Home News కేరళ కమ్యూనిస్టుల కరడుగట్టిన హింసోన్మాదం

కేరళ కమ్యూనిస్టుల కరడుగట్టిన హింసోన్మాదం

0
SHARE

విమల…28 డిసెంబర్‌, 2016..భర్త రాధాకృష్ణ, ఇతర బంధువులతో ఉన్నప్పుడు ఇంటికి నిప్పుపెట్టారు. భర్త, ఒక బంధువు అప్పుడే మరణిస్తే, తీవ్రగాయాలతో విమల చికిత్స పొందుతూ మరణించింది.
నిర్మల్‌…21ఏళ్ళ యువకుడు…12 ఫిబ్రవరి, 2017…దారుణంగా హతమార్చారు.
సంతోష్‌..18 జనవరి, 2017…సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గం ధర్మదంలో..పట్టపగలు..ఇంటి దగ్గరే కాపుకాచి అమానుషంగా నరికి చంపారు.
కె. రామిత్‌…నవయువకుడు, ఇంటికి ఏకైక జీవనాధారం..12, అక్టోబర్‌, 2016…మందులు తేవడానికి బయటకు వస్తే అతి దారుణంగా దాడి చేసి చంపారు..14 ఏళ్ళక్రితం అతని తండ్రి ఉత్తమన్‌ను కూడా ఇలానే పొట్టనపెట్టుకున్నారు.
సి.కె. రామచంద్రన్‌.. కార్మిక నాయకుడు..11 జూలై, 2016… పట్టపగలు భార్య ముందే అత్యంత కిరాతకంగా నరికి చంపారు..
టి.పి. చంద్రశేఖరన్‌…మాజీ మార్క్సిస్టు కార్యకర్త…4 జూలై, 2012..ఒకప్పటి సహచరుడని కూడా చూడకుండా ప్రాణాలు తీశారు..

ఏమిటి వీళ్ళు చేసిన పాపం?.. జాతీయ సంస్థల్లో క్రియాశీలంగా పనిచేయడం, దేశం కోసం, పేద ప్రజల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించడమేనా?

కేరళలో కమ్యూనిస్టులు సాగిస్తున్న నరమేధానికి పైవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కేరళలో కమ్యూనిస్టు కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి 270మంది జాతీయవాదులను బలితీసుకున్న ఈ మార్క్సిస్టు వ్యవస్థీకృత నరమేధం 1957 లోనే ప్రారంభమైంది. ఒక్క కన్నూరు జిల్లాలోనే 80మందికి పైగా పొట్టనపెట్టుకున్నారు.

1969లో దర్జీ పని చేసుకుంటున్న రామకృష్ణ హత్యలో ప్రధాన నిందితుడు నేటి ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌. తమ విఘటనవాద, విచ్ఛిన్నకర, ద్వేషపూరిత విధానాలకు విరుగుడుగా విశుద్ధ, జాతీయవాద, స్నేహపూర్వక, సమరసతామయ భావంతో ముందుకు వచ్చిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అంటే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) నేతలకు మింగుడు పడడంలేదు.

మా ‘మార్గమే నిజమైనద’నే సెమెటిక్‌ సంకుచితత్వం, ప్రత్యర్థుల్ని మట్టుపెట్టి మార్గం సుగమం చేసుకోవాలనుకునే నాజీ, ఫాసిస్ట్‌ ధోరణి నరనరాన జీర్ణించుకున్న మార్క్సిస్టులు హింసావాదాన్నే నమ్ముకున్నారు. తమ హింసోన్మాదానికి ‘విప్లవం’, ‘పోరాటం’ అని ముద్దుపేర్లు పెట్టుకున్నారు.

బెంగాల్‌ లాంటి రాష్ట్రాల్లో మూడు దశాబ్దాలకు పైగా హింసారాజకీయాల్ని అవిచ్ఛిన్నంగా సాగించారు. అలాంటి విధానాన్నే ఉపయోగించి కేరళలో కూడా అధికారాన్ని నిలబెట్టుకోవాలని తహతహలాడుతున్నారు. తమ దారికి అడ్డువచ్చేవారిని అత్యంత కిరాతకంగా హతమార్చేందుకు కొత్తకొత్త పద్ధతుల్ని కూడా కనిపెట్టారు. బతికుండగానే మనిషిని ఉప్పుబస్తాలతోపాటు గోతిలో పూడ్చిపెట్టడంవంటి అమానుషమైన పద్ధతితో వారి కర్కశత్వాన్ని ప్రదర్శించుకుంటున్నారు. అలాంటి పద్ధతులతో బెంగాల్‌ను ‘ఏలిన’ మార్క్సిస్టులు ఆ ‘బెంగాల్‌ నమూనా’ను ఇప్పుడు కేరళలో కూడా అమలు చేయాలని ఊవ్విళ్ళూరుతున్నారు.

ప్రత్యర్థుల్ని తొలగించేందుకు ఎలాంటి మార్గాన్నైనా ఎంచుకోవచ్చన్న ఒకప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శి పినరాయి విజయన్‌ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కావడంతో మార్క్సిస్టు మూకలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. పిల్లలు, మహిళలు, వృద్ధులనే విచక్షణ కూడా లేకుండా అందరిపై విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారు.

యశోద, విమల, కౌసల్య, అమ్ము అమ్మ మొదలైన అనేకమంది మహిళలను హత్య చేయడం, సజీవ దహనం చేయడం వారి అకృత్యాలకు ప్రత్యక్ష నిదర్శనం. కేవలం వారి కుటుంబ సభ్యులు జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారనే నెపంతో బీద, దళిత మహిళలను కూడా అమానుషంగా హత్య చేస్తున్నారు. ముఖ్యంగా తమ కంచుకోటగా భావించే కన్నూర్‌ జిల్లాలో ఈ మూకలు పెచ్చుమీరిపోయాయి.

సాక్షాత్తు హోంమంత్రిత్వశాఖ పరోక్ష ఆదేశాలతో పోలీసు యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటే మార్క్సిస్టు మూకలు సంఘ శాఖలపై, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నాయి. పంట తగలబెట్టడం, ఇల్లువాకిళ్ళు ధ్వంసం చేయడం, పాఠశాల భవనాల్ని కూల్చేయడం, ప్రైవేటు వాహనాల్ని నాశనం చేయడం వారికి నిత్యకృత్యాలయ్యాయి.

నీచ, దుర్మార్గపూరిత, హింసాత్మక విధానాలను ప్రశ్నించి, సంఘ స్వయంసేవకులుగా మారుతున్న, మారిన మాజీ మార్క్సిస్టులపై కూడా దాడులు జరుగుతున్నాయి. ‘ప్రజాహక్కులు’, ‘ప్రజాస్వామ్య పోరాటం’ అంటూ గొంతు చించుకునే మార్క్సిస్టులు అనుసరిస్తున్న అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలి. హత్యారాజకీయాలను యావత్తు సమాజం కలిసికట్టుగా ప్రతిఘటించాలి. ప్రజలచే ఎన్నుకోబడిన ఏ ప్రభుత్వానికైనా ఆ ప్రజలందరినీ రక్షించాల్సిన రాజ్యాంగ పరమైన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను విస్మరించి, హింసాత్మక మూకల కొమ్ముకాస్తున్న కేరళ ప్రభుత్వపు వైఖరిని ఎండగట్టాలి. హింసారాజకీయాలను వ్యతిరేకిద్దాం..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం.

కేరళ లో జరుగుతున్న ఈ దాడులకు నిరసనగా జాగృత భారత్, MMRI వారు 3-మార్చ్-2017, ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్, ట్యాంక్ బండ్, భాగ్యనగర్ లో “మహాధర్నా” ను నిర్వహిస్తున్నారు.