Home News కలుషిత ఆహార ఉత్పత్తికి విరుగుడు సేంద్రియ వ్యవసాయమే..

కలుషిత ఆహార ఉత్పత్తికి విరుగుడు సేంద్రియ వ్యవసాయమే..

0
SHARE

మన ఆహారాన్ని కలుషితం చేస్తున్న అధికాధిక రసాయనాలు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి! కాయలను అతి త్వరగా పండ్లుగా మార్చడానికి, బంగారు రంగులతో పసుపుపచ్చని వనె్నలతో ఈ పండ్లు జనాన్ని ఆకర్షించడానికి వీలైన రసాయనాలు అక్రమంగాను సక్రమంగాను మన దేశంలో చెలామణి అయిపోతున్నాయి. మనం ‘రుచుల’ మోజులో ‘రసాయనాల’ను మెక్కుతుండడం ‘ఆహారశుద్ధి’ – ఫుడ్ ప్రాసెసింగ్ – ప్రక్రియ ఫలితం! ఆహారశుద్ధి ప్రక్రియలో ‘‘అనుమతించినంత’’ మేరకు రసాయనాలు వాడవచ్చునట! ఇలా అనుమతిస్తున్న ప్రభుత్వ విధానం ‘కాలుష్యం’ ఆహారంలో ‘కల్తీ’ అవుతుండడానికి వౌలిక కారణం! అనుమతించిన పరిమాణంలో మాత్రమే ‘‘పారిశ్రామిక వాణిజ్యకారులు’’ ఈ రసాయనాలను వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధి చేసి నిలువ చేసే ప్రక్రియలో వాడుతున్నారన్నది ప్రభుత్వాల విశ్వాసం… ఇలా అనుమతించిన పరిమిత ప్రమాణంలో ‘రసాయన విషాల’ను వాడినప్పటికీ ఈ ‘శుద్ధిచేసి నిలువ చేసిన తిండి’ – ప్రాసెస్డ్ ఫుడ్ -ని మెక్కడం వల్ల దీర్ఘకాలంలో -తింటున్నవారికి – చిత్ర విచిత్ర వ్యాధులు సంక్రమిస్తాయని అంతర్జాతీయంగా ప్రచారం జరిగింది, జరుగుతోంది. కానీ వివిధ ‘‘ఆహారశుద్ధి’’ సంస్థలు అనుమతించిన పరిమాణాన్ని మించి అత్యధికంగా ఈ రసాయనాలను వాడేస్తున్నాయి!! ఇలా రసాయనాలు చైనా నుండి అధికంగా దిగుమతి అవుతున్నాయి. ఈ ‘‘చైనా పౌడర్ల’’ను కూరగాయలను పండ్లను నిలువ చేయడానికి వాడుతున్నారు. ఆహారశుద్ధి ప్రక్రియలో ‘కల్తీ’ చేస్తున్న ఈ చైనా మన పులులను భోంచేసింది, భోంచేస్తోంది. మన ఎఱ్ఱ చందనాన్ని తరలించుకొనిపోయింది. విష రసాయనాలను మనకు అంటగడుతోంది. చైనా సంప్రదాయ ఔషధాల తయారీకి పులిగోళ్లు, చర్మాలు ముడి పదార్థాలు…

రసాయన కాలుష్యాలు మన పంటలను విషమయం చేస్తున్నాయి. ఎఱువులు ‘పురుగుల మందుల’ రూపంలో పంటలలోకి చేరుతున్న ఈ ‘విషాలు’ వ్యవసాయ క్షేత్రాలను నిస్సారం చేస్తున్నాయి. పరిసరాలను పాడుచేస్తున్నాయి. చివరికి విషమెక్కిన కూరగాయలు, పండ్లు, బియ్యం, గోధుమలు, పప్పులు, నూనెల చివరి గమ్యం మన వంట ఇల్లు.. ఈ విషపు సాంకర్యంలో ఇది సగం మాత్రమే! నిలువ ఉండడం కోసం, నిగనిగలాడడం కోసం అన్ని ఆహార పదార్థాలలోను కల్తీ అవుతున్న ‘రసాయన పరిరక్షకాలు’ – కెమికల్ ప్రిజర్వెంట్స్ – మిగిలిన సగం.. సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం అడుగంటిపోయిన ఫలితం ఇది. కృత్రిమమైన ఎఱువులు క్వింటాళ్ల కొద్దీ వాడనిదే భూమి పండదు, ప్రతి పంటకు నిరంతరం క్రిమినాశక రసాయనాలు వాడి తీరాలి! ఈ రెండింటిలో ఏది జరగకపోయినా పంట పాడయిపోతుంది. రెండేళ్ల క్రితం కందిపప్పు ధరలు భారీగా పెరిగాయి. అందువల్ల కందులు ఉత్పత్తి చేయడం లాభసాటి అన్నది రైతులకు కలిగిన భ్రాంతి. విపరీతంగా కందిపంట వేశారు. ప్రతి ఎకరానికి కేవలం క్రిమినాశక రసాయనాల కోసం పది వేల రూపాయలు ఖర్చయిందన్నది రైతులు చెప్పిన మాట! విడతలు విడతలుగా దాదాపు నెలకోసారి ఈ పురుగు మందులను వాడవలసి వస్తోంది! ఈ మందులను వాడడంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినప్పటికీ, పెద్దపెద్ద పురుగులు పుట్టుకొచ్చి కందికాయలను భోంచేసి పోతాయి! అందువల్ల నిరంతర రసాయన స్పర్శకు గురి అవుతున్న ‘కందులు’ తయారవుతున్నాయి! కందిపప్పు నిలువ ఉండడానికి వీలుగా బస్తాలలోను సంచులలోను మళ్లీ ‘ప్రిజర్వేటివ్స్’ కలుపుతున్నారు. ఇలా దశలవారీగా ‘కందిపప్పు’ కలుషితమైంది. ఇది ‘ప్రతీక’ మాత్రమే. కూరలు, పండ్లు, బియ్యం జొన్నలు- ఇలా ‘‘ఇందుకలడందులేదన్న సందేహము లేకుండా’’ రసాయన స్పర్శ సకలవిధ ఆహారంలో వ్యాపించిపోయింది!! కల్తీకథ ఇంకా ఉంది. మిఠాయిలు, పలావులు, వేపుడు అన్నాలు – ఫ్రైడ్‌రైస్-, చిత్రాన్నాలు తయారు చేస్తున్న వ్యాపారులు మాత్రమే కాదు, సొంత వంటవాళ్లు సైతం ‘రంగు’, ‘రుచి’, ‘వాసన’ల కోసం మళ్లీ కృత్రిమ రసాయనాలను కలుపుతున్నారు! రసాయనాలతో ‘శుద్ధి’ అవుతున్న విత్తనాల దశ నుంచి మన నోటికి అందేవరకు ఆహారం నిరంతరం విష స్పర్శకు గురి అవుతుండడం ఆధునిక నాగరికం…

హరిత విప్లవాల పేరుతో కొనసాగుతున్న ప్రక్రియతో ‘సంకర జాతుల’ విత్తనాలు, రసాయన విషాలు అనివార్యమైపోయాయి! దిగుబడులు పెరగడం ప్రధానమైంది. సంకరజాతుల – హైబ్రిడ్ – విత్తనాల వల్ల పంట దిగుబడులు పెరిగాయి. కానీ వికృతమైన విష కీటకాల ‘దిగుబడులు’ కూడా పెరిగాయి! ఈ క్రిమి కీటకాలను నిర్మూలించడం కోసం ‘రసాయన విషాలు’ అనివార్యం అయ్యాయి. ఈ ‘సంకరజాతి’ పంటలకు సేంద్రియమైన సహజమైన ఎఱువులు చాలలేదు. ఆవుపేడ, పశువుల పేడ, అటవీ ఉత్పత్తులు, ఆకులు కలసి తయారైన ఎఱువులు సేంద్రియమైనవి! ఈ ఎఱువులు సహస్రాబ్దుల పాటు మన వ్యవసాయ క్షేత్రాలను సస్యశ్యామలం చేశాయి. ఆవుపేడ వాసనలు సోకగానే భూగర్భంలోని వానపాములు – ఎఱలు – నూతనశక్తిని పొంది భూమిని నిరంతరం మథించాయి. ఈ ‘మథనం’ వల్ల భూమి సహజంగా సారవంతమైంది! రసాయనాలతో విషాలతో అవసరం లేకుండానే పంటలు పండాయి! సంప్రదాయ పద్ధతిలో రైతులు స్వయంగా ‘విత్తనాల’ను పండించుకున్నారు. ఈ విత్తనాలను విత్తడం వల్ల, ఆవుపేడ తదితర ప్రాకృతిక పదార్థాలను ఎఱువుగా వాడటం వల్ల పెరిగిన సేంద్రియ సస్యజాలాన్ని ఎలాంటి ‘రోగ క్రిములు’ పీడించలేదు. ‘తెగులు’ సోకడం చాలా అరుదు. సోకిన ‘తెగుళ్లు’ వర్షం కురియగానే నశించిపోయేవి!! ఇలా సేంద్రియ సంప్రదాయ వ్యవసాయం సహస్రాబ్దులపాటు కొనసాగడం చరిత్ర! ఈ వ్యవసాయ ఉత్పత్తులను భోంచేసిన ప్రజలు దృఢకాయులై జీవించారు, చిత్రవిచిత్ర వ్యాధులకు గురికాలేదు! ఈ చరిత్ర గతం కావడం హతం కావడం కాలుష్య ఆహారానికి కారణం… రసాయన విషాల ఎఱువుల వాసనలు భరించలేని వానపాములు -ఎఱలు – భూగర్భంలో మిక్కిలి ‘లోతు’నకు పారిపోవడం నడుస్తున్న వ్యథ. వానపాముల స్పర్శ తగలని భూమి నిస్సారమైపోయింది! ఈ నిస్సార సీమలను పండించడం కోసం మరింతగా రసాయనాలను వాడడం, వ్యవసాయ భూమి మరింతగా ‘నిస్సారం’ కావడం జగమెరిగిన రహస్యాలు…

అందువల్లనే భూమికి మళ్లీ సహజ పరిపుష్టి కలుగడానికి వీలుగా అనేక దేశాలలో ప్రధానంగా సంపన్న దేశాలలో రసాయనపుటెఱువుల వాడకం నిషేధించారు. క్రిమినాశక ఔషధాలను నిషేధించారు! ‘సేంద్రియ వ్యవసాయం’ ఆయా దేశాలలో మళ్లీ మొలకెత్తి మారాకులు తొడుగుతోంది! మన దేశంలోని సిక్కిం రాష్ట్రంలో మొత్తం వ్యవసాయం సేంద్రియ పద్ధతిలో జరుగుతోంది. కేరళ రాష్ట్రంలో కూడా సేంద్రియ ప్రక్రియ మళ్లీ విస్తరిస్తోంది! కాలుష్య నివారణకు స్వచ్ఛ్భారత్ పునర్‌నిర్మాణానికి ‘సేంద్రియం’ అనివార్యం! ఆవును అడవిని రక్షించడం సేంద్రియ వ్యవసాయానికి అనివార్యం.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)