Home News మార్షల్‌ అర్జన్‌సింగ్‌ అస్తమయం

మార్షల్‌ అర్జన్‌సింగ్‌ అస్తమయం

0
SHARE

భారత వైమానిక దళ మార్షల్‌ అర్జన్‌సింగ్‌ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగాయి. అంతకుముందు అర్జన్‌సింగ్‌ పార్థివ దేహాన్ని శతఘ్ని శకటంపై ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. తుపాకులతో గౌరవ వందనం సమర్పించి.. వైమానిక విన్యాసాలను ప్రదర్శించారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, వైమానిక దళ చీఫ్‌ బీఎస్‌ ధనోవా, నావికాదళ చీఫ్‌ సునీల్‌ లాంబా తదితరులు అర్జన్‌సింగ్‌ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. 98 ఏళ్ల అర్జన్‌సింగ్‌ శనివారం దిల్లీలోని సైనిక ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.

రాష్ట్రపతి, రక్షణ మంత్రి నివాళులు

భారత వైమానిక దళ మార్షల్‌ అర్జన్‌ సింగ్‌ (98) శనివారం రాత్రి కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన ఈ ఉదయం ఆర్మీకి చెందిన రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ పరిస్థితి మిషమించడంతో రాత్రి 8 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. 1964-1969 మధ్య భారత వైమానిక దళ అధిపతిగా ఉన్న ఆయన ఐదు నక్షత్రాల ర్యాంకు ఉన్న ఏకైక మార్షల్‌ కావడం విశేషం. 1965 భారత్‌-పాక్‌ యుద్ధంలో అర్జన్‌ వీరోచితంగా పోరాడారు. యువ వైమానిక దళానికి నాయకత్వం వహించారు. తన ప్రణాళికా చాతుర్యం, ఎవరికీ సాధ్యమవ్వని దార్శనికత, ముందు చూపుతో పాక్‌ వైమానిక దళాన్ని చిత్తుచేశారు. అమెరికా యుద్ధ విమానాలతో పోరాడుతున్న పాక్‌ను తన అసమాన ధైర్య సాహసాలతో తుత్తునీయులు చేశారు. అప్పటికి ఆయన వయసు 44 కావడం విశేషం.

గతేడాది ఆయనకు అరుదైన గౌరవం అందుకున్నారు. పశ్చిమ్‌ బంగాలోని పనాగడ్‌ వైమానికదళ స్థావరానికి ఆయన పేరు పెట్టారు. సాధారణంగా సైన్యంలో జీవించి ఉన్న వారి పేర్లు ఏదైనా విశేషాలకు పెట్టరు. అర్జన్‌ సింగ్‌ వైమానిక దళ అధిపతిగా ఉన్నప్పుడే సూపర్‌ సోనిక్‌, వ్యూహాత్మక, తాంత్రిక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఇంకా అధునాతన సామగ్రి వైమానిక దళంలోకి చేరాయి.

ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్‌లో 1919, ఏప్రిల్‌ 15న జన్మించిన అర్జన్‌ సింగ్‌ 19 ఏళ్ల వయసులోనే రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కళాశాల నుంచి పట్టా పుచ్చుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఎన్నో సన్మానాలు చేసింది. పురస్కారాలు బహూకరించింది. అర్జన్‌ సింగ్‌ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, త్రివిధ దళాధిపతులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన చేసిన సేవలను మోదీ ఈ సందర్భంగా కొనియాడారు. కొన్నాళ్ల కిత్రం ఆయన్ను కలిసినప్పటి చిత్రాలను పంచుకున్నారు. ‘అస్వస్థతో ఉన్నా.. నేను వద్దంటున్నా.. నాకు సెల్యూట్‌ చేయడానికి ప్రయత్నించారు. అది ఆయన సైనిక క్రమశిక్షణకు మారుపేరు’ అంటూ ఉదహరించారు.

“ఈ వీరోచిత సైనికుడిలో గొప్ప పోరాట యోధుడి లక్షణాలు ఉన్నాయి. భరత మాత కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు’’ అని మోదీ గుజరాతీలో తన సంతాప సందేశాన్ని రాశారు.

భారత వాయుసేనను ప్రపంచంలోనే అగ్రశ్రేణి వైమానిక దళాల్లో ఒకటిగా తీర్చిదిద్దడంలో అర్జన్‌సింగ్‌ కీలక పాత్ర పోషించారని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్‌, రక్షణ శాఖ మాజీ మంత్రి ఎ.కె.ఆంటోనీ తదితరులు కూడా వైమానిక యోధుడికి నివాళులర్పించారు.

అర్జన్‌ సింగ్‌ మరణవార్త తనను కలచివేసిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో 1965లో జరిగిన యుద్ధంలో ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. నాడు 44 ఏళ్ల వయసులోనే ఆయన వైమానిక దళానికి నేతృత్వం వహించారని కొనియాడారు. భారత సైనిక చరిత్రలో ఆయన ఒక దిగ్గజమని పేర్కొన్నారు.

అర్జన్‌ సింగ్‌ ఒక అద్భుత యోధుడని, స్ఫూర్తిదాయక నాయకుడని భాజపా అగ్రనేత ఆడ్వాణీ పేర్కొన్నారు. ఆయన మరణంతో భారత సైనిక దళాలు ఒక కాంతి రేఖను కోల్పోయాయన్నారు.

వితరణశీలి: అర్జున్‌ అద్భుత యోధుడే కాక.. గొప్ప దానశీలి కూడా అని వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బి.ఎస్‌.ధనోవా పేర్కొన్నారు. ఆయన పేరు మీద ఒక ట్రస్టును నిర్వహించారని తెలిపారు. దీని ద్వారా వైమానిక దళ మాజీ ఉద్యోగులకు ఆయన ఆర్థిక సాయం అందించేవారన్నారు. ఇప్పటివరకూ రూ.2.7 కోట్ల మేర వితరణను పంపిణీ చేసినట్లు చెప్పారు.

(ఈనాడు సౌజన్యం తో)