Home Telugu Articles హిందూ పాకిస్థాన్‌గా భారత్‌?

హిందూ పాకిస్థాన్‌గా భారత్‌?

0
SHARE

సమ్మేళనం, సమానీకరణం, సహజీవనం అనే సుదీర్ఘమైన ప్రక్రియ ద్వారా మన జాతీయ అస్తిత్వం ఏర్పడింది. ఆధ్యాత్మికతే మన విశాల, సమన్వయపూర్వక, సహనశీల, విశ్వజనీన ఆలోచనా ధోరణికి ఆధారం. దీనినే ‘హిందూ జీవన దృక్పథం’ అని సర్వేపల్లి రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఈ సహనశీల, సమన్వయపూర్వక, సంపూర్ణ, సమైక్య ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కొందరు నిరాకరించడం వల్లనే పాకిస్థాన్ ఏర్పడింది. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ నాయకులు విస్మరిస్తున్నారు.

భారతదేశ పేరుప్రతిష్ఠలు, అస్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా కాంగ్రెస్‌ నాయకులు కొందరు ప్రకటనలు చేయడం బాధాకరం. విద్యాధికులు అయిన ఈ నాయకుల ప్రకటనలు చూస్తూ ఉంటే మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ చెప్పిన మాట గుర్తుకువస్తుంది. మన దేశంలో (ఆంగ్ల)విద్యకున్న అభారతీయ లక్షణాన్ని గురించి 1949 విద్యాసంఘం నివేదికలో రాధాకృష్ణన్‌ ఇలా రాశారు. ‘‘శతాబ్ద కాలంగా మన దేశ విద్యా వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే, అది భారతదేశపు గతాన్ని పూర్తిగా విస్మరించింది. భారతీయ విద్యార్ధులకు తమ సొంత సంస్కృతి గురించిన జ్ఞానం ఏమాత్రం కలిగించడం లేదు. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో మనకి చెప్పుకోదగిన మూలాలు లేనేలేవని అనిపించేట్లు చేస్తోంది. ఇంకా కొన్ని సందర్భాల్లో అంతకంటే దారుణంగా, అసలు చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం కలవకుండా మన మూలాలే అడ్డుపడుతున్నాయనే భావం కలిగిస్తోంది!’’

ఇటీవల ఒక సీనియర్ కాంగ్రెస్ నేత అటువంటి అసంబద్ధమైన, దారుణమైన ప్రకటన ఒకటి చేశారు. భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ దేశం ‘హిందూ పాకిస్థాన్’ అయిపోతుందని ఆయన వాపోయారు. అభారతీయ కమ్యూనిస్ట్ ఆలోచనలు, భావాలు మనలో ఎంతగా పాతుకుపోయాయంటే, మన ఆలోచనా విధానమేకాదు, మన భాష, ఉపయోగించే మాటలు కూడా అలాగే ఉంటున్నాయి. హిందూ పాకిస్థాన్, హిందూ తాలిబాన్, హిందూ తీవ్రవాదం అనే పదాలు పూర్తిగా అభారతీయమైనవి. వీటిలో ‘హిందూ పాకిస్థాన్’ అనే మాట పూర్తిగా విరోధాభాస (oxymoron). ఈ అర్థం లేని ప్రకటన గురించి చర్చించడానికి ముందు అసలు భారత్ అంటే ఏమిటో, హిందూత్వ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇటీవల నాగపూర్‌లో మాట్లాడుతూ ‘‘యూరోప్‌లో జాతి – రాజ్య భావన వికసించకముందే భారత్ ఒక రాజ్యంగా విలసిల్లింది. పరిమిత భూభాగం, ఒకే భాష, మతవిశ్వాసాలు, సమాన శత్రుమిత్ర భావన అనే అంశాలపై యూరోప్‌లో జాతి–రాజ్యాలు ఏర్పడ్డాయి. మరోవైపు భారతీయ జాతీయవాదం ‘వసుధైవ కుటుంబకం’, ‘సర్వేభవంతు సుఖినః సర్వేసంతు నిరామయ’ అనే విశ్వజనీన భావాల ఆధారంగా ఏర్పడింది. ఈ విశ్వజనీన దృష్టికి మూలం భారతీయ తత్వచింతనలో ఉంది. మనం సర్వప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూస్తాం. అందరి సుఖశాంతులు కోరుకుంటాం. సమ్మేళనం (confluence), సమానీకరణం (assimilation), సహజీవనం (co-existence) అనే సుదీర్ఘమైన ప్రక్రియ ద్వారా మన జాతీయ అస్తిత్వం ఏర్పడింది. మతవిశ్వాసాలు, భాషలో బహుళత్వం భారతదేశ ప్రత్యేకత. మనది కేవలం ‘సహిష్ణుత’ కాదు. ఇతరుల పట్ల ‘గౌరవం’, ‘అంగీకారం’. మనం బహుళత్వాన్ని అంగీకరిస్తాం, గౌరవిస్తాం. ఆ బహుళత్వానికి గర్విస్తాం. శతాబ్దాలుగా ఇదే మన సామూహిక చింతన అయింది. కనుక మన జాతీయవాదాన్ని మూఢత్వం, మతగుర్తింపు, ప్రాంతీయ తత్వం, అసహనం, ద్వేషం ఆధారంగా నిర్వచించాలనుకోవడం దానిని పలుచన చేయడమే అవుతుంది’’ అని అన్నారు ఆయన.

ఇటువంటి విశాల, సమన్వయపూర్వక, సహనశీల, విశ్వజనీన ఆలోచనా ధోరణికి ఆధారం ఆధ్యాత్మికత. దీనినే ‘హిందూ జీవన దృక్పథం’ అని రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఈ జీవన విధానపు లక్షణాలను ఆయన ఇలా వివరించారు: -‘‘ హిందూ సంస్కరణ పద్ధతిలో ప్రతి సమూహానికి తన గత సంబంధాలను, వ్యక్తిత్వాన్ని, ప్రయోజనాలను నిలుపుకునేందుకు వీలు ఉంటుంది. విద్యార్థులకు తమ కాలేజీ ఎంత అపురూపమైనదో సమూహాలకు వారి దేవుళ్ళు అంత విలువైనవాళ్లు. కనుక విద్యార్థులను మెరుగుపరచడానికి కాలేజీ మార్చాల్సిన అవసరం లేదు. ప్రతి కాలేజీలో విద్యాప్రమాణాలను పెంచితే అప్పుడు ఏ కాలేజీలో చదివినా విద్యార్ధులు లాభపడతారు. హిందువు ఒకే పరమాత్మ తత్వాన్ని గుర్తిస్తాడు. అయితే ఆ తత్వాన్ని వివిధ పేర్లతో పిలవవచ్చును. హిందూ సమాజం ఒకటే. కానీ అందులో అనేక కులాలు ఉంటాయి.

జనాభాపరంగా అనేక జాతులు ఉండవచ్చును. కానీ వారంతా ఒకే జీవన తత్వంతో ముడిపడి ఉంటారు’’. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగోర్ కూడా తన ‘స్వదేశీ సమాజ్’ అనే వ్యాసంలో ఇలా రాశారు: – ‘‘భిన్నత్వంలో ఏకత్వాన్ని అనుభూతి చెందడం, వైవిధ్యంలో ఏకత్వాన్ని సాధించడం భారతదేశపు అంతర్నిహిత ధర్మం. తేడాలను భారతదేశం విభజనగా, వేరుపడటంగా చూడదు. ఇతరులను శత్రువులుగా చూడదు. ప్రతి మార్గపు గొప్పతనాన్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. ఈ లక్షణం వల్లనే మనం ఏ సమాజాన్ని శత్రువుగా పరిగణించి భయాందోళనలకు గురికాము. ప్రతి సంఘర్షణ వల్ల మనం మరింత విశాలత్వాన్ని సాధించాము తప్ప కుంచించుకుపోలేదు. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు, ముస్లిములు ఇలా అంతా ఇక్కడ కలిసి ఉన్నారు తప్ప కొట్టుకోలేదు. వీరిని కలిపి ఉంచేది హిందుత్వమే. ఈ దేశపు అవయవాలు కొన్ని అన్యదేశీయమైనవైనా జీవనం, మూల తత్వం మాత్రం భారతీయతే’’.

ఈ సహనశీల, సమన్వయపూర్వక, సంపూర్ణ, సమైక్య ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కొందరు నిరాకరించడం వల్లనే పాకిస్థాన్ ఏర్పడిందనే సంగతి కాంగ్రెస్ నేతలు మరచిపోయారు. ఈ మరపునకు కారణం అభారతీయ విద్యావిధానం. అభారతీయమైన కమ్యూనిస్టు ఆలోచనల ప్రభావం. భారతదేశం హిందూత్వ జీవనవిధానంతో ముడిపడి ఉన్నంతకాలం అది పాకిస్థాన్‌గా మారదు. ఈ హిందూత్వాన్ని నిరాకరించడం వల్లనే పాకిస్థాన్ ఏర్పడింది. ఐక్యత, స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం భారత్ ‘అస్తిత్వం’ అయితే, ఆధ్యాత్మికతపై ఆధారపడిన సాంస్కృతిక, సైద్ధాంతిక వారసత్వం దాని ‘అస్మిత’ (స్వభావం). ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ మౌలిక అస్తిత్వాన్ని ప్రశ్నిస్తే భారత్ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని వీరికి తెలియదా? దీనిని నిరాకరించడం వల్లనే దేశ విభజన జరిగింది.

నిజానికి ఈ ఐదు వేల సంవత్సరాల సహనశీలమైన, విశాలమైన పురాతన సంస్కృతి వల్లనే వైవిధ్యం విలసిల్లింది. ఈ సుసంపన్నమైన వారసత్వం నుండి వేరుపడింది కాబట్టే పాకిస్థాన్‌ అలా అయింది. మళ్ళీ ఈ సనాతన స్రవంతిలో కలిస్తే ఇస్లాం ప్రార్ధనా పద్ధతిని వదిలిపెట్టకపోయినా పాకిస్థాన్ హిందూ మూలాలను కాపాడుకోవచ్చును. ఎం.సి. చాగ్లా, అబ్దుల్ కలాం, పాకిస్థాన్‌లో జన్మించి ప్రస్తుతం కెనడాలో జీవిస్తున్న తారేక్ ఫతే వంటివారు ఇస్లాం మతాన్ని అనుసరించినా తమ హిందూ వారసత్వ సంబంధాన్ని తెంచుకోలేదు.

అలాగే పాకిస్థాన్ కూడా ముస్లిం దేశంగా ఉంటూనే ఈ సహనశీలమైన, విశాలమైన సంస్కృతితో ముడిపడితే అప్పుడు అది ‘హిందూ పాకిస్థాన్’ అవుతుంది. మరోలా చెప్పాలంటే అది ‘భారత్’ అవుతుంది. రాజకీయమైన ప్రత్యేక హోదాను నిలబెట్టుకుంటూనే అలా మారవచ్చును. ఇదే భారతీయ దృక్పథం. సార్వభౌమాధికారం కలిగిన స్వతంత్ర దేశమైనా నేపాల్ ఈ సాంస్కృతిక – ఆధ్యాత్మిక పరంపరతో తనను తాను జోడించి ఉంచుకుంది. అందువల్లనే భారత్, నేపాల్ ల మధ్య ప్రవేశ ఆంక్షలు ఏమిలేని సరిహద్దులు ఏర్పడ్డాయి. ‘హిందూ’ అనే మాట పట్ల ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారు ‘భారతీయ’ లేదా ‘ఇండిక్’ అనే పదాలు ఉపయోగించవచ్చును. ఏ పదం ఉపయోగించినా ఆధ్యాత్మికత ఆధారంగా వికసించిన సమీకృత, సంపూర్ణ జీవన విధానమే మన వారసత్వం అనే సత్యం మాత్రం మారదు.

భారతీయ సాంస్కృతిక – ఆధ్యాత్మిక సంప్రదాయంతో ముడిపడి ఉన్నవారి ఆలోచన ఎలా ఉంటుంది? దీనికి మంచి ఉదాహరణ ఆచార్య మహాప్రాజ్ఞజీ మాటల్లోనే లభిస్తుంది. మహాప్రాజ్ఞజీ తేరా పంథ్ తెగకు చెందినవారు. ఇది శ్వేతాంబర జైన్ల ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఒకటి. జాతీయ దృక్పధం, అవగాహన ఉన్న సాధువు కాబట్టి ఆయన్ని అందరూ గౌరవించేవారు. ‘నేను స్థానకావాసి జైన్‌ను కాబట్టి తేరా పంథ్ కు చెందినవాడినయ్యాను. శ్వేతాంబర జైన్‌ను కాబట్టి స్థానకావాసి జైన్ అయ్యాను. జైనుడిని కాబట్టి శ్వేతాంబర జైన్ అయ్యాను. అన్నింటికంటే మించి నేను హిందువును కాబట్టి జైనుడిని అయ్యాను’ అని ఆయన అనేవారు.

భారతీయ చింతనలో ఈ తేడాలు పరస్పర వ్యతిరేకమైనవి, విరుద్ధమైనవి కావు. అవన్నీ ఒకే అస్తిత్వానికి వేరువేరు రూపాలు. ఇదే భారతీయ సంప్రదాయం. ఎప్పుడైతే ఈ సంప్రదాయంతో సంబంధం పలచబడుతుందో అప్పుడు మన ఆలోచనలోను, మాట్లాడే మాటలోను తేడా వస్తుంది. ఈ మరపు మరింత తీవ్రమైతే పెడార్థాలు పెరుగుతాయి. ‘నేను జైన్, శ్వేతాంబర, స్థానకావాసి లేదా తేరా పంథీ.. ఇలా ఏదైనా కావచ్చును కానీ హిందువును మాత్రం కాను’ అనే వరకు వెళుతుంది. ఆ తరువాత రాజకీయాలు వస్తాయి. మూలాలు మరింత దూరమైతే అప్పుడు ఇక హిందూ పాకిస్తాన్, హిందూ తాలిబాన్, హిందూ తీవ్రవాదం వంటి అర్ధంలేని ఆలోచనలు వస్తాయి.

చివరికి అస్తిత్వాన్ని పూర్తిగా మరచిపోవడంతో అభారతీయ ప్రక్రియ పూర్తవుతుంది. అప్పుడు ‘భారత్ తేరే టుక్డే హోంగే, భారత్ కీ బర్బాదీ తక్ జంగ్ చలేగి, జంగ్ చలేగి’ వంటి నినాదాలు పుట్టుకువస్తాయి. ఈ నినాదాలు చేసినవారు నిరక్షరాస్యులు, నిరుపేదలు కారు. వీళ్ళంతా ఆధునిక భారతీయ మేధోవర్గానికి యువ ప్రతినిధులు. ‘అత్యంత ప్రగతిశీల, ఆధునిక’ విద్యా సంస్థల నుంచి వచ్చినవారు. ఏ దేశాన్ని తిట్టిపోస్తున్నారో అదే దేశం నుంచి వేతనభత్యాలు, ఇతర సదుపాయాలు పొందుతున్న విద్యావేత్తల, మేధావుల మద్దతు వీరికి ఉంది. విద్య ద్వారా జరుగుతున్న అభారతీయకరణకు ఇంతకంటే మించిన ఉదాహరణ ఉంటుందా? కనుక జాతీయ అస్తిత్వంగా మారిన భారతీయుల ఐదు వేల సంవత్సరాల సమిష్టి జీవనం, కలిసి సాగించిన ప్రయాణం గురించి ప్రణబ్‌దా మాట్లాడటం ఇప్పుడు చాలా సందర్భోచితం. మనం మన మూలాల నుండి విడిపోకుండా, దూరమైపోకుండా ఉన్నప్పుడే ఈ అస్తిత్వాన్ని కాపాడుకుని రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కాగలుగుతాం.

డా. మన్మోహన్ వైద్య
సహ సర్‌కార్యవాహ్ (సంయుక్త కార్యదర్శి), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)