Home News అడుగుజాడే ఆదర్శం

అడుగుజాడే ఆదర్శం

0
SHARE

స్వాతంత్య్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 4

– ‌డాక్టర్‌ శ్రీ‌రంగ్‌ ‌గోడ్బొలే

పూర్ణ స్వరాజ్యం కోసం డా।। హెడ్గేవార్‌ ‌జీవితాంతం పోరాడారు. అందుకోసం ఏ ఉద్యమం జరిగినా చురుకుగా సహకరించాలని భావించేవారు. కాబట్టే అటవీ సత్యాగ్రహలో పాల్గొనడం, అరెస్ట్ ‌కూడా కావడం వింతేమీ కాదు. అయినా, ఒక నాయకుడి వ్యక్తిగత ప్రత్యేకతలను బట్టి ఆయన మీద తీర్పు చెప్పకూడదు. నాయకుడి ముఖ్య లక్షణం అనుచరులక• స్ఫూర్తినివ్వడం, తాను నాయకత్వం వహించకున్నా, వారంతా అదే దారిలో నడిచేలా చేయడం. అదైనా ఆదర్శంతో నడిపించాలి, ఆదేశంతో కాదు అనేది డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌తత్త్వం. వారి నుంచి ఆదేశం రాకున్నా కూడా అనుచరులు ఆయన అంతరంగానికి తగినట్టుగా ప్రవర్తించారా? అటవీ సత్యాగ్రహం సమయంలో హెడ్గేవార్‌ ‌జైలులో ఉన్నప్పుడు అనుచరులు ఏం చేశారు?

హెడ్గేవార్‌ ‌కాకుండా, సంఘ్‌కు చెందిన చాలామంది ఆఫీస్‌ ‌బేరర్లు అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనే అంశం చర్చించేం దుకు మొట్టమొదటి సమావేశం మే 1,1930న జరిగింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఉప్పు తయారు చేసి, నిషిద్ధ సాహిత్యాన్ని చదివిన మొదటి ముగ్గురు సత్యాగ్రహలు డా।। బి. ఎస్‌.‌మూంజే, డా।। మోరేశ్వర్‌ ‌రాంచంద్ర చోల్కర్‌, ‌గోపాల్‌ ‌ముకుంద అలియాస్‌ ‌బాలాజీ హుద్దార్‌. ‌హుద్దార్‌ ‌సంఘ్‌ ‌సర్‌కార్యవాహ (ప్రధాన కార్యదర్శి). కానీ హెడ్గేవార్‌ ‌కాలంలో సర్‌ ‌కార్యవాహ్‌ అన్న పదవి లేదు. సర్‌ ‌సేనాపతి అనేవారు. ఒకే ఒక్క సర్‌ ‌సేనాపతి, మార్తాండ్‌ ‌పరశురాం జోగ్‌. ఈయననే మారాఠి సెంట్రల్‌ ‌ప్రావిన్స్ ‌యుద్ధ కౌన్సిల్‌కు సహాయ కమాండర్‌గా జూన్‌ 2, 1930‌న నియమించారు (K.K.Chaudhary, ed. Source Material for a History of Freedom Movement, Civil Disobedience Movement, April-September 1930, Vol. XI, Gazetteers Department, Government of Maharashtra, Bombay, 1990, p. 947). ఆగస్ట్ 8, 1930 ‌నాడు జోగ్‌ ‌మరాఠి సెంట్రల్‌ ‌ప్రావిన్సెస్‌ ‌యుద్ధ కౌన్సిల్‌కు స్వచ్ఛంద కార్యకర్తలకు నాయకుడిగా నియమితులయ్యారు (Chaudhary, p. 1016).

ఎంప్రెస్‌ ‌మిల్స్ ‌దగ్గర పికెటింగ్‌ ‌చేసినందుకు సెప్టెంబర్‌ 13, 1930‌న జోగ్‌, ‌మరొక స్వయంసేవక్‌ ‌భాస్కర్‌ ‌బడ్‌కాస్‌లను అరెస్ట్ ‌చేశారు. వారిని మొదట నాగపూర్‌, అక్కడి నుండి రాయ్‌పూర్‌ ‌జైలుకి తీసుకువెళ్లారు. జోగ్‌ ‌జనవరి 7, 1931న విడుదలయ్యారు. ప్రాంతీయ కాంగ్రెస్‌ ‌కమిటి కార్యదర్శి, వార్దా సంఘచాలక్‌ అప్పాజి జోషి, సలోద్‌ ‌ఫకీర్‌ (‌వార్దా జిల్లా), సంఘ్‌చాలక్‌ ‌త్య్రయంబక్‌ ‌కృష్ణరావ్‌ ‌దేశ్‌పాండే, అర్వి (వార్దా జిల్లా) సంఘ్‌చాలక్‌ ‌నారాయణ గోపాల్‌ ‌దేశ్‌పాండే హెడ్గేవార్‌ ‌సత్యాగ్రహుల బృందంలో సభ్యులు. వారికి నాలుగు నెలల కఠిన కారాగార శిక్ష పడింది. అర్వి సంఘచాలక్‌గా దేశ్‌పాండే తర్వాత ఆ స్థానంలో డా।। మోరేశ్వర్‌ ‌గణేష్‌ ఆప్టేను నియమించారు. ఆప్టేను, మరొక స్వయంసేవక్‌ ‌భాస్కర్‌ ‌హరి మూంజేను ఆగస్ట్ 27, 1930‌న అరెస్ట్ ‌చేశారు. నాగపూర్‌ ‌జిల్లా సంఘచాలక్‌ అప్పాజి హల్దే, సావొనర్‌ ‌సంఘచాలక్‌ ‌నారాయణ అంబోకర్‌ ‌కూడా అటవీ సత్యాగ్రహంలోనే అరెస్ట్ అయ్యారు.

అప్పుడు సర్‌ ‌సంఘ్‌చాలక్‌ ‌డా।। హెడ్గేవార్‌ ‌కీలక బృందంలో, ఆయనతో పాటు సర్‌సేనాపతి మార్తాండ్‌రావ్‌ ‌జోగ్‌, ‌సర్‌ ‌కార్యావాహ బాలాజీ హుద్దార్‌, ‌డా।। ఎల్‌.‌వి. పరంజపే, అనంత్‌ ‌గణేశ్‌ అలియాస్‌ అన్నా సోహాని, మోరేశ్వర్‌ శ్రీ‌ధర్‌ అలియాస్‌ అబాజీ హెడ్గేవార్‌, ‌విశ్వనాథ్‌ ‌వినాయక్‌ ‌కేల్కర్‌, అప్పాజి జోషి ఉండేవారు. ఇందులో పరంజపే, సోహాని, అబాజీ, కేల్కర్‌ ‌తప్ప మిగతా అందరూ అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. బాల్యదశలో ఉన్న సంఘ్‌ ‌బాగోగులను చూడడానికి వీరు ఉద్దేశపూర్వకంగానే ఉద్యమానికి దూరంగా ఉండి ఉండవచ్చు.

అటవీ సత్యాగ్రహలో సాధారణ స్వయంసేవకులు

సంఘ్‌ 1925 ‌నాగపూర్‌లో ఆవిర్భవించినా, చాలాచోట్ల అది ఒకటి, రెండు సంవత్సరాల వయసు గలదే. సంఘ్‌ ‌కార్యక్రమం కూడా క్రమపద్ధతిలో ఉండేది కాదు. జనాభా వేల సంఖ్యలో ఉన్నచోట స్వయంసేవకుల హాజరు వంద కూడా ఉండేది కాదు. అటవీ సత్యాగ్రహానికి ముందు సంఘ్‌ ‌బలం ఎంత? దసరా ఉత్సవం సందర్భంగా అక్టోబర్‌ 12, 1929‌న ఇచ్చిన వార్షిక నివేదికలో సర్‌ ‌కార్యవాహ బాలాజీ హుద్దార్‌ ఇలా నివేదించారు: సంఘ్‌కు సెంట్రల్‌ ‌ప్రావిన్సెస్‌, ‌బేరార్‌ ‌వంటి ఇంకొన్ని ప్రాంతాలలో కలిపి మొత్తం 40 శాఖలు ఉన్నాయి. వాటిలో కనీసం 18 శాఖలు నాగపూర్‌లో, 12 వార్దా జిల్లాలో ఉన్నాయి. సంఘ్‌ ‌చాలావరకు మరాఠి మాట్లాడే సెంట్రల్‌ ‌ప్రావిన్సెస్‌ ‌జిల్లాలు నాగపూర్‌, ‌వార్దా, చందా, భాండారాలకే పరిమితమైంది. బేరార్‌ ‌ప్రాంత జిల్లాలు అమరావతి, బుల్‌దానా, అకోలా, యావత్‌మాల్‌లలో చాలావరకు సంఘ్‌ ‌గురించి తెలియదు. బాల్యదశలో, అది కూడా కేవలం రెండు జిల్లాలకే పరిమితమైన సంస్థకు చెందిన వందలాది మంది స్వయంసేవకులు అటవీ సత్యాగ్రహంలో పాల్గొనడం సాధారణ విషయం కాదు. గొప్ప విజయం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సంఘ్‌ ఆర్కైవ్స్‌లో, అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్న స్వయంసేవకుల జాబితా, విధించిన శిక్ష చరిత్రలో నమోదైనాయి (Sangh archives, Hedgewar papers, registers\ Register 3 DSC_0048- DSC_0061), (పట్టిక పక్కపేజీలో)

అటవీ సత్యాగ్రహంలో బ్రిటిష్‌ ‌వ్యతిరేక కార్యక్రమాలు

ఆగస్ట్ 2, 1930 ఉదయం, కాంగ్రెస్‌ ‌తాత్కాలిక అధ్యక్షుడు వల్లభ్‌భాయ్‌ ‌పటేల్‌, ‌పండిత్‌ ‌మదన్‌ ‌మోహన్‌ ‌మాలవీయ, మరో ఏడుగురు కాంగ్రెస్‌ ‌నాయకులను బొంబాయిలో అరెస్ట్ ‌చేశారు (Chaudhary, p.362). దీనికి నిరసనగా ఆగస్ట్ 3 ‌నుంచి వారం రోజుల బహిష్కరణ కార్యక్రమానికి సెంట్రల్‌ ‌ప్రావిన్స్ ‌యుద్ధ కౌన్సిల్‌ ‌పిలుపునిచ్చింది. ఆగస్ట్ 8‌న ఘర్‌వాల్‌ ‌దినంగా పాటించారు. ముందు జాగ్రత్త చర్యగా కంప్టి నుండి వచ్చిన దళాలు నాగపూర్‌లో కవాతు చేసి ఉదయం కాంగ్రెస్‌ ‌కార్యాలయం ముందు గుమిగూడిన 50,000 మందిని చెదరగొట్టినాయి. అనుమతి లేకుండా ప్రారంభమైన ఒక ఊరేగింపును మధ్యాహ్నం 2:30 నుంచి, 144 సెక్షన్‌ ‌నిబంధనను అర్ధరాత్రి ఎత్తివేసే వరకు నిలిపివేశారు (Chaudhary, p.1015). యూనిఫాం ధరించిన 60 మంది అంబులెన్స్ ‌కార్యకర్తల విభాగం సంఘ్‌కు చెందినది. స్వయం సేవకుల• ఊరేగింపులో పాల్గొన్న వారికి నిరంత రాయంగా మధ్యాహ్నం ఒంటి గంట నుండి అర్ధరాత్రి ఒంటిగంట దాకా మంచినీరు సరఫరా చేశారు.

హెడ్గేవార్‌ ‌సూచనల మేరకు ఈ విభాగాన్ని డా.పరంజపే ప్రారంభించారు (Sangh archives, Hedgewar papers,register 7/DSC-0247). నాటి అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు రాంటెక్‌కు చెందిన ఇద్దరు యువకులకు నాగపూర్‌ ‌జైలులో కొరడా దెబ్బల శిక్ష అమలు చేశారు. దీనిపై ఆ రోజే నిరసన సభ జరిగింది. మర్నాడు హర్తాళ్‌కు పిలుపునిచ్చారు. కోర్టుల దగ్గర, సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద స్వచ్ఛంద బృందాలు పికెటింగ్‌ ‌చేశాయి. వీరిని చెదరగొట్టేందుకు ఆశ్వికదళ పోలీసులు వచ్చారు. నలుగురికి గాయాల య్యాయి. సెంట్రల్‌ ‌ప్రావిన్స్ ‌యుద్ధ కౌన్సిల్‌ అధ్యక్షుడు పీకే సాల్వే, మరో ముగ్గురు అరెస్టయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు జరిగిన నిరసన ఊరేగింపులో వెయ్యి మంది మహిళలు సహా, 20 వేల మంది పాల్గొన్నారు. కొరడా దెబ్బలు తిన్న ఆ ఇద్దరిని ప్రదర్శనకు తీసుకు వచ్చారు. వారిని మోటారు కారులలో స్ట్రెచర్‌లపై ఉంచి, వారికి అమలు చేసిన శిక్షను గురించి వివరించారు (Chaudhary p 1035). యూనిఫాం ధరించిన 32 మంది స్వయంసేవకుల అంబులెన్స్ ‌విభాగమూ ఊరేగింపులో పాల్గొంది. సెప్టెంబర్‌ 11‌న జరిగిన ఒక సభలో పాల్గొన్న 3,500 మంది అంతకు ముందురోజు అరెస్ట్ అయిన స్వచ్ఛంద సేవకులను అభినందించారు. సర్‌సంఘ్‌చాలక్‌ ‌డాక్టర్‌ ఎల్‌.‌వి. పరంజపె ప్రసంగించారు (Chaudhary p 1038). అరెస్టయిన కాంగ్రెస్‌ ‌నాయకుడు, బారిస్టర్‌ ఎం.‌వి. అభయంకర్‌, ‌సెంట్రల్‌ ‌ప్రావిన్స్ ‌యుద్ధ కౌన్సిల్‌పై జరిగిన దౌర్జన్యాలకు నిరసనగా అక్టోబర్‌ 24, 1930 ‌నాడు అభయంకర్‌ ‌రోజుగా పాటించారు. దీనికి సంఘ్‌ను ఆహ్వానించారు. దీంట్లో స్వయంసేవకులు వ్యక్తిగత హోదాలో పాల్గొన్నారు. యూనిఫాం ధరించిన సంఘ్‌కు చెందిన అంబులెన్స్ ‌విభాగం కూడా పాల్గొన్నది (Sangh archives, Hedgewar papers, register 7/DSC-0250).

సంఘ్‌ ‌కార్యక్రమాలపై అటవీ సత్యాగ్రహ ప్రభావం

హెడ్గేవార్‌ అరెస్ట్ ‌తరువాత కూడా యథావిధిగా సంఘ్‌ ‌కార్యక్రమాలు సాగాయి. జూలైలో హెడ్గేవార్‌ అరెస్ట్ ‌తదుపరి మూడు కార్యకారిమండలి సమావేశాలు, సంఘ్‌ ‌నిర్దేశకుల సమావేశం ఒకటి జరిగాయి. సెలవుల తరువాత కళాశాలలో వారి తరగతులు పునః ప్రారంభమయ్యాయి. దండతో, శారీరక శిక్షణ, సభ్యత్వాల నమోదు సంఘస్థాన్‌ ‌బయట నిర్వహించారు. నాగపూర్‌లోని సంఘ్‌ ‌రోజువారీ కార్యక్రమాలను అన్నా సోహాని, సేనాపతి యశ్వంత్‌ ‌నారాయణ అలియాస్‌ ‌బాపురావ్‌ ‌బల్లాల్‌, ‌కార్యవాహ్‌ ‌కృష్ణ నీలకాంత్‌ ‌మోహరిర్‌, ‌హెడ్గేవార్‌ ‌మామగారు అబాజి తదితరులు చూడసాగారు. సర్‌సంఘ్‌చాలక్‌ ‌డా.పరంజపే, విశ్వనాథ్‌ ‌కేల్కర్‌ ‌సంఘ్‌ ‌మొత్తం కార్యక్రమాలను చూశారు. ఈ క్రమంలో డా.పరంజపే జైలులోని హెడ్గేవార్‌ను కలుస్తూ, వారి యోగక్షేమాలను తెలుసుకునేవారు. స్వయంసేవకులకు తెలియచేసేవారు (Sangh archives, Hedgewar papers, register 7/DSC-0248, DSC-0244).

అక్టోబర్‌ 21, 1930‌న సంఘ్‌ ‌స్వయం సేవకులు నాగపూర్‌ ‌జైలు వైపు దసరా కవాతును నిర్వహించారు. సేనాపతి మార్తాండరావ్‌ ‌జోగ్‌ను అక్కడ ఉంచారు. అలాగే అరెస్టయిన కాంగ్రెస్‌ ‌నాయకుడు ఎం.వి.అభయంకర్‌ ఇం‌టివైపు తిరిగి వందనం చేశారు. హెడ్గేవార్‌ ‌నిర్బంధ కాలంలో కొన్ని సంఘ్‌ ‌వ్యతిరేకశక్తులు సంఘ్‌ ‌కార్యక్రమాలకు కేంద్రమైన మోహిత్‌ ‌సంఘస్థాన్‌ ‌దగ్గర కార్యక్రమాలకు ఆటంకం కలిగించసాగారు. నాగపూర్‌ ‌సంస్థానా ధీశుల ఔదార్యం వల్ల, ముఖ్యంగా, రాజే లక్ష్మణరావ్‌ ‌భోంస్లే చొరవతో కేంద్ర సంఘస్థాన్‌ ‌డిసెంబర్‌ 24,1930‌న భోంస్లే హతిఖానాకు మారింది (Sangh archives, Hedgewar papers, register 7/DSC-0292). సంఘ్‌ ‌కార్యక్రమాలతో పాటు స్వయంసేవకులు తమ వ్యక్తిగత హోదాలలో, సంస్థాపరంగా జాతీయవాద కార్యక్రమాలకు హాజరయ్యారు.

ఆగస్టు 1, 1930న రాష్ట్రీయ ఉత్సవ్‌ ‌మండల్‌ ఆధ్వర్యంలో నాగపూర్‌లోని చండీమందిర్‌ ‌వద్ద లోకమాన్య తిలక్‌ ‌వర్ధంతిని నిర్వహించారు. ‘మహారాష్ట్ర’ పత్రిక సంపాకుడు గోపాల్‌ అనంత్‌ ఒగాలె అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్‌సంఘ్‌ ‌చాలక్‌ ‌డా.పరంజపే పాల్గొన్నారు. అక్కడ ఏర్పాట్లన్నీ సంఘ్‌ ‌చూసింది (Sangh archives, Hedge war papers, register 7/DSC-0243).


మొద‌టి భాగం : అటవీ సత్యాగ్రహంలో సంఘ్‌ (స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 1)

రెండ‌వ భాగం : సర్‌సంఘచాలక్‌ ‌బాధ్యతకు విరామం (స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 2)

మూడ‌వ భాగం : సత్యాగ్రహి డా. హెడ్గేవార్‌ (స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 3)

జాగృతి సౌజ‌న్యంతో…