Home Telugu Articles ఎప్పటికీ ఆచరణీయం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ‘ఏకాత్మతా మానవతావాదం’

ఎప్పటికీ ఆచరణీయం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ‘ఏకాత్మతా మానవతావాదం’

0
SHARE

ప్రతి వ్యక్తినీ అభివృద్ధి వైపు, సమృద్ధి వైపు, సంతోషం వైపు తీసుకువెళ్లగల ఉత్తమ సిద్ధాంతం ‘ఏకాత్మ మానవ వాదం’. మహా తత్త్వవేత్త, రాజకీయ మేధావి, సామాజికవేత్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఈ ‘ఏకాత్మ మానవ వాదం’ ఒక దేశానికో, ఒక జాతికో, ఒక మతానికో కాకుండా అన్ని కాలాల్లోను విశ్వమానవ కల్యాణానికి రాచమార్గం వంటిది. స్వాతంత్య్రం సిద్ధించాక భారత్ అన్ని రంగాల్లో ఎదగాలంటే విదేశీయ భావజాలం, వ్యక్తివాదం, కమ్యూనిజం తదితర సిద్ధాంతాలకు బదులు జాతీయత, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత అవసరమని ఆయన చెప్పేవారు. ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’లో విశేష సేవలందించిన ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాల ఆధారంగా ‘జన్‌సంఘ్’ పార్టీ ఆవర్భివించింది. ‘జన్‌సంఘ్’కు రూపాంతరమైన భారతీయ జనతా పార్టీ దీనదయాళ్ సిద్ధాంతాలను విశ్వసిస్తూ ఈ ఏడాది ఆయన శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది.

ప్రపంచ దేశాల్లో మతరాజ్య వ్యవస్థలు- పెట్టుబడిదారీ సిద్ధాం తం-సోషలిజం-కమ్యూనిజం సిద్ధాంతాల ప్రయోగాలన్నీ ఆచరణలో విఫలమై అనేక వికృత, వినాశకర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మత రాజ్యాలు మారణ హోమానికి, పెట్టుబడిదారీ సి ద్ధాంతం దోపిడీ వ్యవస్థకు దారి తీయగా, కమ్యూనిజం నిరంకుశత్వానికి, నిర్బంధాలకు దారితీసి వ్యక్తి స్వేచ్ఛను అణిచివేసింది. ఇందుకు కారణం- భౌతికవాద సిద్ధాంతాలన్నీ మనిషిని ఆర్థికజీవిగా మాత్రమే పరిగణించి అతని భౌతిక అవసరాలను తీరిస్తే సరిపోతుందని భావించడమేనని దీనదయాళ్ విశ్లేషించారు.

మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు, శరీరంతోపాటు మనసు-బుద్ధి-ఆత్మ ఈ నాలుగింటి సమాహారమే మనిషి. కూడు, గుడ్డ, గూడు లభించినంత మాత్రాన సుఖం పొందలేము. మనసు, బుద్ధి, ఆత్మల అవసరాలు కూడా నెరవేరినపుడే మనిషి ఆనందంగా జీవించగలడు. మనసు వల్ల కోరికలు, సుఖదుఃఖాలు, మమకారాలు, బుద్ధి వల్ల మేధస్సు,అనే్వషణ,నూతన ఆవిష్కరణలు, ఆలోచనలు, వివిధ కళల సృష్టి, ఆత్మ వల్ల కుటుంబం, సమాజం, సృష్టి, పరిమేష్టితో తాదాత్మ్యం చెందడం ప్రతి మనిషి సహజ లక్షణం. పూర్వకాలంలో రుషులు, మునులు, తత్త్వవేత్తలు ఈ పరమసత్యాన్ని గుర్తించి విశ్వమానవ కల్యాణాన్ని ఆశించి, ఉత్తమ సాంస్కృతిక జీవన మూల్యాలను మనకు అందించారు. వేయి సంవత్సరాల విదేశీ దండయాత్రలతో దేశం పరాధీనమైన కారణంగా భారతీయ జీవన విలువల పరంపర మరుగున పడిపోయింది. జాతి ఆత్మ విస్మృతి చెందింది. దేశం స్వతంత్రమైన తర్వాత కూడా మన పాలకులు, నాయకులు పశ్చిమ దేశాల సిద్ధాంతాల మోజులో పడి.. దారీ తెన్ను తెలియని గందరగోళం సృష్టించారు. పేదరికం, అవిద్య, అవినీతి, అక్రమాలు, అరాచకత్వం వికృతరూపం దాల్చాయి. రష్యా నమూనా ప్రణాళికలను గుడ్డిగా అనుసరించడం-మనదేశ వనరులు-జనాభా- సాంప్రదాయాలు-అవసరాలను గుర్తించకుండా విచ్చలవిడి యాంత్రీకరణ వల్ల జన జీవనం దుర్భరమైంది. ఆర్థిక సామాజిక అసమానతలు పెరిగాయి. ఈ దుస్థితిని అధిగమించడానికి మానవజాతి మొత్తనికి కళ్యాణ కారిణి అయిన మార్గాన్ని ప్రతిపాదించాడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ. అదే- ‘ఏకాత్మ మానవ వాదం’. మనిషి సంపూర్ణ వికాసం చెందినపుడే సుఖసంతోషాలు లభిస్తాయి. సంపూర్ణ వికాసం అంటే శరీరం-మనసు -బుద్ధి-ఆత్మ అనే నాలుగింటి అవసరాలు నెరవేరడం. ఇది నెరవేరడానికి మన పూర్వీకులు నాలుగు పురుషార్థాలు సూచించారు.

శరీర అవసరాల కోసం- కామం అనగా కోరికలు తీరడం కోసం ధనం సంపాదించాలి. దాన్ని ధర్మబద్ధంగా సంపాదించినపుడే సుఖం అనుభవిస్తాడు. ధర్మం అంటే మతం-పూజలు- వ్రతాలు కావు. ఏది మంచి? ఏది చెడు? అని చెప్పేదే ధర్మం. మంచిని పెంచడం ధర్మం. అక్రమాలను అరికట్టడం ధర్మం. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం ధర్మం. మానవహితం కోరేది, సృష్టిహితం కోరేది ధర్మం. మనం చేసే ప్రతి పనికీ దిక్సూచి ధర్మం. ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతోనే శారీరక అవసరాలు, కోరికలు తీర్చుకుంటూ మనిషి తృప్తిగా, ఆనందంగా జీవించగలడు. సమాజం గురించి కూడా పాటుపడగలడు. మనిషి తనకు తాను సంపూర్ణుడు కాడు. కుటుంబం, గ్రామం, సమాజం, దేశం, విశ్వం దాకా వికసించి వాటితో మమేకవౌతాడు. సాటి మనిషి దుఃఖిస్తుంటే సంతోషించలేడు. వరదలు, తుపానులు, యుద్ధాలు, కరవుకాటకాలు, భూకంపాలు ప్రపంచంలో ఎక్కడ సంభవించినా మనిషి చలించిపోతాడు. సకల సంపదలున్నా సుఖపడలేడు. కారణం అన్నింటిలో ఉన్నది ఒకే ఆత్మ కనుక. భౌతికవాదం ఈ అంశాలను గమనించదు.

బాల్యంలో తన గురించి మాత్రమే ఆరాటపడే వ్యక్తి తర్వాత తల్లిదండ్రులు, కుటుంబం పరిధిలో ఎదుగుతాడు. జ్ఞానం పెరిగిన కొద్దీ కుటుంబ వలయం దాటి- నా ఊరు, నా సమాజం, నా దేశం అనే మరింత పెద్ద వలయంలోకి చేరుతాడు. దాన్నికూడా దాటి విశ్వమానవులతో, సృష్టి మొత్తంతో కలిసిపోతాడు. చివరగా అన్నింటినీ దాటి పరమేశ్వరునితో ఆత్మానుభూతి పొందుతాడు. వ్యక్తిలో, సమష్టిలో, సృష్టిలో, పరమేష్టిలో వున్న ఆత్మ ఒక్కటేనన్న అనుభూతి కలుగుతుంది. సమష్టికి, సృష్టికి నష్టం జరిగితే తనకు కూడా నష్టమేనన్న జ్ఞానం కలుగుతుంది. మనిషి మనుగడ కుటుంబం, సమాజం, సృష్టి, ప్రకృతిలోని అనేక అంశాలతో ముడివడి ఉంటుంది. ప్రకృతి వినాశనం వైపు పోకుండా వికాసం వైపు ప్రయాణిస్తాడు. ప్రకృతిని ఆరాధించడం కర్తవ్యంగా భావిస్తాడు. శాంతి మంత్రంతో మానవులందరూ సుఖంగా ఉండాలని ప్రార్థించే సంస్కృతి మనది

ప్రకృతి-వికృతి-సంస్కృతి..

ప్రకృతిలోని వృక్ష, జంతు, పశు, పక్షి, మానవ ప్రాణులలోను, నిర్జీవ పదార్థాలలోను ఉండే లక్షణాలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తాయి. వీటి మధ్య పైకి కనిపించే భిన్నత్వాలను వైరుధ్యాలుగా భావించరాదు. ఇవి మొత్తం పరస్పర పూరకాలు. ఒకదానిపై మరొకటి ఆధారపడినవి. చెట్టు వల్ల ప్రాణవాయువు, వర్షం వల్ల జీవజలం, భూమి వల్ల ఆహారం, సూర్యుని వల్ల వెలుగు, ప్రాణశక్తి మనకు అందుతున్నవి. ప్రకృతిలో ఉన్న భిన్నత్వాలను శత్రుత్వాలుగా భావించడం వికృతి. భిన్నత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మనకు అనుకూలంగా మలుచుకోవడం సంస్కృతి. మనిషి బతుకు మొత్తం సమష్టి సమాజంతో విశాల సృష్టితో ముడిపడి ఉంది. ఉదాహరణకు పాలు ప్రకృతి. ఉప్పో, నిమ్మరసమో ఆ పాలలో వేసి విరగొట్టితే వికృతి. పాలను కాచి, తోడువేసి పెరుగు, వెన్న ,నెయ్యిగా మార్చడమే సంస్కృతి. వ్యక్తి వికాసం సమాజం హితం. విశ్వమానవ కళ్యాణమే లక్ష్యంగా మన సంస్కృతి జీవన వ్యవస్థ ఏర్పడింది.

ఆ సాంస్కృతిక జీవన మూల్యాల సారాంశమే దీన్‌దయాళ్‌జీ ప్రతిపాదించిన ‘ఏకాత్మ మానవ వాదం’. ప్రతి వ్యక్తి సర్వాంగణ వికాసమే లక్ష్యంగా మన ఆర్థిక, సామాజిక, రాజకీయ విధి విధానాలు రూపొందినప్పుడు సర్వశ్రేష్ఠ భారత నిర్మాణం సాధ్యమని భారతీయ జనతాపార్టీ ప్రగాఢ విశ్వాసం. ‘ఏకాత్మ మానవ వాదా’న్ని సైద్ధాంతిక భూమికగా స్వీకరించి ఆ మార్గంలో పయనిస్తున్నది బిజెపి. పండిట్ దీన్‌దయాళ్ ఒక ఋషి. జీవన సర్వస్వం అర్పించిన త్యాగశీలి. ఒక పరిశోధకుడు. ఒక సిద్ధాంతకర్త. ఒక దారి దీపం. ఒక రాజనీతిజ్ఞుడు, సంఘటనా దక్షుడు, మేధాసంపన్నుడు, సుఖదుఃఖాలను అధిగమించిన స్థితప్రజ్ఞుడు. నిరాడంబర జీవి. కోట్లాది మందికి స్ఫూర్తి ప్రదాత. ‘ఏకాత్మ మానవ వాదం’పై అందరూ అవగాహన పెంచుకోవాలని, దాన్ని ఆచరించాలని మోదీ ప్రభుత్వం దీనదయాళ్‌జీ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది.

ఆణిముత్యాలు, అక్షర సత్యాలు..

1965లో కచ్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమిస్తే మన పాలకులు తలవంచి, ఆ దేశంతో చేసుకున్న ఒప్పందానికి నిరసనగా భారతీయ జనసంఘ్ దిల్లీలో ‘విరాట్ ప్రదర్శన’కు పిలుపునిచ్చింది. ఆ ప్రదర్శనకు దేశం నలుమూలల నుండి లక్షలాదిమంది తరలివచ్చారు. నాడు జాతిజనులకు దీనదయాళ్‌జీ ఇచ్చిన సందేశం చారిత్రాత్మకమైనది. ‘మనలో మనకు ఎన్ని విభేదాలున్నప్పటికీ మాతృభూమి రక్షణకు అందరం ఒక్కటై ప్రభుత్వానికి అండగా వుండి శత్రుమూకలను తరిమికొడదాం రండి’ అని దీనదయాళ్ పిలుపునిచ్చారు. మహాభారతంలో గంధర్వుల చెరలో చిక్కిన కౌరవులను విడిపించడానికి ధర్మరాజు తన తమ్ములకు చెప్పిన నీతి సూత్రం ‘వయం పంచాధిక శతం’ను పండిట్‌జీ గుర్తుచేశారు. ఎందరో ప్రధానమంత్రులు ఇచ్చిన సందేశాల కంటే దీనదయాళ్ ఇచ్చిన సందేశం దేశ ప్రజలను, ప్రభుత్వాన్ని, సైన్యాలను ఉత్తేజ పరిచింది.

నాయకుడి లక్షణం..

ఏకధాటిగా కాకుండా వినేవారు సులభంగా గ్రహించేలా ఉపన్యాసం చేస్తే ఎవరైనా సులభంగా అర్థం చేసుకుని ఆచరిస్తారు. నాయకుడు పరిగెత్తకుండా నెమ్మదిగా నడుస్తూ అందరినీ తనతో నడిపించాలి. నాయకుని వెనకపాదం వద్ద అనుచరుడి ముందు పాదం వుండే విధంగా ముందు నడవాలి. క్రమంగా వేగాన్ని పెంచుకుంటూ పోతే అందరూ నాయకుని వెంటే నడుస్తారు. అందనంత వేగంగా నాయకుడు దూసుకుపోతే ఆయన వెనకాల ఎవ్వరూ రారు. నడుస్తూ నడిపించగలవాడే నాయకుడు.

ధర్మకర్తృత్వం

ప్రకృతి సంపదలైన భూమి, ఖనిజాలు, శిలలు మొదలగు వాటికి పునరుత్పత్తి లేదు. వృక్ష సంపదకు పునరుత్పత్తి ఉన్నా నరికివేయడమే తప్ప మొక్కలు పెంచడం మరిచాం. సముద్రపు అలలతో, వరదల తాకిడితో కొంత భూమి కోతకు గురవుతుంటే, జనావాసాల విస్తరణకు, రహదారులు, రైలుమార్గాలు, పరిశ్రమల స్థాపనకు మరికొంత భూమిని కోల్పోతున్నాం. రసాయన ఎరువులు, క్రిమిసంహారక విషాల వల్ల భూమి నిస్సారమవుతున్నది. వాతావరణ కా లుష్యం పెరిగిపోతున్నది. భావితరాల కోసం వీటిని భద్రంగా కాపాడాలి. దేవుడిచ్చిన సంపదలకు మనం ధర్మకర్తలుగానే వుండాలి.

పిల్లి క్రూరత్వం.. కోతి మాతృత్వం!

పిల్లి ప్రసవించిన తక్షణం కడుపులో జఠరాగ్ని ఎక్కువై ఆకలిని భరించలేక తాను కన్న పిల్లలనే తింటుంది. కోతి పిల్ల చనిపోతే తల్లి కోతి ఆ శవం కుళ్లి ఏకీలుకాకీలు ఊడిపోయే వరకు మోసుకుని తిరుగుతూ కన్నీరు పెడుతుంది. పిల్లిది క్రూరత్వం.. కోతిది మాతృత్వం! దేన్ని ఆదర్శంగా తీసుకోవాలి? మన జీవన విలువలు మాతృత్వం ఆధారంగా రూపుదిద్దుకున్నవి.

కమ్యూనిస్టులు శ్రామిక నియంతృత్వం ద్వారా రాజ్యరహిత సమాజాన్ని స్థాపిస్తామన్న దాని గురించి దీన్‌దయాళ్ జీ ‘శ్రామిక నియంతృత్వ మనగా నియంతృత్వ పార్టీ యొక్క, నియంత యొక్క నియంతృత్వమే!’ అన్నారు. రష్యా సహా అనేక దేశాలలో సాగిన నిరంకుశ కమ్యూనిస్టు రాజ్యాలు భూస్థాపితమైనవి. కమ్యూనిజం ద్వారా శ్రామిక నియంతృత్వం అనేది రంగుల స్వప్నం అని చెప్పిన దీన్‌దయాళ్‌జీ గొప్ప దార్శనికుడు. పశ్చిమ దేశాలు తాము అనుసరించిన క్యాపిటలిజం, సోషలిజం, కమ్యూనిజం నినాదాలు ఆచరణలో పూర్తిగా విఫలమై దారి తెలియని అయోమయంలో నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నవి. ఆ వైఫల్య సిద్ధాంతాల మైకంలో మన పాలకులు పాశ్చాత్య దేశాలవైపు చూస్తున్నారు. గుడ్డివాడు మరో గుడ్డివానికి దారి చూపడం సాధ్యమా?

-మందాడి సత్యనారాయణరెడ్డి, సెల్ : 98663 25248

(ఆంధ్రభూమి సౌజన్యంతో)

(నేడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా..)

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గురించిమరిన్నివ్యాసాల కోసం ఈక్రింది లింకులు క్లిక్ చేయండి:

ఉపేక్షితులు, పేదల సంరక్షణే దీన్ దయాళ్ జీ తత్వానికి మూలం 

కర్మయోగి దీనదయాళ్‌ ఉపాధ్యాయ