Home Hyderabad Mukti Sangram కనుమరుగైన విప్లవ వీరులు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-9)

కనుమరుగైన విప్లవ వీరులు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-9)

0
SHARE

కాని ఈ విప్లవ వీరులను తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. కొందరి కుటుంబాలు చెదిరిపోయాయి. మరికొందరు రోగగ్రస్తులై చికిత్సా సౌకర్యాలు లేక మరణించారు. ఈ విప్లవవీరులలో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకించి పేర్కొనవలసిన అవసరం ఉంది. ఉమ్రీ బ్యాంక్‌పై జరిగిన దాడికి నాయకత్వం వహించిన వ్యక్తి శ్రీ నాగనాథ్ పరంజపే. ఇతను బి.ఎస్సీ, యల్.యల్.బి. పట్టా పొందిన ఉన్నత విద్యావంతుడు. తండ్రి ఆనాటి రైల్వేలో ఒక అధికార హోదాలో ఉన్నాడు. పరంజపే ఆనాడు నిజాం సర్వీసులో పైలెట్‌గా శిక్షణ పొందాడు. మరో ఇద్దరు ముస్లిం యువకులతో పాటు బెంగుళూరు వెళ్ళి పైలెట్ శిక్షణను పూర్తిచేసి రమ్మని ప్రభుత్వం ఆదేశించింది.

అతను ప్రయాణమవుతుండగా మిత్రులు వచ్చి మందలించారు. మేమంతా దేశవిముక్తికి ప్రాణాలు అర్పిస్తూవుంటే నువ్వు పైలెట్‌గా నిజాంకు సేవచేస్తూ మాపైన బాంబులు వేయబోతున్నావా? అని విమర్శించారు. పరంజపే తాను చేయబోతున్న విద్రోహాన్ని గ్రహించుకొని ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు. ఆ తర్వాత, హైద్రాబాద్ విముక్తి పిదప పరంజపే పక్షవాతంతో బాధపడ్డాడు. అయినా దృఢదీక్షతో తనవంతు కృషిని కొనసాగించడం మాత్రం మానలేదు. పరంజపే నాందేడ్‌లో ఖాదీ గ్రామోద్యోగ సంస్థలో పరిశోధనలో నిమగ్నమై ఉన్నాడు. విద్యుత్ కార్మాగారాల్లో పనికి వచ్చే కాగితాన్ని తయారుచేయడంలో ఆయన విజయం పొందాడు. ఆ కాగితం వల్ల మన దేశానికి విదేశీ మారక ద్రవ్యం బాగా ఆదాయం అయ్యే అవకాశం ఉంది. దేశం కోసం జీవించడం, మరణించడం అంటే ఏమిటో పరంజపే నిరూపించాడు.

రెండోవ్యక్తి ఉమ్రీభామాషాగా పేరు పొందిన ధన్‌జీ పురోహిత్. ఇతను తన ఆస్తిని సర్వస్వం అమ్మి నలభైవేల రూపాయల సొమ్మును విప్లవకారులకు ఇచ్చాడు. ఆ డబ్బుతోనే ఆనాడు బొంబాయి నుండి హైద్రాబాద్ విముక్త దళాలు ఒక రహస్య రేడియో కేంద్రాన్ని నిర్వహిస్తూ ఉండేవి. బ్యాంక్ దోపిడీ తర్వాత కూడా పదివేల రూపాయల సొమ్మును తిరిగి ఇచ్చినా ధన్‌జీ తీసుకోలేదు. తాను చేసిన త్యాగానికి ప్రతిఫలం కోరలేదు. ఆ తర్వాత అతని కుటుంబం దారిద్య్రానికి లోనై అనేక బాధలను సహించింది. కొంత కాలం క్యాంటీన్ నడిపించాడు. మరికొంత కాలం చిన్న ఉద్యోగం. ఇలా చివరికి వృద్ధాప్యంలో రోగంతో కాలాన్ని గడుపుతూ వచ్చాడు. ఈనాడు హర్యానా రాష్ట్రంలో ఎక్కడో కోట దగ్గర శేష జీవితం గడిపనట్లు తెలుస్తున్నది.

ఉమ్రీ బ్యాంక్ దోపిడీవల్ల చేజిక్కిన డబ్బును కాంగ్రెస్ దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా విప్లవకారుల అంతిమ దినాలు మాత్రం విషాదకరంగా ముగిశాయి.

“స్వాతంత్ర వీరుల త్యాగాలను విస్మరించే
పాలకుల గుండెలు నిజంగానే రాతి గుండెలు.’

తెగించిన గూఢచారి

సభాస్థలం వేలాది ముస్లిం ప్రజలతో కిక్కిరిసి ఉంది. ఇస్లామియా గీతాలతో, నినాదాలతో వాతావరణం మార్మ్రోగుతోంది. మజ్లిసే ఇత్తెహదుల్ ముసల్మీన్ అధ్యక్షుడు ఖాసిం రజ్వీ వందనం స్వీకరిస్తూ వేదికవైపు వస్తున్నాడు. సాయుధులైన రజాకార్లు రెండవవైపులా ఉన్నారు. “ఆలీజనాబ్ సిద్దికె మిలత్‌”, రజాకార్ల “సాలెరెఅజమ్‌” (సర్వసేనాధిపతి) ఖాసిం రజ్వీ వేదిక ఎక్కగానే జనం నినాదాలు చేశారు. “షాహె ఉస్మాన్ జిందాబాద్, ఆజాద్ హైద్రాబాద్ పాయంబాద్ సిద్దికె మిల్లత్ ఖాసిం రజ్వీ జిందాబాద్‌” అనే నినాదాలు ప్రతిధ్వనించాయి. ఖాసిం రజ్వీ ఆవేశంతో ఉపన్యసిస్తూ హైద్రాబాద్ సర్వస్వతంత్ర ప్రాంతంగా కొనసాగించాలన్న తమ నిశ్చయాన్ని వ్యక్తం చేశాడు. భారత ప్రభుత్వంతో జరిగిన యథాతథ స్థితి ఒప్పందం గురించి చెబుతూ రెసిడెన్సీ నివాసం ప్రసక్తి తీసుకువచ్చాడు.

ఆ భవనంలో అప్పుడు భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్‌గా శ్రీ కె.యం. మున్షీ బసచేస్తున్నారు. ఆ భవనం సార్వభౌమాధికారాలకు చిహ్నం కాబట్టి దానిలో మున్షీ ఉండడానికి వీల్లేదని, అతను మకాం మార్చని పక్షంలో రెసిడెన్సీ భవనాన్ని నేలమట్టం చేస్తామని రజ్వీ బెదిరించాడు. ముస్లిం జనం జయ జయ ధ్వానాలతో ఆమోదించింది. ఫలితంగా నిజాం “ప్రభువు” శ్రీ కె.యం. మున్షీని మకాం మార్చవలసిందని ఆదేశించాడు. బొలారంలో నివాసం ఏర్పర్చుకోమని హుకుం జారీ చేశాడు. రెసిడెన్సీ భవనంలో పోలీసు ప్రధాన కార్యాలయం వెలిసింది. ఇది ఒక విధంగా ఖాసి రజ్వీకి రాజకీయమైన విజయం. నిజాం, రజ్వీల ఎత్తుగడలలో ఇది మరొక మెట్టు.

పూర్వ చరిత్ర

1947 నాటి పరిస్థితి ననుసరించి ఇండియా ప్రభుత్వం ఆనాటి సంస్థానాలకు సౌకర్యాన్ని కలుగచేసింది. భారత్‌లో, పాకిస్తాన్‌లో విలీనం కాదలచుకొనని సంస్థానాలు స్వతంత్రంగా ఉండవచ్చుననే సౌకర్యం అది. ఈ మిషతో నిజాం తన హైద్రాబాద్ సంస్థానాన్ని సర్వ స్వతంత్రంగా నిలుపుకోవాలని పన్నాగం పన్నాడు. కాని నిజాం చరిత్ర మరో చారిత్రక సత్యాన్ని వెల్లడించింది. గతంలో ప్రతి సామ్రాజ్య శక్తి ఎదుట నిజాం రాచరికం మోకరిల్లింది. తొలుత మరాఠా, ఆ తర్వాత ఫ్రెంచి  చివరకు ఇంగ్లీషు వాళ్ళకు నమ్మినబంటుగా వ్యవహరించాడు. ఇంగ్లీషు సామ్రాజ్యం భారతదేశంలో అస్తమిస్తున్నపుడు నిజాం తమను అసహాయులనుగా వదలి వెళ్ళిపోవద్దని ఇంగ్లీషు వాళ్ళను వేడుకొనడం దీనికి పరాకాష్ట.

(విజయక్రాంతి సౌజన్యం తో)