Home Hyderabad Mukti Sangram హైద‌రాబాద్ (భాగ్య‌న‌గ‌రం) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న – మొద‌టి భాగం

హైద‌రాబాద్ (భాగ్య‌న‌గ‌రం) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న – మొద‌టి భాగం

0
SHARE

నిజాం సంస్థాన స్వరూపం

– డా. శ్రీరంగ్ గోడ్బోలే

ప్రస్తుతం దేశమంతా స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుగుతున్నా, నిజానికి దేశం మొత్తానికి ఒకేసారి (1947లో) స్వాతంత్య్రం రాలేదు. హైదరాబాద్ కు (17 సెప్టెంబర్ 1948), దాదరా నగర్ హవేలి (2 ఆగస్టు 1954), పాండిచేరి (నవంబర్ 1954), గోవాకు (19 డిసెంబర్ 1961) స్వాతంత్య్రం లభించింది. స్వాతంత్య్ర పోరాటం అంటే దేశంలోని ఈ అన్ని రాష్ట్రాల పోరాటం కూడా. వీటిలో హైదరాబాద్ విముక్తి కొరకు సాగిన పోరాటం చాలా విశేషమైనదే కాక సంఘర్షణభరితమైనది కూడా.

మొగలు బాదషా ఫారూక్ సియర్ (పరిపాలనా కాలం 1713 – 1719) 1719లో మీర్ కమృద్దీన్ అనే తన సర్దారును దక్షిణ భారతదేశానికి తన ప్రతినిధిగా పంపాడు. అతని పాలనా విధానంతో సంతృప్తి చెంది అతనికి ‘నిజామ్-ఉల్-ముల్క్ ‘(అంటే – రాజ్య వ్యవస్థాపకుడు) అనే బిరుదు ఇచ్చాడు. ఆ తరువాత బాద్షా ముహమ్మద్ షా (శాసన కాలం -1919-1947), ఇతనిని ‘ఆసఫ్ జాహ’ (అంటే – క్రైస్తవ రాజు సోలమన్ వద్ద వున్న అసఫ్ అనే వజీరుతో సరైనవాడు అని అర్థం. ఇది మొఘలు రాజ్య వ్యవస్థలో సర్వోచ్చ పదవి) అనే పదవిని ఇచ్చాడు. ఆ తరువాత మొఘలు సామ్రాజ్యం అస్తవ్యస్తం అయిందని తెలుసుకున్న మీర్ కమృద్దీన్ 1724 లో ఒక కుటుంబ కార్యక్రమంలో హైదరాబాదును స్వతంత్ర రాజ్యాంగ ప్రకటించుకున్నాడు. ఆ తరువాత భారతదేశం పై ఆంగ్లేయులు తమ ఆధిపత్యాన్ని సాధించాక నిజాము వాళ్ళతో చేతులు కలిపాడు. 1778 నుండి ఆంగ్లేయులు తమ పర్యవేక్షక అధికారి (రెసిడెంట్)ను హైదరాబాద్ సంస్థానంలో ఉంచేవారు. అయితే 1800 అక్టోబరులో ఆంగ్లేయులు, నిజాం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం హైదరాబాద్ ని ‘సంరక్షిత రాజ్యంగా’ ప్రకటించారు. 1857 తిరుగుబాటుని అణచడంలో నిజాం ఆంగ్లేయులకి చాలా సహకరించాడు. ఆ తరువాత ఆంగ్లేయులు, నిజాం మధ్య 1936లో కుదిరిన ఒప్పందం మేర “వర్హాడ్ ప్రాంతం”పై నిజాంకు అధికారం వచ్చింది. ఎన్నోసార్లు యుద్ధభూమిలో మరాఠాల చేతిలో మట్టికరిచిన నిజాం ఆంగ్లేయుల పుణ్యమా అని 1948 వరకు ఈ ప్రాంతంపై అధికారం చెలాయించాడు.

సెప్టెంబరు 1938 నుంచి ఆగస్టు 1939 వరకు హైదరాబాద్ సంస్థానంలో స్వాతంత్య్రం కోసం తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటును ‘భాగానగర్ నిఃశ్శస్త్ర ప్రతీకార్’ (భాగానగర్ నిరాయుధ ప్రతిఘటన) అని కూడా అంటారు. ఈ తిరుగుబాటును ముఖ్యంగా ఆర్యసమాజ్, హిందూ మహాసభ, కాంగ్రేస్ నడిపాయి. ప్రొ. డా. చంద్రశేఖర లోఖండే వ్రాసిన ‘హైదరాబాద్ ముక్తి సంగ్రామ్ కా ఇతిహాస్ ‘ (శ్రీ ఘుడమల్ ప్రహ్లాదకుమార్ ఆర్య ధర్మార్థ ట్రస్ట్, హిండోన్, రాజస్థాన్, 2004) లాంటి పుస్తకాలలో ఈ విముక్తి పోరాటంలో ఆర్య సమాజ పాత్ర సవివరంగా కనిపిస్తుంది. అలాగే శ్రీ శంకర రామచంద్ర (మామా రావ్ దాతే ) వ్రాసిన ‘Bhagyanagar struggle : a brief history of the movement led by Hindu Mahasabha in Hyderabad state in 1938-1939 (కాళ ప్రకాశన్, పుణే 1940) పుస్తకంలో హిందూ మహాసభ నిర్వహించిన పాత్ర వివరంగా ఉంది. ఈ పోరాటంలో కాంగ్రెస్ పాత్రను వివరించే అనేక పుస్తకాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత వ్యాస పరంపర ముక్తి సంగ్రామంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకుల పాత్రకు సంబంధిత వివరాలు మీ ముందుంచుతుంది. ఈ ముక్తి సంగ్రామంలో సంఘ స్వయంసేవకులు హిందూ మహాసభ ద్వారా పోరాడారు .

హైదరాబాదు సంస్థాన అంత‌రంగ పరిశీలన : 

హైదరాబాద్ సంస్థాన వార్షిక నివేదిక ఆధారంగా అఖిల భారతీయ హిందూ మహాసభ ఉపాధ్యక్షులు, ప్రఖ్యాత న్యాయవాది అయిన లక్ష్మణ్ బలవంత్ (అణ్ణాసాహేబ్)భోపట్ కర్ వ్రాసిన ‘హైదరాబాద్ సంస్థానాచే అంతరంగ నిరీక్షణ్ ‘(హైదరబాద్ అంతర్గత పరిశీలన) అనే వ్యాసంలో (కేసరి , 17 మార్చ్ 1939) నిజాం పాలనలోని వాస్తవిక విషయాలను వివరించారు . లోఖండే, దాతేలు వ్రాసిన పుస్తకాలలో కూడా నిజాం పరిపాలనా విధానాలను వివరించారు. ఈ వివరాలన్నింటిని బట్టి నిజాం సంస్థానపు స్వరూపం ఇలా ఉండేది :

1 మహారాష్ట్ర, వర్హాడ్, కర్ణాటక ఇంకా ఆంధ్ర ప్రాంతాలలో విస్తరించిన హైదరాబాదు సంస్థానపు క్షేత్ర ఫలం సమారు 72,698 చ.మైళ్ళు. అందులో 9515 చ.మై. భూభాగం అటవీ ప్రాంతం . అంటే ఈ నిజాము సంస్థానం బెంగాలంత పెద్దదిగా వుండి (అంటే ఒక్క ముంబై ప్రాంతం 70,035 చ.మై. అంటే ఇంగ్లండ్ – స్కాట్లాండ్ రెండిటి ఉమ్మడి భూభాగం 70,752 చ.మై) అందులో ఐదు మహానగరాలు , 118 నగరాలు, 21,708 గ్రామాలు వుండేవి. హైదరాబాదు సంస్థాన మరాఠ్వాడా విభాగంలో ఔరంగాబాద్, పరభణి, నాందేడ్, ఉస్మానాబాద్ ఇంకా లాతూర్ అనే ఐదు జిల్లాలు ఉండేవి.

2 జనాభా (సుమారుగా 1.4 కోట్లు) పరంగా చూస్తే హైదరాబాద్ అన్నిటికన్నా పెద్ద సంస్థానం. ఈ సంస్థానంలో 1,29,28,876 మంది హిందువులు, 15,7,272 మంది ముసల్మానులు, 1,51,382 మంది క్రైస్తవులు, 7,084 మంది పారసీలు ఇంకా 28 మంది యూదులు ఉండేవారు. హిందువులలో 60,15, 172 మంది తెలుగువారు. 32,96,858 మంది మరాఠీలు, 15,36,928 మంది కన్నడ వాళ్ళు ఉన్నారు. జనాభా లెక్కల ప్రకారం, సంస్థానంలో 1901లో 88.6% హిందువులు, 10.4% ముస్లింలు ఉండగా 1931 నాటికి 84.%హిందువులు, 10.6%మంది ముస్లింలు ఉన్నారు.

3 నిజాం వద్ద కార్యనిర్వాహక అధికారమే కాక న్యాయనిర్ణయాధికారము ఇంకా చట్టాలను రూపొందించే అధికారాలు కూడా ఉండేవి. ఏడుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వాహణ మండలి నిజాం చేతిలో కీలుబొమ్మ మాత్రమే. ఈ మండలిలో ఒక్క హిందువు మాత్రమే ఉండేవాడు. ఇదేకాక 21 మంది సభ్యులతో కూడిన నామమాత్రపు శాసనమండలి కూడా వుండేది. ఆ మండలి సభ్యులు ఏడాదికి ఒకటి రెండుసార్లు ఒక రెండు గంటలపాటు కలుసుకునేవారు. బ్రిటిష్ ఇండియాలో ఉన్న పురపాలక చట్టాలలాంటివేవి నిజాం హయాములో లేవు. హైదరాబాద్ పురపాలక సంస్థ ఒక ప్రభుత్వ శాఖ లాగా పనిచేసేది. స్థానిక జిల్లాల తహసీలు, శాసన మండలికి ఏవిధమైన అధికారాలు ఉండేవి కాదు. నిజాం తన ప్రజలను ఇష్టానుసారంగా పాలించటానికి బ్రిటిష్ వారు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.

4 శేరీ భూములు (నిజాం పేరు మీద ఆస్తి), రాజభవనాల నుండి నిజాంకి వచ్చే ఆదాయాన్ని మినహాయించి. సంస్థానం వార్షిక ఆదాయం ఎనిమిదిన్నర కోట్లు ఉండేది. నిజాంకి సొంత ఆస్తి ద్వారా రోజుకు వచ్చే ఆదాయం రూ.60,000 అయినప్పటికీ సంస్థానానికి వచ్చే వార్షిక ఆదాయంలోనుండి 50లక్షలు స్వంత ఖర్చులకని, 16లక్షలు రాజ కుటుంబీకుల ఖర్చులకని నిజాము తీసుకునేవాడు. ఆ రోజుల్లో ప్రపంచంలోని సంపన్నులలో ఒకడుగా నిజాముకి పేరు వుండేది .

5. విద్యాపరంగా నిజాం సంస్థానం చాలా వెనకబడి ఉండేది. అయితే విద్య పేరున చేసే ఖర్చు మాత్రం తక్కువ ఉండేదికాదు. అయినప్పటికీ విద్యారంగం అందులోనూ ప్రాథమిక విద్యారంగం ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. 1881లో అక్షరాస్యత వెయ్యికి 37% వుంటే ఖర్చు రూ.2,29,220. 1921 లో వెయ్యికి 33% అక్షరాస్యత ఉండి ఖర్చు మాత్రం 68,29,902 రూపాయలకు పెరిగింది. 1921నుండి 1936 మధ్య కాలంలో విద్య పేరుతో అయ్యే ఖర్చు పెరిగిందేకాని అక్షరాస్యత మాత్రం పెరగలేదు.

6. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. లక్షల రూపాయలు విశ్వ విద్యాలయ భవనాల నిర్మాణానికి ఖర్చు చేశారు. కానీ శిక్షణ స్థాయిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. సంస్థానంలో ముస్లిం జనాభా పదిశాతం కన్నా లేకపోయినా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నూటికి 60 శాతం ఉన్న ముస్లిం విద్యార్థులకి మాత్రం 75% ముస్లిం అధ్యాపకులు ఉండేవారు. వాళ్ళల్లో చాలామంది, దాదాపుగా అందరూ , సంస్థానం బయటనుండి వచ్చిన వాళ్ళే. భారతీయ వాజ్మయం, శాస్త్రాల శిక్షణ కన్నా ఇస్లామీ సంస్కృతి, ఉర్దూ భాషకే ప్రాధాన్యత. అందుకు భారీగా నిధులు ఖర్చు చేసేవారు.

7. గురుకుల పాఠశాలల్లో హిందూ ఆచార వ్యవహారాలు, తాత్విక పరంపరను పెంపొందిస్తాయి, కాబట్టి సాధ్యమైనన్ని నిబంధనలు, చట్టాలను వాటికి వ్యతిరేకంగా రూపొందించి ఆ బడులు యావత్తూ నడువకుండా చేశారు. 1923 లో గురుకుల పాఠశాలల సంఖ్య 4063 వుండగా, 1926కల్లా 3142 కి పడిపోయింది. 1935 లో 500వున్న పాఠశాలలు, 1939 లో అసలు లేకుండాపోయాయి.

8. 1924 – 1931 కాలంలో ముస్లిం సంస్థలకి లక్షల రూపాయల సహాయం లభిస్తే, 90%వున్న హిందువుల సంస్థలకి మాత్రం కొన్ని వేల రూపాయలు కూడా లభించలేదు. ఇదేకాక సంస్థానం బయట వున్న ముస్లిం సంస్థలకి ప్రతి సంవత్సరం 56లక్షలు ధనసహాయంగా మంజూరయ్యేది.

9. మతపరమైన (రిలీజియస్ ) విషయాలకై సంస్థానంలో ‘ఉమర్ మజ్హబీ’ అనే విభాగం వుండేది. “మసీదులు , దేవాలయాలు , చర్చ్ ల వ్యవహారాల పర్యవేక్షణ, ధార్మిక శిక్షణ సంస్థలు నడపటం , ముఖ్యమైన ధార్మిక ఉత్సవాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా చేసుకోవటానికి సహకరించటం” వంటివి ఈ విభాగపు విధులు. 1936 – 1937 సం.లలో ఆరు నుండి పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ప్రతి సంవత్సరం 34 లక్షలు ఖర్చు చూపుతూ హిందువుల ధార్మిక, సామాజిక కార్యక్రమాలకు మాత్రం ఎన్నో అవాంతరాలను సృష్టించేవారు . హిందూ ధార్మిక భావాలను అటకెక్కించి, కొత్త కొత్త చర్చ్ లు , మసీదులను నిర్మించేవారు . హిందూ దేవాలయాలలో సంవత్సరానికి ఒకసారి కూడా సున్నాలకి, చిన్నచిన్న మరమ్మతులకి కూడా డబ్బు ఇచ్చేవారుకాదు . ఇక కొత్తదేవాలయాల సంగతి అసలు చెప్పే అవసరంలేదు . హిందువులు ఏవైనా వాయిద్యాలు వాయించాలంటే అక్కడున్న మసీదుకి చుట్టూ మూడువందల గజాలవరకు దూరం వుండాలని నిబంధన వుండేది . షియా పంథాకు చెందిన నిజాముకి ముహర్రమ్ చాలా విశేషమైన పండుగ. ఒకవేళ ఏదైనా హిందూ పండుగ ముహర్రంతో కలిసి వస్తే హిందువులు ఆ పండుగ జరపటానికి అనేక ఆంక్షలు విధించేవారు.

10. 1934, జనవరి 23న ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆర్యసమాజ భవనం ముందర హవనము, సత్సంగము, లేక ఉపదేశము నిర్వహణపై నిషేధం విధించారు. 1934, ఏప్రిల్ 12న ఆర్యసమాజ భవనం లోపల కూడా ప్రవచనానికి వీలులేదు. ఒకవేళ ప్రవచనం ఏర్పాటుచేస్తే దాని ప్రతిని ముందుగా ప్రభుత్వానికి పంపాలి .1935 లో ప్రవేశపెట్టబడిన క్రమసంఖ్య 52-53 నిబంధనల ప్రకారం అన్ని హిందూ దేవాలయాలలో గంట కొట్టడం, కీర్తన చేయడం (హరికథ, బుర్రకథల్లాంటివి), ధ్వజారోహణ, ప్రవచనం మొదలైనవి నిషిద్దం.

11. 90% హిందువులు ఉన్నప్పటికీ సంస్థానంలోని పాలనా రాజకీయాలలో వాళ్ళ సంఖ్య నామమాత్రంగానే ఉండేది. 1931లో నిజాం ప్రభుత్వ సచివాలయంలో 263 మంది హిందువులు, 864 మంది ముస్లింలు, 73 మంది క్రైస్తవులు, 36 మంది పర్షియన్లు ఉండేవారు. వీరు ఆర్థిక శాఖ, మాల్గుజారి(వస్తుసేకరణ ), న్యాయ శాఖ , పోలీసు, జైళ్లు , విద్య , వైద్యం , పబ్లిక్ వర్క్స్‌ లలో ఉన్నారు . అంటే ఉన్నతపదవుల్లో వేయి మందికి ఒక హిందువు, వందకి ఆరుగురు ముస్లిములు, వందకి ఐదుగురు క్రైస్తవులు, వందకి యాభై మంది పారసీలు ఉండేవారన్నమాట. పై వివరాలు 1931 సంవత్సరానివి కాగా 1939 నాటికి హిందూ ఉద్యోగుల సంఖ్య మరింత తగ్గిపోయింది.

12. పోలీసు శాఖలో దాదాపుగా అందరూ ముస్లిములే వుండేవారు. ఇతరులు ఎవరైనా ఉన్నా, వాళ్ళ తరువాత ముస్లిములనే భర్తి చేసుకునే వాళ్ళు. సంస్థానపు సైన్యంలో హిందువులకి అవకాశం వుండేది కాదు. అరబ్బులు, ఉత్తరభారత దేశంలోని ముసల్మానులను మాత్రం ప్రముఖంగా భర్తీ చేసుకొనే వాళ్ళు.

13. మరాఠీ, తెలుగు, కన్నడ భాషీయులను, ఉద్దేశ్యపూర్వకంగా పక్కకు పెట్టి వాళ్ళ స్థానంలో ముస్లిములు, ఉర్దూ భాషీయులను ఉద్యోగులుగా పెట్టుకునే వాళ్ళు. కొటిన్నర జనాభాలో ఉర్దూ భాషీయులు గుప్పెడు మందే ఉన్నారు . మిగతా వాళ్ళు కన్నడ , తెలుగు, మరాఠీ భాషీయులు , అయినా ప్రాథమికపాఠశాలల నుండి విశ్వవిద్యాలయం శిక్షణ వరకు విద్య పార్సీ, అరబ్బు భాషల మిశ్రమమైన హైదరాబాదీ ఉర్దూలో ఇచ్చేవారు.

14. సంస్థానం పరిపాలనా విధానాన్ని ముక్తకంఠంతో పొగిడే పత్రికలు తప్ప మరే పత్రిక సంస్థానంలో నడిచేవి కావు . స్వతంత్ర భావాలు గల ప్రచురణ సంస్థలకు ఎలాంటి ప్రచురణలు చేయటానికి అనుమతి వుండేది కాదు. అరబ్బి , పార్సీ , ఉర్దూ భాషల్లోనే ప్రచురణకి అనుమతి వుండేది . 1935లో ఈ భాషల్లో 698 పుస్తకాలు ప్రచురితమయ్యాయి . అందులో 11 అరబ్బీ, 6 పార్సీ, 475 ఉర్దూ, 8 ఉర్దూ, అరబ్బీ, 1 ఉర్దూ, తెలుగు, 13 ఆంగ్ల పుస్తకాలు, 2 ఆంగ్లం, హిందీ , 1 ఆంగ్లం, అరబ్బీ , 74 తెలుగు , 25 మరాఠీ , 5 సంస్కృత , 2 హిందీ , 3 మార్వాడీ, 10 కన్నడం పుస్తకాలు ప్రచురితమయ్యాయి .

15. సామాజిక అధికారం అంటే ఏమిటో కూడా హైదరాబాద్ సంస్థాన ప్రజలకి తెలియదు . సామాన్యమైన ధార్మిక ఉత్సవానికి, సమ్మేళనాలకి కూడా అధికారుల అనుమతి తీసుకోవలసివచ్చేది .

దుర్భ‌లుల‌ శోషణ :

నిజాం సర్కారు ధోరణి కారణంగా సంస్థానంలోని రైతులు నిరాశపడసాగారు. సంస్థానంలో రహదారుల నిర్మాణం కోసం రైతుల వద్ద తీసుకున్న భూములకి నష్ట పరిహారం ఇవ్వకపోగా, అక్కడ పంట పండించకున్నా దానిపై పంట శిస్తును వసూలు చేసేవారు. అంతే కాకుండా ప్రతి గ్రామంలో ఉండే పశుచర భూమిని లాగోడీకి(పంట సాగుకి) ఇవ్వడం మొదలు పెట్టారు. దాంతో పశువుల మేత చాలా పెద్ద సమస్యగా మారింది . రైతులకి పశుపాలన కష్టతరం అయిపోయింది.

“దస్తురుల్ అమ్మల్ ఇంతెకాలాత్ అరాజీ – జిరాయతీ” అనే నియమం నిజాంషాహీ ఫర్మాన్ ద్వారా అమలులోకి వచ్చింది. దీని ప్రకారం రైతులు తమ భూమి కోసం షావుకారు వద్ద అప్పు తీసుకుంటే, దానికి ఈ నియమం శాశ్వత పరిష్కార మార్గం అని చెప్పారు . ఈ నియమం ప్రకారం ఇరవై ఏళ్ళ కాలంలో ఏ రైతు పంట కోసం షావుకారు దగ్గర అప్పు తీసుకునిఉన్నాడో, ఆ అప్పు తీసుకున్నవారు ఒప్పుకున్న సమయం వరకు షావుకారు భూమిని తన వద్ద ఉంచుకుని, అప్పుకు సరిపడా పంటని రాబట్టుకుని, ఆ తరువాత రైతుకి తిరిగి ఇచ్చేయాలని అర్థం. ఈ విధానం వల్ల భూమిని అమ్మటానికి రైతుకున్న అధికారాన్ని సర్కారు లాగేసుకుంది.

హైదరాబాదులో కూరలమ్ముకునే వాళ్ళు బుట్టబట్టుకుని వచ్చేవాళ్ళు ,వీళ్ళే కాక మరెవ్వరైనాసరే తమ వస్తువుని నగరాల్లో అమ్ముకోవడానికి తెచ్చినప్పుడు, వాళ్ళవద్ద “కరోడ్ గిరి ” అంటే “జకాతు” తీసుకొనే వాళ్ళు. అదే వస్తువును మళ్ళీ గ్రామాల్లోకి తెస్తే మళ్ళీ “తయబ్ దారీ “అనే వసూలీ జరిగేది. ఈ విధంగా ప్రతి గంపకి లేదా ప్రతి మొతకి “తయబ్ దారీ” రెండు పైసలు పడేది. పైగా దీని వసూలుకి ఎలాంటి అధికారిక నియామకం వుండేది కాదు. చుట్టుపక్కల తిరిగే ఏ ముస్లిమైనా దీని వసూలుకి వచ్చేవాడు. ఆ నెపంతో అమ్ముకోవడానికి వచ్చిన ఆడవాళ్ళ వెంటపడేవాడు. ఆ సమయంలో ఆ ఆడమనిషి దగ్గర డబ్బు లేకపోతే ఆమె ఇంటిదాకా వెళ్ళేవాడు, ఇంట్లో ఎవరూ కనబడకపోతే ఇక ఆ మహిళ పరిస్థితి దుర్భరమయ్యేది. మరికొన్ని సందర్భాల్లో సరుకు లాక్కు పోయేవాళ్ళు. (కేసరి, 8 మార్చి 1927 ) .

ఇస్లాం స్వీకరించాలనే ఒత్తిడికి తలవంచని ఒక అస్పృశ్యురాలి కథ “కేసరి” సంచికలో (3 మే 1927 ) ప్రచురితమైంది. 1927 ఏప్రిల్ 16న మాహూరులో చైత్రీ యాత్ర మొదలైంది. దానికోసం కట్టిన ధర్మసత్రంలో హిందూ భక్తులు వుండగా, వాళ్ళలో పది పన్నెండు మందిని ఈ ముస్లిం తీవ్రంగా కొట్టాడు. అంతే కాదు వాళ్ళని అక్కడినుండి గెంటి వేసాడు కూడా. అంతకు మునుపు ఒక రోజు మాహూరులోని రామీ అనే యుక్త వయసుగల విధవ మహిళ తనను మరిది కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే అక్కడ ఆ హశము `నువ్వు ఇస్లాం మతం పుచ్చుకో అప్పుడు నీ మరిదిని జైల్లో పెడతాను’ అని ఆ మహిళపై ఒత్తిడి తెచ్చాడు. వాడి మాటలను లెక్క చేయక రామీ అక్కడ నుండి వెళ్ళి పోయింది. అప్పుడు ఆ హశము రామీ ఇంటికి సిపాయీలని పంపసాగాడు. `నువ్వు ఇస్లాం స్వీకరించకపోతే నిన్నే జైలులో పెడతాను’ అని భయపెట్ట సాగాడు.

హైదరాబాద్ సంస్థానంలో హిందువులకు వార్తాపత్రికలలో కానీ సార్వజనిక ప్రసంగాలలో కానీ తమ క‌ష్టాలను చెప్పుకునే అవకాశం లేదు. పీడిత హిందువులు సంస్థానంలోని అధికారులవద్ద కానీ లేక బ్రిటిష్ ప్రభుత్వం వద్ద కానీ చేసుకున్న ఫిర్యాదులకు ఎలాంటి ప్రతిస్పందన ఉండేదికాదు. దానివల్ల హిందువులకు నిజాము వ్యతిరేకంగా ఆయుధాలు పట్టడంతప్ప వేరే గత్యంతరం లేకపోయింది.

అనువాదం : పరిమళ నడింపల్లి