి ప్రతికూల ప్రభావం పడుతుందనీ కాబట్టి తలా గుప్పెడు బియ్యమే సరిపోతుందని వివరించింది.
కళాశాలలకు ఆదర్శం…
ఈ పథకం ఎంతో మంది నుంచి ప్రశంసలందుకుంటోంది. రాష్ట్రంలో అనేక కళాశాలలూ, విద్యాలయాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం చాలామంది విద్యార్థులు ఇదే పంథాను అనుసరించడం విశేషం. ఈ పథకం ఇచ్చిన స్ఫూర్తితో విద్యార్థినులు ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ వంతు సహాయం చేస్తున్నారు. స్వయంగా విద్యార్థినిలే ప్రతినెలా కొంత డబ్బును సేకరించి పేదవారికి సహాయం చేస్తున్నారు. అనాథలూ, వృద్ధులకు దుప్పట్లను అందజేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థినులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు గణితం, ఆంగ్లం, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తూ వారిలో చైతన్యం నింపుతున్నారు.
– ముంత శ్రీను,
(ఈనాడు సౌజన్యం తో)