Home News పాకిస్థాన్ పై చర్యలు తప్పవు: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

పాకిస్థాన్ పై చర్యలు తప్పవు: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

0
SHARE

ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. జమ్మూలోని సైనిక శిబిరంపై ఈ నెల 10న జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. అత్యంత త్వరలోనే, ఏమాత్రం ఆలస్యం లేకుండా గుణపాఠం చెప్తామన్నారు. బుధవారం ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ హెచ్చరిక చేశారు.

యుద్ధం చేస్తున్నామని, దాని వల్ల తమకు లాభాలు వస్తాయని పాకిస్థాన్ అనుకుంటోందన్నారు. కానీ తమకు (భారతదేశానికి) చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. లక్షిత దాడులతో సహా అనేక రకాలుగా తాము గుణపాఠం చెప్పవచ్చునన్నారు. భారతదేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తుందన్నారు. నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాదులను పంపించడాన్ని పాకిస్థాన్ ఆపిన రోజే ఉద్రిక్తతలు ఆగిపోతాయని తెలిపారు.

జమ్మూలోని సుంజువాన్‌లో సైనిక శిబిరంపై ఈ నెల 10న జరిగిన ఉగ్రవాద దాడిలో ఆరుగురు జవాన్లు, ఓ పౌరుడు అసువులుబాసిన సంగతి తెలిసిందే. జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారు. రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ స్పందిస్తూ ఉగ్రవాదులకు పాకిస్థాన్ వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. ఈ దుస్సాహసానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాకిస్థాన్‌ను హెచ్చరించారు.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)