ఒక జాతి స్వభావాన్ని వివరించడం కష్టం. ఒక మతం, భాష, కులం, తెగ – వివిధ రకాలుగా విడిపోయిన హిందువుల స్వభావాన్ని వర్ణించడం దాదాపు అసాధ్యం. ఏదేమైనప్పటికీ, కొందరు విదేశీ పరిశీలకులు తమ అనుభవాల ఆధారంగా హిందువుల స్వభావాన్ని వివరించడానికి ప్రయత్నించారు. కాలక్రమేణా వచ్చిన అటువంటి వివరణల సంగ్రహం క్లుప్తంగా పరిశీలిద్దాం.
పర్షియన్ రాజు అర్తహషస్త వద్ద పనిచేసిన గ్రీకు వైద్యుడు క్టేసియస్ తన గ్రంథం (404-358BC) లో ”హిందువుల న్యాయ విధానం” గురించి ఒక ప్రత్యేక అధ్యాయం పొందుపరిచారు. దొంగతనాలు చాలా అరుదనీ, ప్రజలు సత్యాన్నీ, నిజాయితీని గౌరవించేవారనీ, మెగస్తనీస్ తన గ్రంథం ఇండికాలో వివరించాడు.
అరియన్ (సి86-160AD) అధికారగణం గురించి “వారు దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో జరుగుతున్న విషయాలను పర్యవేక్షించి, రాచరిక పాలన ఉన్న చోట్ల రాజుకు, ప్రజా స్వయంపాలన ఉన్నచోట్ల న్యాయాధికారులకూ నివేదించేవారు. తప్పుడు నివేదిక ఇచ్చే ఆచారం లేదు. ఒక్క హిందువు పైనా అసత్య భాషణ ఆరోపణ లేదు” అని వ్రాశారు.
629-645AD మధ్యకాలంలో భారతదేశంలో పర్యటించిన చైనా బౌద్ధ సన్యాసి హ్యుయాన్‌త్సాంగ్ ఆయన సందర్శించిన వివిధ ప్రాంతాల ప్రజల స్వభావం, మర్యాద, మన్ననలు, రీతి, రివాజుల గురించి 30 పైగా విశేష వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలను ఐదు సమూహాలుగా వర్గీకరించవచ్చు. చురుకైన – ఉగ్రమైన, ఉల్లాసమైన- సాహసోపేతమైన, వీర-ఉగ్ర, కఠిన-భయంకర, న్యాయం, ధైర్యం పట్ల గౌరవం, సామాన్యమైన – నిజాయితీతో కూడిన, స్థిర నిశ్చయం- క్రూరత్వం, పట్టుదల- సాహసం మొదటి వర్గీకరణ సమూహంలో ఉన్నాయి.
రెండవ సమూహంలో పిరికి-మృదువు, ఆమోదనీయ మృదుస్వభావం, విధేయత-ధర్మనిరతి, మృదుస్వభావ ఆత్మ సంతృప్తి, పోటీతత్వంతో శాంతి కాముకత, చులకనయైన, బలహీనమైన భీరువులు ఉన్నాయి.
మూడవ సమూహంలో చిత్తశుద్ధితో కూడిన నిజాయితీ (మూడుసార్లు పేర్కొన్నారు); స్వచ్ఛత నిజాయితీ ఉన్నాయి.
నాల్గవ సమూహంలో మృదువైన-పిరికి, తెలివి తక్కువ-కృత్రిమ, సాహసానికి ప్రాధాన్యం, భయం కరమైన, వంచన- అనాగరికత, కఠినము – కరకు, చలనం లేని-కాపట్యం వంటి కొన్ని సానుకూల గుణాలతో కలసి ఉన్న ప్రతికూల లక్షణాలను చేర్చారు.
ఇక ఐదవ సమూహంలో కఠినమైన – కరకైన – అనాగరిక, శీఘ్ర- హింసాత్మక, ఒంటరి, హింసాత్మక – తల బిరుసు; శీఘ్ర- అనాలోచిత వంటి అసహ్యమైన అంశాలు ఉన్నాయి.
“మైసూరుకు చెందిన ఈ అబైయమాన్‌లు (బ్రాహ్మణులు, వ్యాపారులకు మార్కోపోలో ఈ పదం ఉపయోగించారు) ప్రపంచ అత్యుత్తమ వ్యాపారులు, అత్యంత నిజాయితీ పరులు, ఎటువంటి పరిస్థితులలోను అబద్ధం పలుకరు” అని చెప్పారు మార్కోపోలో (1254-1324).
ముస్లిం చరిత్రకారులు కూడా వారి అధీనంలోని హిందువుల విషయాలను రాశారు. ఇద్రిస్ (11వ శతాబ్దం) తన భౌగోళిక శాస్త్రంలో హిందువుల గురించి. తన అభిప్రాయాన్ని ఇలా క్రోడీకరించాడు. “హిందువులు సహజంగానే న్యాయం వైపు మొగ్గు చూపుతారు. వారి చర్యలలో ఎప్పుడూ న్యాయానికి దూరంగా వెళ్ళేవారు కాదు. వారి విశ్వాసం, నిజాయితీ, వారి నిశ్చితార్థాల పట్ల విశ్వసనీయతా బాగా తెలిసినవే. వారి ఈ లక్షణాలు ప్రసిద్ధం కావడంతో అన్ని దిక్కుల నుండి ప్రజలు వీరి దేశానికి వస్తారు”.
13వ శతాబ్దానికి చెందిన షెంషెద్దిన్ అబుఅబ్దుల్లా (1320-1380)- “హిందువులు ఇసుక రేణువుల వలె అసంఖ్యాకులు. వారు వంచన, హింసలకు దూరంగా ఉంటారు. వారికి జీవన్మరణాల భయం లేదు” అన్నట్లు బెడీజుర్ జెనాన్ ఉటంకించాడు.
“హిందువులు దైవభక్తికలవారు, సులభంగా స్నేహం చేసేవారు, ఉత్సాహవంతులు, ధర్మాన్ని అభిమానించేవారు, వ్యాపార దక్షులు, సత్యాభిమానులు, కృతజ్ఞత, అపరిమిత విశ్వసనీయత కలవారు; ఇక్కడి సైనికులకు రణరంగంలో వెన్ను చూపడం తెలియదు” అని 16వ శతాబ్దంలో అక్బరు వద్ద చరిత్రకారుడుగా పనిచేసిన అబుల్ ఫజల్ (1551-1602) ప్రకటించాడు.
వారి ఆధీనంలో ఉన్న హిందువుల గురించి బ్రిటిష్ వారి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. “వీరు సున్నితమైన వారు, దయాళువులు, కృతజ్ఞతకు, దయకు లొంగిపోయేవారు, ప్రపంచంలోని ఏ యితర ప్రజల కంటే కూడా ప్రతీకార వాంఛ తక్కువగా కలవారు, విశ్వాసపాత్రులు, అభిమాన పాత్రులు, చట్టపరమైన అధికారానికి లొంగి ఉండేవారు” అని వారెన్ హేస్టింగ్స్ (1732-1818) అభిప్రాయ పడ్డారు.
“హిందువులు ధైర్యవంతులు, మర్యాదస్తులు, మేధావులు, జ్ఞానం, అభివృద్ధుల పట్ల ఆసక్తికలవారు, గంభీరమైన వారు, కష్టపడేవారు, తల్లిదండ్రులకు విధేయులు, తమ సంతానాన్ని అభిమానించేవారు. సున్నితత్వం, ఓరిమి ఏకరీతిగా ఉండేవారు. నేను ఇంతవరకు కలిసిన వారందరిలోనూ తమ కోరికలు, భావాలపట్ల చూపిన దయ, శ్రద్ధ వలన సులభంగా ప్రభావితమయ్యే వారు” అని బిషప్ హెబర్ (1783-1826) అభిప్రాయపడ్డారు.
“భారతీయులకు నాగరికత నేర్పడమంటే అర్థం ఏమిటో నాకు తెలియదు. మంచి ప్రభుత్వ సిద్ధాంతమూ, ఆచరణలో వారిలో కొంత లోపం ఉండవచ్చు. కాని, ఒక మంచి వ్యవసాయ వ్యవస్థ, ఎదురులేని తయారీ పద్ధతులు, విద్యాభివృద్ధి కొరకు పాఠశాలల స్థాపన, దయ, ఆతిథ్యాల ఆచరణ, వీటన్నిటికీ మించి, స్త్రీల పట్ల సున్నితత్వం, ఖచ్చితమైన గౌరవం – ఇవే నాగరిక ప్రజలను సూచించినట్లైతే, హిందువులు నాగరికత విషయంలో యూరోపు ప్రజలకు ఏమాత్రం తీసిపోరు” అని సర్ థామస్ మన్రో (1761-1827) అభిప్రాయపడ్డారు.
“శ్రమకు విసుగు చెందని ఉత్సాహం వారిలో చూశాను. ఉన్నతాధికారుల ఆజ్ఞలను సహృదయంతో పాటించడం, వారి నుండి ఆశింపబడే శ్రమకు సంసిద్ధత, వారిలో చూశాను. త్రాగుడు, క్రమరహిత ప్రవర్తన, అవిధేయత వారిలో కనిపించ లేదు. తగినంత నైపుణ్యం, విధేయత వారిలో ఉన్నాయి. భయరహిత విశ్వాసం ఉన్న హైందవ స్వభావంలో నిష్కాపట్యం సార్వజనీన లక్షణంగా ఉంది” అంటూ శ్రామిక వర్గం గురించి హెచ్.హెచ్.విల్సన్ (1786-1860) అభిప్రాయపడ్డారు.
“వారి వృత్తి, వ్యాపకాలకు ప్రత్యేకమైన పోలిక ఉన్న ఇతరులలో ఉన్న కష్టపడేతత్వం, తెలివితేటలు, ఉత్సాహం, నిష్కాపట్యం వంటి సద్గుణాలను వీరిలో గమనించాను” అని విల్సన్ పండితుల గురించి వ్యాఖ్యానించారు.
“మెరుగైన సభ్యత, అవగాహనలో స్పష్టత, పరిపూర్ణత; ఆలోచనలలో సరళత, నియమాలలో స్వతంత్రతలతో ప్రపంచంలో ఏ దేశంలోనైనా వీరిని పెద్ద మనుషులుగా గుర్తిస్తారు” అంటూ ఉన్నత వర్గాల గురించి విల్సన్ వ్యాఖ్యానించాడు.
“వీరు అలవాటుగాను, తప్పనిసరిగాను సత్యానికి అంకితమై ఉంటారు. ఒక వ్యక్తి ఆస్తులు, స్వాతంత్య్రం, అంతేకాక అతడి ప్రాణాలు కూడ ఒక అసత్యం చెప్పడంపై ఆధారపడినప్పటికీ, అతడు వీటిని కాపాడుకోవడానికి అసత్యం పలకడానికి తిరస్కరించిన వందలాది సంఘటనలు నా ముందున్నాయి. హిందూ వ్యాపార వర్గాల వారి కంటే తమ వ్యవహారాలలో ఎక్కువగా గౌరవించవలసిన వారు ప్రపంచంలో ఎక్కడా లేరు” అని సర్ విలియం స్లీమాన్ (1788-1856) అన్నారు.
– గౌతమ్ పింగళే