Home News మహిళా సురక్ష, సరిహద్దు భద్రతపై ఆర్.ఎస్.ఎస్ సమన్వయ సమావేశాలు

మహిళా సురక్ష, సరిహద్దు భద్రతపై ఆర్.ఎస్.ఎస్ సమన్వయ సమావేశాలు

0
SHARE

సరిహద్దుల భద్రత గురించి చాలా జాగరూకతతో వ్యవహరించాలని, సరిహద్దుల్లో నివసించేవారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అప్పుడే దేశం సురక్షితంగా ఉంటుందని, దీని కోసం వివిధ సంస్థలు కలిసి పనిచేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ అన్నారు. పుష్కర్ లో జరుగుతున్న అఖిల భారతీయ సమన్వయ బైఠక్ ల సందర్భంగా ఏర్పాటైన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

అధ్యయన్ పేరు గల సంస్థ మహిళల సమస్యల గురించి పరిశీలించిందని, ఈ సంస్థ రెండేళ్లపాటు మహిళల సమస్యల గురించి అధ్యయనం చేసిందని, వివిధ సంస్థలకు చెందిన మహిళలు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారని, ఈ అధ్యయన నివేదిక ఆధారంగా మహిళా సురక్ష, సాధికారత, గౌరవ మర్యాదలు పెంపొందించడం మొదలైన విషయాలపై విస్తృతమైన చర్చ జరుగుతుందని శ్రీ అరుణ్ కుమార్ తెలియజేశారు.

సంఘ స్వయంసేవకులు 35కంటే ఎక్కువ సంస్థల్లో పనిచేస్తున్నారని, ఇవన్నీ వేరు వేరు సంస్థలేనని, స్వతంత్రమైనవేనని ఆయన తెలియజేశారు. సమన్వయ సమావేశాల్లో ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోరని, ఆయా సంస్థలకు నిర్ణయాలు తీసుకునే ప్రత్యేక ఏర్పాటు, పద్దతి ఉంటాయని ఆయన అన్నారు. ఈ సంస్థలకు చెందిన అధికారులు, కార్యకర్తలు దేశం మొత్తంలో పర్యటిస్తూ ప్రజల స్థితిగతుల గురించి తెలుసుకుంటారు. ఇలా తెలుసుకున్న విషయాలను ఇతర సంస్థల కార్యకర్తలతో పంచుకునేందుకే ఈ సమన్వయ సమావేశాలని శ్రీ అరుణ్ కుమార్ తెలియజేశారు. ఈ సమావేశాల్లో వివిధ సంస్థలకు చెందిన కార్యనిర్వహణ అధికారులు(అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సంఘటనా కార్యదర్శి) పాల్గొంటారు. ఈ సమావేశాల్లో సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ , సర్ కార్యవహ భయ్యాజీ జోషి, ఇతర అఖిలా భారతీయ కార్యకారిణి సభ్యులు కూడా పాల్గొంటారు.

గత ఏడాది మంత్రాలయం(ఆంధ్ర ప్రదేశ్)లో జరిగిన సమావేశాల్లో అన్నీ సంస్థలు మూడు రకాల కార్యక్రమాలు ఏడాది మొత్తంలో నిర్వహించాలని నిర్ణయించారు. జల, పర్యావరణ పరిరక్షణ విషయంలో సమాజంలో అవగాహన కలిగించడం, యువ కార్యకర్తలను ప్రోత్సహించడం, సమాజంలో, ముఖ్యంగా యువతలో, సంస్కారాలను పెంపొందించడం వంటి మూడు కార్యక్రమాల సమీక్ష ఇప్పటి సమావేశాల్లో జరుగుతుంది. అలాగే వివిధ జాతీయ విషయాల పైన కూడా చర్చ జరుగుతుందని శ్రీ అరుణ్ కుమార్ తెలియజేశారు.