Home News నల్లధనం.. నల్లతనం!

నల్లధనం.. నల్లతనం!

0
SHARE

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన నూట యాబయి ఆరుగురు ఉన్నత అధికారులు తాత్కాలికంగా తొలగింపునకు గురయ్యారట! మరో నలబయి ఒక్కరు బదిలీలకు గురయ్యారట! వీరందరూ ఘరానా అవినీతిపరులన్న ఆరోపణలు ఈ తొలగింపు- సస్పెన్షన్-లకు, బదిలీలకు ప్రాతిపదిక. ‘శతకోటి దారిద్య్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్న సామెతను మార్చి వ్రాసుకోవలసి రావడానికి హేతుభూతులు ఈ ఘరానా బ్యాంకు అధికారులు! ‘అనంతకోటి వ్యూహాల’ను వమ్ముచేయడానికి అసంఖ్యాక ‘షడ్యంత్రాలు..’ అన్నది వినూతన విచిత్ర లోకోక్తి! అవినీతిని, నకిలీ డబ్బును, నల్లడబ్బును అరికట్టడానికి వీలుగా ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం అమలు జరిపిన పెద్దనోట్ల రద్దు వ్యూహాన్ని వమ్ముచేయడానికి ఈ నూట తొంబయి ఏడుగురు బ్యాంకు పెద్దమనుషులు ఈ ‘షడ్యంత్రాన్ని’- కుట్రను- అమలు జరిపారట! ఈ కుట్ర ఎంతవరకు విజయవంతమైందన్నది ఇప్పుడప్పుడే బయటపడే అవకాశం లేదు.

ఆ ఊళ్లో ఒకడు, ఈ ఊళ్లో ఒకడు, ఇంకొక ఊళ్లో వేరొకడు, మరొక ఊళ్లో ఇంకొకడు… ఇలా అవినీతిగ్రస్త ‘బ్యాంకు’ అధికారులు పట్టుబడ్డారు. నవంబర్ ఎనిమిదవ తేదీన పెద్దనోట్లు రద్దయ్యాక నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చడానికి ప్రయత్నిస్తూ అన్ని చోట్లా బ్యాంకు అధికారులు పట్టుబడ్డారు. కానీ, వీరి సంఖ్య ఇంత భారీగా ఉందన్నది ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తాజాగా లోక్‌సభలో నివేదించిన వాస్తవం. ప్రయివేటు బ్యాంకులలో అవినీతికి, అ క్రమాలకు పాలుపడిన ఆరోపణలకు గురై సస్పెండైన వారి సంఖ్య పదకొండని కూడ జైట్లీ సభకు తెలియచేశాడు. ఇలా రెండు వందలకు పైగా ‘అవినీతి’ అధికారులు చర్యలకు గురవుతున్నారు. వీరి అవినీతిపై దర్యాప్తు జరగడానికి ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్’- కేంద్రీయ నేర పరిశోధక మండలి- సిబిఐ-కూడ రంగంలోకి దిగిందట! ఆరోపణలను నమోదుచేసి అభియోగాలను రూపొందించే ప్రక్రియ మొదలైందని మంత్రి లోక్‌సభలో నివేదించాడు. బయటపడని అవినీతి ఉదంతాలు ఎన్నో, ఎనె్నన్నో ఉండవచ్చు. పట్టుపడే నేరస్థుల కంటె పట్టుబడని నేరస్థుల సంఖ్య ఎక్కువ. అందువల్ల ఇంకెంతమంది బ్యాంకు అధికారులు నోట్లమార్పిడి ప్రక్రియను, పాత నోట్లను జమచేసే ప్రక్రియను అవినీతిమంతం చేశారో మరి..?

పెద్దనోట్ల రద్దు తరువాత బ్యాంకులలో జమ అయిన పెద్దనోట్లలో పంతొమ్మిదిన్నర కోట్ల రూపాయల ‘నకిలీ’ డబ్బు బయటపడిందట! ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవర్ పార్లమెంటుకు వెల్లడించిన సమాచారం ఇది. ఇలా బయటపడిన ‘నకిలీనోట్లు’ చెలామణి అయిన నకిలీ డబ్బులో ఎంత శాతమన్నది బహుశా ఎప్పటికీ తేలదు. ఎందుకంటె ఈ నకిలీ డబ్బును ముద్రించిన ముఠాలవారు, బుద్ధిపూర్వకంగా చెలామణి చేసిన దేశద్రోహులు ఆ నోట్లను బ్యాంకులలో జమకట్టడానికి సాహసించి ఉండరు. జమకట్టినవారు ఆ ‘నోట్లు’ నకిలీవని తెలియనివారు మాత్రమే! ‘తెలిసిన వారికి’ తెలుసు, నకిలీనోట్లు జమకట్టే సమయంలో అవి బయటపడతాయని, తాము పట్టుబడతామని.. అందువల్ల పెద్దసంఖ్యలో ‘నోట్ల’ను ఈ నకిలీలు ధ్వంసం చేసి ఉండవచ్చు! ‘తెలియనివారు’వారు మాత్రమే నకిలీ నోట్లను బ్యాంకులలో జమకట్టి ఉంటారు. వంద లేదా వెయ్యి అసలు నోట్ల మధ్య ఒకటో,రెండో నకిలీ నోట్లు బ్యాంకులకు చేరి ఉండవచ్చు! అందువల్ల బ్యాంకులలో బయటపడిన సమాచారం ప్రాతిపదికగా నకిలీ డబ్బును అంచనా వేయలేము. మన దేశపు పెద్ద కరెన్సీనోట్లు తమ దేశంలో ముద్రించిన పాకిస్తానీ ముఠాలు వాటిని జీహాదీ బీభత్సకారుల ద్వారా మనదేశంలోకి చేరవేయడం చరిత్ర. నకిలీ డబ్బులో అత్యధిక భాగం ఇలా ఈ పాకిస్తానీ ముఠాలు సృష్టించి చెలామణి చేసింది మాత్రమే! మన దేశంలో సైతం నకిలీ నోట్లను ముద్రించిన, ముద్రిస్తున్న ముఠాలున్నాయి. ఈ ముఠాలన్నీ పెద్దసంఖ్యలో ముద్రించిన ‘నకిలీ’నోట్లు పెద్దనోట్ల రద్దు తరువాత బహుశా ధ్వంసమయి ఉంటాయి. బ్యాంకులకు చేరింది పంతొమ్మిదిన్నర కోట్ల రూపాయల విలువైన నకిలీ నోట్లు మాత్రమే.

నల్లడబ్బు, నకిలీడబ్బు భారీగా చెలామణిలో ఉన్నందున- వీటిని నియంత్రించడానికి వీలుగా పెద్దనోట్లను రద్దుచేసినట్టు నవంబర్ ఎనిమిదవ తేదీన ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించాడు. ఈ ద్విముఖ లక్ష్యం ఎంతమేరకు నెరవేరిందన్నది స్పష్టం కాలేదు. నకిలీ డబ్బు రద్దయిన ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్ల రూపంలో మాత్రమేకాక రద్దుకాని వంద రూపాయల నోట్లరూపంలో కూడ చెలామణి అవుతూ ఉండవచ్చు! పెద్ద నోట్ల సంఖ్య కంటె వంద రూపాయల నోట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అందువల్ల నకిలీ డబ్బు పూర్తిగా నిర్మూలన కాలేదన్నది నిరాకరింపజాలని నిజం! నల్లడబ్బు సైతం బయటపడకుండా నల్లడబ్బున్నవారు, అవినీతిపరులైన అధికారులు కలసికట్టుగా నిరోధించినట్టు స్పష్టమైపోయింది. ప్రభు త్వం, ప్రజలు ఆశించిన పరిమాణంలో, ఊహించిన పరిమాణంలో నల్లడబ్బు వెల్లడి కాలేదు. ఈ రెండువందల ఎనిమిది మంది- పట్టుబడిన- అవినీతిగ్రస్త అధికారులు మాత్రమేకాక వందలాది పట్టుబడని అవినీతి అధికారులు ‘నల్లడబ్బు’స్వాములతో కలసికట్టుగా ప్రభుత్వ వ్యూహాన్ని వమ్ముచేయడానికి యత్నించడం నైతికత అడుగంటిన దానికి నిదర్శనం. మన దేశంలో అసలు సమస్య ‘నల్లడబ్బు’కాదని, పలుకుబడి కలవారికి, విద్యావంతులకు, ప్రముఖులకు, ఉన్నతులకు ‘నైతిక నిష్ఠ’ లేకపోవడమే అసలు సమస్య అని మరోసారి ఇలా ఋజువైపోయింది! ఈ వైఫల్యం ప్రభుత్వానిది కాదు, దశాబ్దుల తరబడి నైతిక నిష్ఠ స్పర్శలేని విద్యా విధానానిది.. ‘కాపీ’కొట్టి ఉత్తీర్ణులైన విద్యార్థులు విద్యావంతులయ్యారు. నైతిక నిష్ఠ నశించడానికీ అది అంకురం. అలాంటి విద్యావంతులు లంచాలివ్వడం ద్వారాను ఇతర మార్గాల ద్వారాను ఉద్యోగాలు పొందారు, అధికారులయ్యారు. ‘నైతికత అంటని’ విద్యావంతులు రాజకీయవేత్తలయ్యారు, నేరచరితుల సంఖ్య చట్టసభల్లో నానాటికీ పెరుగుతోంది. వారు రాష్ట్ర మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా చెలామణి కావడం చరిత్ర..

ఇలా నైతిక నిష్ఠ ధ్యాస అడుగంటిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, బ్యాంకుల నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు, అయ్యవారు, ఆచార్యులు- ఇలా అన్ని రంగాలలోను అవినీతి పెరగడం వల్ల మాత్రమే ‘నల్లడబ్బు’ పుట్టింది, పెరిగింది, విస్తరించింది, విలయతాండవం చేస్తోంది. ‘నోట్ల రద్దు’ తాత్కాలిక ఉపశమన కారకమైన ఔషధం.. కానీ సమూల చికిత్స జరగాలంటే ప్రాథమిక స్థాయి నుండి ‘డాక్టరేట్’ స్థాయి వరకూ విద్యలో నైతికతను పెంచే విధంగా రూపొందాలి! లేదంటే ‘నల్లడబ్బు’ మహిష రాక్షసులు మళ్లీ మళ్లీ పుడతారు, విస్తరిస్తారు! ‘నల్ల డబ్బు’ కంటె ప్రమాదం.. నల్లని హృదయం!

(ఆంధ్రభూమి సౌజన్యం తో )