దేశంలో ఉన్న విద్యా రంగ సమస్యల పరిష్కార దిశగా, సమాజంలో సేవ చేయాలనే జాతీయత భావంతో దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ విద్యార్థుల్లో జాతీయ భావాల కల్పనకై విశ్వవిద్యాలయాలు, కళాశాలలను కేంద్రాలుగా చేసుకొని కొందరు యువకులు వారు చదువుతున్న ప్రాంతంలో నుంచే పనులు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు 1949 జూలై 9న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)ని ఏర్పాటు చేశారు. ఆ రోజును దేశవ్యాప్తంగా జాతీయ విద్యార్థి దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ద్వారా దేశం, సమాజం కోసం ఏర్పడిన విద్యార్థి పరిషత్‌కు ఈ ఏడాది జూలై 9తో 69 సంవత్సరాలు పూర్తికానున్నాయి..
విద్యార్థి పరిషత్ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు కూడా “విద్యారంగం” అంటే ఒక కుటుంబం అనే భావనతో పనిచేస్తూ విద్యార్థుల మధ్య ఉంటూ కళాశాలలు కేంద్రాలుగా చేసుకొని కళాశాలల్లో సైకిల్ స్టాండ్ సమస్య మొదలుకొని మౌలిక వసతులు, ఉపకార వేతనాలు, సమస్యల పరిష్కారంతో పాటు “జాతీయత మా ఊపిరి దేశ భక్తి మా ప్రాణం” అంటూ దేశంలో ఎక్కడ విచ్ఛిన్నం చేసే సంఘటన జరిగినా అనుక్షణం స్పందిస్తూ దేశ రక్షణలో ఒక వాచ్ డాగ్ లాగా ఏబీవీపీ నిమగ్నం అయి ఉంది. కొద్దిమందితో ప్రారంభమైన ఏబీవీపీ యాత్ర ఎక్కడ ఆగలేదు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ దశాబ్దాలుగా ముందుకు వెళుతూనే ఉంది. ప్రతి అణిచివేతకు ఏబీవీపీ మరింత బలం పుంజుకుంది.
కార్యక్రమాల విస్తరణ పెరిగింది. దేశభక్తి సమాజం యెడల ప్రేమ అధికమైంది. విద్యారంగ సమస్యలతో పాటు జాతీయ పునర్నిర్మాణం అనగా దేశంలో చిట్టచివరి వ్యక్తికి కూడు, గూడు, గుడ్డ, చదువు, వైద్యం వంటి ప్రాథమిక వసతులు కల్పించాలి. ఆపై అభివృద్ధిలో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే శక్తితో పాటు వ్యక్తిగత జీవన ప్రమాణాలు, సంస్కృతిని కాపాడుకుంటూ వసుధైక కుటుంబం అనే భావనతో పనిచేయడమే ఏబీవీపీ ముఖ్య ఉద్దేశం.
దేశం కోసం ఏబీవీపీ కార్యకర్తల బలిదానం
కళాశాల క్యాంపస్‌లలో పనిచేస్తున్న సందర్భాల్లో ఇంకా మనకు స్వతంత్రం రాలేదని భరత్ మాతాకి జై అంటే చంపేస్తామని బెదిరించిన విదేశీ సిద్ధాంతాలతో ఉన్న కమ్యూనిస్టులు వాటి అనుబంధ విద్యార్థి సంఘమైన (ఆర్‌ఎస్‌యూ) రాడికల్ స్టూడెంట్ యూనియన్ పేరు మీద కళాశాలలో విద్యార్థులను రెచ్చగొట్టేవి. దేశవిద్రోహ కార్యకలాపాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న తరుణం. తెలంగాణ ప్రాంతంలో 1982 సమయంలో వరంగల్‌లోని కాకతీయ వర్శిటీని కారల్ మార్క్స్ వర్శిటీ అనేవారు. కాకతీయ వర్సిటీలో స్వతంత్ర గణతంత్ర దినోత్సవం సందర్భంగా అప్పటి ఉపకులపతి జాతీయ జెండా ఎగరవేస్తున్న సమయంలో నక్సలైట్లు వచ్చి నల్ల జెండా ఎగురవేయగా జాతీయ జెండాకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అక్కడున్న వర్శిటీ ఏబీవీపీ అధ్యక్షుడు సామ జగన్ మోహన్ ఎదురించి జాతీయ జెండా ఎగురవేసినందుకు అతి కిరాతకంగా అంతమొందించారు.
ఇదే మాదిరిగా ఉస్మానియా వర్సిటీలో మేరేటి చంద్రారెడ్డి, వరంగల్ జిల్లా పరకాలలో దగ్గు వెంకన్న, సూరనేని భీమన్న, కరీంనగర్ జిల్లాలో రామన్న, గోపన్నలు, జమ్మికుంటలో ఎల్క సమ్మిరెడ్డి, నల్లగొండ జిల్లాలో ఏచూరి శ్రీనన్నలు ఇలా 30 మందికిపైగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలను కమ్యూనిస్టులు పొట్టనపెట్టుకున్నారు. ప్రాణాలు పోతాయి అని తెలిసినా కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఎరుపు అంటే ఎవడికిరా భయం అది నా తల్లి నొడుతి సింధూరం అంటూ నినాదాలిస్తూ నమ్మిన సిద్ధాంతం కోసం జాతీయ భావాలు నరనరాన నింపుకొని నేటి తరానికి ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు. వారు ఇచ్చిన స్ఫూర్తి, వారి త్యాగ ఫలితం కారణంగా నేటి విద్యార్థి లోకం, కార్యకర్తలందరూ అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వారి త్యాగాలు వృథా కాకుండా వారి యొక్క ఆశయాలు ఆగిపోకుండా నేటి యువతరం పుణికి పుచ్చుకొని కార్యసిద్దులవుతున్నారు.
నా సంఘర్షణ తర్వాత ఏబీవీపీ వైపు విద్యార్థి సమాజం మొత్తం కూడా జాతీయ భావ సిద్ధాంతాలతో పాలుపంచుకొని ప్రస్తుతం దేశంలోనే లక్షలాది విద్యార్థుల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేసి సాధించిన విజయాలు అనేకం. ఇందులో ముఖ్యంగా దేశవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలమీద, వాటి స్థితిగతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలను ఏబీవీపీ క్లుప్తంగా అధ్యయనం చేసి బ్లాక్ పేపర్‌ని విడుదల చేసి సుప్రీం కోర్టులో పిల్ వేసింది. దీంతో స్వయానా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆ డిమాండ్లను చూసి ఏబీవీపీకి వసతి గృహాల మీద ఉన్న దృష్టి కోణాన్ని ప్రశంసించారు. దీని కారణంగా విద్యార్థులకు నెల వారీగా వచ్చే కాస్మోటిక్ చార్జీలు, నూతన భవనాలు, భోజన మెనూను మార్చిన ఘనత ఏబీవీపీకే సొంతం.
అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ జన్మించిన ప్రదేశం మహారాష్ట్రలోని ‘మరత్వడా’ విశ్వవిద్యాలయాన్ని డా.బి.ఆర్. అంబేద్కర్ వర్శిటీగా పేరు మార్చాలని మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసి ఆ ప్రాంత ప్రజల మనోభావాలు నొప్పించకుండా ఒప్పించిన ఘనత ఏబీవీపీకి ఉంది. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ క్యాంపస్ ఆచారాలను, విద్యారంగంలో నూతన మార్పులను తీసుకురావాలని ప్రభుత్వాలకు అనేక ప్రతిపాదనలు ఇచ్చిన ఏకైక విద్యార్థి సంస్థగా ఉంటూ సామాజిక సామరస్యత మా నినాదం కాదు అది మా నిబద్దత అని అనేందుకు నిలువెత్తు నిదర్శనం ఏబీవీపీ. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలోని సమస్యల సాధనలో కీలకంగా పనిచేస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక వినూత్న కార్యక్రమాలు నిర్వహించి ‘నా రక్తం నా తెలంగాణ’ కార్యక్రమాన్ని వేలాది మంది విద్యార్థులతో నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది.
లక్షలాది మంది విద్యార్థులతో తెలంగాణ రణభేరి కార్యక్రమాలు, తెలంగాణ నలుమూలల నుంచి “తెలంగాణ విద్యార్థి మహా పాదయాత్ర” పేరు మీద 500 మంది విద్యార్థులతో 12 రోజులుగా 1200 కిలోమీటర్లు యాత్ర చేసి తెలంగాణ ప్రజలను చైతన్యపరచడం జరిగింది. అనేక నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర సాధనలో ప్రత్యేక భూమిక పోషించింది. విద్యార్థులు అంటేనే న్యూసెన్స్, దాడులు అనుకునే రోజుల్లో యువతకు ఏబీవీపీ తోడై స్టూడెంట్ పవర్ న్యూసెన్స్ పవర్ కాదు “స్టూడెంట్ పవర్ ఇన్ ఏ నేషన్ పవర్”గా తీర్చిదిద్దుటకు కృషి చేసింది. నేటి బాలలే రేపటి పౌరులు అని చెబుతూ విద్యార్థి పరిషత్‌లో కుల, వర్గ, మత భావన లేకుండా మనమందరం ఒక్కటే, మన అందరికీ ఒకే తల్లి ఆమెనే మన భారతమాత అనే భావనను కలిగించే దేశభక్తి గల ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీపీ. కులాల కుళ్ళును కడిగేద్దాం, అంబేడ్కర్ ఆశయాలను సాధిద్దాం అంటూ భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని వారి ఆశయ సాధన దిశగా కళాశాల క్యాంపస్‌లలో కులం పునాదుల మీద ఒక నీతిని గాని ఒక జాతిని గానీ నిర్మించలేము అనే అంబేడ్కర్ మాటలను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తోంది.
ఈ క్రమంలో ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల్లో కులాల పేరు మీద మతాల పేరు మీద కుంపటి పెడుతూ విద్యార్థులను విభజిస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు విద్య వాతావరణం కోల్పోయే దిశగా అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏబీవీపీ సేవ్ క్యాంపస్ సేవ్ ఎడ్యుకేషన్ అనే నినాదంతో విద్యార్థులకు అండగా ఉంది. అన్ని వర్గాల విద్యార్థులకు కార్య విస్తరణకు గాను ఏబీవీపీ వివిధ నియమాలను ఏర్పాటు చేసి బహు పరిమాణ దృష్టితో ఇంజనీరింగ్ విద్యార్థులకు సృజన, మెడిసిన్ విద్యార్థులకు మేడివిసన్, విదేశీ విద్యార్థులకు ఓసీఈ, గిరిజన విద్యార్థులకు జనజాతి, సమాజంలో పర్యావరణ నియంత్రణకు స్టూడెంట్ ఫర్ డెలప్‌మెంట్, ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థుల కోసం థింక్ ఇండియా, ఇలా అనేక రకాలుగా వివిధ నియమాలు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది.
విద్యార్థులకు మనమంతా సమానత అన్న భావం కల్పించి విద్యారంగంలో అనేక సంస్కరణలకు కృషి చేస్తూ ప్రపంచంలోనే ఒక శక్తిగా నిలించింది. ఈ జాతీయ పునర్నిర్మాణ మహాయజ్ఞంలో అనేక మంది పనిచేసిన కారణంగా నేడు దేశ, విదేశాల్లో, రాజకీయ రంగంలో కీలకమైన వ్యక్తులందరూ విద్యార్థి పరిషత్‌లో పనిచేసిన వారే దీనికి కారణం. విద్యార్థి పరిషత్ వారికి నేర్పిన క్రమశిక్షణ, వ్యక్తి నిర్మాణమే ప్రధాన కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక శక్తులు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. వివిధ రకాల సంఘాలను స్థాపించి విద్యార్థి యువతలో కుల రాజకీయ పేరుతో ముందుకు వస్తున్న శక్తులను తిప్పికొట్టడానికి యువత సన్నద్ధం కావాలి. దేశంలో విదేశీ భావజాలంతో కూడిన రోజుకో డేల పేరుమీద జరుగుతున్న తీరును పక్షత సంస్కృతిని నేటి యువత విడనాడాలి.
నేటి విద్యార్థి సమాజాన్ని చదివి దేశ విదేశాలకి నూతన ఆవిష్కరణలు అందించే శక్తి సామర్థ్యాలు ఉన్న విద్యార్థికి ప్రత్యేక దినంగా ఏబీవీపీ జూలై 9ను దేశవ్యాప్తంగా జాతీయ విద్యార్థి దినోత్సవంగా నిర్వహిస్తోంది. దీనిలో విద్యార్థి, యువత, మేధావులు అందరూ పాల్గొని రాబోయే తరాలకు మార్గదర్శనం చేయాలి. స్వామి వివేకానందుని మాట ఏబీవీపీ బాటగా నేడు సమాజంలోని అంతరాలను తొలగించేందుకు పనిచేస్తూ 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని మీ ముందుకు వస్తున్న విద్యార్థి పరిషత్‌ని కుల, మత, వర్గ, భేదాలు లేకుండా విద్యావంతులు, మేధావులు అందరూ ఆదరించి ఈ జాతీయ పునర్నిర్మాణ మహా యజ్ఞంలో అందరూ భాగస్వాములు అవుతారని ఆశిద్దాం.
– ఈర్ల రాకేష్
ఏబీవీపీ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు
(విజయక్రాంతి సౌజన్యం తో)